కార్పొరేషన్ ఎన్నికలకు సిద్ధం కండి
ఎన్నికల హామీలను విస్మరించిన కేసీఆర్
నిరుద్యోగ యువకులకు మొండి చెయ్యి
రంజాన్ కానుకగా ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేయూలి
కార్యకర్తల సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియా
ఖమ్మం:
నాడు.. నేడు.. ఏనాడైనా జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోటగానే ఉంటుందని, గడిచిన ఎన్నికల్లో కూడా నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి గెలిచారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, టీపీసీసీ ఇన్‌చార్జి రామచంద్రకుంతియా అన్నారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని శనివారం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి కుంతియా హాజరై ప్రసంగించారు. గతంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకొని నష్టపోయిందన్నారు. ఎన్నికల ముందు కేసీఆర్ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామని, నిరుద్యోగ సమస్యను తీర్చుతామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచినా వాటిని అమలు చేయలేదని విమర్శించారు. పవిత్ర రంజాన్ మాసంలోనైనా మైనార్టీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం యువకులు బలిదానమయ్యారని,
ఉద్యమంలో ముందు ఉన్నారని అన్నారు. కాగా కేసీఆర్ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీలో నిలిచి గెలిచేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపు నిచ్చారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ డివిజన్ కమిటీలతోపాటు, పార్టీ అనుబంధ కమిటీలు వేయాలని, ప్రతి గడపకు పదిసార్లు వెళ్లి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలను గుర్తు చేయాలన్నారు. అదే సమయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు పడుతున్న ఇబ్బందులు వివరించాలన్నారు. టీఆర్‌ఎస్ కార్యక్రమాల్లో కూడా ప్రభుత్వ అధికారులు పాల్గొనడం శోచనీయమన్నారు. అధికారులు టీఆర్‌ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని, ప్రజల పక్షాన ఉండాలని పిలుపు నిచ్చారు. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయం వైపు నడిపించేందుకు అందరూ సహకరించాలన్నారు. ఇప్పటి వరకు అన్ని డివిజన్లలో కమిటీలను వేశామని, ఇదే స్ఫూర్తితో బూత్ లెవల్ కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సైనికుల్లా పనిచేసేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపు నిచ్చారు. ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఖమ్మం కార్పొరేషన్‌పై కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయం అన్నారు. పదిమంది తుమ్మల నాగేశ్వరరావులు వచ్చినా కాంగ్రెస్ గెలుపును అడ్డుకోలేరన్నారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో 8వ షెడ్యూల్ పెట్టాలనడం విడ్డూరంగా ఉందన్నారు. నైతిక విలువలు ఉంటే ఏపీ సీఎం చంద్రబాబు పదవికి రాజీనామా చేసి 'ఓటుకు నోటు'కేసులో న్యాయ పోరాటం చేయాలని సవాల్ విసిరారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షులు ఐతం సత్యం, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, రేగ కాంతారావు కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు, కొత్తా సీతారాములు, యర్రం బాలగంగాధర్ తిలక్, దీపక్ చౌదరి, నర్సింహా రావు, బాలాజీరావు నాయక్, పద్మ, ఫజల్, విజయ్‌కుమార్, కాలంగి దేవదానం, మగ్బూల్ పాల్గొన్నారు.
జెండా ఎగరేయాలి..
Published Sat, Jun 27 2015 6:26 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement