జైసల్మీర్: దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కరువు విలయతాండవం చేస్తోంటే.. రాజస్థాన్ లోని థార్ ఎడారిలో మాత్రం 2 నుంచి 3 అడుగుల లోతు గుంటను తవ్వితే నీరు బయటకు వస్తోంది. జైసల్మీర్ కు సమీపంలోని షాఘర్ బల్జ్ ప్రాంతంలో ఈ పరిస్థితే కనిపిస్తోంది. ఆ ప్రాంతంలో ఉన్న ఒయాసిసలో ఎక్కడ తవ్విన 2 నుంచి 3 అడుగుల్లోపే నీరు వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నీరు అంతరించిపోయిన సరస్వతి నదివేనని అంటున్నారు. భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉండే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) జవాన్లకు ఈ నీరు కొన్ని సంవత్సరాలుగా దాహార్తి తీరుస్తోందని చెప్తున్నారు. ఏ సీజన్ లోనైనా ఇక్కడ నీరు లభిస్తోందనీ, ఉదయం ఒకసారి గుంటను తవ్వి నీరు తొడుకుంటే సాయంతానికి తిరిగి నీరు ఊరుతోందని తెలిపారు.
ఎంతో శుభ్రతతో లభ్యమయ్యే ఈ నీరు మినరల్ వాటర్ కంటే బావుంటాయని చెప్పారు. నీరు లభించే ప్రాంతమంతా వృక్షసంపదతో కళకళలాడుతుంటుందని తెలిపారు. ఒయాసిస్ కింద ఏదో జీవనది ప్రయాణిస్తుండటం మూలానే ఇలా జరుగుతోందని అంటున్నారు. బోర్డర్ లో ఉండే ఖారా, నల్కా, ఝలారియా, రోహ్ తోష్, వీర్ హిల్, కిర్వాలీ, సొంగమ్ లకు పైపులైన్ల ద్వారా ఇక్కడి నుంచి నీటి సరఫరా జరుగుతుందని బీఎస్ఎఫ్ అధికారి దిల్ బాగ్ సింగ్ తెలిపారు. సీనియర్ గ్రౌండ్ వాటర్ సైంటిస్ట్ డా.నారాయణ్ దాస్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో భూమి కింద నీటి వనరులు అధికంగా ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా ఇక్కడ నీటి వినియోగం చాలా తక్కువగా ఉండటం కూడా ఇక్కడి వాసులకు కలిసి వస్తోందని అన్నారు.
ఈ ఎడారిలో నీటికి కొదవ లేదు!
Published Sat, May 28 2016 4:22 PM | Last Updated on Mon, Sep 4 2017 1:08 AM
Advertisement