జనగణన ఆచూకీ ఏదీ? | Editorial About Census Exercise Not To Be Held Anytime Soon | Sakshi
Sakshi News home page

జనగణన ఆచూకీ ఏదీ?

Published Fri, Jan 7 2022 12:05 AM | Last Updated on Fri, Jan 7 2022 12:09 AM

Editorial About Census Exercise Not To Be Held Anytime Soon - Sakshi

ఈసారి కుల ప్రాతిపదికన జనగణన జరపాలని వివిధ రాజకీయ పార్టీలతోపాటు బీసీ కులాలు సైతం గట్టిగా డిమాండ్‌ చేస్తున్న తరుణంలో మొత్తంగా జనగణన ప్రక్రియకే గండికొడుతున్నారన్న కథనాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. వాస్తవానికి జనాభా లెక్కల సేకరణకు సంబంధించిన నోటిఫికేషన్‌ పద్ధతి ప్రకారం 2019 మార్చిలో విడుదలైంది. 2020 ఏప్రిల్‌– సెప్టెంబర్‌ల మధ్య తొలి దశలో ఇళ్లు, కట్టడాలు, కుటుంబాలకు సంబంధించిన లెక్కల సమీకరణ... నిరుడు ఫిబ్రవరి 9నుంచి రెండో దశ లో జనాభా లెక్కింపు, భాష, మత, విద్య, ఆర్థిక అంశాలతోపాటు వలసలు, సంతాన సాఫల్యత, విడాకులు, సహజీవనాలు వగైరా వివరాల సేకరణ ప్రారంభం కావాలని అందులో నిర్దే శించారు. కానీ ఈలోగా కరోనా విరుచుకుపడటంతో ఇదంతా వాయిదా పడింది.

2020 నవంబర్‌ మొదలుకొని క్రమేపీ సాధారణ పరిస్థితులు ఏర్పడ్డం మొదలైంది. ఎన్నికలు, మతపరమైన ఉత్స వాలు, ఊరేగింపులు, సభలు, సమావేశాలన్నీ నిరుడు యధావిధిగానే జరిగాయి. కానీ జనగణనను మాత్రం ఆపేశారు. 2021–22 మధ్య జనగణన తొలి దశ ఉంటుందనీ, 2023–24 మధ్య రెండో దశ ఉంటుందనీ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సైతం చెప్పింది. ఫోన్‌ ద్వారా వివరాలు సేకరించే ఆలోచన చేస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఇంతవరకూ మళ్లీ దానిపై ఉలుకూ పలుకూ లేదు. 

ప్రభుత్వాలు వేసే ప్రతి అడుగుకూ జనగణనలో వెలువడే డేటా ఎంత ప్రాణప్రదమో చెప్పన వసరం లేదు. పేదరిక నిర్మూలన పథకాల అమలుకూ, మౌలిక వసతుల పరికల్పనకూ, విద్య, ఆరోగ్య రంగాల పటిష్టతకూ, ఆహారభద్రతకూ ప్రభుత్వాలు ఏ చర్యలు తీసుకోవాలన్నా జనగణన కీలకం. అందులో వెలువడే డేటా లేకుండా అవి పకడ్బందీ వ్యూహాలను రూపొందించడం, వాటిని పట్టాలెక్కించడం అసాధ్యం. జనాభా లెక్కల స్థూల వివరాలు వెనువెంటనే వెల్లడైనా వివిధ రంగాలకు సంబంధించిన సమస్త గణాంకాలూ అనంతరకాలంలో అంచెలంచెలుగా బయటి కొస్తుంటాయి.

సాధారణ ప్రజానీకం జీవనం ఎలావుందో తెలియలన్నా... వారి మౌలిక అవసరాలు తీర్చడానికి అమలవుతున్న చర్యల ఫలితాలు అవగాహన కావాలన్నా... మత, భాషా ప్రాతిపదికన మైనారిటీలుగా ఉన్నవారి స్థితిగతులు అర్థం కావాలన్నా... లోటుపాట్ల సవరణకు ఏం చేయాలో ప్రభుత్వాలు సమీక్షించాలన్నా జనగణనే దిక్కు. విధాన రూపకల్పనకూ, బడ్జెట్‌ కేటాయింపులకూ, పాలనా వ్యవస్థ పటిష్టతకూ జనగణనలో వెల్లడయ్యే డేటా ఉపయోగపడుతుంది. నియోజకవర్గాల పునర్విభజన, ఎస్సీ, ఎస్టీ స్థానాల ఖరారు తదితర అంశాలు సరేసరి.   

మన దేశంలో 1881లో ప్రారంభించాక ఎప్పుడూ జనగణన ఆగలేదు. ఎన్ని అవాంత రాలొచ్చినా పదేళ్లకోసారి అది క్రమం తప్పకుండా సాగుతూనే ఉంది. అలాగని దానిపై వివాదాలు లేకపోలేదు. ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించే ఎన్యూమరేటర్లు నిర్దుష్టమైన సమాచారాన్ని సేకరించడంలో విఫలమవుతున్నారని నిపుణుల వాదన. ఎన్యూమరేటర్లకు తగిన శిక్షణ లేకుండా, డేటా సేకరణ వెనకుండే పరమార్థాన్ని వివరించకుండా రంగంలోకి దించడం వల్ల వారు ఇష్టాను సారం కాగితాలు నింపడం మినహా మరేమీ చేయటంలేదని 2011 జనాభా లెక్కల సేకరణ సమయంలో ఆరోపణలు వెల్లువెత్తాయి.

అంతక్రితం దశాబ్దాల్లోనూ ఇదే వరస. కొన్ని చోట్లయితే ఎన్యూమరేటర్ల జాడలేదంటూ జనమే ఫిర్యాదులు చేశారు. వీటన్నిటినీ సరిచేసి పకడ్బందీ జనగణనకు చర్యలు తీసుకోవాల్సిందిపోయి, మొత్తంగా ఆ ప్రక్రియనే అనిశ్చితిలో పడేయటం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ప్రజలకు సంబంధించిన డేటా లేనప్పుడు ఏమవుతుందో చెప్పడానికి ఇటీవల ఆర్థికవేత్తలు జీన్‌ డ్రీజ్, రీతికా ఖేరాలు లేవనెత్తిన అంశాలే రుజువు. 2011 లెక్కల ప్రకారం దేశ జనాభా 121 కోట్లు. దాని ప్రకారం ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్‌) ద్వారా 80 కోట్లమంది నిరుపేదలకు ప్రభుత్వాలు సబ్సిడీ బియ్యం, ఇతర సరుకులు అందిస్తున్నాయి.

దేశ జనాభా దాదాపు 137 కోట్లకు చేరివుండొచ్చని 2020లో అంచనావేశారు. ఆ లెక్కన మొత్తంగా 92 కోట్ల మందికి పీడీఎస్‌ అమలు కావాలి. కానీ ఇప్పటికీ 2011 జనాభా లెక్కలను మాత్రమే ప్రాతిపదికగా తీసుకోవడంవల్ల 12 కోట్లమందికి పీడీఎస్‌ సరుకులు అందుబాటులోకి రావడంలేదని వారిద్దరూ తేల్చారు. కరోనా కారణంగా ప్రబలిన నిరుద్యోగిత ఈ సంఖ్యను మరింత పెంచివుండొచ్చు. దానికి తగినట్టు తమ రాష్ట్రాలకు అదనపు కోటా కావాలని రాష్ట్రాలు అడగాలన్నా, కేంద్రం ఇవ్వాలన్నా జనగణన డేటా ఉంటే తప్ప అసాధ్యం. ఆమధ్య కేంద్ర ఆహార శాఖ కార్యదర్శే ఈ మాటన్నారు. 

మనకు ఆధార్‌ డేటా ఎటూ ఉంది కదా అని కొందరు వాదిస్తున్నారు. అలాగే అంగన్‌వాడీ వంటిచోట్ల గర్భిణుల, శిశువుల వివరాలు నమోదు చేస్తారు. కానీ ఆ గణాంకాలు సమగ్ర చిత్రాన్ని ఆవిష్కరించే అవకాశం ఎంతమాత్రమూ లేదు. కరోనా విరుచుకుపడటం, అది ఒమిక్రాన్‌ రూపంలో శరవేగంగా విస్తరిస్తుండటం వాస్తవమే. కానీ మన పొరుగునున్న చైనా 2020 న వంబర్‌–డిసెంబర్‌ మధ్య జనగణన పూర్తి చేసుకుంది. స్థూల వివరాలను నిరుడు మే నెలలో ప్రకటించింది. అమెరికా సైతం ఆన్‌లైన్, ఫోన్‌–ఇన్‌ మార్గాల్లో 2020లో ఈ క్రతువు పూర్తిచేసింది. నిరుడు ఆగస్టులో అది డేటా కూడా విడుదల చేసింది. కానీ మనం మాత్రం ఇతరత్రా కార్యకలాపాలన్నీ యధావిధిగా సాగించుకుంటూ జనగణనను మాత్రం నిర్లక్ష్యం చేశాం. ఈ విషయంలో కేంద్రం వివరణనివ్వడం, సాధ్యమైనంత త్వరగా దాన్ని ప్రారంభించటం అత్యవసరం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement