బీసీలు, ముస్లింలకు సగం టికెట్లు | Half of the tickets to the BC and Muslims | Sakshi
Sakshi News home page

బీసీలు, ముస్లింలకు సగం టికెట్లు

Published Mon, Jul 22 2019 2:32 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

Half of the tickets to the BC and Muslims - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న కుంతియా. చిత్రంలో పొన్నం, గీతారెడ్డి, పొన్నాల, ఉత్తమ్‌

సాక్షి, సంగారెడ్డి: త్వరలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లు కాకుండా బీసీలు, ముస్లింలకు ప్రత్యేకంగా 50 శాతం సీట్లు కేటాయిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రిజర్వేషన్ల విషయంలో బీసీ సంఘాలతో కాంగ్రెస్‌ ఏకీభవిస్తోందని, ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి అధ్యక్షతన జరిగిన టీపీసీసీ పురపాలక ఎన్నికల రాష్ట్రస్థాయి సన్నాహక సమావేశం జరిగింది. ఈ భేటీలో మున్సిపల్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చించారు. ఈ భేటీ అనంతరం ఉత్తమ్‌ విలేకరులతో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై టీఆర్‌ఎస్‌ విధానాన్ని తప్పుపడుతూ ఈ నెల 23న అన్ని జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఎన్నికలకు సర్వసన్నద్ధంగా ఉండాలని, ఈ నెల 26న అన్ని మున్సిపాలిటీల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఈ నెల 27, 28, 29, 30 తేదీల్లో అన్ని మున్సిపాలిటీలలో స్థానిక నేతల ఆధ్వర్యంలో ‘ఇంటింటికీ కాంగ్రెస్‌–వాడవాడనా జెండా‘నినాదంతో పార్టీ శ్రేణులు ముందుకు కదలాలన్నారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ పార్టీ మెజారిటీ సీట్లను కైవసం చేసుకుంటుందని ఉత్తమ్‌ పునరుద్ఘాటించారు.   కౌన్సిలర్‌ లేదా కార్పొరేటర్‌గా గెలిచాక చైర్మన్, వైస్‌చైర్మన్, కో–ఆప్టెడ్‌ సభ్యులకు ఓటు వేసే విషయంలో పార్టీ విప్‌ ధిక్కరించనని, గెలిచాక పార్టీ వీడనని అభ్యర్థులు అఫిడవిట్‌లో స్పష్టం చేయాలన్నారు. ప్రస్తుతం ఎంపీగా పార్లమెంటులో అడుగుపెట్టిన తనకు పార్లమెంటు భవనం కంటే తెలంగాణ అసెంబ్లీ, సెక్రటేరియట్‌ భవనాలే బాగున్నట్లు అనిపించిందన్నారు. వీఆర్వో వ్యవస్థలో లోపాలను ప్రభుత్వం మెరుగుపరచాలే కానీ రద్దు చేయాలనుకోవడం తగదన్నారు 

టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం మేమే... 
అంతకుముందు జరిగిన సన్నాహక సమావేశంలో ఉత్తమ్‌ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం ఎప్పటికీ కాంగ్రెస్‌ పార్టీయేనని స్పష్టం చేశారు. అన్ని మున్సిపాలిటీల్లో గట్టి పోటీ ఇచ్చి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. రాష్ట్రంలో నాలుగు ఎంపీ సీట్లు గెలవగానే అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు పగటి కలలు కంటున్నారని, అది ఎన్నటికీ నెరవేరదని ఎద్దేవా చేశారు. కొత్త మున్సిపల్‌ చట్టం లో ప్రత్యక్ష పద్ధతిలో చైర్మన్‌ను ఎన్నుకుంటే బాగుండేదన్నారు. కౌన్సిలర్లు, చైర్మన్లను తొలగించే అధికారం కలెక్టర్లకు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. 

గెలుపు గుర్రాలకే టికెట్లు: కుంతియా 
మున్సిపల్‌ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుస్తామని ఏఐసీసీ కార్యదర్శి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి. కుంతియా ధీమా వ్యక్తం చేశారు. గెలిచే వారిని గుర్తించి టికెట్లు కేటాయించాలని ఆయన సూచించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి తక్కువ సీట్లు వచ్చినా ఓట్ల శాతం మాత్రం పెరిగిందన్నారు. ప్రజాప్రతినిధుల హక్కులను కాలరాస్తూ కొత్త మున్సిపల్‌ చట్టంలో కలెక్టర్లకు సంపూర్ణ అధికారాలు కట్టబెట్టడం ప్రజాస్వామ్యాన్ని అపçహాస్యం చేయడమేనని సీఎల్పీనేత భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రజాప్రతినిధులను సస్పెండ్‌ చేసే అధికారం కలెక్టర్లకు కట్టబెట్టడం విచారకరమన్నారు. శాసనసభలో మందిబలం ఉందని సీఎం కేసీఆర్‌ ఇష్టమొచ్చినట్లు చట్టాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మున్సిపల్‌ ఎన్నికల సీట్ల కేటాయింపులో ముస్లింలు, యువతకు ప్రాధాన్యమివ్వాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీ సూచించారు. 

పట్టణాల్లో వ్యతిరేకత ఉంది... 
మున్సిపల్‌ ఎన్నికలను పకడ్బందీగా ఎదుర్కోవాలని టీపీసీసీ రాష్ట్ర స్థాయి సమావేశంలో నేతలు నిర్ణయించారు. పట్టణ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, దాన్ని సొమ్ము చేసుకోవడానికి మున్సిపల్‌ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ముందుకెళ్లేలా కసరత్తు చేయాలని తీర్మానించారు. ఒకరిద్దరు జిల్లా అధ్యక్షులు పార్టీ నేతల వైఖరి మార్చుకోవాలని సూచించినట్టు తెలిసింది. ఎంపీలు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సీతక్క, పోడెం వీరయ్య, ఇతర ముఖ్య నేతలు హాజరు కానప్పటికీ వారంతా వ్యక్తిగత పనుల వల్లే రాలేదని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి.  సమావేశంలో పార్టీ నేతలు సంపత్‌కుమార్, వంశీధర్‌రెడ్డి,  జీవన్‌రెడ్డి,  పొన్నాల లక్ష్మయ్య, పద్మావతి, పొన్నం ప్రభాకర్, మల్లు రవి, గీతారెడ్డి, నాగం తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement