ఎన్‌పీఆర్‌ అమలుకు రంగం సిద్ధం.. | Field is ready for NPR implementation across the country | Sakshi
Sakshi News home page

మీ 'జాతీయత' ఏమిటి?

Published Tue, Feb 11 2020 1:56 AM | Last Updated on Tue, Feb 11 2020 2:03 AM

Field is ready for NPR implementation across the country - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌) నవీకరణ, జనాభా గణన, గృహ ఆస్తుల వివరాల సేకరణ (హౌస్‌ లిస్టింగ్‌)కు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ప్రభుత్వం శిక్షణ ఇచ్చి నియమించిన ఎన్యూమరేటర్లు ఇంటింటికీ తిరిగి ప్రజల నుంచి వివిధ వివరాలు సేకరించనున్నారు. ‘మీరు, మీ తల్లిదండ్రుల పుట్టిన తేదీ, పుట్టిన ప్రాంతం ఏమిటి?.. మీరు భారతీయులేనా? మీ ఆధార్, ఓటర్‌ ఐడీ, పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్స్, మొబైల్‌ నంబర్‌ ఏమిటి?. మీకు చట్టబద్ధంగా, సంప్రదాయబద్ధంగా పెళ్లైందా లేక సహజీవనం చేస్తున్నారా? వంటి వివరాలను అడిగి తెలుసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన రుజువులను ప్రజలు స్వచ్ఛందంగా ఇస్తే ఎన్యూమరేటర్లు తీసుకోనున్నారు. అయితే సర్వేకు వచ్చినప్పుడు ఈ పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని ఎన్యూమరేటర్లు కుటుంబ పెద్దను కోరనున్నట్లు ఎన్‌పీఆర్‌–2020 యూజర్‌ మాన్యువల్‌లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పౌరసత్వ చట్టం–1955, పౌరసత్వ నిబంధనలు–2013 కింద ఎన్‌పీఆర్‌కు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. దేశ పౌరులతోపాటు దేశంలో నివాసముంటున్న విదేశీయుల సమాచారాన్ని ఈ కార్యక్రమంలో భాగంగా సేకరించనుంది.

ఎన్‌పీఆర్‌ కింద అడిగే ప్రశ్నలు....
1. ఎన్‌పీఆర్‌ బుక్‌లెట్‌పై ముద్రించిన పేరు సరైనదేనా? (ఒకవేళ తప్పులుంటే పేరును బుక్‌లెట్‌లో సరిచేస్తారు. ప్రతి వ్యక్తి పేరును కరెక్టుగా నమోదు చేయడం కీలకమని ఎన్‌పీఆర్‌ నియమావళి పేర్కొంటోంది)
2. ఇంట్లో అందుబాటులో ఉన్న వ్యక్తులు ఎంత మంది? (కుటుంబ సభ్యులు ఎవరైనా వలస వెళ్లినా, చనిపోయినా నమోదు చేసుకుంటారు)
3. కుటుంబ పెద్దతో ఇతర సభ్యుల బంధుత్వం.
4. పురుషులా.. మహిళలా లేక ఇతరులా?
5. వివాహ స్థితిగతులు. (అవివాహితులు, వివాహితులు, వితంతువు/భార్య చనిపోయిన వ్యక్తి, విడిపోయిన వారు, విడాకులు పొందిన వారు వంటి వివరాలు సేకరిస్తారు. రెండోసారి పెళ్లి చేసుకున్నా లేక సహజీవనం చేస్తున్నా పెళ్లయిన వ్యక్తుల కిందే లెక్కగట్టనున్నారు)
6. కుటుంబ సభ్యుల పుట్టిన తేదీ ఏమిటి? (తప్పుగా ఉంటే సరిచేస్తారు. ఒకవేళ ఎవరైనా తమ పుట్టిన తేదీ, నెల వివరాలు అందించలేని స్థితిలో ఉంటే కేవలం పుట్టిన సంవత్సరాన్ని మాత్రమే నమోదు చేస్తారు. ఎన్‌పీఆర్‌ డేటాబేస్‌లో పుట్టిన తేదీ కీలకం. ఒకవేళ పుట్టిన తేదీ సమాచారం అందించలేని పరిస్థితిలో ఉంటే సంబంధిత వ్యక్తుల స్కూల్‌ సర్టిఫికెట్లు, ఇతర పత్రాలు, ఆధార్, ఓటర్‌ ఐడీ, పాన్‌కార్డు, పాస్‌పోర్టు, ఇతర పత్రాల ఆధారంగా పుట్టిన తేదీని సేకరిస్తారు. అవి కూడా లేకపోతే సభ్యుల జాతక చక్రాన్ని పరిగణలోకి తీసుకోనున్నారు. జాతకచక్రం కూడా లేకుంటే ఎన్యూమరేటర్లే వయసును అంచనా వేసి నమోదు చేసుకోనున్నారు)
- కేవలం పుట్టిన సంవత్సరం మాత్రమే తెలిసి ఉంటే పుట్టిన తేదీని అంచనా వేసేందుకు ఎన్యూమరేటర్లు పలు ప్రశ్నలు అడగనున్నారు. వర్షాకాలంలో పుట్టారా లేదా తర్వాత? పుట్టిన నెలలో దసరా, దీపావళి, సంక్రాంతి, క్రిస్మస్‌ వంటి ఏమైనా పండుగలు వచ్చాయా? గాంధీ జయంతి, స్వాతంత్య్ర దినోత్సవం వంటి సెలవులు వచ్చాయా? వంటి ప్రశ్నలను సంధించడం ద్వారా పుట్టిన తేదీని అంచనా వేయనున్నారు.
- పుట్టిన తేదీ, సంవత్సరం రెండూ తెలియని పక్షంలో ఎప్పుడు పుట్టారో తెలుసుకోవడానికి దేశ చరిత్రలో కీలక ఘట్టాలుగా నిలిచిన సంఘటనల ఆధారంగా వ్యక్తుల వయసును ఎన్యూమరేటర్లు అంచనా వేయనున్నారు. తొలి ప్రపంచ యుద్ధం (1914–18), దండి యాత్ర (1930), క్విట్‌ ఇండియా ఉద్యమం (1942), స్వాతంత్య్ర దినోత్సవం (1947), చైనాతో యుద్ధం (1962), పాకిస్తాన్‌తో యుద్ధం (1965), బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం (1971), ఏసియాడ్‌ క్రీడలు (1982), భారత్‌ తొలి క్రికెట్‌ ప్రపంచకప్‌ విజయం (1983) సాధించినప్పుడు పుట్టారా? అని అడిగి తెలుసుకోనున్నారు.
7. మీరు పుట్టిన ప్రాంతం ఏమిటి? (దేశంలో పుడితే రాష్ట్రం, జిల్లా వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది)
8. మీ జాతీయత ఏమిటి? భారతీయులేనా? (మీరు పాస్‌పోర్టు నంబర్‌ స్వచ్ఛందంగా ఇస్తే స్వీకరించనున్నారు)
9. మీ విద్యార్హతలు ఏమిటి? (ప్రీ ప్రైమరీ, ప్రాథమిక, 1–12 తరగతులు, ఐటీఐ, పాలిటెక్నిక్, నర్సింగ్‌ డిప్లొమా, టీటీసీ, ఇతర డిప్లొమా, బ్యాచిలర్‌ డిగ్రీ, పీజీ డిప్లొమా, పీజీ, ఎంఫిల్, పీజీ ఆపై, సరైన విద్య లేని, నిరక్షరాస్యులా? వంటి వివరాలను అడిగి తెలుసుకోనున్నారు)
10. మీ వృత్తి ఏమిటి? (వ్యవసాయం, రోజుకూలీ, స్వయం ఉపాధి, ప్రభుత్వ ఉద్యోగి, ఉద్యోగి యజమాని, ప్రైవేటు ఉద్యోగి, డొమెస్టిక్‌ హెల్పర్, నాన్‌ వర్కరా? అని అరా తీయనున్నారు)
11. తల్లి మాతృ భాష ఏమిటి?
12. మీ శాశ్వత చిరునామా చెప్పండి
13. ప్రస్తుత చిరునామాలో ఓ సభ్యుడు పుట్టినప్పటి నుంచి ఉంటున్నాడా? (ఒకవేళ లేకుంటే ఇప్పుడు ఎన్నేళ్ల నుంచి ఇక్కడ ఉన్నాడు? అంతకు ముందు ఎక్కడ ఉన్నాడో తెలపాలి)
14. తండ్రి, తల్లి, భాగస్వామి వివరాలు (తల్లిదండ్రుల గణన ఈ ఇంట్లో జరగని పక్షంలో వారి పేర్లు, పుట్టిన తేదీ వివరాలు సేకరిస్తారు. భాగస్వామి అయితే కేవలం పేరు మాత్రమే రాస్తారు. అదే ఇంట్లో తల్లిదండ్రులు, భాగస్వామి గణన నిర్వహిస్తే వారి పేర్లు, దేశం/విదేశంలో పుట్టిన ప్రాంతం, పుట్టిన తేదీ వివరాలు సేకరిస్తారు. తల్లిదండ్రుల పుట్టిన తేదీ వివరాలు రూఢీ కాకపోతే సంబంధిత కాలమ్‌లో ‘–’అని పెడతారు.
15. ఆధార్, మొబైల్, ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌ నంబర్లు అందుబాటులో ఉంటే తీసుకుంటారు.

జనాభా గణనకు అర్హులైన వారు..
- ఎన్యూమరేటర్‌ వచ్చిన సమయంలో ఇంట్లో అందుబాటులో ఉన్న వ్యక్తులు.
జనాభా గణన నిర్వహించే సమయంలో అక్కడ ప్రత్యక్షంగా ఉన్న ఇంటి సాధారణ నివాసితులు.
ఇంటి సాధారణ నివాసితులై ఉండి ఎన్యూమరేటర్‌ సందర్శనకు వచ్చిన సమయంలో ఇంట్లో లేని వ్యక్తులు జనాభా గణన ముగిసేలోగా తిరిగి వస్తే వారి వివరాలను సైతం సేకరించనున్నారు.
- సందర్శకులు, పనిమనుషులు, అద్దెకు ఉండే వ్యక్తులు, డ్రైవర్లు లేదా అలాంటి వ్యక్తులు ఓ గృహ పరివారంతో కలసి ఉండటంతోపాటు పైన పేర్కొన్న మూడు అర్హతలను కలిగి ఉంటే వారి వివరాలను సైతం సేకరిస్తారు.

ఎన్‌పీఆర్‌ డేటాబేస్‌–2010 ఆధారంగా...
దేశంలో నివాసముంటున్న ప్రజలందరికీ సంబంధించిన ఎన్‌పీఆర్‌ డేటాబేస్‌ను తొలిసారిగా 2010లో తయారు చేశారు. జనగణన–2011 కార్యక్రమంలో భాగంగా 2010లో నిర్వహించిన సర్వేలో సేకరించిన సమాచారం ఆధారంగా ఎన్‌పీఆర్‌ డేటాను రూపొందించారు. ఆ వివరాలతో ‘ఎన్‌పీఆర్‌ డేటా బుక్‌లెట్‌’ను ముద్రించనున్నారు. ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి కుటుంబ పెద్ద నుంచి జనాభా గణనతోపాటు ఎన్‌పీఆర్‌కు సంబంధించి తాజా సమాచారాన్ని సేకరించనున్నారు. ఈ క్రమంలో ఎన్‌పీఆర్‌ బుక్‌లెట్స్‌లో సంబంధిత కుటుంబం/వ్యక్తులకు సంబంధించి ముద్రించి ఉన్న సమాచారాన్ని సరిపోల్చి చూడనున్నారు.

ఇందుకు అవసరమైతే ఆధార్, ఓటర్‌ ఐడీ కార్డు వంటి రుజువులను చూపాలని కోరనున్నారు. పాత ఎన్పీఆర్‌ డేటాబేస్‌లో ఎవైనా తప్పులుంటే సరిచేయడంతోపాటు అవసరమైన కొత్త సమాచారాన్ని నమోదు చేసుకోనున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన సందర్భంగా పాత ఎన్‌పీఆర్‌ డేటాబేస్‌లో ఉన్న కుటుంబాల్లో కొత్త సభ్యులున్నట్లుగానీ, కొత్త కుటుంబాలున్నట్లుగానీ గుర్తిస్తే వారికి సంబంధించిన సమాచారాన్ని నమోదు చేసేందుకు ఎన్యూమరేటర్లకు ‘ఖాళీ ఎన్‌పీఆర్‌ ఫారాలను’కేంద్రం అందించనుంది. ఓ కుటుంబానికి సంబంధించిన ఎన్‌పీఆర్‌ బుక్‌లెట్‌లో ఆ కుటుంబానికి సంబంధించిన కొత్త సభ్యుల వివరాలను నమోదు చేసేందుకు అవసరమైన ఖాళీ పేజీలుంటే అదే బుక్‌లెట్‌లో నమోదు చేయనున్నారు.
కుటుంబలోని ప్రతి వ్యక్తికి సంబంధించిన ఎన్‌పీఆర్‌ డేటాబేస్‌ను నవీకరిస్తారు.
నవీకరించిన ఎన్‌పీఆర్‌ డేటాబేస్‌ను కుటుంబ పెద్దకు చూపించడంతోపాటు బుక్‌లెట్‌పై అతడి/ఆమె సంతకం/వేలిముద్రను సేకరించనున్నారు. 
- కుటుంబ సభ్యుల పేర్లు, సంఖ్య, ఇతర అంశాలకు సంబంధించిన సరైన సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత కుటుంబ పెద్దది అని ఎన్‌పీఆర్‌ నిబంధనలు పేర్కొంటున్నాయి.
- ఒకే గృహంలో నివాసముంటూ ఉమ్మడి కిచెన్‌పై ఆధారపడిన రక్తసంబంధికులతోపాటు ఏ సంబంధం లేని వ్యక్తుల ఎన్‌పీఆర్‌ డేటాను ‘సాధారణ గృహాల’విభాగం కింద స్వీకరించనున్నారు.
బోర్డింగ్‌ గృహాలు, మెస్‌లు, హాస్టళ్లు, హోటళ్లు, రెస్క్యూ గృహాలు, అబ్జర్వేషన్‌ హోంలు, బెగ్గర్‌ హోంలు, జైళ్లు, ఆశ్రమాలు, వద్ధాశ్రమాలు, బాల గృహాలు, అనాథాశ్రమాలు వంటి భవనాల్లో నివాసముండే ఏ బంధుత్వం లేని వ్యక్తుల ఎన్‌పీఆర్‌ డేటాను వ్యవస్థాగత గృహాల విభాగం కింద సమీకరించనున్నారు.
ఎన్‌పీఆర్‌ బుక్‌లెట్‌పై రాష్ట్రం/జిల్లా/తహసీల్‌/తాలుకా/పోలీస్‌ స్టేషన్‌/డివిజన్‌ బ్లాక్‌/సర్కిల్‌ బ్లాక్‌/మండలం/పట్టణం/గ్రామం పేర్లతో వాటికి సంబంధించిన కోడ్‌లు ముద్రించి ఉండనున్నాయి. వార్డు, హౌస్‌హోల్డ్‌ బ్లాక్‌ నంబర్, సబ్‌బ్లాక్‌ నంబర్, పిన్‌కోడ్‌ వంటి వివరాలు సైతం ఉండనున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement