బుధవారం నోట్ల రద్దుకు నిరసనగా నల్ల బెలూన్లను ఎగరేస్తున్న కుంతియా, జైపాల్‌రెడ్డి. చిత్రంలో శశిధర్‌రెడ్డి, యాష్కీ, వీహెచ్, జానారెడ్డి, ఉత్తమ్, షబ్బీర్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మద్దతు ఇచ్చారని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి.కుంతియా ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్ నుంచి పీపుల్స్‌ప్లాజా వరకు కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా కుంతియా మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని దుయ్యబట్టారు. నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. దీనివల్ల నల్లధనం మార్చుకోవడం అక్రమార్కులకు సులువైందని ఆయన వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రధాని మోదీది చీకటి నిర్ణయమని సీనియర్ నేత ఎస్.జైపాల్‌రెడ్డి విమర్శించారు. నోట్ల రద్దును సమర్థించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆర్థిక వ్యవస్థపై దాడి: జానారెడ్డి
ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు .. ఆర్థిక వ్యవస్థపై దాడి అని అభివర్ణించారు. ప్రజలు సంయమనం పాటించినా ప్రయోజనాలు రాలేదన్నారు. నియంతృత్వ పాలనకు నోట్ల రద్దు నిర్ణయం పరాకాష్ట అని విమర్శించారు. చిన్న పరిశ్రమలు మూతపడ్డాయని, కార్మికులు ఉపాధి అవకాశాలు కోల్పోయారని అన్నారు. కాంగ్రెస్‌ను దూషిస్తూ కేంద్రం అసహనాన్ని ప్రదర్శిస్తోందన్నారు. దేశంలో, రాష్ట్రంలో ఆర్థిక ప్రగతి సంక్షోభంలో ఉందన్నారు. మాజీ ఎంపీ మధు యాష్కీ మాట్లాడుతూ దేశానికి ప్రధాని చేసిన మోసాన్ని ఎండగట్టాలన్నారు.
మోదీ తీసుకున్న నిర్ణయం మెదడు లేని నిర్ణయమన్నారు. కేసీఆర్ కొడుకు కేటీఆర్‌కు, కూతురు కవితకు, అల్లుడు హరీశ్‌రావుకు ఈడీ నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమో కాదో చెప్పాలని మధు యాష్కీ డిమాండ్ చేశారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ మోదీ ఓ క్రిమినల్ అని వ్యాఖ్యానించారు. నోట్లరద్దులో సంపన్న వర్గాలకు కొమ్ముకాశారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment