అత్యధిక జన సాంద్రత ఉన్న ఎడారి.. థార్!
హైదరాబాద్: ప్రపంచంలో వాతావరణ వైవిధ్యం ఉన్న ప్రాంతాల్లో ఎడారులు ప్రత్యేకమైనవి. ఒక పక్క అత్యధిక ఉష్ణోగ్రతలు, మరో పక్క ఎముకలు కొరికే చలితో ఎడారి ప్రాంతాలు విభిన్నంగా ఉంటాయి. ఇక వర్షాల గురించి చెప్పాల్సిన పనే లేదు. ఏడాదిలో ఎప్పుడో ఒకసారి మాత్రమే ఈ ప్రాంతాల్లో వర్షం చూడగలం. అయినప్పటికీ ఇక్కడ కూడా అత్యధిక సంఖ్యలో ప్రజలు నివసిస్తున్నారు. మన దేశంలో అత్యధిక భాగంలో విస్తరించి ఉన్న ‘థార్ ఎడారి’లో ఉండే పరిస్థితుల గురించి ఈ రోజు తెలుసుకుందాం..!
ఎక్కడ ఉంది?
థార్ ఎడారి భారత్, పాక్ సరిహద్దుల్లో ఉంది. దీన్నే ‘గ్రేట్ ఇండియన్ డెసెర్ట్’ అని పిలుస్తారు. ఇది రాజస్థాన్, హరియాణా, పంజాబ్, పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. పాకిస్తాన్ ఉన్న భూ భాగాన్ని ‘ఖలిస్తాన్ ఎడారి’ అని పిలుస్తారు. ఇది భారత్‌లో మొదటి, ప్రపంచంలో ఏడో అతి పెద్ద ఎడారి.
పుట్టుక:
దీని పుట్టుక మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు ఈ ఎడారి 4-10 వేల ఏళ్ల పూర్వం నాటిది మాత్రమే అని చెబుతారు. క్రీ.పూ 2000-1500 సంవత్సరాలలో ఇక్కడ ప్రవహించే షుగ్గర్ నది ఇంకిపోవడం వల్లే ఈ ఎడారి ఏర్పడిందని కొంత మంది భావిస్తున్నారు. అత్యధిక శాతం మంది పరిశోధకులు ప్రస్తుతం ఎడారిగా ఉన్న ఈ ప్రాంతం ఒకప్పుడు మొహంజదారో కేంద్రంగా ఉంటూ, సింధులోయ నాగరికత ప్రజలకు ప్రధాన నీటివనరుగా ఉండేదని.. ఆకస్మికంగా భౌగోళిక సమతుల్యం లోపించి పెనుమార్పులు చోటుచేసుకుని ఇలా ఎడారిగా మార్పు చెందిందని వాదిస్తున్నారు. అయితే ‘సరస్వతి’ నది ఇంకిపోయిన ప్రాంతమే థార్ ఎడారి అనే వాదనను మాత్రం పరిశోధకులు అంగీకరించడం లేదు.
సహజ వృక్షాలు:
ఇక్కడి పొడి వాతావరణంలో జీవించగల్గిన ముళ్ల చెట్లు అధికంగా ఉన్నాయి. వీటిలో కీకర్, వేవంజా, ఖేర్, దిరిశన, వేప, సంగ్రి, జాల్కి, రొహిడా, ఫరాశ్ వంటి ఎడారి మొక్కలు ఎక్కువగా కనిపిస్తాయి. థార్ ఎడారిలో సందూర్, దుర్వ, బంచ్ గ్రాస్, ఘమూర్, కాస్, బఫెల్ గ్రాస్, దర్భ, ఘోకోరూ, జినస్, గవాక్షీ.. వంటి ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి.
ఉప్పునీటి సరస్సులు:
థార్ ఎడారిలో అనేక ఉప్పునీటి సరస్సులు ఉన్నాయి. సంభర్, పచ్చద్రా, తాల్ చాపర్, ఫాలౌడి, లంకన్సర్ వద్ద ఉన్న ఉప్పునీటి సరస్సుల నుంచి సోడియం క్లోరైడ్(ఉప్పు)ను ఉత్పత్తి చేస్తున్నారు.
నీటి వనరులు:
సాధారణంగా ఎడారి ప్రాంతాల్లో నీరు లభ్యం కావడం చాలా అరుదు. కనుక ఎడారి ప్రాంత ప్రజల జీవితాల్లో నీరు ప్రధాన భూమిక పోషిస్తుంది. సహజ నీటి వనరులు (ఒయాసిసులు), మానవ నిర్మిత ‘జోహాడ్’ అనే చిన్న తరహా నీటి గుంటలు మానవులకు, జంతువులకు ఈ ప్రాంతంలో తాగునీటిని అందిస్తున్నాయి. నీటి వనరులు లభ్యమయ్యే ప్రాంతాన్ని బట్టి ఎడారి వాసులు వలస జీవనం సాగిస్తారు.
విస్తీర్ణం:
‘వరల్డ్ వైడ్ ఫండ్’ సంస్థ నిర్వచనం ప్రకారం దీని విస్తీర్ణం 2,38,700 చ.కిమీ. భారతదేశంలో ఉన్న భూభాగంలో ఈ ఎడారి 61 శాతం రాజస్థాన్, 20 శాతం గుజరాత్, 9 శాతం హరియాణ, పంజాబ్‌లలో విస్తరించి ఉంది.
జీవవైవిధ్యం:
థార్ ఎడారిలో ప్రపంచంలోని మిగిలిన ఎడారుల్లో కంటే ఎక్కువ జీవులు నివసిస్తున్నాయి. ఈ ప్రాంతంలో 23 రకాల పాకే జీవులు, 25 జాతుల సర్పాలు ఉన్నాయి. వీటిలో పలు జాతులు ఇక్కడ మాత్రమే కనిపిస్తాయి. ప్రాంతీయ, వలస పక్షులు కలిపి సుమారు 141 పక్షి జాతులు ఉన్నాయి.
ప్రజలు:
థార్ ఎడారిలో ప్రధానంగా హిందువులు, ముస్లింలు, సిక్కులు నివసిస్తున్నారు. పాకిస్తాన్ భూ భాగంలో సింధీలు, కొల్హీలు జీవిస్తున్నారు. రాజస్థాన్‌లో 40 శాతం ప్రజలు ఎడారిలోనే నివసిస్తున్నారు. ఇక్కడి ప్రజలు జీవనాధారం కోసం వ్యవసాయం, జంతువుల పెంపకం మీద ఆధారపడుతుంటారు. ఎడారి ప్రజల ఆర్థిక స్థితి చాలా త క్కువగా ఉంటుంది. థార్ ఎడారి ప్రపంచంలోనే అత్యధిక జన సాంద్రత కలిగిన ఎడారి ప్రదేశం. ఇక్కడ చదరపు కిలోమీటరుకు 83 మంది నివసిస్తున్నారు. ఇతర ఎడారుల్లో ఈ సంఖ్య 7 మంది మాత్రమే.
పర్యటనలు:
జైసల్మీర్ వద్ద ఒంటెల సవారీ ప్రజాదరణ పొందడంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతోంది. విదేశీ, స్వదేశీ పర్యాటకులు ఒంటెల మీద ఎడారిలో సవారీ చేసేందుకు అత్యంత ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ పర్యటనలో తక్కువ ధరలో అరేబియన్ శైలి విందులు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు ఉంటాయి. ఈ కార్యక్రమాలు జైసల్మీర్, దాని చుట్టుపక్కన ఉన్న గ్రామాలలో ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నాయి. పర్యాటక నిర్వాహకులకు, ఒంటెల యజమానులకు ఇవి చక్కని ఆదాయాన్ని అందిస్తున్నాయి.
(స్కూల్ ఎడిషన్ ప్రత్యేకం).