విపత్తు వెన్నాడుతున్నదని శాస్త్రవేత్తలూ, పర్యావరణ ఉద్యమకారులూ ఎప్పటికప్పుడు చేస్తున్న హెచ్చరికలన్నీ షరా మామూలుగా వృథా అయ్యాయని పెరూ రాజధాని లిమాలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో రెండు వారాలపాటు కొనసాగి ఆదివారం ముగిసిన వాతావరణ సదస్సు(సీఓపీ-20) తేటతెల్లం చేసింది. రెండు దశాబ్దాలనాటి విధానాల నుంచి సంపన్న దేశాలు అంగుళం కూడా ముందుకు కదల్లేదని, తమ మొండి వైఖరిని విడనాడలేదని సదస్సు ఆమోదించిన ముసాయిదా చూస్తే అర్థమవుతుంది. ‘వాతావరణ కార్యాచరణకు లిమా పిలుపు’ పేరిట విడుదలైన ఆ ముసాయిదా నిండా బడాయి కబుర్లు, మాయ మాటలే తప్ప అందులో నిర్దిష్టమైన కార్యాచరణకు చోటే లేదు.
పారిస్ సదస్సులో కుదరబోయే ఒప్పందం అమల్లోకి రావాల్సిన 2020లోగా తమ వంతు కర్బన ఉద్గారాలను ఏ స్థాయిలో తగ్గించుకుంటామన్న విషయంలో వాగ్దానం ఇవ్వడానికి సంపన్న దేశాలకు నోరు రాలేదు! అలాగే వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన ఆర్థిక సాయాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వర్థమాన దేశాలకు అందించే విషయంలో కూడా అవి స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయాయి. వచ్చే ఏడాది వాతావరణంపై పారిస్‌లో జరగబోయే సదస్సుకు కాస్త ముందు అందుకు సంబంధించిన హామీలేమిటో చెబుతామని వాయిదా వేశాయి. మొత్తంమీద పారిస్‌లో కుదరవలసిన ఒడంబడిక కు ప్రాతిపదికను నిర్దేశించగలదనుకున్న లిమా సదస్సు అనుకున్నకంటే ఒక రోజు అదనంగా కొనసాగినా తగిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. లిమాలో ఏమీ సాధించలేదన్న ముద్ర పడకుండా తప్పించుకోవడానికి ఏదో కంటి తుడుపు రాజీ ముసాయిదాను అయిందనిపించి ఎక్కడివారక్కడికి నిష్ర్కమించారు! అందుకోసం ముసాయిదాలోని వాక్యాలు పదే పదే మారుతూ వచ్చాయి.
ముసాయిదా ప్రకారం ప్రతి దేశమూ తన ఉద్గారాలను తగ్గించుకోవడానికి ఏం చేయాలో తానే నిర్ణయించుకుంటుంది. ఆ నిర్ణయాల్లోని సహేతుకత ఏపాటో, అందుకు అనుసరిస్తామని చెబుతున్న కార్యాచరణ ఎలాటిదో ఎవరూ అడిగేవారుండరు. ఆ దేశాలూ చెప్పవు. ఉద్గారాల తగ్గింపు విషయంలో చేస్తామని చెప్పినదెంతో, చేసినదెంతో పారిస్ సదస్సుకు ముందు మదింపు వేసే ప్రక్రియపైనా ఎలాంటి నిర్ణయం లేదు. వాతావరణంలో చోటుచేసుకుంటున్న ప్రమాదకర మార్పులు ఎలాంటివో వివరించి, వాటి నివారణకు తక్షణం చేపట్టాల్సిన కార్యాచరణ అవసరాన్ని నొక్కిచెప్పడంలో దాదాపు అన్ని దేశాలూ విఫలమయ్యాయి. ఏ దేశానికి ఆ దేశం ‘నొప్పింపక తానొవ్వక’ అన్న రీతిలో తప్పించుకు తిరిగే వైఖరినే ప్రదర్శించింది. గాంబియా పర్యావరణ మంత్రి మాత్రం విపరీత వాతావరణం పోకడలెలా ఉంటాయో, అందులో తమ అనుభవాలేమిటో ఏకరువు పెట్టారు. తమవంటి పేద దేశాల్లో భూగర్భ జలాలు ఉప్పుదేరడం, తరచుగా కరువు వాతబడటం, సముద్ర మట్టాలు పెరగడంవంటివి చోటు చేసుకుంటున్నాయని వాపోయారు. ఈ విషయంలో సంపన్న దేశాల సహకారం కొరవడితే వలసలు అధికమవుతాయని, అవి పెను సంక్షోభానికి దారితీస్తాయని హెచ్చరించారు.
పారిశ్రామిక దేశాలు కేవల లాభాపేక్షతో వెనకా ముందూ చూడకుండా కర్బన ఉద్గారాలను భారీయెత్తున విడిచిపెడుతున్నాయి. ఆ దేశాలు లాభాలు పోగేసుకుని మురుస్తుంటే పర్యవసానాలను మాత్రం ప్రపంచ దేశాలన్నీ అనుభవిస్తున్నాయి. గత రెండేళ్లలో మన దేశంలోనే సంభవించిన ఉత్తరాఖండ్, జమ్మూ-కశ్మీర్, మేఘాలయ వరదలు భూతాపోన్నతి దుష్పరిణామాలెలా ఉంటాయో వెల్లడించాయి. ఇప్పుడున్న స్థాయిలోనే కర్బన ఉద్గారాలు వెలువడుతుంటే ఉష్ణోగ్రతలు మరో 3 డిగ్రీలు పెరుగుతాయి. పర్యవసానంగా అకాల వర్షాలు సంభవించి వ్యవసాయ ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడుతుంది.
ప్రపంచంలో కోట్లాదిమంది జీవిక దెబ్బతింటుంది. ఇది ఆర్థిక సంక్షోభానికీ, ఆపై సామాజిక సంక్షోభానికీ దారి తీస్తుంది. ఇంతటి విపత్తును తెచ్చిపెడుతున్న తమ చర్యలను నియంత్రించుకోవ డానికి ఈ క్షణంలో కూడా సంపన్న దేశాలు ముందుకు రాకపోవడం... లిమా సదస్సు అచేతనంగా ఉండిపోవడం అత్యంత విచారకరం. పెపైచ్చు వాతావరణ కార్యాచరణకు సంబంధించి పేద, ధనిక దేశాలను ఒకే గాటన కట్టకుండా చూసే నిబంధనను కాస్తా లిమా సదస్సు నీరుగార్చింది. ఉద్గారాల విషయంలో ఇప్పటి వరకూ వర్థమాన దేశాలకిచ్చే వెసులుబాటు సంపన్న దేశాలకు సైతం వర్తించేందుకు వీలు కల్పిస్తున్న వాక్యం ఈ ముసాయిదాలో వచ్చిచేరింది. అమెరికా-చైనాల మధ్య ఇటీవల ఉద్గారాల తగ్గింపు విషయంలో కుదిరిన ఒప్పందంలోనుంచి దీన్ని తీసుకున్నారు.
క్యోటో ప్రోటోకాల్‌కు దారితీసిన చర్చల నాటినుంచీ సంపన్న దేశాలకూ, ఇతర దేశాలకూ మధ్య వివాదంగా మారి చివరకు అంగీకరించిన అంశం కూడా లిమా సదస్సు ముసాయిదావల్ల దెబ్బతిందని పర్యావరణ ఉద్యమకారులు అంటున్నారు. మన దేశంతోసహా పలు దేశాలు లిమా సదస్సు సాధించిన విజయం ఎన్నదగినదని అంటున్నా ఇంత బలహీనమైన, అన్యాయమైన ఒప్పందం ఇంతకు ముందెన్నడూ కుదరలేదన్నది వారి ఆవేదన. కర్బన ఉద్గారాల్లో ఎవరి వాటా ఎంతని చిట్టా విప్పితే సంపన్న దేశాల పాపాలన్నీ బయటపడతాయి. ప్రపంచాన్ని ఆవరించిన కర్బన మేఘాల్లో పారిశ్రామిక దేశాల వాటా 70 శాతంపైగా ఉంటుందన్నది ఒక అంచనా. ఇప్పుడు లిమా సదస్సు మాత్రం అందరినీ సమాన బాధ్యుల్ని చేస్తున్నది. ఇందువల్ల వర్థమాన దేశాల్లో పేదరిక నిర్మూలన , సుస్థిర అభివృద్ధి చర్యలపై తీవ్ర ప్రభావం పడుతుంది. పర్యావరణ విధ్వంసంలో తమ పాత్రను గుర్తించి సరిచేసుకోవాల్సిన సంపన్న దేశాలు దబాయించి, మొండికేసి మానవాళి సురక్షిత భవిష్యత్తుకు మోకాలడ్డాయి. భావితరాలు దీన్ని క్షమించవు.
‘లిమా’ విషాదం!
Published Tue, Dec 16 2014 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 6:13 PM
Advertisement
Advertisement