మెజారిటీ శూద్రులు కులాలవారీ జనగణనను కోరుకుంటుండగా, ద్విజులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఓబీసీలకు రిజర్వేషన్లు ఉన్నప్పటికీ, ఐఐటీ, ఐఐఎమ్, కేంద్రీయ విశ్వవిద్యాలయాల వంటి అత్యున్నత సంస్థలతోపాటు కేంద్రప్రభుత్వ పాలనావ్యవస్థ దాదాపుగా ద్విజుల అదుపులో ఉంటోంది. ఒకసారి కులాలవారీగా అధికారిక డేటా విడుదల చేశాక, దేశంలోని కీలకమైన పాలనా వ్యవస్థల్లో ఏ ఒక్కదానిలో కూడా తమకు ప్రాతినిధ్యం లేదని జాట్‌లు, గుజ్జర్లు, పటేళ్లు, ఉత్తర, దక్షిణ భారతదేశంలోని ఇతర కమ్యూనిటీలు కూడా గుర్తించే ప్రమాదముంది. జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లో తమ ప్రాతినిధ్యం కోసం శూద్రకులాలు డిమాండ్ చేసే ప్రమాదం ఉంది కాబట్టే కులాలవారీగా జనగణనను అగ్రవర్ణాలు వ్యతిరేకిస్తున్నాయి.
కులాలవారీ జనాభా గణన కోసం డిమాండ్ పుంజుకుంటోంది. దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలూ దీనికి అంగీకరించాయి. కొన్ని ప్రాంతీయ పార్టీలు ఇప్పటికే అంతర్గత వినియోగం కోసం కులాల వారీ డేటాను సేకరించి ఉన్నాయి. ఉదాహరణకు, తెలంగాణ రాష్ట్ర సమితి 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే కులపరమైన డేటాను సేకరించింది. ‘సమగ్ర కుటుంబ సర్వే’ అని పేరుపెట్టినప్పటికీ కులాలవారీగా ప్రజల సమగ్ర వివరాలను సేకరించింది. తెలంగాణలో పుట్టి, ఆ తర్వాత దేశవిదేశాల్లోని వలస ప్రాంతాల్లో పెరిగిన అనేకమంది పిల్లలను తెలంగాణ గ్రామాలకు తిరిగివచ్చి తమతమ పేర్లను నమోదు చేసుకోవాలని వారి తల్లిదండ్రులు కోరి మరీ వెనక్కు పిలిపించారు.
‘తెలంగాణ ఆల్ ఫ్యామిలీ సెన్సెస్ 2014’ నాకు జీసస్ తల్లిదండ్రులైన జోసెఫ్, మేరీలు నజరత్ నుంచి బెతెల్‌హామ్ చేరుకుని స్వస్థలంలో తమ పేర్లు నమోదు చేయించుకున్న వైనాన్ని గుర్తు చేసింది. వ్యక్తులందరూ తమతమ పూర్వీకుల పట్టణాలకు రావాలన్న నాటి రాజాదేశాన్ని పాటించడానికి జోసెఫ్, మేరీలు బెతెల్‌హామ్‌కు ప్రయాణించి వచ్చారు. ఈ ఆదేశం జారీ చేసిన సమయంలో మేరీ... జీసస్‌కి జన్మ నివ్వడానికి గర్భధారణతో ఉండింది. కాబట్టి, బెతెల్‌హామ్‌లో ఒక గొర్రెల పాకలో జీసస్ జన్మించడానికి ఆనాడు నిర్వహించిన జనాభా గణనే కారణమైంది. మోజెస్ కాలం నుంచి వ్యక్తులను లెక్కించే చరిత్ర ఇజ్రాయెల్‌కి ఉండేది. హరప్పా వంటి మహత్తర నాగరికతను కలిగి ఉన్నప్పటికీ ప్రాచీన భారతదేశం వ్యక్తుల వారీగా జనాభాను లెక్కించే ఎలాంటి పద్ధతినీ కలిగి ఉండేది కాదు. మన చరిత్రలో తొలిసారిగా బ్రిటిష్ వలస ప్రభుత్వం తన సొంత పన్నుల వసూలు కోసం జనాభా లెక్కలను నిర్వహించింది. తొలి జనగణనను 1865 నుంచి 1872 మధ్య కాలంలో నిర్వహించారు. మొట్టమొదటి సమగ్ర జనగణన 1881లో జరిగింది.
చాలావరకు బ్రాహ్మణులు జనగణనను, ప్రత్యేకించి కులాలవారీ జనగణన అనే భావనను తొలినుంచీ వ్యతిరేకిస్తూ వచ్చారు. అతి చిన్న మైనారిటీగా ఉండే ద్విజులు (బ్రాహ్మణులు, బనియాలు, క్షత్రియులు, కాయస్థులు, ఖాత్రీలు) సంస్కృతం, పర్షియన్, ఇంగ్లిష్ భాషలు నేర్చుకున్న విద్యావంతులుగా ఉండేవారు. దేశంలో తాము అతి చిన్న మైనారిటీ అనే వాస్తవం ప్రపంచానికి తెలీకూడదనే వారు కోరుకున్నారు.
ఈ మేధావి వర్గమే మండల్ రిజర్వేషన్ల అమలును, కుల గణనను వ్యతిరేకించింది. భాను ప్రతాప్ మెహతా వంటి పలువురు ఉదారవాద మేధావులు కులాలవారీ జనగణనకు వ్యతిరేకంగా బలంగా వాదించారు. మండల్ ఉద్యమ కాలంలో కూడా వీరిలో చాలామంది కులం అనేది బ్రిటిష్ వారి సృష్టి అని వాదించేంతవరకు వెళ్లారు. వామపక్షం, ఉదారవాదులు, ఛాందసవాదులు... ఇలా భావజాలాలతో పనిలేకుండా, ఈ మేధావులందరూ కులవ్యవస్థను బ్రిటిష్ వలసవాదులు సృష్టించారని వాదించారు. వేదాలను సృష్టించిన క్రమంలో, కౌటిల్యుడి అర్థశాస్త్రం, మనుధర్మశాస్త్రం రచించిన క్రమంలో వర్ణ కుల విభజన ఉనికిలోకి వచ్చిన వైనాన్ని వీరు ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. అనేక జాతీయ వాద పండితులు మనుస్మృతిని గొప్ప ప్రాచీన న్యాయ స్మృతిగా ప్రశంసించేవరకు వెళ్లారు. భారతీయ కమ్యూనిస్టు చింతనాపరులు సైతం ఈ వాదంలో కొట్టుకుపోయారు. అంబేడ్కర్ అనేక రంగాల్లో ద్విజ మేధావులను సవాలు చేసేంతవరకు... కులంపై, భారతీయ నాగరికతపై వ్యతిరేక దృక్పథాన్ని ప్రతిపాదించేవారు శూద్ర, దళిత, ఆదివాసీ ప్రజలకు లేకుండా పోయారు.
1931 తర్వాత కులవారీ గణనను జనాభా లెక్కలనుంచి ఉపసంహరించారు. ప్రపంచ యుద్ధం, 1951 వరకు భారతదేశంలో దుర్భిక్ష పరిస్థితులే దీనికి కారణం. నెహ్రూ, ఆయన ఏర్పర్చుకున్న మేధావుల బృందం సైతం కులాలవారీ జన గణన చేపట్టాలని కోరుకోలేదు. కులసంబంధిత గాయాలను కులాలవారీ గణన కొత్తగా రేపుతుందనే అర్థరహితమైన సిద్ధాంతాలు వ్యాప్తిలోకి వచ్చాయి. కులాల వారీ జనగణన, ఓబీసీ రిజర్వేషన్ పై నెహ్రూ కూడా వీటి ప్రభావానికి లోనయ్యారని పిస్తుంది. నెహ్రూ స్వయంగా కులవారీ జనగణనను వ్యతిరేకించినప్పుడు, 1951లో నెహ్రూ మంత్రివర్గంలోని అంబేడ్కర్ సైతం ఏమీ చేయలేకపోయారు. పీసీ జోషి, శ్రీపాద్ డాంగే, బీటీ రణదివే వంటి కమ్యూనిస్టు ద్విజ మేధావులతోపాటు వామపక్షానికి చెందిన బెంగాలీ భద్రలోక్ నెహ్రూవియన్ల అభిప్రాయాలతో ఏకీభవించినట్లే కనిపించింది. ఏదేమైనా ఈ దృక్పథం హెగ్డేవార్, గోల్వాల్కర్ వంటి హిందుత్వ మేధావులకు ఆమోదనీయమైందని గ్రహించాలి.
బ్రిటిష్ వారు దేశాన్ని వీడి వెళ్లిపోగానే, దేశంలోని మొత్తం మేధో, పాలనా, రాజకీయ నిర్మాణాలు ద్విజ మేధావుల చేతుల్లోకి వచ్చేశాయి. అత్యున్నత పాలనా వ్యవస్థలో శూద్ర, దళిత, ఆదివాసీ మేధావులు కానీ, చైతన్యవంతమైన రాజకీయ శక్తులు కానీ లేకుండా పోయారు. అదే సమయంలో తమను ప్రత్యేక వర్గాల కింద గణించే హక్కును దళితులు, ముస్లింలు పొందడంతో అంబేడ్కర్ పెద్దగా ఈ అంశంపై పోరాడలేకపోయారు. సూత్రరీత్యా దళిత రిజర్వేషన్లు 1947లోనే ఉనికిలోకి వచ్చాయి. దేశ విభజన సమస్యల కారణంగా నెహ్రూ పాలనా యంత్రాంగం ముస్లింలను మైనారిటీలుగా గణించడాన్ని కొనసాగించడం ద్వారా వారిని సంతృప్తి పరిచింది. దాంతోపాటు అగ్రశ్రేణి విద్యావంత ముస్లిం మేధావులను పాలనా యంత్రాంగంలో చేర్చుకున్నారు. కానీ శూద్ర ఓబీసీలకు కులవారీ జనగణన కోసం లేదా రిజర్వేషన్ల కోసం పోరాడేందుకు ఒక లాబీ అంటూ లేకుండా పోయింది.
మెజారిటీ శూద్రులు కులవారీ జనగణనను కోరుకుంటుండగా, ద్విజులు దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఓబీసీలకు రిజర్వేషన్లు ఉన్నప్పటికీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, కేంద్రీయ విశ్వవిద్యాలయాల వంటి అత్యున్నత సంస్థలలోని పాలనా యంత్రాంగ నిర్మాణాలు మొత్తంగా తమ నియంత్రణలోనే ఉన్నాయని ద్విజులకు తెలుసు. మన రాయబార కార్యాలయాలతో సహా ఢిల్లీ పాలనాయంత్రాంగం కూడా వాస్తవంగా ద్విజుల అదుపులో ఉంటోంది. ఒకసారి కులాలవారీగా అధికారిక డేటా విడుదల చేశాక, ఢిల్లీ నుంచి దేశాన్ని పాలిస్తున్న కీలకమైన పాలనా వ్యవస్థల్లో ఏ ఒక్కదానిలో కూడా తమకూ ప్రాతినిధ్యం లేదని జాట్‌లు, గుజ్జర్లు, పటేళ్లు, మహిస్యాలు (పశ్చిమ బెంగాల్), ఉత్తర, దక్షిణ భారతదేశంలోని ఇతర కమ్యూనిటీలు కూడా గుర్తించే ప్రమాదముంది.
కులాలవారీగా జనాభా గణన భారతదేశంలో ప్రజాస్వామ్య భావనను మౌలికంగానే మార్చివేస్తుంది. పార్టీ భేదాలకు అతీతంగా బిహార్ ప్రాంతీయ నేతలు ప్రధాని నరేంద్రమోదీని ఇటీవలే కలిసి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే తలపెట్టిన కులప్రాతిపదిక డేటా సేకరణను నమూనాగా తీసుకుని కులాలవారీ జనగణన చేపట్టాలని కోరారు. తెలంగాణలో కేసీఆర్, కర్ణాటకలో సిద్ధరామయ్య కులాల ప్రాతిపదికన తమవైన సంక్షేమ పథకాల ఎజెండా కోసం ఆ డేటాను ఉపయోగించుకున్నారు. ఉదాహరణకు తెలంగాణలోనే ఒకటో, రెండవ అతిపెద్ద కమ్యూనిటీలైన గొల్ల–కురుమలు, ముదిరాజుల అసలు సంఖ్యను కేసీఆర్ గుర్తించి, సాంప్రదాయికంగా గొర్రెలకాపరులైన గొల్లకురుమల కోసం గొర్రెల పంపిణీ, చేపల వేటను వృత్తిగా కలగిన ముదిరాజుల కోసం మత్స్య పరిశ్రమాభివద్ధి పథకాన్ని ప్రారంభించారు. ప్రతిఫలంగా 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ వీరి ఓట్లను కొల్లగొట్టారు.
ప్రాంతీయ పార్టీలకు ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి. ఇక ప్రజానీకం కులాలవారీగా జనాభా గణన వల్ల తమదైన ప్రయోజనాలను పొందుతోంది. మరోవైపున బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టుల వంటి జాతీయ పార్టీలు... తమను కులాలుగా గణించడాన్ని వ్యతిరేకిస్తున్న తమవైన ద్విజుల నెట్‌వర్క్‌పట్ల ఎంతో జాగరూకతతో ఉంటున్నాయి. ఇదే భవిష్యత్తులో అతిపెద్ద వైరుధ్యంగా మారబోతోంది.
-ప్రొ. కంచ ఐలయ్య షెపర్డ్
వ్యాసకర్త ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త
Comments
Please login to add a commentAdd a comment