టీడీపీ నేత ఎ.రేవంత్‌రెడ్డి చేరికను పార్టీ నేతలంతా స్వాగతించాల్సిందేనని ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి.కుంతియా స్పష్టం చేశారు. ఆదివారం ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యులతో గోల్కొండ హోటల్‌లో వేర్వేరుగా సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్‌రెడ్డి చేరికపై వారి అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు వర్తమాన రాజకీయ పరిస్థితులపై పార్టీ నేతల మనోగతాన్ని చెప్పుకోవడానికి ఏఐసీసీ నుంచి అవకాశం కల్పించే ఉద్దేశంతో కుంతియా వారితో సమావేశమయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్షనేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, మాజీమంత్రి, గద్వాల ఎమ్మెల్యే డి.కె.అరుణ తదితరులు కుంతియాతో వేర్వేరుగా భేటీ అయ్యారు.