ప్రపంచంలో అతిపెద్ద జనతంత్ర రాజ్యం ఇండియాలో, అత్యంత ఉత్కృష్ట ప్రజాస్వామ్య దేశంగా పరిగణించే అమెరికాలో 2024లో కేంద్ర ప్రభుత్వాలను ఎన్నుకోవడానికి ఓటర్లు అప్పుడే సిద్ధమౌతున్నారు. ఈ జాతీయ ఎన్నికల్లో ఏయే అంశాల ఆధారంగా తాము ఓటేయాలో ఆలోచించడం మొదలుబెట్టారు. ఎన్నెన్నో వ్యత్యాసాలున్న ఈ రెండు విశాల దేశాలనూ కలిపే అంశం ఎన్నికల ద్వారా నడిచే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యమే.
నిజానికి అమెరికా జనాభా 33 కోట్ల 49 లక్షలని, భారతదేశం జనసంఖ్య 142 కోట్లు దాటిందని ఈ ఏడాది తెలిసింది. ఇక భూభాగం విషయానికి వస్తే–ఇండియా కన్నా అమెరికా వైశాల్యం మూడు రెడ్లు ఎక్కువ. ఇతర దేశాల ప్రజలు లక్షల సంఖ్యలో వలసొచ్చి అమెరికాలో స్థిరపడడానికి అవసరమైన చోటు, టెక్నాలజీ, ఉపాధి అవకాశాలు, ఇతర వనరులు పుష్కలంగా ఉన్నాయి. ప్రపంచంలో ఓటర్ల సంఖ్య విషయంలో ఇండియా ప్రథమ స్థానంలో ఉంది. అన్ని పార్లమెంట్లకు మాతృక అని వర్ణించే బ్రిటిష్ పార్లమెంటు ఉన్న యునైటెడ్ కింగ్‌డమ్ తర్వాత ఆ దేశ సంపర్కంతో ప్రజాస్వామ్య వ్యవస్థ వేళ్లూనుకుంది అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో.
‘కొత్త ప్రపంచం’గా అభివర్ణించే అట్లాంటిక్ మహాసముద్రం ఆవల ఉన్న ఈ సువిశాల అమెరికాలో ఎన్నికల ప్రజాస్వామ్యం ఆ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 12 సంవత్సరాలకు ఆరంభమైంది. అక్కడ మొదటి అధ్యక్ష ఎన్నికలు 1788 డిసెంబర్ 15న మొదలై 1789 జనవరి 7న ముగిశాయి. ప్రథమ అధ్యక్షుడిగా స్వాతంత్య్ర సేనాని జార్జి వాషింగ్టన్ ఎన్నికయ్యారు. అప్పటి నుంచీ 2020 ఎన్నికల వరకూ ఈ అత్యంత సంపన్న దేశంలో (ప్రతి నాలుగేళ్లకూ) 59 సార్లు జరిగాయి. వచ్చే ఏడాది నవంబర్ 5న 60వ అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది.
ఇండియాతో పోల్చితే 163 ఏళ్ల ముందే ఎన్నికల ప్రజాస్వామ్యం అమల్లోకి వచ్చిన కారణంగా మనకు వింతగా కనిపించే ప్రజాస్వామ్య సాంప్రదాయాలు అమెరికాలో కనిపిస్తాయి. అధ్యక్ష ఎన్నికల పోలింగ్ తేదీ కూడా ఇలాంటిదే. 18వ శతాబ్దం చివరిలో అమెరికాలోని వ్యవసాయ పనులు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని నవంబర్ మాసంలో తొలి సోమవారం తర్వాత వచ్చే మొదటి మంగళవారంనాడు ఎన్నికల పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. అందుకే ప్రతిసారీ నవంబర్ 7 లోపే అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరగడం చూస్తున్నాం.
ఇండియాలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన రెండేళ్లకే ఎన్నిక ప్రజాస్వామ్యం..
అమెరికాలో రాజ్యాంగ రచన పూర్తయి, మొదటి సాధారణ ఎన్నికలు జరిపించడానికి పుష్కర కాలం పట్టింది. కానీ, ఇండియాలో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన (1950 జనవరి) నాటి నుంచి రెండేళ్లలోపే అంటే 1951 అక్టోబర్ 25న తొలి సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మొదలైంది. 1952 ఫిబ్రవరి 21న ముగిసింది. నాటి పరిస్థితులు, విస్తృతమైన ఎన్నికల నిర్వహణ అనుభవం లేకపోవడంతో ప్రథమ సాధారణ ఎన్నికలకు దాదాపు నాలుగు నెలల కాలం అవసరమైంది. ఇప్పుడేమో ఎన్నికలు ప్రశాంతంగా, సాఫీగా జరగడం కోసం నెల రోజుల సమయం పడుతోంది.
2019 పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయడానికి నెలపైన వారం రోజుల సమయం అవసరమైంది. ఈ రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం విషయం ఓటర్ల నమోదు ప్రక్రియ. ఇండియాతో పోల్చితే పోలింగ్ శాతం బాగా తక్కువ ఉండే అమెరికాలో పోలింగ్ రోజు కూడా పొద్దున్నే ఓటరుగా నమోదు చేయించుకుని, తర్వాత ఓటు వేసే వెసులుబాటు అక్కడి పౌరులకు కల్పించారు. భారత్‌లో నిర్ణీత గడువులోగా ఓటరుగా నమోదు చేయించుకోవాల్సిన పరిస్థితి. అలాగే, అమెరికాను దాదాపు 525 ఏళ్ల క్రితం క్రిస్టఫర్ కొలంబస్ కనిపెట్టినప్పటి నుంచీ అక్కడికి ఏటా లక్షలాది ప్రపంచదేశాల ప్రజలు వచ్చి స్థిరపడుతూనే ఉన్నారు. ఇలా ఉన్నత విద్య, ఉపాధి కోసం వచ్చిన వారందరికీ వెంటనే పౌరసత్వం రాదు. కోరుకోకపోతే కొందరికి ఎప్పటికీ రాకపోవచ్చు కూడా.
ప్రధానంగా పని, నివాసం, ఇతర అంశాల వల్ల పౌరసత్వం వచ్చిన (నేచురలైజేషన్) వ్యక్తులు మొదట చేసే పని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయడం. ఎన్నికల్లో ఓటు వేయడాన్ని– తమ కృషిని గుర్తించి తమకు పౌరసత్వం ఇచ్చిన అమెరికా రుణం తీర్చుకోవడంలో భాగంగా ఈ పూర్వ వలసదారులు భావిస్తారు. ఇతర దేశాల నుంచి వలసవచ్చిన వారికి అత్యధిక సంఖ్యలో 2022లో అమెరికా పౌరసత్వం లభించిందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కిందటేడాది నేచురలైజేషన్ ప్రక్రియ ద్వారా రికార్డు స్థాయిలో దాదాపు పది లక్షల మంది అమెరికా పౌరసత్వం పొందారు. ఈ నూతన పౌరులందరికీ 2024 నవంబర్ 5 ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లభించింది. ఓటు వేయడాన్ని తమ శక్తిగా, దేశం రుణం తీర్చుకునే క్రియలో భాగంగా పరిగణించడం నిజంగా మంచి భావనే. ఈ సూత్రం ఇండియాకు కూడా వర్తిస్తుంది.
వెస్సార్‌సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment