లింగ సమానత్వం దిశగా యువత అడుగులు
ఎవరైనా ఒక్కటే అన్న ఆలోచన.. ఆడ శిశువులకు స్వాగతం
2036 నాటికి పెరగనున్న మహిళల సంఖ్య
అంచనా గణాంకాలు విడుదల చేసిన కేంద్రం
తరం మారుతోంది.. జనం అభిప్రాయం మారుతోంది... అబ్బాయే కావాలి.. వంశానికి వారసుడు ఉండాలనే ధోరణిలో మార్పు వస్తోంది. ఆడ, మగ.. ఎవరైనా చాలు అనే ఆలోచన పెరుగుతోంది.. లింగ నిష్పత్తి సమానత్వం దిశగా సమాజం వడివడిగా అడుగులు వేస్తోంది..
మన దేశంలో ఆది నుంచి పురుషాధిక్యత ఎక్కువ. అబ్బాయి ఇంటిపేరు నిలబెడతాడు.. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకుంటాడు.. పున్నామ నరకం నుంచి తప్పించాలంటే పుత్రుడు ఉండాలి.. అమ్మాయి అయితే కట్న, కానుకలిచ్చి పెళ్లి చేయాలి.. వివాహంతో తల్లి ఇంటితో రుణం తీరిపోతుంది.. లాంటి ఆలోచన చాలా మందిలో నాటుకుపోయింది. ఈ నేపథ్యంలో లింగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి వచి్చనప్పుటి నుంచి ఆడ శిశువుల హత్యలు పెరిగాయి.
లక్షల మంది ఆడ శిశువులు అమ్మ కడుపులోనే కన్నుమూశారు. అయితే ఇప్పుడు ఈ ధోరణి మారుతోంది.. అమ్మాయి ఐనా.. అబ్బాయి ఐనా ఓకే అంటూ యువతరం స్వాగతం పలుకుతోంది. ఆడ శిశువుల కంటే మగ శిశువుల నిష్పత్తి ఎక్కువగా ఉండే పరిస్థితి క్రమేపీ మారుతోంది. దేశంలో లింగ సమానత్వం దిశగా అడుగులు పడుతున్నట్లు, మహిళా జనాభా పెరగనున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన అంచనా గణాంకాలు ధ్రువీకరిస్తున్నాయి.
2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి వెయ్యి మంది పురుషులకు 943 మహిళలు ఉండగా, 2036 వరకల్లా ఇది 952కు వృద్ధి చెందుతుందని గణాంకాలు చెబుతున్నాయి. కేంద్ర గణాంకాల ప్రకారం.. 2036 నాటికి దేశ జనాభా 152.2 కోట్లకు చేరుతుంది. మొత్తం జనాభాలో స్త్రీల శాతం 48.5 నుంచి 48.8కి పెరగనుంది. పదేళ్లలోపు చిన్నారుల సంఖ్య గణనీయంగా పడిపోవడంతో పాటు వృద్ధుల సంఖ్య పెరుగుతుందని స్పష్టం చేసింది. కాగా లింగ నిష్పత్తి, పని చేసే యువత, జననాల రేటుకు సంబంధించిన పలు ఆసక్తికర గణాంకాలను కేంద్రం వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment