నేల మీద సాము
అక్షర తూణీరం
క్యాపిటల్ నిర్మాణానికి ముఫ్పై మూడువేల ఎకరాలు ఆక్రమించాం. నిర్మాణ వ్యయం తట్టుకోడానికి రెండు జిల్లాలను అమ్మేస్తే తప్పేముంది. భార్య నగలమ్మి స్కూటర్ కొనుక్కున్న వారెందరో వున్నారు. కనుక ఏలిన వారు ఈ దిశగా ఆలోచించగలరు.
మంచిదే! నేల విడిచి సాము చెయ్యకూడదంటారు. ఏడాది నుంచి రాష్ట్రంలో ‘‘నేల మీద సాము’’ జరుగుతోంది. మొత్తానికి సాము అయిపోయి స్వాధీ నానికి వచ్చింది. ఒకప్పుడు రెండే రకాల సంపదలుండేవి. భూమి, బంగారం. గోసంపద కూడా సంపదే గాని మళ్లీ అవి తిరగడానికి తినడానికి నేల కావాలి. వారి ఆవులు వారి నేలనే ఉండాలి. భూప్రపంచంలో భూమికి ఉన్న గిరాకీ దేనికీ లేదు. అలెగ్జాండర్ నించి కృష్ణరాయల దాకా భూమి కోసమే పరితపించారు. పోరాడారు. జయించారు. విస్తరించారు. తర్వాత అందరి లాగే మరణించారు.
అసలు భూమి పుట్టీ పుట్టగానే నేలకున్న డిమాండ్‌ని తొలుత రాక్షసులు కనుగొన్నారు. హిరణ్యాక్షుడు భూగోళాన్ని భుజాన వేసుకువెళ్లిపోయాడు. అప్పుడు విష్ణుమూర్తుల వారు వరాహావతారుడై వెళ్లి, రాక్షసుని వధించి భూమిని ఉద్ధరించారు. అసలానాడు దేవుడు ఆ పని చెయ్యకపోతే, భూమి యింకెక్కడో రాక్షసుల అధీనంలో ఉండి ఉండేది. ‘‘ఇప్పుడు మాత్రం...’’ అన్నాడొక విచిత్రవాది నన్ను ముందుకు పోనీయకుండా. సన్మార్గులకి రాక్షసులకీ సన్నగీత మాత్రమే వ్యత్యాసం.
ఎందుకంటే సన్మార్గుడు రాక్షసంగా ఉండకపోతే ఆ మార్గంలో ముందుకు పోలేడు. నా సొంత ఫిలాసఫీని పక్కన పెట్టి మళ్లీ కథలోకి వస్తే - వేంకటేశ్వరస్వామికి కలియుగంలో నేల అర్జంటుగా కావల్సివచ్చింది. ‘‘భూమి యిస్తావా’’ అని సంస్కృతంలో దిగివచ్చిన స్వామి వరాహస్వామిని అడిగాడు. ఇస్తానన్నాడాయన. ఏరియా, రేట్లు సంస్కృ తంలో మాట్లాడుకున్నారు. బేరం సెటిలై స్వామి కొండ మీద స్థిరపడ్డాడు. తొట్ట తొలి రియల్ ఎస్టేట్ వ్యాపారిగా వరాహస్వామి గణనకెక్కారు.
బ్రిటిష్ టైంలో దత్తమండలాల చరిత్ర మనకు తెలుసు. అసలెందుకో ఆలోచన రాలేదు గాని సరిహద్దు జిల్లాల్ని ఎక్కువ కాకుండా ఒకదాన్నో రెంటినో బేరం పెడితే...?! ఖమ్మం జిల్లా ఆంధ్రప్రదేశ్‌కి వచ్చి ఉంటే, మంచి ధర పలికేది. ఇప్పుడైనా మించిపోయింది లేదు. పక్క రాష్ట్రాల వారిని పలకరించి చూడొచ్చు. క్యాపిటల్ నిర్మాణానికి ముప్పై మూడువేల ఎకరాలు (మనకి మొత్తం ముప్పైమూడు వేల దేవతలున్నారని ప్రతీతి. ‘‘ముప్పది మూడు వేల దేవతలెగబడ్డ దేశమున క్షుధార్తుల క్షుత్తులారునే’’ అన్నారు మహాకవి జాషువా) ఆక్రమించాం. అంటే సేకరించాం. నిర్మాణ వ్యయం తట్టుకోడానికి రెండు జిల్లాలను సరసమైన ధరకు అమ్మేస్తే తప్పేముంది. భార్య నగలమ్మి స్కూటర్ కొనుక్కున్న వారెందరో వున్నారు. కనుక ఏలిన వారు యీ దిశగా ఆలో చించగలరు.
కొన్ని వేల లక్షల రకాల మట్టి వచ్చి పడుతోంది. ఈ మట్టిలో ఏ శక్తి ఉందో తెలి యదు. అవినీతి, బంధుప్రీతి, ఆశ్రీత పక్షపాతం, అసత్య సంధతలేని దివ్యమట్టి వచ్చి చేరొచ్చు. మొన్నటికి మొన్న మహా దాతలుగా అభివర్ణింపబడిన అమరావతి భేనష్ట రైతులకు సగౌరవంగా సమర్పించిన నూతన వస్త్రాలు ‘‘వార్ క్వాలిటీ’’ అని తేలిపోయింది. పాపం, అసలు వాళ్లు అడిగారా పెట్టారా. ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదొక శాంపిల్. ఒక అనుభవజ్ఞుడైన పెద్దాయన, ‘‘వద్దండీ, మహత్తులున్న మట్టి మనకి వద్దులెండి. మహా ప్రమాదం. తెల్లారి లేస్తే, అందునా క్యాపిటల్ కూడా. బోలెడు అడ్డగోలు యవ్వారా లుంటాయ్. అవన్నీ ఆగిపోతే చాలా ఇబ్బంది’’ అంటూ ఆందోళన వ్యక్తం చేశాడు.
బుద్ధిగా వింటున్న కుర్రాడు అందుకుని, ‘‘తాతా, నువ్వు కంగారు పడొద్దు. యవ్వారాలు మాట్లాడుకోడానికి యీ నేలతో ఏం పని. గవర్నమెంట్ కంట్రోల్‌లో పది హెలికాప్టర్‌లు రెడీగా వుంటాయి. పాత పద్ధతిలో బుద్ధి చెడకుండా గాలిలోనే సెటిల్ చేసుకుని, దస్కత్తులు అయ్యాకే నేలకి దిగుతాం’’ అంటూ విజయగర్వంతో ముగించాడు.
- శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)