నాస్తికుడి మెదడులో తిరునామం తిష్టవేస్తే?!
అక్షర తూణీరం
ఆనాడు గాంధీజీ మెదడులో నెహ్రూ నిలువెత్తు కాలుష్యం. పటేల్ తొలి ప్రధాని అయితే మన కథ వేరేలా ఉండేదని మేధావులు అంటూ ఉంటారు. ధృతరాష్ర్టుడికి దుర్యో ధనుడు, ద్రోణుడికి అర్జునుడు, కృష్ణుడికి శకుని అబ్సెషన్స్ అయి, అవే కాలుష్యాలై ఇతిహాసాన్ని కొత్త మలుపు తిప్పాయి. చివరగా మన రాష్ట్రపతికున్న కాంగిరేసుపై వీరాభిమానం వదిలించాల్సిన కాలుష్యం కాదా?
భారత రాష్ట్రపతి, ఔను! మన రాష్ట్రపతి ఇటీవల ఒక మంచి మాట అన్నారు. స్వచ్ఛ భారత్ కార్య క్రమంలో మన చుట్టూ చేరిన చెత్తాచెదారం తోపాటు, మన మెదళ్లలో పేరుకుపోయిన మాలిన్యాలను తక్షణం తొలగించుకోవాల న్నారు. ఇది నిజంగా గొప్ప సందేశమే. బుద్ధుడికి బోధి వృక్షం నీడలో జ్ఞానోదయం కాగానే దాదాపు ఇలాంటి ప్రకటనే చేశాడు. నువ్వు నిర్మలంగా ఉంటే లోకమంతా నిర్మలంగా ఉంటుందని పాళీ భాషలో అన్నాడు. మెదడులో మట్టి చేరడం వేరు. కాలుష్యాలు చేరడం వేరు. మట్టిబుర్ర పనిచేతలో మంద కొడిగా ఉంటుంది. కాలు ష్యాలు పేరుకుపోయిన బుర్ర లోపలి రసాయనిక చర్యలను బట్టి అక్రమంగా ప్రవర్తిస్తూ ఉంటుంది.
అసలు కల్తీ, కాలుష్యం, వ్యర్థం అనేవి సాపేక్షకాలు. బొగ్గు పులుసు వాయువు మనకు వ్యర్థం. చెట్లకు అదే బతుకు. ప్రధాని నరేంద్ర మోదీ మెదడులో హిందూత్వ మహాలింగం తిష్టవేయడం, మతాతీత లౌకిక రాజ్యాధినేతకది కాలుష్యమే. శివసేనరులకు, తొగాడియాలకు రుద్రాక్షలు మెదళ్లలో కొలువై ఉంటాయి. రుద్రాక్ష పవిత్రమైనదే గాని, ఇక్కడ కాలుష్యం హానికరం. బ్రెయిన్‌లో కూడా రెండు మూడు హానికరం. వెంకయ్య బ్రెయిన్‌లో కూడా రెండు మూడు చెంచాల కాలుష్యాలు లేకుండా ఉండవు. అందులో ఒక చెంచా లాల్ కృష్ణ అద్వాణీ. లోహ్ పురుష్‌గా కీర్తించి మరీ నెత్తిన పెట్టుకున్నారు వెంకయ్య. తలమీంచి తలలోకి దూరారాయన. సుష్మాస్వరాజ్ మెదడుని కూడా సంపూర్ణంగా క్షాళన చెయ్యాల్సి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. లోపల ఏమేమి పేరుకుపోయి ఉన్నాయో తెలియదు. అద్వాణీ బుర్రంతా వ్యర్థాలతో నిండిపోయి ఉందట. అయితే, ఆయన ప్రస్తుతం రాజకీయ రాజవీధిలో లేరు కాబట్టి ఏమీ పర్వాలేదం టున్నారు.
కొందరి మెదళ్లలో బొగ్గునుసి చేరిపోయిం దట. మరికొందరిలో సెల్‌టవర్స్ విస్తరించే ధ్వని తరంగాల రజను చేరిందట. ఆంధ్ర పెద్దల బ్రెయిన్స్‌ని స్కాన్ చేస్తే, ఇసుక కుప్పలు తెప్పలుగా కనిపిస్తోందట. లాలూజీ తలమీదికి ‘‘గామా కిరణాలు’’ పంపితే, చిట్టు తవుడు మాత్రమే కనిపిస్తాయి. గొప్పదే అయినా తేనెలో విస్కీ కలవడం కాలుష్యమే. బియ్యంలో గోధుమలు కలిసినా, నీళ్లలో పాలు కలిసినా కాలుష్యమే. ఇదొక పెద్ద సాపేక్ష సిద్ధాంతం. అసలు ఐన్‌స్టీన్ బ్రెయిన్‌లో పుట్టిన థియరీ ఆఫ్ రెలిటివిటీ ఒక కాలుష్యం. అది ఏ జాతికి చెందిన కాలుష్యమో ఎవ్వరూ నిర్వచించలేకపోతున్నారు. నాస్తికుడి మెదడులో తిరునామం తిష్టవేస్తే అది కొంపలు మునిగేంత కాలుష్యం. ఆస్తికుడు హేతువాదిలా ఆలోచించడం మొదలుపెడితే ఆ బుర్రకి పుచ్చుపట్టినట్టు లెక్క. మనిషి బుర్రకి చెదపడుతుంది. పుచ్చుపడుతుంది. కొన్నిసార్లు బుర్రకి బొజ్జ వస్తుంది. అప్పుడు ఆలోచనలు మందగిస్తాయి. ఈ స్వచ్ఛ విశ్వాసానికి నాంది పలికినవాడు మహాశివుడు. హాలాహలాన్ని గొంతులో పెట్టుకున్నాడు.
ఆనాడు గాంధీజీ మెదడులో నెహ్రూ నిలువెత్తు కాలుష్యం. పటేల్ తొలి ప్రధాని అయితే మన కథ వేరేలా ఉండేదని మేధావులు అంటూ ఉంటారు. ధృతరాష్ర్టుడికి దుర్యో ధనుడు, ద్రోణుడికి అర్జునుడు, కృష్ణుడికి శకుని అబ్సెషన్స్ అయి, అవే కాలుష్యాలై ఇతిహాసాన్ని కొత్త మలుపు తిప్పాయి. చివరగా మన రాష్ట్రపతికున్న కాంగిరేసుపై వీరాభిమానం వదిలించాల్సిన కాలుష్యం కాదా?
- శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)