Yashoda Lodhi: పల్లెటూరోళ్లు ఇంగ్లిష్‌ మాట్లాడొద్దా? | Yashoda Lodhi gives English classes on her YouTube channel | Sakshi
Sakshi News home page

Yashoda Lodhi: పల్లెటూరోళ్లు ఇంగ్లిష్‌ మాట్లాడొద్దా?

Published Tue, Nov 28 2023 12:43 AM | Last Updated on Tue, Nov 28 2023 12:43 AM

Yashoda Lodhi gives English classes on her YouTube channel - Sakshi

యూ ట్యూబ్‌ తెరుస్తున్న కొత్త ద్వారాలు చూస్తూనే ఉన్నాం. మన దగ్గర ఒక బర్రెలక్క ఉన్నట్టుగానే ఉత్తర ప్రదేశ్‌లో ఒక టీచరక్క ఉంది. ఇంటర్‌ మాత్రమే చదివిన వ్యవసాయ కూలీ
యశోదా లోధి ఇంగ్లిష్‌ మీద ఆసక్తితో నేర్చుకుంది. ‘నాలాగే పల్లెటూరి ఆడవాళ్లు ఇంగ్లిష్‌ మాట్లాడాలి’ అనుకుని ఒకరోజు పొలం పని చేస్తూ, ఇంగ్లిష్‌ పాఠం వీడియో విడుదల చేసింది. ఇవాళ దాదాపు మూడు లక్షల మంది సబ్‌స్క్రయిబర్లు ఆమె ఇంగ్లిష్‌ పాఠాలను నేర్చుకుంటున్నారు. యశోదా లోధి సక్సెస్‌ స్టోరీ.

‘కట్‌ టు ద చేజ్‌’ అంటే ఏమిటి? ‘బై ఆల్‌ మీన్స్‌’ అని ఎప్పుడు ఉపయోగించాలి? ‘అకేషనల్లీకి సమ్‌టైమ్స్‌కి తేడా ఏమిటి?’... ఇలాంటి చిన్న చిన్న విషయాల నుంచి మంచినీళ్లు తాగినంత సులభంగా ఇంగ్లిష్‌ మాట్లాడటం ఎలాగో నేర్పుతోంది ఒక పల్లెటూరి పంతులమ్మ. ఆశ్చర్యం ఏమిటంటే తాను ఒకవైపు నేర్చుకుంటూ మరో వైపు నేర్పుతూ. చదివింది ఇంటర్మీడియట్‌ మాత్రమే. అది కూడా హిందీ మీడియమ్‌లో. కాని  యశోదా లోధి వీడియోలు చూస్తే ఆమె అంత చక్కగా ఇంగ్లిష్‌ మాట్లాడుతున్నప్పుడు మనమెందుకు మాట్లాడకూడదు అనిపిస్తుంది. అలా అనిపించేలా చేయడమే ఆమె సక్సెస్‌. ఆమె యూట్యూబ్‌ చానల్‌ సక్సెస్‌.

ఇంగ్లిష్‌ విత్‌ దేహాతీ మేడమ్‌
‘దెహాత్‌’ అంటే పల్లెటూరు అని అర్థం. యశోదా లోధి ఉత్తర ప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో సిరాతు నగర్‌ అనే చిన్న పల్లెటూళ్లో ఉంటోంది. అందుకే తన యూట్యూబ్‌ చానల్‌కు ‘ఇంగ్లిష్‌ విత్‌ దెహాతి మేడమ్‌’ అనే పేరు పెట్టుకుంది. ఆమె ఇంగ్లిష్‌ పాఠాలకు ఇప్పటికి రెండున్నర కోట్ల వ్యూస్‌ వచ్చాయి. మూడు లక్షల మంది సబ్‌స్క్రయిబర్లు ఉన్నారు. అంతే కాదు... ఆమెను చూసిన ధైర్యంతో చాలామంది గృహిణులు ఇంగ్లిష్‌ ఎంతో కొంత నేర్చుకుని ఆమెతో లైవ్‌లో ఇంగ్లిష్‌లో మాట్లాడుతూ మురిసిపోతుంటారు. ఇంగ్లిష్‌ మన భాష కాదు, మనం మాట్లాడలేము అనుకునే పల్లెటూరి స్త్రీలకు, గృహిణులకు యశోద గొప్ప ఇన్‌స్పిరేషన్‌గా ఉంది.

300 రూపాయల రోజు కూలి
యశోద కుటుంబం నిరుపేదది. చిన్నప్పటి నుంచి యశోదకు బాగా చదువుకోవాలని ఉండేది. కాని డబ్బులేక అతి కష్టమ్మీద ఇంటర్‌ వరకు చదివింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. భర్త ఎనిమిది వరకు చదివారు. ఆడపడుచులు స్కూలు ముఖం చూడలేదు. అలాంటి ఇంటికి కోడలైంది యశోద. పల్లెలో భర్తతో పాటు బంగాళదుంప చేలలో కూలి పనికి వెళితే రోజుకు రూ. 300 కూలి ఇచ్చేవారు. మరోవైపు భర్తకు ప్రమాదం జరిగి కూలి పని చేయలేని స్థితికి వచ్చాడు. అలాంటి స్థితిలో ఏం చేయాలా... కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలా... అని తీవ్రంగా ఆలోచించేది యశోద.

ఒంటి గంట నుంచి మూడు వరకు
పల్లెలో ఇంటి పని, పొలం పని చేసుకుంటూ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు వరకు దొరికే ఖాళీలో మాత్రమే యశోద వీడియోలు చేస్తుంది. ‘మా ప్రాంతంలో నెలంతా సంపాదిస్తే 9 వేలు వస్తాయి. చాలామంది పిల్లలకు మంచి చదువు లేదు. నేను యూట్యూబ్‌లో బాగా సంపాదించి అందరికీ సాయం చేయాలని, మంచి స్కూల్‌ నడపాలని కోరిక’ అంటుంది యశోద. పల్లెటూరి వనితగా ఎప్పుడూ తల మీద చీర కొంగును కప్పుకుని వీడియోలు చేసే యశోదకు చాలామంది ఫ్యాన్స్‌ ఉన్నారు. ఇప్పుడు ఆమె ఆదాయం కూడా చాలా బాగా ఉంది. ఇది నేటి పల్లెటూరి విజయగాథ.

గతి మార్చిన స్మార్ట్‌ఫోన్‌
‘2021లో స్మార్ట్‌ఫోన్‌ కొనడంతో నా జీవితమే మారిపోయింది. అప్పటి వరకూ నాకు ఈమెయిల్‌ క్రియేట్‌ చేయడం తెలియదు, యూట్యూబ్‌ చూడటం తెలియదు. కాని ఫోన్‌ నుంచి అన్నీ తెలుసుకున్నాను. యూట్యూబ్‌లో మోటివేషనల్‌ స్పీచ్‌లు వినేదాన్ని. నాకు అలా మోటివేషనల్‌ స్పీకర్‌ కావాలని ఉండేది. కాని నా మాతృభాషలో చెప్తే ఎవరు వింటారు? అదీగాక నా మాతృభాష కొద్దిమందికే.

అదే ఇంగ్లిష్‌ నేర్చుకుంటే ప్రపంచంలో ఎవరినైనా చేరవచ్చు అనుకున్నాను. అలా ఇంగ్లిష్‌ నేర్చుకోవాలని ఇంగ్లిష్‌ నేర్పించే చానల్స్‌ చూడసాగాను. నేర్చుకుంటూ వెళ్లాను. అలా నేర్చుకుంటున్నప్పుడే నాకు ఆలోచన వచ్చింది. నాలాగా ఇంగ్లిష్‌ నేర్చుకోవాలనుకునే పేద మహిళలు, పెద్దగా చదువుకోని మహిళలు ఉంటారు... వారి కోసం ఇంగ్లిష్‌ పాఠాలు చెప్పాలి అని. నేను ఆశించేదీ, అందరు మహిళలు చేయాలని కోరుకునేదీ ఒక్కటే... భయం లేకుండా ఇంగ్లిష్‌ మాట్లాడటం. అది కష్టం కాదు. నేను నేర్చుకున్నాను అంటే అందరికీ వస్తుందనే అర్థం’ అంటుంది యశోద.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement