హుజూర్‌నగర్: తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దోపిడీ చేసిన టీఆర్‌ఎస్ పార్టీని గ్రామాల్లోకి రానివ్వకుండా తరిమికొట్టాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపుని చ్చారు. శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. 2014 ఎన్నికల్లో అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. ప్రజలకు ఏం చేసిందో, ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడిగేందుకు వస్తుందో నిలదీయాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అర్హులైన వారందరికీ డబుల్ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడు ఎకరాల భూమి, ముస్లింలకు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు వంటి హామీలను అమలు చేయకుండా ఆయా వర్గాలను మోసం చేశారన్నారు.
ఇంటికొక ఉద్యోగం ఇస్తానని పదే పదే చెప్పిన సీఎం.. ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్ర సాధన కోసం అమరులైన వారి కుటుంబాలను కూడా ఆదుకోలేకపోయారని మండిపడ్డారు. అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని, ఆమెకు సముచిత స్థానం కల్పించి గౌరవిస్తామని చెప్పారు. నాలుగున్నరేళ్ల పాటు పార్టీని నమ్ముకొని ఆమె పని చేసినప్పటికీ కనీసం నామినేటెడ్ పదవి కూడా ఇవ్వలేదని ఉత్తమ్ విమర్శించారు. ప్రజాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కోదాడ తాజా మాజీ ఎమ్మెల్యే ఎన్.పద్మావతిరెడ్డి, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment