ఎవరు డోలక్? బుల్ బుల్ ఏమిటి? | Dholak Who? What Bull Bull? | Sakshi
Sakshi News home page

ఎవరు డోలక్? బుల్ బుల్ ఏమిటి?

Published Fri, Oct 10 2014 11:55 PM | Last Updated on Sat, Sep 2 2017 2:38 PM

ఎవరు డోలక్? బుల్ బుల్ ఏమిటి?

ఎవరు డోలక్? బుల్ బుల్ ఏమిటి?

ఓస్! అంతేకదా! అయితే కొట్టండి డోలక్, వాయించండి బుల్ బుల్ అన్నాడు.
‘‘ ఆ గోల దేనికిరా యీ అర్థరాత్రి’’ అని గద్దించాడు ఒకాయన. ‘‘గోలేంది బాబూ!
అవి లేందే నాక్కాలు లెగవదు’’ అన్నాడు జీన్సు కుర్రాడు.

 
అక్షర తూణీరం
 
రోడ్డు వారగా సాము గరిడీల సందడి ఆరంభై మెంది. నేలకు పాతి న కట్టుకొయ్యకు ముంగిస కట్టేసి ఉంది. దాని పక్కనే మూసేసిన పాము బుట్ట ఉంది. మూటల్లోంచి సరుకు సరంజామా తీసి వివరంగా పరుస్తున్నారు. డోలక్ నిర్విరామంగా మోగుతోంది. బాగా నలిగిన హిందీ పాట వరస బుల్ బుల్ మీద వినిపిస్తోంది. చేతికి కట్టుకున్న గజ్జెల చెండు లయబద్ధంగా మోగుతూ డోలక్ దరు వుకి కొత్త రంగు వేస్తోంది. రెండేసి గడముక్కల్ని కత్తెరవా టుగా అమర్చి, ఆ రెంటినీ దూరం దూరంగా నిలబెట్టి వాటి మధ్య తీగె బిగిస్తున్నారు. చోద్యం చూడ్డానికి జనం మూగుతున్నారు. అయిదారేళ్ల పిల్ల బనీను, నిక్కరు వేసుకుని పిల్లిమొగ్గలు వేస్తూ జనాన్ని ఆకడుతోంది. రంగురంగుల సెల్వార్ కమీజ్ వేసుకున్న గడసాని ఓ పక్కగా నిలబడి మొహానికి పౌడర్ మెత్తుతోంది. అక్కడ కూచున్న దాదా చాయ్ తాగి బీడీ కాల్చడం పూర్తి చేసి రంగంలోకి దిగాడు. జులపాల జుట్టు, సైకిల్ కట్టు, అడ్డచారల బనీను, దవడలు జారిపోయినా ముఖంలో జాలువారు తున్న ఉత్సాహం- డమరు కాన్ని శక్తి కొద్దీ వాయించి, ఏదో జరిగిపోతోందన్న భ్రమ కలిగించాడు. జనం పోగవుతున్నారు. బుట్ట లోంచి పాముని తీసి మెడలో వేసుకుని దాని పడ గని విప్పిస్తూ, బుసకొట్టిస్తూ చుట్టూ తిరిగాడు దాదా. చూస్తుండగా అక్కడ కొంత చోటు ఆక్రమిం చి జనాన్ని గుండ్రంగా నిలబెట్టాడు. డోలక్ మోగు తోంది. బుల్ బుల్ పాత వరసలనే పాడుతోంది. ఉన్నట్టుండి గడసాని డ్యాన్స్ మొదలెట్టింది. బుల్ బుల్ నాగిన్ మ్యూజిక్ వినిపి స్తుంటే డోలక్ గజ్జెల దరువు వేస్తోంది. స్పీడు పెరిగే సరికి జనం యీలలు వేస్తూ, కాళ్లూ చేతులూ కదుపుతున్నారు. జనం దడి కట్టారు. దడి మందం నాలుగు వరసలకి పెరిగింది.

దాదా డమరుకం వాయిస్తూ చేయబోయే అద్భుతాలను ఏకరువు పెడుతున్నాడు. పాము ముంగిసల పోరాటం చూడకుండా వెళితే పాపం అన్నాడు. శాపం చుట్టుకుంటుందన్నాడు. అక్కడ గారడీ ముఠా అంతా కలసి అయిదుగురు లేరు గాని చాలామంది ఉన్నట్టుగా ఉంది. ఉన్నట్టుండి ఒక కుర్రాడు ముందుకు వచ్చాడు. పాలిపోయిన జీన్సు, తెగ మాసిన టీషర్టు, గట్టిగా దువ్వి ముడేసిన పిలక జుట్టు, చివికిపోయిన కాన్వాస్ బూట్లు, రెండు చేతుల్లో కర్రపుల్లలున్నాయి. వాటి చివరల వస్త్రాల పీలికలు చుట్టి ఉన్నాయి. వాటిని కాసేపు గాలిలో తిప్పి ఆర్భాటం చేశాడు. పుల్లల కొసలని కిరసనాయిల్‌లో ముంచి, వెలిగించి కాగడాల తో విన్యాసం చేశాడు. కిరసనాయిలు పుక్కిట నిండా తీసుకున్నాడు. డోలక్, డమరుకం, బుల్ బుల్ జోరుగా మోగుతున్నాయి. జీన్సు కుర్రాడు ఆకాశం వైపు తిరిగి రెండు కాగడాలను  ఒకచోట నిలిపి ఆ మంట మీదకి నోట్లో కిరసనాయిల్‌ని బలంగా ఉమిశాడు. ఆ శక్తికి అది అగ్నిగోళంలా గాలిలోకి వెళ్లింది. జనం హాహా కారాలు, చప్పట్లు, ఈలలు... వీధి వీధి అంతా పైకి చూసింది. జీన్సుకు ర్రాడు వెలుగు తున్న కాగడాలతో గెడసాని కోసం కట్టిన తీగెమీంచి దూకాడు. అలా గాలిలోకి తేలి గాలి బొమ్మలా అవతల దిగాడు.

ఆశ్చర్యపోయారు. ఆలోచన చేశారు, జీన్సు కుర్రాణ్ణి జీప్‌లో తీసుకెళ్లారు. బోలెడంత బిర్యానీ పెట్టించారు. బాగా చీకటి పడ్డాక మరోచోటికి తీసు కెళ్లారు. అక్కడ గాజుపెంకులు గుచ్చిన గోడను చూపించారు. అది అతను దూకిన తీగె ఎత్తు కంటె తక్కువే. అవతలికి దూకు ఆ తర్వాత నీకోపని చెబుతాం అన్నారు, తీసుకెళ్లిన వాళ్లు. ఓస్! అంతే కదా! అయితే కొట్టండి డోలక్, వాయించండి బుల్ బుల్ అన్నాడు. ‘‘ ఆ గోల దేనికిరా యీ అర్థరాత్రి’’ అని గద్దించాడు ఒకాయన. ‘‘గోలేంది బాబూ! అవి లేందే నాక్కాలు లెగవదు’’ అన్నాడు జీన్సు కుర్రాడు.
 ‘ఓరి నీయబ్బ...’అని ఒక్కసారి వాళ్లంతా నీరు కారిపోయారు. జీన్సు కుర్రాడు ఆ చీకట్లో నడు చుకుంటూ దాదా సన్నిధికి, డోలక్ బుల్‌బుల్ చప్పు డుని వెతుక్కుంటూ వెళ్లిపోయాడు. దాదా ఎవరు? పాము, ముంగిస తలపడ్డాయా? గడసాని పడకుం డా నడిచిందా?
ఇదంతా ఒక పజిల్.

-  శ్రీరమణ


1960లలో బాపురమణల ఆధ్వర్యంలో నడిచిన జ్యోతి మంత్లీ సంపాదక బాధ్యతలని నండూరి రామమోహనరావు తీసుకున్నారు. జ్యోతిలో సవ్యసాచి పేరుతో ‘అక్షర తూణీరం’ శీర్షిక నడిపారు ఎన్నార్. మా పల్లెటూళ్లో కాలక్షేపం చేస్తున్న నన్ను నలభై ఏళ్లనాడు కాలమిస్ట్‌గా పత్రికలకు పరిచయం చేసిన నండూరికి నివాళిగా యీ అక్షర తూణీరం.    
 - శ్రీ
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement