జ్వరం తగిలిన పులి
అక్షర తూణీరం
బిహార్ ఫలితాల తర్వాత చంద్రబాబు మొహం కొంచెం తేటగా కనిపిస్తోందని ఒక పెద్దమనిషి అంటే ఆశ్చర్య పోయాను. ‘ఆయన’ మరీ బలం పుంజుకుంటే కష్టం కదండీ. అంతరం పెరిగిపోదూ! ఇప్పటికే ఇంటర్వ్యూలు దొరకడం లేదు. బిహార్ దెబ్బతో పెద్దాయన జ్వరం తగిలిన పులిలా ఉన్నాడు. కాస్త దగ్గరకి వెళ్లొచ్చు.
ఒక్కోసారి అపజయం కూడా అవసరం అనిపి స్తుంది. జీవితంలో, సిని మాల్లో, క్రికెట్‌లో, రాజ కీయాల్లో మధ్య మధ్య మొట్టి కాయలు మంచిదే నని అనుభవజ్ఞులు చెబుతూ ఉంటారు. విజ యం ఉత్సాహాన్నిచ్చి ముందుకు నడిపిస్తుంది. అతి విజయాలు అనర్థాలను కలిగిస్తాయి. సినిమా రంగంలో ఇది కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. ఆ రోజుల్లో చాలా సక్సెస్‌ఫుల్ నిర్మాత ఉండేవారు. ‘‘ఏమిటి, ఇంకా ఘంటసాల రాలేదా? ఆయన కోసం వెయిటింగా? అక్కర్లేదు. ఆ డోలక్ వాయించే చిదంబరంతో పాడించండి... నే చెబు తున్నాగా!’’ అని ఆజ్ఞాపించే స్థాయికి ఆ నిర్మాత వెళ్లారు. దాని ఫలితంగా మళ్లీ జీవితంలో విజయం రాలేదు. ‘నే చెబుతున్నాగా’ అనేది ఆయన ఊత పదం.
ఆత్మవిశ్వాసం వేరు అతిశయించిన అహంకారం వేరు.
మోదీని ప్రజలు గమనిస్తున్నారు. ఎన్నికల వేళ అభ్యర్థిగా మోదీ ప్రసంగాలను ఆసక్తిగా విన్నారు. కొంత మేర విశ్వసించారు. ప్రధానిగా సింహాసనం ఎక్కాక ఆయన ధోరణిని గమనిస్తున్నారు. తనని గ్లోరిఫై చేసుకోగల పలుకుబడి మోదీకి మీడియా ప్రపంచంలో ఉన్నట్టు లేదనేది నిజం. మీడియా తన శక్తియుక్తులను ఎంతగా ప్రయోగించినా, నాయకులకు గెలుపు ఓటములను ప్రసాదించలేదు.
కాకపోతే ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టించి పెట్టగలదు. ఈనాటి సామాన్య ప్రజ రాజకీయ నాయకులను ఎంతగా నమ్ముతున్నారో, మీడియాని కూడా అంతే నమ్ముతున్నారు. దానివల్ల వార్తలు వార్తలుగా, విశ్లేషణలు విశ్లేషణలుగా, ఊకదంపుళ్లు దంపుళ్లుగా జనం జల్లెడ పట్టుకుని ఆస్వాదిస్తున్నారు. మోదీ చెప్పిన ‘స్వచ్ఛ భారత్’ బావుందన్నారు. రేడియోల దుమ్ముదులిపిన ‘మనసులో మాట’ ఆలోచన ఫర్వాలేదన్నారు.
నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక ఢిల్లీ పరాజయం లెక్కకి రాలేదు గానీ, బిహార్ లెక్కకు వచ్చింది. ప్రభుత్వంపై రెఫరెండం కాకపోవచ్చుగాని, ఒక్క గట్టి మొట్టికాయగా భావించాలని అనుభవజ్ఞులు అంటున్నారు. నెగెటివ్ ఓటు కూడా మోదీకి గెలుపుని ఇవ్వలేక పోయిందంటున్నారు. ఓటరు నాడిని పట్టుకోవడం ఎంత సులభమో అంత కష్టం కూడా. మహోపన్యాసాలు ఓట్లని కురిపించవని మరోసారి రుజువైంది. బీజేపీకి కొంచెం చాలా ఓవర్‌కాన్ఫిడెన్స్ ఎక్కువని కొందరు అంటారు.
కావచ్చు. వారంతా శ్రీరాముని అనుచరులు. రాముడిది కూడా మించిన ఆత్మ విశ్వాసం. అందుకే వనవాసంలో అంతమంది రాక్షసులతో అకారణ శత్రుత్వం పెంచుకున్నాడు. శ్రీరాముడి ఓవర్‌కాన్ఫిడెన్స్ లక్ష్మణుడు. దాంతోనే సీతని అడవిలో వదిలి వెళ్లాడు. బంటు అయినా హనుమంతుడి సిద్ధాంతం గొప్పది. తన శక్తి తనకు తెలియదు. అశక్తుడనని అనుకుంటూనే సర్వం సాధించాడు. మోదీ మరోసారి ఫ్రెష్ మైండ్‌తో రామాయణం చదవాలి. రాముణ్ణి పూజించండి కానీ, హనుమంతుణ్ణి అనుసరించండి. ఆత్మ విమర్శ చేసుకోండి. లోకాన్ని అర్థం చేసుకోండి. బిహార్ ఫలితాల తర్వాత చంద్రబాబు మొహం కొంచెం తేటగా కనిపిస్తోందని ఒక పెద్దమనిషి అంటే ఆశ్చర్యపోయాను.
‘ఆయన’ మరీ బలం పుంజుకుంటే కష్టం కదండీ. అంతరం పెరిగిపోదూ! ఇప్పటికే ఇంటర్వ్యూలు దొరకడం లేదు. బిహార్ దెబ్బతో పెద్దాయన జ్వరం తగిలిన పులిలా ఉన్నాడు. కాస్త దగ్గరకి వెళ్లొచ్చు. పెద్దాయన మాటలు నాకు సరిగ్గా అర్థం కాలేదు.
- శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)