‘జ్యేష్టంలో భూమి పూజా? హవ్వ!'
అక్షర తూణీరం
వేర్లు పడ్డాం. ఇల్లూ వాకిలీ లేదు. కుండా చట్టీ లేదు. చేట జల్లెడ, మంచం కుంచం లేవు. పాడీ పశువూ లేదు. ఆఖరికి చెట్టూ చేమా కూడా ఆ వాటా లోకే వెళ్లాయి. విడిపోయినా పదేళ్లపాటు సాధన సంపత్తిని ఉమ్మడిగా వాడుకోండని విడ గొట్టిన పెద్దలు చెప్పారు. ఏడాది తిరక్కుండా రాజకీయాలు మొదలైనాయి. ఆ గోడ మీది బల్లి ఈ గోడ మీద పాకకూడదన్నారు. అసలే రోష స్వభావి. దానికి తోడు దాయాది పోటీ. చంద్ర బాబు అర్జంటుగా కృష్ణాతీరానికి స్పాట్ పెట్టి, పాతికవేల ఎకరాలు పట్టేశారు. అలనాటి అమరావతికి గొప్ప వైభవం ఉంది. ఘన చరిత్ర ఉంది. వాస్తుబ్రహ్మలు అక్కడ ప్రతి అంగుళాన్ని తడిమి చూసి, బాగు బాగు అన్నారు. ఇప్పుడక్కడ ఒక మహాద్భుత మహానగరం రాబోతోంది.
ఇహ అన్ని హంగులూ ఉన్న తెలంగాణలో కూడా నిర్మాణాత్మక మాటలు, అంటే కాంక్రీట్ కబుర్లు విరివిగా వినిపిస్తున్నాయి. ఎక్కడ ఖాళీ జాగా ఉంటే అక్కడ భవనాలు నిర్మిస్తామంటున్నారు. ఒకవైపు మిషన్ కాక తీయ కింద మట్టిపనులు, మరోపక్క స్వచ్ఛభారత్ కింద చెత్తపనులు జోరుగా సాగుతున్నాయి. నేల దొరికితే తాపీపనులు మొదలవుతాయి. అసలు సగం ఆఫీసులు, సగం ఉద్యోగులు, సగం కాపురాలు వెళ్లిపోయాయి కదా, ఇప్పుడీ కరువులో కొత్త నిర్మాణాలు అవసరమా అన్నాడు మా రామలింగేశ్వర్రావ్. దేవాలయాలకీ, విద్యా లయాలకీ, వైద్యాలయాలకీ సువిశాల ప్రాంగణాలు ఉండాలన్నాడు. ఐఐటీలన్నీ వేల ఎకరాల్లో ఎందుకుం టాయో తెలుసుకోవాలన్నాడు. ఇంతకీ ఎవడా రామలిం గేశ్వర్రావ్ అన్నాను. వాడొక ఓటరు. అయితేనేం, వాడు సలహా ఇవ్వకూడదా? ఇవ్వచ్చు.
‘పొయ్యి మీదకూ పొయ్యి కిందకూ ఉంటే; చెట్టు కిందైనా వండుకు తినొచ్చు’ అనేది మా అవ్వ. ఇప్పుడు ప్రపంచ స్థాయి కలల రాజధాని మనకి అవసరమా? ‘మన బతుక్కి మీసాలే దండగ, దానికి తోడు సంపెంగ నూనె కూడానా!’ అంటోంది మా అవ్వ. చంద్రబాబు వేదాంతాన్ని, ఇలాంటి నిర్వేదాంతాన్ని భరించడు. అసలు సహించడు. పైగా దైవజ్ఞులు నిర్ణయించిన శంకు స్థాపన ముహూర్తం మీద దుమారం రేగి, చెలరేగి సాగు తోంది. ‘జ్యేష్టంలో భూమి పూజా? హవ్వ!’ అంటూ అపోజిషన్ జ్యోతిష్కులు బుగ్గలు నొక్కుకుంటున్నారు.
మోదీ రాయి వెయ్యడానికి స్వయంగా వస్తున్నారు కాబట్టి, హస్తినలో ఉన్న కేంద్ర పంచాంగ వేత్తలు కూడా ముహూర్తంపై దృష్టి సారిస్తారు. భూమి పూజకు జ్యేష్ట మాసం ప్రశస్తం. ఏరువాక వచ్చేదీ, భూమి దున్నడం ఆరంభించేదీ జ్యేష్టమాసంలోనే. కనుక ఆక్షేపణ లేదని కొందరి వాదన. జనన మరణాలకు, మంచి పనులు ఆరంభించడానికి ముహూర్తాలుండవని మరో వాదన. చంద్రబాబు గతంలో ఎన్నో ఘనకార్యాలు చేశారు. వాటికి ముహూర్తాలు ఎవరైనా పెట్టారా? కార్యసాధ కులు పరిస్థితులు డిమాండ్ చేసినపుడు దిగిపోతారంతే.
ఆమాటకొస్తే అంతా ఘటన. ఏదీ మన చేతుల్లో లేదు. విజయనగర సామ్రాజ్యానికి పునాది వేస్తూ, విద్యారణ్యస్వామి ముహూర్తం నిర్ణయించారు. నక్షత్ర కదలికలను బట్టి నేను శంఖం పూరిస్తా, అప్పుడు శంకు స్థాపన జరగాలని ఆదేశించి ఆయన కొండెక్కి కూర్చు న్నారు. కాసేపటికి శంఖనాదం వినిపించింది. స్థాపన జరిగింది. అసలు ముహూర్తానికి స్వామి శంఖం విని పించింది. ముందు వినిపించింది ఓ జంగందేవర భిక్షా టనలో ఊదిందట. అందువల్ల కలకాలం ఉండాల్సిన విజయనగర సామ్రాజ్యం ఉండలేదని చెబుతారు. ముహూర్తబలం ఉంటుంది.
- శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)