దేశంలో ప్రతి దానికీ లెక్క ఉంటుంది. పశుపక్ష్యాదు లెన్ని, పులులు, సింహాలెన్ని అనే లెక్కలు కూడా తీస్తారు. అలాంటిది బీసీల లెక్క ఎందుకు తీయడం లేదు? గత నాలుగు దశాబ్దాలుగా ఎన్ని పోరాటాలు చేసినప్పటికీ బీసీ జనగణన చేయడం లేదు. బీసీ జనాభా ఎంతో తెలియకుండా బీసీల సమగ్రాభివృద్ధికి ఎలా ప్రణాళికలు రూపొందిస్తారు? చట్టసభల్లో ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలనీ, క్రీమీలేయర్ విధానాన్ని తొలగించాలనీ, విద్య, ఉద్యోగాల్లో ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలనీ దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న ఉద్యమ సంఘాలు దేశ రాజధాని ఢిల్లీ చేరుకొని ధర్నా చేస్తున్నాయి. ముఖ్యమైన నాయకులను కలిసి వినతి పత్రాలు సమర్పిస్తున్నాయి.
ఎస్సీ, ఎస్టీలకున్న రాజ్యాంగపరమైన హక్కులు, ఆధిపత్య వర్గాలకున్న రాజ్యాధికారం బీసీలకు లేక పోవడం వల్ల వారు అభివృద్ధికి నోచుకోవడంలేదు. ప్రాచీన కాలం నుంచీ ఉత్పత్తి, సేవా రంగాల్లో తమ దైన నైపుణ్యంతో మానవాళి మనుగడకు కృషి చేస్తూ వచ్చిన బీసీలు ఇవ్వాళ దయనీయమైన స్థితికి చేరుకున్నారు. ఆధునిక పారిశ్రామిక విధానం వల్ల బీసీలకు జీవనాధారమైన సాంప్రదాయిక వృత్తులు విధ్వంసమై బీసీలు వలసల బాట పట్టారు. సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చిన మార్పులను గమనించిన ఆధి పత్య కులాల వాళ్లు బీసీ కులాల వృత్తులను లాక్కున్నారు.
మెషినరీ (మిల్లు)తో చేనేత రంగాన్ని కొల్లగొట్టారు. ప్లాస్టిక్‌తో కుమ్మరుల వృత్తీ, బ్యాండ్ బాక్స్‌లతో చాకలి వృత్తీ, బ్యూటీ పార్లర్లతో మంగలి ఉపాధీ మాయమవుతోంది. దూదేకుల, నూరుబాషా, పింజారి, లద్ధాఫ్, మెహతర్, ఫకీర్, అత్తరు, కాశోల్లు, గారడోళ్ల లాంటి ఎన్నో చిన్న చిన్న ఒంటరి కులాల వారు... బహుళజాతి కంపెనీల ఉత్పత్తులు, ఆధిపత్య కులాల వారి వ్యాపారాలతో ఉపాధి కోల్పోయి రోడ్డున పడి తమ ఉనికి కోల్పోవాల్సిన దుస్థితిలో ఉన్నారు. దాదాపు అన్ని బీసీ కులాల వారూ ఇదే పరిస్థితుల్లో ఉన్నారు. వీరు సంఘటితమై రాజ్యాధికారాన్ని చేపడితే కానీ వారి దుస్థితి మారదు. మరి అందుకేం చేయాలి?
బీసీలు రాజ్యాధికారం కోసం కొత్త ఎత్తుగడలతో ముందుకు సాగాలి. తమ జనాభాలో సగమైన మహిళ లను రాజకీయాలవైపు తీసుకురానంత కాలం విముక్తి సాధ్యం కాదని గుర్తించాలి. వందల కులాలుగా, వర్గాలుగా విడిపోయి జీవిస్తున్న బీసీ ప్రజలు బతుకు దెరువు కోసం వంద ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వారందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి రాజ్యాధికారం చేపట్టడం బీసీ నాయకత్వానికి, సంఘాలకు కత్తిమీద సాము లాంటిదే. బీసీ ప్రజలందరూ ఒకే జాతి ప్రజ లనే అవగాహన పెంపొందించాలి. వారి దైనందిన సమస్యలలో బీసీ నాయకత్వం పాల్పంచుకోవాలి.
రాజ్యాధికారంతోనే సమగ్రాభివృద్ధి సాధ్యమని బోధించి వారిని సమీకరించిన నాడు తప్పక విజయం సాధించవచ్చు. బీసీలు నేడు తమ ఆత్మగౌరవం కోసం, బహుజన రాజ్యాధికారం కోసం ఐక్యం కావాల్సిన చారిత్రక సందర్భాన్ని గుర్తించి ముందుకు సాగాలి. బహుజనులకు రాజ్యాధికారం నినాదంతో ఉత్తరప్రదేశ్, బిహార్‌లలో బహుజనుల రాజ్యం ఏర్పడింది. పెరియార్ ఉద్యమ వారసత్వంగా ఆనాడు కరుణానిధి, నేడు స్టాలిన్ తమిళనాడులో రాజ్యాధికారం చేపట్టి బహుజన ప్రజల సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. బీసీ సమాజం నుండి ఎదిగిన బీసీ నాయకులు, మేధావులు, విద్యావంతులు, విద్య, ఉద్యోగాలతోనే అభివృద్ది జరగదని గుర్తించాలి. (క్లిక్: వినదగిన ‘తక్కెళ్ల జగ్గడి’ వాదన)
రాష్ట్రాల్లో విడివిడిగా ఉద్యమాలు జరుపుతున్న నాయకులు ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమి టీగా ఏర్పడి దేశవ్యాప్త ఉద్యమ నిర్మాణానికి నడుంబిగించారు. ఈ కృషిలోప్రతి బీసీ భాగస్వామి కావాలి. (GO 111 Hyderabad: పర్యావరణాన్నే పణంగా పెడదామా?)
- సాయిని నరేందర్
బీసీ స్టడీ ఫోరం వ్యవస్థాపక చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment