Highest population density
-
మంచి పనిని కించపరుస్తారా?
జనాభా సమీకరణాల్లో వస్తున్నంత పరివర్తన సామాజికార్థిక పరిస్థితుల్లో రాకపోవడం దేశంలో ఏకరీతి ప్రగతికి సవాల్ విసురుతోంది. అసమగ్ర అభివృద్ధికి ప్రభుత్వాలే కారణమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ‘జనాభా ఆధారంగా చట్టసభలకు ప్రాతినిధ్య’ పద్ధతి సమాఖ్య స్ఫూర్తికే విఘాతం కలిగించేలా పరిణమించింది. నియోజకవర్గ పునర్విభజనతో జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య పెరుగనుండగా, దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గనున్నాయి. జనాభా నియంత్రిస్తే తప్పయినట్టు, ఎక్కువ మంది పిల్లల్ని కనడమే గొప్పయినట్టు అధికారిక ప్రచారాలు, అమలు చర్యలు మొదలయ్యే ప్రమాదముంది. ఈ పరిస్థితులపై లోతైన సమగ్ర అధ్యయనం, దిద్దుబాటు చర్యలు తక్షణావసరం.మనమిపుడు 140 కోట్ల మందితో ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా ఉన్నాం. వనరులు, సదుపాయాలు, జనాభా నిష్పత్తిలో చూసినపుడు ఇదొక సంక్లిష్ట నమూనా! ఇటీవలి వరకు అధిక జనాభా దేశంగా ఉన్న చైనా కొన్నేళ్లుగా కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలతో జనాభా వృద్ధిని నిలువరించింది. మనం కూడా నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ, ఆశించిన లక్ష్యాలు అందుకోలేకపోయాం. అయితే, దేశంలోని కొన్ని, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు ఈ విషయంలో మంచి విజయాలు సాధించాయి. అర్థవంతమైన సంతానోత్పత్తి రేటు తరుగుదలను నమోదు చేశాయి. ఇది ప్రగతి సంకేతమే! కానీ, అదే తమ పాలిట శాపంగా పరిణమించిందని ఇప్పుడా రాష్ట్రాలు నెత్తి బాదుకుంటు న్నాయి. ప్రధానంగా రెండు సమస్యల్ని ఎదుర్కొంటున్నామని ఆ యా రాష్ట్రాల అధినేతలు భావిస్తున్నారు. ఒకటి, సంతానోత్పత్తి రేటు నియంత్రణ వల్ల పిల్లలు, యువ జనాభా తగ్గుతూ, వృద్ధుల జనాభా నిష్పత్తి పెరుగుతోంది. రెండోది, జనాభా నిలువరింపు కారణంగా, జాతీయ సగటు జనాభా ఆధారంగా జరిగే లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో ఆ యా రాష్ట్రాల్లో ఎంపీ స్థానాల సంఖ్య తగ్గనుంది. ఇది దేశంలోని అత్యున్నత విధాన నిర్ణాయక సభలో ప్రాతినిధ్యం కోతగా భావిస్తూ వారు కలత చెందుతున్నారు. ఇంకోవైపు, జనాభాను అదుపు చేయక, సంతానోత్పత్తి రేటును అధికంగానే చూపుతున్న రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాల సంఖ్య పెరుగనుండటం దేనికి సంకేతం? అనే ప్రశ్న పుట్టుకొస్తోంది.తగ్గిన సంతానోత్పత్తి రేటుదక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య భారతంలోని చిన్న రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటులో రమారమి తరుగుదల నమోదైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోనూ ఈ రేటు తక్కువగానే ఉంది. 2019–21 కాలంలో, దేశంలోనే అత్యల్పంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో సంతానోత్పత్తి రేటు 1.4గా ఉంటే... తెలంగాణ, ఏపీ, కేరళ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లలో ఇది 1.5గా నమోదయినట్టు ‘భారత రిజిస్ట్రార్ జనరల్’ నివేదిక చెబుతోంది. ‘పిల్లలు కనే వయసు’ కాలంలో మహిళలకు పుట్టిన పిల్లల సంఖ్య సగటును, ఆ ప్రాంతపు లేదా ఆ రాష్ట్రపు సంతా నోత్పత్తి రేటుగా పరిగణిస్తారు. అదే సమయంలో బిహార్ (3), ఉత్తర ప్రదేశ్ (2.7), మధ్యప్రదేశ్ (2.6) రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు అధి కంగా నమోదవుతోంది. ఎక్కువ సంతానోత్పత్తి రేటున్న రాష్ట్రాల్లో అభివృద్ధి మందగించడం సహజం.సంతానోత్పత్తి పరిమితుల్లో ఉండటం ప్రగతి సంకేతమే అయినా, మరో సమస్యకు అది కారణమవుతోంది. ఒక వంక పుట్టే పిల్లల సంఖ్య తగ్గుతుంటే, మరోవంక శాస్త్ర సాంకేతికత పురోగతి పుణ్యమా అని మనిషి సగటు జీవనకాలం పెరగటం వల్ల వృద్ధుల సంఖ్య అధిక మవుతోంది. అభివృద్ధి చెందిన దేశాల్లోలాగా ఒక నిర్దిష్ట వయసు దాటినవారికి ప్రభుత్వమే కల్పించే సామాజిక భద్రత పథకాలు, కార్యక్రమాలు మనవద్ద లేకపోవడంతో వారి పోషణ, ఆరోగ్య నిర్వహణ కుటుంబాలకు అదనపు ఆర్థిక భారంగా పరిణమిస్తు న్నాయి. జనాభా ఆధారంగానే వివిధ కేంద్ర పథకాలు, సంక్షేమ కార్య క్రమాల నిధుల కేటాయింపులు, చివరకు చట్టసభల్లో ఆయా రాష్ట్రాల ప్రాతినిధ్య సంఖ్య ఖరారు కూడా జరగటం తమకు నష్టం కలిగిస్తోందని ఏపీ, తమిళనాడు ముఖ్యమంత్రులు వ్యాఖ్యానించారు.ఆధారపడే జనాభా రేటులో వృద్ధిప్రపంచంలోనే అత్యధిక యువజనాభా కలిగిన దేశంగా భారత్ రికార్డులకెక్కింది. కానీ, ఇటీవలి కాలంలో వృద్ధుల జనాభా శాతం క్రమంగా పెరుగుతున్నట్టు, మున్ముందు అది మరింత పెరుగనున్నట్టు ఐక్యరాజ్యసమితి విభాగమొకటి (యూఎన్‌ఎఫ్‌పీయే) తన నివేదికలో చెప్పింది. భారత వైద్య, కుటుంబ ఆరోగ్య విభాగం అందించిన సమాచారం ఆధారంగా అంచనాలు లెక్కగట్టిన ఈ విభాగం 2021లో 10.1 శాతంగా ఉన్న వృద్ధుల జనాభా 2036 నాటికి 15 శాతానికి చేరవచ్చని చెప్పింది.అయితే, వృద్ధుల జనాభా పెరుగుదల రేటు సమస్య కాదు... సదరు జనాభా పనిచేసే వయస్కుల మీద ఆధారపడే స్థితి అధిక మవడం ఇబ్బంది. అంటే, వంద మంది పనిచేసే (18–59 ఏళ్లు) వయస్కులున్నపుడు, వారిపై ఆధారపడే వృద్ధుల జనాభా అధికంగా ఉండటం కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై నేరుగా ప్రభావం చూపుతుందనేది అంతర్జాతీయ ప్రమాణాల లెక్క. ఆ నిష్పత్తి పెరుగుతోంది. అది 15 శాతాన్ని దాటితే సమస్యను ‘వృద్ధుల సంక్షోభం’గా లెక్కిస్తారు. భారత జాతీయ జనాభా కమిషన్ (ఎన్సీపీ) 2021 లెక్కల ప్రకారం, కేరళలో ఇది ఇప్పటికే 26.1 శాతంగా ఉంది. తమిళనాడు (20.5), హిమాచల్ ప్రదేశ్ (19.6), ఏపీ (18.5) శాతాలు కూడా అధికంగానే ఉన్నాయి. 2036 నాటికి అవి మరింత గణనీయంగా పెరగటం ఖాయంగా కనిపిస్తోంది. సంతానన్పోత్తి రేటును, తద్వారా జనాభాను నియంత్రించినందుకు, సదరు కుటుంబాల్లో లభించే ఆ ప్రయోజనం... వృద్ధుల పోషణ, వారి ఆరోగ్య పరిరక్షణలోనే కరిగిపోతోందనే వాదన బలంగా వినిపిస్తోంది.కట్టడి చేసినందుకు కనీస స్థానాలా?2026 తర్వాతి జనాభా లెక్కల ఆధారంగా దేశంలో నియోజక వర్గాల పునర్విభజన జరగాల్సి ఉంది. రాష్ట్ర విభజన చట్ట నిర్దేశ్యం ప్రకారం ఏపీ, తెలంగాణల్లోనూ సంఖ్య పెంపుతో పునర్విభజన జరగాల్సి ఉంది. దేశవ్యాప్తంగా గడువు లోపల జనాభా తాజా లెక్కలు అందించడానికి వీలుగా జనగణన ప్రక్రియ సత్వరం చేపట్టనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే ప్రకటించింది. దశాబ్దానికి ఒకసారి జరిపే జనగణన, పాత సంప్రదాయం ప్రకారం 2020లో మొదలు కావాల్సింది. కోవిడ్ మహమ్మారి వల్ల అది వాయిదా పడింది. ఇప్పుడు 2025లో చేపట్టి, పదేళ్ల సైకిల్ని (ఇదివరకటిలా 2021 –2031 కాకుండా 2025 –2035గా) మారుస్తున్నారు. జనాభా వృద్ధి రేటు తీరుతెన్నుల్ని బట్టి కె.ఎస్. జేమ్స్, శుభ్ర కృతి జరిపిన అధ్యయనం ప్రకారం, వచ్చే పునర్విభజనతో ఉత్తరాది రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య పెరు గనుండగా దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గనుంది. ఉత్తరప్రదేశ్ (12), బిహార్ (10), రాజస్థాన్ (7) లలో లోక్‌సభ నియోజకవర్గాలు పెరుగ నున్నాయి. తమిళనాడు (9), కేరళ (6), ఏపీ (5) లలో తగ్గనున్నాయి. జాతీయ జనాభాలో వాటా పెరుగుదల, తరుగుదలను బట్టి ఈ సంఖ్య మారనుంది. ‘ఎక్కువ పిల్లలు కలిగిన తలిదండ్రులకు ప్రోత్సాహకాలివ్వాలి, ఆ మేరకు చట్టం తేవాలని నేను ఆలోచిస్తున్నాను’ అంటూ ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల అన్నారు. ఇటువంటి పంథా మంచిది కాదనీ, దాని వల్ల ఏ మంచీ జరుగదనేది ప్రపంచ వ్యాప్తంగా రుజువైన అంశమనీ సామాజికవేత్తలు అంటున్నారు. ప్రభుత్వాలిచ్చే ప్రాత్సాహకాలు అదనంగా పుట్టే సంతాన పోషణ, వారి విద్య –వైద్య అవసరాలు తీర్చవనీ, అధిక సంతానం కుటుంబ జీవన ప్రమాణాల పతనానికే కారణమవుతుందనీ విశ్లేషణలున్నాయి.ఈ పరిణామాలను ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకొని ప్రత్యా మ్నాయ చర్యలు చేపట్టాలి. జానాభా వృద్ధిని నిలుపుదల చేసిన వారిని ప్రోత్సహించేలా నిర్ణయాలుండాలి. సరైన జనాభా నిష్పత్తి ఉండేలా చూడాలి. వయసు మళ్లినవారు ఆయా కుటంబాలకు భారం కాకుండా సార్వత్రిక సాంఘిక భద్రతా పథకాలు ఉండాలి. ‘పనిచేసే వయసు’ కాలం నిడివి పెరిగేట్టు జీవన ప్రమాణాల వృద్ధికి చర్యలు తీసుకోవాలి. జనాభా నియంత్రణ తప్పు కాదు. ముసలితనం శాపం కాకూడదు. మంచి పనులకు ప్రోత్సాహం ఉండాలే తప్ప, శిక్షలు ఉండకూడదు.దిలీప్ రెడ్డి వ్యాసకర్త ‘పీపుల్స్ పల్స్’ రిసెర్చ్ సంస్థ డైరెక్టర్ -
World Population: అత్యధిక జనాభా దేశంగా భారత్!
న్యూయార్క్: ప్రపంచంలోనే అత్యధిక జనాభా దేశంగా భారత దేశం ఆవిర్భవించబోతోంది. అదీ 2023లోనే!. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాదిలో చైనాను అధిగమించి.. ప్రపంచంలోనే మోస్ట్ పాపులేటెడ్ కంట్రీగా భారత్ నిలవబోతోందని ఐరాస తెలిపింది. అంతేకాదు.. ఈ నవంబర్ 15వ తేదీ నాటికి ప్రపంచ జనాభా.. ఎనిమిది బిలియన్లకు(800 వందల కోట్లకు) చేరుకోనుందని ప్రకటించింది. జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన UN వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2022లోనే ఈ వివరాలను పొందుపరిచారు. అయితే.. అంచనా వేసిన గడువు దగ్గర పడుతుండడంతో ఇప్పుడు ఆ వివరాలను బయటికి విడుదల చేశారు. ఇక 2050 నాటికి ప్రపంచ జనాభాలో సగానికి పైగా పెరుగుదల కేవలం ఎనిమిది దేశాల్లోనే ఉండొచ్చని అంచనా వేసింది ఈ సంస్థ. భారత్‌తో పాటు పాకిస్తాన్, పిలిప్పీన్స్, ఆఫ్రికా దేశాలైన ఈజిప్ట్, ఇథియోపియా, కాంగో, నైజీరియా, టాంజానియా.. ఈ లిస్ట్‌లో ఉన్నాయి. మరో విశేషం ఏంటంటే.. 1950 తర్వాత తొలిసారిగా 2020లో ప్రపంచ జనాభా పెరుగుదల ఒక శాతం కంటే తక్కువగా పడిపోయిందని ఈ ఏజెన్సీ పేర్కొంది. ప్రపంచ జనాభా 2030 నాటికి 8.5 బిలియన్లు, 2050 నాటికి 9.7 బిలియన్లు, 2080 నాటికి 10.4 బిలియన్లకు చేరుకోనుందని అంచనా వేసింది ఐరాస సంస్థ. ఇదీ చదవండి: ఫార్చూన్ పింక్.. విలువ రూ.231 కోట్లు -
అత్యధిక జన సాంద్రత ఉన్న ఎడారి.. థార్!
హైదరాబాద్: ప్రపంచంలో వాతావరణ వైవిధ్యం ఉన్న ప్రాంతాల్లో ఎడారులు ప్రత్యేకమైనవి. ఒక పక్క అత్యధిక ఉష్ణోగ్రతలు, మరో పక్క ఎముకలు కొరికే చలితో ఎడారి ప్రాంతాలు విభిన్నంగా ఉంటాయి. ఇక వర్షాల గురించి చెప్పాల్సిన పనే లేదు. ఏడాదిలో ఎప్పుడో ఒకసారి మాత్రమే ఈ ప్రాంతాల్లో వర్షం చూడగలం. అయినప్పటికీ ఇక్కడ కూడా అత్యధిక సంఖ్యలో ప్రజలు నివసిస్తున్నారు. మన దేశంలో అత్యధిక భాగంలో విస్తరించి ఉన్న ‘థార్ ఎడారి’లో ఉండే పరిస్థితుల గురించి ఈ రోజు తెలుసుకుందాం..! ఎక్కడ ఉంది? థార్ ఎడారి భారత్, పాక్ సరిహద్దుల్లో ఉంది. దీన్నే ‘గ్రేట్ ఇండియన్ డెసెర్ట్’ అని పిలుస్తారు. ఇది రాజస్థాన్, హరియాణా, పంజాబ్, పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. పాకిస్తాన్ ఉన్న భూ భాగాన్ని ‘ఖలిస్తాన్ ఎడారి’ అని పిలుస్తారు. ఇది భారత్‌లో మొదటి, ప్రపంచంలో ఏడో అతి పెద్ద ఎడారి. పుట్టుక: దీని పుట్టుక మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు ఈ ఎడారి 4-10 వేల ఏళ్ల పూర్వం నాటిది మాత్రమే అని చెబుతారు. క్రీ.పూ 2000-1500 సంవత్సరాలలో ఇక్కడ ప్రవహించే షుగ్గర్ నది ఇంకిపోవడం వల్లే ఈ ఎడారి ఏర్పడిందని కొంత మంది భావిస్తున్నారు. అత్యధిక శాతం మంది పరిశోధకులు ప్రస్తుతం ఎడారిగా ఉన్న ఈ ప్రాంతం ఒకప్పుడు మొహంజదారో కేంద్రంగా ఉంటూ, సింధులోయ నాగరికత ప్రజలకు ప్రధాన నీటివనరుగా ఉండేదని.. ఆకస్మికంగా భౌగోళిక సమతుల్యం లోపించి పెనుమార్పులు చోటుచేసుకుని ఇలా ఎడారిగా మార్పు చెందిందని వాదిస్తున్నారు. అయితే ‘సరస్వతి’ నది ఇంకిపోయిన ప్రాంతమే థార్ ఎడారి అనే వాదనను మాత్రం పరిశోధకులు అంగీకరించడం లేదు. సహజ వృక్షాలు: ఇక్కడి పొడి వాతావరణంలో జీవించగల్గిన ముళ్ల చెట్లు అధికంగా ఉన్నాయి. వీటిలో కీకర్, వేవంజా, ఖేర్, దిరిశన, వేప, సంగ్రి, జాల్కి, రొహిడా, ఫరాశ్ వంటి ఎడారి మొక్కలు ఎక్కువగా కనిపిస్తాయి. థార్ ఎడారిలో సందూర్, దుర్వ, బంచ్ గ్రాస్, ఘమూర్, కాస్, బఫెల్ గ్రాస్, దర్భ, ఘోకోరూ, జినస్, గవాక్షీ.. వంటి ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి. ఉప్పునీటి సరస్సులు: థార్ ఎడారిలో అనేక ఉప్పునీటి సరస్సులు ఉన్నాయి. సంభర్, పచ్చద్రా, తాల్ చాపర్, ఫాలౌడి, లంకన్సర్ వద్ద ఉన్న ఉప్పునీటి సరస్సుల నుంచి సోడియం క్లోరైడ్(ఉప్పు)ను ఉత్పత్తి చేస్తున్నారు. నీటి వనరులు: సాధారణంగా ఎడారి ప్రాంతాల్లో నీరు లభ్యం కావడం చాలా అరుదు. కనుక ఎడారి ప్రాంత ప్రజల జీవితాల్లో నీరు ప్రధాన భూమిక పోషిస్తుంది. సహజ నీటి వనరులు (ఒయాసిసులు), మానవ నిర్మిత ‘జోహాడ్’ అనే చిన్న తరహా నీటి గుంటలు మానవులకు, జంతువులకు ఈ ప్రాంతంలో తాగునీటిని అందిస్తున్నాయి. నీటి వనరులు లభ్యమయ్యే ప్రాంతాన్ని బట్టి ఎడారి వాసులు వలస జీవనం సాగిస్తారు. విస్తీర్ణం: ‘వరల్డ్ వైడ్ ఫండ్’ సంస్థ నిర్వచనం ప్రకారం దీని విస్తీర్ణం 2,38,700 చ.కిమీ. భారతదేశంలో ఉన్న భూభాగంలో ఈ ఎడారి 61 శాతం రాజస్థాన్, 20 శాతం గుజరాత్, 9 శాతం హరియాణ, పంజాబ్‌లలో విస్తరించి ఉంది. జీవవైవిధ్యం: థార్ ఎడారిలో ప్రపంచంలోని మిగిలిన ఎడారుల్లో కంటే ఎక్కువ జీవులు నివసిస్తున్నాయి. ఈ ప్రాంతంలో 23 రకాల పాకే జీవులు, 25 జాతుల సర్పాలు ఉన్నాయి. వీటిలో పలు జాతులు ఇక్కడ మాత్రమే కనిపిస్తాయి. ప్రాంతీయ, వలస పక్షులు కలిపి సుమారు 141 పక్షి జాతులు ఉన్నాయి. ప్రజలు: థార్ ఎడారిలో ప్రధానంగా హిందువులు, ముస్లింలు, సిక్కులు నివసిస్తున్నారు. పాకిస్తాన్ భూ భాగంలో సింధీలు, కొల్హీలు జీవిస్తున్నారు. రాజస్థాన్‌లో 40 శాతం ప్రజలు ఎడారిలోనే నివసిస్తున్నారు. ఇక్కడి ప్రజలు జీవనాధారం కోసం వ్యవసాయం, జంతువుల పెంపకం మీద ఆధారపడుతుంటారు. ఎడారి ప్రజల ఆర్థిక స్థితి చాలా త క్కువగా ఉంటుంది. థార్ ఎడారి ప్రపంచంలోనే అత్యధిక జన సాంద్రత కలిగిన ఎడారి ప్రదేశం. ఇక్కడ చదరపు కిలోమీటరుకు 83 మంది నివసిస్తున్నారు. ఇతర ఎడారుల్లో ఈ సంఖ్య 7 మంది మాత్రమే. పర్యటనలు: జైసల్మీర్ వద్ద ఒంటెల సవారీ ప్రజాదరణ పొందడంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతోంది. విదేశీ, స్వదేశీ పర్యాటకులు ఒంటెల మీద ఎడారిలో సవారీ చేసేందుకు అత్యంత ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ పర్యటనలో తక్కువ ధరలో అరేబియన్ శైలి విందులు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు ఉంటాయి. ఈ కార్యక్రమాలు జైసల్మీర్, దాని చుట్టుపక్కన ఉన్న గ్రామాలలో ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నాయి. పర్యాటక నిర్వాహకులకు, ఒంటెల యజమానులకు ఇవి చక్కని ఆదాయాన్ని అందిస్తున్నాయి. (స్కూల్ ఎడిషన్ ప్రత్యేకం). -
జనారణ్యం!
సాక్షి, న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ ప్రపంచ నగరాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ప్రపంచంలోని అత్యధిక జనసాంద్రత కలిగిన నగరాల జాబితాలో మన హస్తినాపురానికి రెండోస్థానం దక్కింది. పట్టణ జనాభాపై ఐక్యరాజ్య సమితి వెలువరించిన నివేదికలో జపాన్‌లోని టోక్యో నగరం మొదటిస్థానంలో నిలువగా ఢిల్లీ రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానాన్ని చైనాలోని షాంఘై ఆక్రమించింది. ఢిల్లీ జనాభా ప్రస్తుతం 2 కోట్ల 50 లక్షలని ఐ.రా.స నివేదిక పేర్కొంది. కేవలం పదిహేనేళ్లలో.. అంటే 1990 నుంచి ఢిల్లీలో జనాభా రెండింతలు పెరిగిందని, 2030 నాటికి కూడా ఢిల్లీ ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత గలిగిన రెండో నగరంగా ఉంటుందని నివేదిక పేర్కొంది. 2030 నాటికి ఢిల్లీ జనాభా 3 కోట్ల60 లక్షలకు చేరుతుందని నివేదిక అంచనా వేసింది. ప్రస్తుతం టోక్యో జనాభా 3.80 కోట్లు. దీంతో ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత కలిగిన నగరంగా టోక్యో గుర్తింపు పొందింది. గతం తో పోలిస్తే టోక్యో జనాభా తగ్గడం మొదలైందని, 2030 నాటికి కూడా టోక్యోనే జనసాంద్రతలో నం బర్వన్ నగరంగా ఉంటుందని నివేదిక తెలిపింది. టోక్యో జనాభా 2030 నాటికి పదిలక్షల వరకు తగ్గవచ్చని అంచనా వేసింది. ఐ.రా.స నివేదిక ప్రకారం.. జనసాంద్రత పరంగా ప్రస్తుతం ముంబై ప్రపంచంలో ఆరో స్థానంలో ఉంది.2030 నాటికి ముంబై నాలుగో స్థానానికి చేరుతుంది. ప్రస్తుతం 2.1 కోట్లున్న ముంబై జనాభా 2030 నాటికి 2.8 కోట్లకు చేరుతుంది. జనసాం ద్రతలో మెక్సికన్ సిటీ నాలుగో స్థానంలో, సావ్ పావ్లో ఐదో స్థానంలో ఉన్నాయి. 2050 వరకు భారత్, చైనా, నైజీరియాలలో పట్టణ జనాభా మరింత పెరిగే అవకాశముందని ఐ.రా.స నివేదిక స్పష్టం చేసింది. జనాభా స్థిరీకరణ కోసం వాకథాన్ జెండా ఊపి ప్రారంభించిన ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం ఢిల్లీలో వాకథాన్ నిర్వహించారు. జనాభా స్థిరీకరణ లక్ష్యంగా నిర్వహించిన ఈ వాకథాన్‌ను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రారంభించారు. నటి, సామాజిక కార్యకర్త షబానా ఆజ్మీ ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ మాట్లాడుతూ.. దేశాన్ని సమస్యల నుంచి విముక్తి చేయాలంటే జనాభా స్థిరీకరణ ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఇందుకోసం ప్రతి భారతీయుడు తనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. జనాభా పెరుగుదల వల్ల ఎదురయ్యే సమస్యలను ప్రజలకు వివరించాల్సి బాధ్యత ప్రతి భారత పౌరుడిపై ఉందన్నారు. వ్యాక్సిన్లపై గర్భిణులకు అవగాహన కలిగించాలన్నారు. కుటుంబంలోకి ఆడపిల్లలను ఆహ్వానిస్తామంటూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. ఆడపిల్లకు శక్తినిచ్చి, తద్వారా కుటుంబాన్ని.. దేశాన్ని బలంగా మార్చాలన్నారు.