జనారణ్యం!
సాక్షి, న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ ప్రపంచ నగరాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ప్రపంచంలోని అత్యధిక జనసాంద్రత కలిగిన నగరాల జాబితాలో మన హస్తినాపురానికి రెండోస్థానం దక్కింది. పట్టణ జనాభాపై ఐక్యరాజ్య సమితి వెలువరించిన నివేదికలో జపాన్‌లోని టోక్యో నగరం మొదటిస్థానంలో నిలువగా ఢిల్లీ రెండో స్థానంలో నిలిచింది.
మూడో స్థానాన్ని చైనాలోని షాంఘై ఆక్రమించింది. ఢిల్లీ జనాభా ప్రస్తుతం 2 కోట్ల 50 లక్షలని ఐ.రా.స నివేదిక పేర్కొంది. కేవలం పదిహేనేళ్లలో.. అంటే 1990 నుంచి ఢిల్లీలో జనాభా రెండింతలు పెరిగిందని, 2030 నాటికి కూడా ఢిల్లీ ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత గలిగిన రెండో నగరంగా ఉంటుందని నివేదిక పేర్కొంది. 2030 నాటికి ఢిల్లీ జనాభా 3 కోట్ల60 లక్షలకు చేరుతుందని నివేదిక అంచనా వేసింది.
ప్రస్తుతం టోక్యో జనాభా 3.80 కోట్లు. దీంతో ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత కలిగిన నగరంగా టోక్యో గుర్తింపు పొందింది. గతం తో పోలిస్తే టోక్యో జనాభా తగ్గడం మొదలైందని, 2030 నాటికి కూడా టోక్యోనే జనసాంద్రతలో నం బర్‌వన్ నగరంగా ఉంటుందని నివేదిక తెలిపింది. టోక్యో జనాభా 2030 నాటికి పదిలక్షల వరకు తగ్గవచ్చని అంచనా వేసింది. ఐ.రా.స నివేదిక ప్రకారం.. జనసాంద్రత పరంగా ప్రస్తుతం ముంబై ప్రపంచంలో ఆరో స్థానంలో ఉంది.2030 నాటికి ముంబై నాలుగో స్థానానికి చేరుతుంది. ప్రస్తుతం 2.1 కోట్లున్న ముంబై జనాభా 2030 నాటికి 2.8 కోట్లకు చేరుతుంది. జనసాం ద్రతలో మెక్సికన్ సిటీ నాలుగో స్థానంలో, సావ్ పావ్లో ఐదో స్థానంలో ఉన్నాయి. 2050 వరకు భారత్, చైనా, నైజీరియాలలో పట్టణ జనాభా మరింత పెరిగే అవకాశముందని ఐ.రా.స నివేదిక స్పష్టం చేసింది.
జనాభా స్థిరీకరణ కోసం వాకథాన్
జెండా ఊపి ప్రారంభించిన ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్
ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం ఢిల్లీలో వాకథాన్ నిర్వహించారు. జనాభా స్థిరీకరణ లక్ష్యంగా నిర్వహించిన ఈ వాకథాన్‌ను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రారంభించారు. నటి, సామాజిక కార్యకర్త షబానా ఆజ్మీ ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ మాట్లాడుతూ.. దేశాన్ని సమస్యల నుంచి విముక్తి చేయాలంటే జనాభా స్థిరీకరణ ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.
ఇందుకోసం ప్రతి భారతీయుడు తనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. జనాభా పెరుగుదల వల్ల ఎదురయ్యే సమస్యలను ప్రజలకు వివరించాల్సి బాధ్యత ప్రతి భారత పౌరుడిపై ఉందన్నారు. వ్యాక్సిన్లపై గర్భిణులకు అవగాహన కలిగించాలన్నారు. కుటుంబంలోకి ఆడపిల్లలను ఆహ్వానిస్తామంటూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. ఆడపిల్లకు శక్తినిచ్చి, తద్వారా కుటుంబాన్ని.. దేశాన్ని బలంగా మార్చాలన్నారు.