అభయహస్తం తప్పుడు సంకేతం!
అక్షర తూణీరం
‘‘ఏ పుట్టలో ఏ పాముందో, ఏ మట్టిలో ఏ మహిమ ఉందో! అన్ని చోట్ల నించి మట్టి తేవడం మంచిదే కాని, ప్రధాని మోదీ ఇంతా చేసి ముంతెడు మట్టి తెచ్చాడంటే మాత్రం బాలేదురా’’ అన్నాడొకడు.
ఒకవైపు సర్వత్రా దసరా ఉత్స వాలు, ఒక దిక్కు బ్రహ్మాండ నాయ కుని బ్రహ్మోత్స వాలు, మరోవైపు అమరావతి మహానగర శిలా న్యాస సంరంభం - ఆంధ్రప్రదేశ్ ప్రజని బూరెలగంపలో కూచో పెట్టినట్టయింది. చాలా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారు. అప శ్రుతులు దొర్లకుండా కార్యక్రమాన్ని జరిపిం చారు. ప్రజల్లో ఉత్సాహం నింపారు. ‘‘ప్రధానమంత్రి ఏమీ అభయహస్తం ఇవ్వ లేదే’’ అని ఒకాయన చప్పరించారు. ఎలా ఇస్తాడండీ, అభయహస్తం? అపోజిషన్ సిం బల్ కదా! అని పక్కాయన సమర్థించాడు. ఏమీ ఎరగనట్టు, ఏమీ పట్టనట్టు ఆ మహా జనం మధ్య తిరుగుతూ ఉంటే రకరకాల మాటలు, విసుర్లు, చెణుకులు, ఆశలు, నిరాశలు, నిట్టూర్పులు వినిపించాయి.
ఎంతైనా కె.సి.ఆర్. రావడం వల్ల సభ నిండుగా ఉందన్నారు చాలా మంది. ‘‘అం తేగా, మనం పెళ్లి ఎంత గ్రాండ్‌గా చేసినా తోబుట్టువు రాలేదనుకో శుభకార్యం వెలా తెలా పోదూ’’ అని వత్తాసు పలికారు ఇం కొందరు. ‘‘ఈసారి ఇక్కడెందుకో అన్నగారి జోక్యం తగ్గించినట్టు కనబడుతోంది’’ అన్నా డొక రైతు. ‘‘నీది మరీ చోద్యం. ఇదేమన్నా మహానాడా... అన్నగారి బొమ్మలు పెట్టడా నికి’’ ఖండించాడు ఇంకో పెద్ద రైతు. ‘‘ఎన్నై నా చెప్పండ్రా, మన చంద్రబాబు మంచి పనివాడురా’’ అని ఒకాయన కాంప్లిమెం టు. ‘‘పనోడు కాపోతేనే అంతపని చేస్తాడం ట్రా’’ మరొకాయన రివర్స్ సప్లిమెంటు.
ఏ పుట్టలో ఏ పాముందో, ఏ మట్టిలో ఏ మహిమ ఉందో! అన్ని చోట్ల నించి మట్టి తేవడం మంచిదే కాని, ప్రధాని మోదీ ఇం తా చేసి ముంతెడు మట్టి తెచ్చాడంటే మాత్రం బాలేదురా’’ అన్నాడొక వయసు మళ్లిన స్థానికుడు. ‘‘ఏంటి బాబాయ్, కొత్త పట్టుపంచెలు కట్టుకురాలేదే’’ ఒక ప్రశ్న. దాచిందిరా మీ పిన్ని. ఇప్పుడెందుకులే, గృహప్రవేశానికి కట్టుకుంటే పద్ధతిగా ఉం టుందని చెప్పింది. ‘‘ఏంటి! అమరావతి గృహప్రవేశానికా... అబ్బో అయినట్టే’’ అన్నాడో గొంతు వెటకారంగా. ‘‘నవ్విన నాపచేనే పండుద్దిరా’’ అన్నాడు తిరిగి రోషంగా. ‘‘అది సామెతలే బాబాయ్... నాపచేను పండటం చూశావా’’ అంటూ తిరగబడ్డాడు.
‘‘నాకు బాస రాదుగాని, ఆయన చెప్పిందే మన వెంకయ్య చెప్పాడా, వేరే ఏమన్నా సొంతంగా చెప్పాడా’’ అని పక్క వాడి చెవి కొరికాడొకాయన. ‘‘ఆయన మాటలే ఈయన మాటలు’’. ‘‘ఎవరే బాసలో, ఎవరేం మాట్టాడినా వెంకయ్య తన ఆలోచనలో వినిపిస్తాడని డౌటేసి అడి గాలే’’ అని వివరణ ఇచ్చాడు. ‘‘ఔను గాని ఒరే, బాలకృష్ణ స్పీచి దేనికిరా అక్కడ. బాగా కామెడీగానే ఉందనుకో...’’ అని ఒకాయన సందేహం వెలిబుచ్చాడు.
‘‘చంద్రబాబుకి బాగా వాస్తు పిచ్చంట గదరా’’ అని ఒక పెద్దాయన సందేహం వెలిబుచ్చాడు. ‘‘పిచ్చేంటి, నమ్మకం. అప్పట్లో, ఇల్లు నిన్ను దెబ్బతీస్తుంది. రెండు గుమ్మాల్ని అర్జం టుగా మార్పించమని మామగారి చెవిలో ఇల్లు కట్టుకు చెబితే ఎన్టీఆర్ పెడచెవిన పెట్టాట్ట. ఏమైంది చివరికి... అందుకే బాబుకి పిచ్చి నమ్మకం’’ అని క్లారిఫై చేశా డొక టీడీపీ కార్యకర్త. ఔన్లేరా, ఇక్కడే తెలు స్తోందిగా. కేసీఆర్‌తో భుజం మీద చేతులు వేసుకు తిరుగుతున్నాడంటే, మరి ఈ నేలపై ఏదో పవరున్నట్టేగా?
‘‘ఇవన్నీ సరేగాని, మన సీయమ్ చెబు తున్న నవ నగర నగరం వస్తుందం టావా...’’ అని ఒక పెద్దాయన నీరసంగా అడగడం వినిపించింది. అవతల భోజనాల సందడి మొదలైంది.
- శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)