పిల్లలచేత మమ్మీ డాడీ అని తొలి పలుకులుగా పలికించేటప్పుడు ఎవ్వరికీ మాతృభాష గుర్తుకు రాదు. తప్పటడుగులు వేసేటప్పుడు సోప్, షాంపూ, షవర్ అని పిల్లలు కేరింతలు కొడుతుంటే మహదానందపడుతుంటాం. అన్నప్రాసన అయ్యాక డైనింగ్ టేబుల్, ప్లేటు, గ్లాసు, వాటర్, రైస్, కర్రీ, చట్నీ, సాంబార్, రసం, సాల్ట్, కర్డ్ అని పిల్లలు మాట్లాడుతుంటే మురిసిపోతాం. ఏ తల్లిదండ్రులైనా ఇంగ్లిష్ మాటల్ని ఒకసారైనా సరిచేశారా? పొద్దున లేచి బ్రష్ పేస్ట్ నించీ అంతా ఇంగ్లిషే. బడికి బయలుదేరుతుంటే పెన్సిల్, పెన్, బుక్స్, బ్యాగ్, షూస్, హోంవర్క్, యూని ఫాం ఇలా అన్నీ ఆంగ్లపదాలే.
స్కూలు ఆవరణలో అడుగుపెట్టాక తెలుగు నిషేధం. అక్కడ పిల్లల నోటెంట తెలుగు ముక్క దొర్లితే ఫైన్ చెల్లిం చాల్సి ఉంటుంది. వీటిని తల్లిదండ్రులు ఘనంగా గర్వంగా చెప్పుకుంటారుగానీ స్కూలుకి వెళ్లిపోట్లాడతారా అంటే లేదు. ఎందుకంటే ఖరీదైన స్కూల్స్‌లో అవన్నీ ఉండే నియమ నిబంధనలే. విచిత్రం ఏమిటంటే, ఏ పల్లెకైనా వెళ్లి ఫోన్ నంబరు అడగండి. పది సెల్ నెంబర్లూ స్పష్టంగా ఇంగ్లిష్‌లోనే చెబుతారు. ఇంగ్లిష్‌లో చెప్పారేమని అడిగితే, ‘ఏంటోనండీ ఈ నంబర్ తెలుగులో చెప్పడానికి రాదండీ’ అన్నదా యువతి. మన సీఎం తెలుగు కాదు, పదో ఏడు వచ్చేదాకా ఇంగ్లిష్ అనేసరికి ఇంటిమీద పెంకులు లేచిపోతున్నాయ్. అంతా ఒక్కసారి ఆలోచించాలి.
మా తరం అంటే అరవై ఏళ్లు దాటిన వాళ్లం స్కూలు ఫైనల్ కాగానే పై చదువుకి దగ్గరి బస్తీకో, బస్తీలో ఉన్న సమీప బంధువులింటికో వెళ్లాల్సి వచ్చేది. పీయూసీలో చేరే వాళ్లం. నిక్కర్లు వదిలి ప్యాంటు వేసుకోవడమే చాలా తికమకగా ఉండేది. చాలా మందికి చెప్పులుండేవి కావు. వాచీలు చాలా కొందరికే. బస్తీల్లో పుట్టి బస్తీల్లో పెరిగినవాళ్లు చాలా స్టయిల్‌గా ఉండేవాళ్లు. వాళ్లకి ‘బినాకా గీత్‌మాలా’ తెలుసు. హిందీ సినిమాల గురించి తెలుసు. వాళ్లు ఇంగ్లిష్ పిల్లలు. మేమంతా పల్లెటూరి బైతు పిల్లలం. ఇంగ్లిష్‌లో అటెండెన్స్ పిలిచేవారు. వాళ్లు మాస్టర్లు కారు లెక్చరర్లు. వాళ్ల పేర్లు కూడా పొడి అక్షరాల్లో పొట్టిగా ఉండేవి. కొంతమంది లెక్చరర్లు ఇంగ్లిష్‌లో తప్ప మాట్లాడేవారు కాదు. అర్థం అయినా కాకపోయినా, పెద్దవాళ్లం అయిపోయాం అనే నమ్మకమైన భ్రమ మమ్మల్ని ఆవరించేది.
ఇంగ్లిష్ రాకపోవడంవల్ల చుట్టుకునే చిన్న చిన్న అవమానాలు తరచూ బాధించేవి. తమాషా ఏమిటంటే మా తెలుగు మేస్టారు కూడా ఇంగ్లిష్‌లో మాకు వార్నింగ్‌లిచ్చేవారు. ఇంగ్లిష్ రాదనకుంటారనే బెంగ ఆయన్ని పీడిస్తూ ఉండేది. ఇప్పుడు కాదు ఎప్పట్నించో పల్లెల్లో కూడా బోలెడు ఇంగ్లిష్ వినిపిస్తూనే ఉంది. రేడియో కంటే టీవీ చాలా మాటలు నేర్పింది. రోజూ పొలాల్లో వేసే ఎరువులు, పురుగుమందులు అన్నీ ఇంగ్లిష్‌లోనే కదా ఉంటాయి. కానీ ఇదంతా వ్యవసాయ పరిభాష. ఇదొక జార్గాన్. దానికి తెలుగు ఉండదు. స్టేషన్, రైలు లాగానే.
బ్రిటిష్ హయాంలో మనమంతా వాళ్ల మనుషులం కాబట్టి మన చదువుల్ని వారికి అనుకూలంగా ఉండేలా మనపై రుద్దారు. వాటినే ‘మెకాలే చదువులు’ అనుకుంటూనే చచ్చినట్టు చదువుకున్నాం. అదెందుకు, ఇదెందుకు అని అడగలేదు. అదేమిటి ఇదేమిటని ప్రశ్నించలేదు. తర్వాత ఆ శకం అంతరించింది. అయినా ఇంకా అవశేషాలు మిగిలే ఉన్నాయి. ఆ చదువులు పోయి అమెరికా చదువులు వచ్చాయి. ‘మొత్తం బతుకంతా ఆ డాలర్ రాజ్యంలోనే ఉంది నాయనా, మనోళ్లంతా ఆ నీళ్లే తాగి బతుకుతున్నా రయ్యా’ అంటూ ఆప్తులు పుట్టినప్పట్నించి ప్రోత్సహిస్తున్నారు.
ఒకప్పటిలాగా మన ఊళ్లోనే, మన రాష్ట్రంలోనే, మన దేశంలోనే జీవితం గడిచిపోతుందనే గ్యారంటీ ఎవ్వడికీ లేదు. టీడీపీ వాళ్లకి లాజిక్‌తో పనిలేదు. జగన్ ఏది ప్రవేశపెట్టినా వారికి నచ్చదు. ఈ వ్యతిరేకుల సమీప కుటుంబ సభ్యులలో ఎందరికి తెలుగు చదవను, రాయను వచ్చునో కనుక్కోండి. మన దేశం లాంటి ప్రజా రాజ్యంలో అడుగడుగునా పేదవాడికి అన్యాయం జరుగుతూనే ఉంటుంది. అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, న్యాయం, చట్టం కావచ్చు, నీతి నియమాలు కావచ్చు.
అందరూ సమానమే. కొందరు మరీ ఎక్కువ సమానం. మా చిన్నప్పటినించీ తెలుగు మేష్టారంటే అలుసే. అందుకని పాపం ఆయన అవసరం లేకపోయినా ఇంగ్లిష్‌లో మాకు వార్నింగ్‌లు ఇస్తూ ఉండేవారు. నిజంగానే ఇంగ్లిష్, సైన్సులు, లెక్కలకు ఉన్న డిమాండ్ తెలుగుకి అప్పట్నించీ లేదు. పెళ్లికొడుకుని వెదికేటప్పుడు కూడా, ‘పిల్లకి వయసు
మీరుతోంది. పోనీ బడిపంతులుగానీ, ఆహరికి తెలుగు మేష్టారైనా పర్వాలేదు...’ అనే వారు. ఏదేశమేగినా ఎందుకాలిడినా ఇంగ్లిషే బెటరు!
శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
Comments
Please login to add a commentAdd a comment