
సాక్షి, న్యూఢిల్లీ : క్లైమేట్ చేంజ్‌పై ‘సీ 40’ పేరిట డెన్మార్క్‌లో జరుగుతున్న అంతర్జాతీయ మెగా నగరాల మేయర్ల సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌కి కేంద్రం అనుమతి నిరాకరించడం దారుణం. అయనకు అర్హత ఎక్కువైనందున అనుమతి నిరాకరించామని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిథి సమర్థించుకోవడం అర్థరహితం. ఏ వ్యక్తినైనా అర్హత తక్కువుందని నిరాకరించడంలో అర్థం ఉంది. అర్హత ఎక్కువుందని నిరాకరించడం అన్యాయం. అదీ ఓ మంచి కార్యక్రమం కోసం వెళ్లాలనుకున్నప్పుడు. ఢిల్లీ నగరంలో రోజు రోజుకు వాయు కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో, దాని గురించి సమగ్రంగా అంతర్జాతీయ సదస్సులో చర్చించాలని, వీలయితే సరైన పరిష్కారం కనుగొనాలని కేజ్రివాల్ భావించారు.
ముఖ్యమంత్రులు, రాష్ట్రాల మంత్రులు అధికార హోదాలో విదేశాల్లో పర్యటించాలనుకున్నప్పుడు కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి తప్పనిసరి. భారత విదేశాంగ విధానం అంతా ఒక్కటేనని చెప్పడానికి చట్టంలో ఈ నిబంధనను చేర్చారు. భారత్ సమాఖ్య ప్రభుత్వ స్ఫూర్తిని చాటు కోవాలంటే ఇలాంటి సంబంధాల్లో సానుకూలంగా స్పందించాల్సి ఉంటుంది. నిజంగా చెప్పాలంటే పలు అంతర్జాతీయ నగరాల మేయర్ల కన్నా కేజ్రివాల్‌కు అధికారాలు తక్కువ. ఆయన లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఆదేశాలకు లోబడి పనిచేయాల్సి వస్తోంది.
ఈ దుస్థితి నుంచి తప్పుకునేందుకు ఢిల్లీకి రాష్ట్ర హోదాను కల్పించాల్సిందిగా కేజ్రివాల్ ఎన్నిసార్లు డిమాండ్ చేసినా, ఆందోళనలు చేసిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. కేంద్ర ప్రభుత్వ నేతలు కూడా ఢిల్లీలో ఉంటున్నందున ఆ నగర సమస్యకు ఓ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించడం పట్ల అభ్యంతరాలు ఉన్నట్లయితే ఆ విషయాన్ని ఆయనకు స్పష్టంగా వివరించాలి. తుది నిర్ణయం కేజ్రివాల్‌కే వదిలేయాలి. ఏమీ చెప్పకుండా నిర్ద్వంద్వంగా ఆయన వినతిని తిరస్కరించడమంటే ఉద్దేశ పూర్వకంగా ఆయన్నే అవమానించడమే అవుతుంది. కేజ్రివాల్ మంగళవారం మధ్యాహ్నం బయల్దేరి డెన్మార్క్ వెళ్లాల్సి ఉండింది.
Comments
Please login to add a commentAdd a comment