ఫలశృతులేగానీ ప్రతిఫలాల్లేవ్‌! | Sriramana writes on Ilayaraja's issue | Sakshi
Sakshi News home page

ఫలశృతులేగానీ ప్రతిఫలాల్లేవ్‌!

Published Sat, Mar 25 2017 1:54 AM | Last Updated on Tue, Sep 5 2017 6:59 AM

ఫలశృతులేగానీ ప్రతిఫలాల్లేవ్‌!

ఫలశృతులేగానీ ప్రతిఫలాల్లేవ్‌!

అక్షర తూణీరం
నాలుగు దశాబ్దాల క్రితం శ్రీ రాజగోపురం నిర్మాణానికి కంచి పరమాచార్య ఆదేశించారని లక్షలు సమర్పించారు స్వర చక్రవర్తి ఇళయరాజా. పుంభావ సరస్వతి. ఆయనకా ఈ ‘‘కాపీనం’’! అంతా కాలమహిమ!

‘‘సర్వమ్‌ బాణోచ్చిష్టమ్‌’’ అన్నారు పెద్దలు. ఏదీ మాతృక కాదు. ఎవరిదీ సొంతం కాదు. జన హితం కోరి అన్ని మంచి మాటలు ఎన్నడో బాణుడు అనేశాడంటారు. వ్యాస మహర్షి కూడా ఆ కోవలో వాడే. ఒకే కొండగా పడి ఉన్న వేద వాఙ్మ యాన్ని నాలుగు విభాగాలుగా వర్గీకరించాడు. మహా భారతాన్ని పంచమ వేదంగా సృజించాడు. దీన్ని పది మందీ చదివి బాగుపడండని ఫలశృతి చెప్పాడు గానీ ప్రతిఫలం ఆశించలేదు. వ్రేపల్లెలో యశోదమ్మ కడవ లలో పాలు తోడేసి, పెరుగు చేయడం నేర్పింది. ఆ వాడ ఇల్లాండ్రు నిలువు కవ్వాలతో పెరుగుమీది మీగడలు చిలికి, వెన్నలు తీయడం నేర్పారు. ఫలితంగా అక్కడ ఓ వెన్నదొంగ పెరిగి పెద్దవాడై, పెద్ద మనిషై, జగద్గురువై భగవద్గీత చెప్పాడు. ఆ గీత మానవాళికి వెలుగు వెన్నెల అయింది. బృందావనంలో గోపికలు కోలాటంలో కోపు లో ఆడిపాడిన భక్తి కావ్యాలెన్నో! వాటన్నింటినీ ఆప  ళంగా, అప్పనంగా జాతికిచ్చేశారుగానీ, ‘‘మాకేంటి నభా’’ అని క్లెయిమ్‌ చెయ్యలేదు.

ఆలయాలలో, అక్కడ ఇక్కడా జీవకళ ఉట్టిపడే శిల్పాలెన్నింటినో దర్శిస్తుంటాం. దణ్ణం పెట్టుకుంటాం. మొక్కుతాం. ఎక్కడైనా, ఏ శాసనంలో అయినా గుడి కట్టిన రాజు పేరు ఉంటుందిగానీ, దేవుడికి ప్రాణం పోసిన శిల్పి పేరు చూశారా? అయినా, తను శిల్పించిన తావున చిరంజీవిగా ఆ శిల్పి ఉంటాడు. నిజానికి విగ్రహానికి వచ్చే కీర్తి ప్రతిష్టలు, అందే పూజలు సగం శిల్పికే చెందుతాయి.

నాలుకను చిత్రంగా బుగ్గలమధ్య కదిలిస్తూ అమ్మ ‘‘ఉళుతూ’’ అంటూ జోల పాటని అందుకుంటుంది. ఆ తరువాత ‘‘హాయి హాయి హాయీ ఆపదలు గాయి’’ అని పాట మొదలవుతుంది. ఏ తల్లి ఈ ఉళుళూలకు ఫణితి కూర్చిందో ఎరుక లేదుగానీ, కోట్లాదిమంది అమ్మ తల్లులు తరాలుగా అచ్చం ఒక్కలాగే జోలపాట పాడుతున్నారు. ఏ తల్లీ ఇంతవరకు ఈ బాణీపై హక్కులు కోరిన దాఖలా లేదు. మన ప్రాచీన మునులు, రుషులు తమ విద్వత్తును, అనుభవాలను ఉదారంగా జాతికి పంచారు. ఆయుర్వేదం మరో వేదమై జాతికి సేవ చేస్తోంది. దీనిపై క్లెయిములు లేవు. పాటలు నేర్పిన కోయిలకు మనం బంగారు గూళ్లు కట్టాలి. ఆటలు నేర్పిన నెమలికి వజ్రాల హారం వెయ్యాలి. జానపద సాహిత్యం వరుసలతో సహా, అనూచానంగా మనకు అందింది. త్యాగరాజస్వామి సంగీత స్వరాలను మేకు బందీ చేయడానికే కృతులు రచించారు. ట్యూనుకి పాటలు రాసిన తొట్టతొలి పాటకారి. ఉంఛ వృత్తితో రామ భక్తి సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలారు. ఎన్ని నాటకాలు, పాటలు, ఎన్ని పద్యాలు? నేటికీ జనం నాల్కల మీద నర్తిస్తున్నాయి. ఆ బాణీ లెవరివి? వెన్నెల అనుభవించడానికి హరివిల్లుని ఆనందించడానికి రుసుమా?

వెయ్యేళ్ల క్రితం ఉపదేశించిన గురువు మాటని పెడ చెవిన పెట్టి, మహా నారాయణ మంత్రాన్ని శ్రీరంగం ఆలయ గోపురం మీంచి రంకె వేసి వినిపించి, అందరికీ పంచిన శ్రీమద్రామానుజుడు దైవాంశ సంభూతుడు. నాలుగు దశాబ్దాల క్రితం శ్రీ రాజగోపురం నిర్మాణానికి కంచి పరమాచార్య ఆదేశించారని లక్షలు సమర్పించారు స్వర చక్రవర్తి ఇళయరాజా. పుంభావ సరస్వతి. ఆయ నకా ఈ ‘‘కాపీనం’’! అంతా కాలమహిమ!


- శ్రీరమణ

(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement