
మద్యమే మనకు రక్ష!
ఇది బడ్జెట్ సీజన్. ఒక నెలరోజుల పాటు ఏ నోట విన్నా అంకెలే తప్ప అక్షరాలు వినిపిం చవు. ‘‘ఇదంతా ఒక పెద్ద మాయాజాలం. ఏదో అందరికీ మేలు చేసినట్టే బడ్జెట్ చిట్టాని సమర్పి స్తారు. ఎవరికీ ప్రయోజనం ఉండదు. అట్లాగని ప్రభుత్వానికీ మేలు జరగదు’’ అని ఒక ఆర్థిక మేధావి అన్నారు. మళ్లీ ఇందులో రైల్వే బడ్జెట్ ఒక ప్రత్యేక విశేషం. ఆసక్తికర అంశంగా నిలుస్తుంది. టికెట్ల ధర పెంచడం తప్ప తగ్గించడం ఉండదు. రవాణా అంటే సరుకు రవాణా చార్జీలు కూడా తగ్గవు. కొత్త రైళ్లు, కొత్త రైలు పట్టాలు కూడా బడ్జెట్‌లోకే వస్తాయి. ఇక్కడ ఆయా మంత్రుల పలుకుబళ్లు బాగా పనిచేస్తాయి. రెండు నెలలు ముందు నుంచే రాష్ట్ర మంత్రులు ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అన్నీ వింటారు. కేంద్ర మంత్రులు సమస్త ప్రతిపాదనలకూ సానుకూలంగా స్పందించినట్టే కనిపిస్తారు. ఆ తర్వాత జరిగేది జరుగుతుంది. ‘బ డ్జెట్ సమర్పణ’ మన దేశానికో పెద్ద సందర్భం. ఎందుకో తెలియదు. అనాదిగా పెద్దలు, పత్రికలు కలసి దానికి విపరీతమైన ప్రాముఖ్యం కల్పించారు. బడ్జెట్ ప్రతిపాదనలు శిలాశాసనాలేమీ కాదు. ఏదో గురికి బెత్తెడుగా నడిచిపోతూ ఉంటాయి.
అధికార వర్గం ‘‘ఇదొక అద్భుతం! ఇది పేదోడి బడ్జెట్’’ అంటూ ఆకాశానికెత్తేస్తుంది. ‘‘ఇది అంకెల గారడీ. పెట్టుబడిదారుల బడ్జెట్’’ అంటూ అపోజిషన్ అరుస్తుంది. పత్రికలు అవే శీర్షికలు, ఉప శీర్షికలతో బడ్జెట్ వార్తలు ప్రచురిస్తాయి. సామాన్యుడికి ఏమాత్రం తేడా పడదు. గడిచిన యాభై ఏళ్లుగా కథ ఇలాగే నడుస్తోంది. ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్లు, నాయకుల గౌరవ వేతనాలు, వారింటి ఖర్చులు, విదేశీ ప్రయాణ బరువులు ఇవే చాలావరకు దేశ ఆదాయాన్ని హరించివే స్తాయి. పావలో, బేడో మిగిలితే దానికి కావల్సినన్ని అవసరాలు. ‘‘అంతా మన ఫ్యామిలీలాగానే. అనుకోని ఖర్చులు బోలెడు. ఇల్లు రిపేర్లు, పెళ్లిళ్లు పేరంటాలు, రాకపోకలు మనకు ఉన్నట్టే పాపం, మోదీగారికీ ఉంటాయ్’’ అన్నాడొక కుటుంబరావు. ఏముందండీ... ఏదో ఫిగర్స్ చదువుతారు. అవన్నీ లెక్క ప్రకారం జరగాలని ఎక్కడుంది. కొత్త పంచాంగంలో కందాయ ఫలాల్లాగే. ఏదో ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేస్తాం’’ అన్నాడొక మధ్య తరగతి నిరాశాజీవి. ఇప్పటికే రాష్ట్రాల్లో, కేంద్రంలో ఈ కసరత్తులతో పెద్దలకి చెమటలు పడుతున్నాయి. చివరకు హళ్లికి హళ్లికి సున్నకు సున్న.
తెలుగు రాష్ట్రాలలో మద్యం మీద ఆదాయమే మిక్కిలి ఆశావహంగా ఉంది. ఏటికే డాది ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది. ప్రభుత్వం టార్గెట్లు పెంచినా తేలిగ్గా వాటిని పూర్తి చేస్తున్నారు. చివరికి అబ్కారీదే పెద్ద ఆదాయం అయింది. మద్యాదాయాన్ని పెంచుకోవడానికి ఉభయ రాష్ట్రాలు పగలూ రాత్రీ శ్రమిస్తున్నాయి. ఇందుకు ఆనందించాలా? గర్వించాలా? గాంధీని తలుచుకుని తలదించుకోవాలా?
శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు)