తెనాలి దగ్గర వరహాపురం అగ్రహారంలో సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి, చిన్నతనం నుంచీ సమతావాదాన్ని జీర్ణించుకుని కడదాకా అదే వాదాన్ని విశ్వసిస్తూ ఆచరిస్తూ, 78వ ఏట కన్నుమూశారు డాక్టర్ ఏపీ విఠల్. నాకు పాపం పుణ్యం, శ్లేషార్థాలు తెలియని రోజుల్లో విఠల్ పంట్లాము బుష్‌కోటు వేసుకుని బిరుసైన ఉంగరాల జుత్తు దువ్వుకుని మా పెరటి చింత చెట్టుకింద కూచుని పీట చెక్కమీద దరువేస్తూ గొంతెత్తి ‘పతితులార! భ్రష్టులార! ఏడవకండేడవకండి– నేనున్నా నేనున్నా’నంటూ అభయమిస్తూ పాడే వాడు. అప్పటికి ఆటల్లో వాడే కూత పాటలే వచ్చు. ఇంకేం తెలియవ్. అయినా, పాపం మా అగ్రహారం బుడతలందరికీ ఏదో వివరించి చెప్పాలని వృథా ప్రయత్నం చేసేవాడు. ఏపీ విఠల్ నాకప్పట్నించి మొన్న జనవరి 20 దాకా సజీవ జ్ఞాపకం. తండ్రి ఉద్యోగరీత్యా ఊళ్లు తిరుగుతుంటే విఠల్ కూడా తిరిగాడు. గుంటూరు మెడికల్ కాలేజీలో చేరాడు. ఏ సెలవులు వచ్చినా విఠల్ తల్లిదండ్రి, పిల్లలతో స్వగ్రామం వచ్చేవారు. హాయిగా సేదతీరి వెళ్లేవారు. అందుకని వాళ్ల కుటుంబం ఊరికి హితంగా సన్నిహితంగా ఉండేది. మెడికో విఠల్ కూడా ఆ సెల వుల్లో మా అగ్రహారంలోనే కన్పించేవాడు.
పచ్చి పల్లెటూరు కావడంవల్ల, విఠలయ్యగారు డాక్టరని పూర్తి నమ్మకంతో వచ్చి చేతులు చూపించేవారు. అంతా బీద, బిక్కి– చిన్న మందుబిళ్లకి మొహం వాచే స్థితి వారిది. వాళ్లందరికీ కూడా తెచ్చిన శాంపిల్స్ పంచేవాడు. వాళ్ల మొహాలు వెలిగిపోయేవి. విఠల య్యపై ఉన్న విశ్వాసం వాళ్ల రోగాలు తగ్గించేవి. పెద్ద ఆరోగ్య సమస్యలున్నవారు మరీ ముఖ్యంగా మావూరి మాలపల్లె, కుమ్మరిగూడెం వాసులు మా విఠలయ్యగారున్నారని ధైర్యంగా రేపల్లె–గుంటూరు రైలెక్కి వెళ్లేవారు. అక్కడి పెద్దాసుపత్రిలో విఠలయ్య పుణ్యమా అని అనుభవజ్ఞులైన ప్రొఫెసర్ల వైద్యంతోపాటు ఉచితంగా మందులు కూడా అందేవి. ఆనాడు డాక్టర్ అందించిన ఈ అమూల్యమైన సేవను ఇప్పటికీ మావూరు గుర్తు పెట్టుకుంది. పోయాడన్న విషాద వార్త విన్నప్పుడు, ‘అయ్యో! ఆ దేవుడు పోయాడా?‘ అని వూరు బావురుమంది. అప్పటికీ ఇప్పటికీ వూరి వారికి విఠల్ డాక్టర్‌గానే తెలుసు. ఆయన కమ్యూనిస్ట్ సిద్ధాంతాల వైపు పూర్తిగా మళ్లడం అవగాహన, విచక్షణా జ్ఞానం పెంపొందించుకోవడం, భావ వ్యక్తీకరణలో సూటిదనం, అందుకు తగిన తెలుగు పలుకుబడి విఠల్ సాధనతో సాధించిన అస్త్రశస్త్రాలు.
పూర్తిగా విభేదించినా సౌమ్యంగా, ‘వీరితో ఏకీభవించు భాగ్యము మాకు కలుగదని’ పశ్చాత్తాపం ప్రకటించి వూరుకోవడమే డా. విఠల్ పంథా. విఠల్ నేటి తెలంగాణ సూర్యాపేటలో రెండుచేతులా వైద్యాన్ని సేవగా అందిస్తూ, విఠల్ దవాఖానాని కొండగుర్తుగా మార్చినప్పుడు అందరి దృష్టిని ఆయన ఆకర్షించారు. రాష్ట్రం పట్టనంత పేరు గుబాళింప చేసింది. అప్పుడే ఒకసారి పుచ్చలపల్లి సుందరయ్య దవాఖానాకి వచ్చారు. ఊరకే రాలేదు. మహాత్ములు ఊరక ఎందుకు వస్తారు. పూర్తి సమయం పార్టీకి అంకితం చెయ్యాలని అడిగి ఒప్పించి తీసుకెళ్లడానికి వచ్చారు. చాలా చిన్నతనంలోనే పీఎస్ భావ ప్రభావాలకు సంపూర్ణంగా లొంగిపోయిన విఠల్ ఆయన పిలుపుని గొప్ప పురస్కారంగా భావించారు. ఆ తర్వాత విఠల్ తండ్రికి సంగతి చెప్పారు. ‘మీరూ పెద్దవారు. మావాడూ తెలిసినవాడు. మీ ఇద్దరికి ఇష్టమైతే నాదేముంది’ అంటూ పరోక్షంగా తన అనుమతి తెల్పారు. ఆ తర్వాత విఠల్ తల్లితో ప్రస్తావించారు పుచ్చలపల్లి. ‘ఆమె పెద్దగా చదువుకున్నది కాదు. పిల్లలగన్న తల్లి. సంప్రదాయాల నడుమ వొద్దికగా పెరిగిన హైందవ గృహిణి. ‘మీ అబ్బాయిని మీ అనుమతితో తీసికెళ్లడానికి వచ్చానమ్మా’ అన్నాడాయన సాదరంగా. వెంటనే ఆమె, ‘మీరు చాలా పెద్దవారు.
మీరడిగిన తీరు చూస్తుంటే ఆనాడు విశ్వామిత్రుడు దశరథుని దగ్గరకొచ్చి యాగరక్షణ కోసం రాముణ్ణి తీసుకువెళ్తానన్నట్టుంది. మేమేం చెప్పగలం’ అంటూ తల్లి కళ్లు తుడుచుకుంది. ఇది సుందరయ్య ఊహించని జవాబు. తర్వాత విఠల్‌తో, ‘చూడవయ్యా మన పురాణ ఇతిహాసాలు సాధారణ గృహిణుల మనసుల్లో సైతం ఎంతగా నాటుకుపోయాయో’ అని వ్యాఖ్యానించారట. చివరకు విశ్వామిత్రుడులాగానే రాముడితోనే కదిలాడు. తర్వాత డాక్టర్ విఠల్ ప్రజాశక్తి సంపాదక వర్గంలో కీలకపాత్ర వహించారు. ప్రజానాట్యమండలికి ప్రాతినిధ్యం వహించారు. సుందరయ్యకి, లీలమ్మకి ఆప్తుడైన విఠల్ పద్నాలుగేళ్లు పీఎస్‌కి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. ‘విప్లవపథంలో నా పయనం’ పేరిట సుందరయ్య జీవిత కథ గ్రంథస్తం చేశారు. తెలుగు పత్రికలన్నీ ఏపీ విఠల్ అక్షరాల్ని, అభిప్రాయాల్ని కడదాకా గౌరవించాయి. డాక్టర్ కె. రామచంద్రమూర్తి, మురళి సాక్షి దినపత్రిక పక్షాన విఠల్‌ని ఎంతగానో సమాదరించారు. డాక్టర్ విఠల్ పెళ్లికి నరుడో, భాస్కరుడో అని కీర్తించబడ్డ చాగంటి భాస్కరరావు మా వూరు వచ్చాడు. ఆ విప్లవమూర్తితో తర్వాత ఎప్పటికో ఒక అడుగు దగ్గరకు జరిగాను. విఠల్ నిష్క్రమణతో నిజమైన హితాభిలాషిని పోగొట్టుకున్నాను. అక్షర నివాళి.
శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
Comments
Please login to add a commentAdd a comment