Vital AP
-
హితాభిలాషి ఏపీ విఠల్
తెనాలి దగ్గర వరహాపురం అగ్రహారంలో సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి, చిన్నతనం నుంచీ సమతావాదాన్ని జీర్ణించుకుని కడదాకా అదే వాదాన్ని విశ్వసిస్తూ ఆచరిస్తూ, 78వ ఏట కన్నుమూశారు డాక్టర్ ఏపీ విఠల్. నాకు పాపం పుణ్యం, శ్లేషార్థాలు తెలియని రోజుల్లో విఠల్ పంట్లాము బుష్‌కోటు వేసుకుని బిరుసైన ఉంగరాల జుత్తు దువ్వుకుని మా పెరటి చింత చెట్టుకింద కూచుని పీట చెక్కమీద దరువేస్తూ గొంతెత్తి ‘పతితులార! భ్రష్టులార! ఏడవకండేడవకండి– నేనున్నా నేనున్నా’నంటూ అభయమిస్తూ పాడే వాడు. అప్పటికి ఆటల్లో వాడే కూత పాటలే వచ్చు. ఇంకేం తెలియవ్. అయినా, పాపం మా అగ్రహారం బుడతలందరికీ ఏదో వివరించి చెప్పాలని వృథా ప్రయత్నం చేసేవాడు. ఏపీ విఠల్ నాకప్పట్నించి మొన్న జనవరి 20 దాకా సజీవ జ్ఞాపకం. తండ్రి ఉద్యోగరీత్యా ఊళ్లు తిరుగుతుంటే విఠల్ కూడా తిరిగాడు. గుంటూరు మెడికల్ కాలేజీలో చేరాడు. ఏ సెలవులు వచ్చినా విఠల్ తల్లిదండ్రి, పిల్లలతో స్వగ్రామం వచ్చేవారు. హాయిగా సేదతీరి వెళ్లేవారు. అందుకని వాళ్ల కుటుంబం ఊరికి హితంగా సన్నిహితంగా ఉండేది. మెడికో విఠల్ కూడా ఆ సెల వుల్లో మా అగ్రహారంలోనే కన్పించేవాడు. పచ్చి పల్లెటూరు కావడంవల్ల, విఠలయ్యగారు డాక్టరని పూర్తి నమ్మకంతో వచ్చి చేతులు చూపించేవారు. అంతా బీద, బిక్కి– చిన్న మందుబిళ్లకి మొహం వాచే స్థితి వారిది. వాళ్లందరికీ కూడా తెచ్చిన శాంపిల్స్ పంచేవాడు. వాళ్ల మొహాలు వెలిగిపోయేవి. విఠల య్యపై ఉన్న విశ్వాసం వాళ్ల రోగాలు తగ్గించేవి. పెద్ద ఆరోగ్య సమస్యలున్నవారు మరీ ముఖ్యంగా మావూరి మాలపల్లె, కుమ్మరిగూడెం వాసులు మా విఠలయ్యగారున్నారని ధైర్యంగా రేపల్లె–గుంటూరు రైలెక్కి వెళ్లేవారు. అక్కడి పెద్దాసుపత్రిలో విఠలయ్య పుణ్యమా అని అనుభవజ్ఞులైన ప్రొఫెసర్ల వైద్యంతోపాటు ఉచితంగా మందులు కూడా అందేవి. ఆనాడు డాక్టర్ అందించిన ఈ అమూల్యమైన సేవను ఇప్పటికీ మావూరు గుర్తు పెట్టుకుంది. పోయాడన్న విషాద వార్త విన్నప్పుడు, ‘అయ్యో! ఆ దేవుడు పోయాడా?‘ అని వూరు బావురుమంది. అప్పటికీ ఇప్పటికీ వూరి వారికి విఠల్ డాక్టర్‌గానే తెలుసు. ఆయన కమ్యూనిస్ట్ సిద్ధాంతాల వైపు పూర్తిగా మళ్లడం అవగాహన, విచక్షణా జ్ఞానం పెంపొందించుకోవడం, భావ వ్యక్తీకరణలో సూటిదనం, అందుకు తగిన తెలుగు పలుకుబడి విఠల్ సాధనతో సాధించిన అస్త్రశస్త్రాలు. పూర్తిగా విభేదించినా సౌమ్యంగా, ‘వీరితో ఏకీభవించు భాగ్యము మాకు కలుగదని’ పశ్చాత్తాపం ప్రకటించి వూరుకోవడమే డా. విఠల్ పంథా. విఠల్ నేటి తెలంగాణ సూర్యాపేటలో రెండుచేతులా వైద్యాన్ని సేవగా అందిస్తూ, విఠల్ దవాఖానాని కొండగుర్తుగా మార్చినప్పుడు అందరి దృష్టిని ఆయన ఆకర్షించారు. రాష్ట్రం పట్టనంత పేరు గుబాళింప చేసింది. అప్పుడే ఒకసారి పుచ్చలపల్లి సుందరయ్య దవాఖానాకి వచ్చారు. ఊరకే రాలేదు. మహాత్ములు ఊరక ఎందుకు వస్తారు. పూర్తి సమయం పార్టీకి అంకితం చెయ్యాలని అడిగి ఒప్పించి తీసుకెళ్లడానికి వచ్చారు. చాలా చిన్నతనంలోనే పీఎస్ భావ ప్రభావాలకు సంపూర్ణంగా లొంగిపోయిన విఠల్ ఆయన పిలుపుని గొప్ప పురస్కారంగా భావించారు. ఆ తర్వాత విఠల్ తండ్రికి సంగతి చెప్పారు. ‘మీరూ పెద్దవారు. మావాడూ తెలిసినవాడు. మీ ఇద్దరికి ఇష్టమైతే నాదేముంది’ అంటూ పరోక్షంగా తన అనుమతి తెల్పారు. ఆ తర్వాత విఠల్ తల్లితో ప్రస్తావించారు పుచ్చలపల్లి. ‘ఆమె పెద్దగా చదువుకున్నది కాదు. పిల్లలగన్న తల్లి. సంప్రదాయాల నడుమ వొద్దికగా పెరిగిన హైందవ గృహిణి. ‘మీ అబ్బాయిని మీ అనుమతితో తీసికెళ్లడానికి వచ్చానమ్మా’ అన్నాడాయన సాదరంగా. వెంటనే ఆమె, ‘మీరు చాలా పెద్దవారు. మీరడిగిన తీరు చూస్తుంటే ఆనాడు విశ్వామిత్రుడు దశరథుని దగ్గరకొచ్చి యాగరక్షణ కోసం రాముణ్ణి తీసుకువెళ్తానన్నట్టుంది. మేమేం చెప్పగలం’ అంటూ తల్లి కళ్లు తుడుచుకుంది. ఇది సుందరయ్య ఊహించని జవాబు. తర్వాత విఠల్‌తో, ‘చూడవయ్యా మన పురాణ ఇతిహాసాలు సాధారణ గృహిణుల మనసుల్లో సైతం ఎంతగా నాటుకుపోయాయో’ అని వ్యాఖ్యానించారట. చివరకు విశ్వామిత్రుడులాగానే రాముడితోనే కదిలాడు. తర్వాత డాక్టర్ విఠల్ ప్రజాశక్తి సంపాదక వర్గంలో కీలకపాత్ర వహించారు. ప్రజానాట్యమండలికి ప్రాతినిధ్యం వహించారు. సుందరయ్యకి, లీలమ్మకి ఆప్తుడైన విఠల్ పద్నాలుగేళ్లు పీఎస్‌కి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. ‘విప్లవపథంలో నా పయనం’ పేరిట సుందరయ్య జీవిత కథ గ్రంథస్తం చేశారు. తెలుగు పత్రికలన్నీ ఏపీ విఠల్ అక్షరాల్ని, అభిప్రాయాల్ని కడదాకా గౌరవించాయి. డాక్టర్ కె. రామచంద్రమూర్తి, మురళి సాక్షి దినపత్రిక పక్షాన విఠల్‌ని ఎంతగానో సమాదరించారు. డాక్టర్ విఠల్ పెళ్లికి నరుడో, భాస్కరుడో అని కీర్తించబడ్డ చాగంటి భాస్కరరావు మా వూరు వచ్చాడు. ఆ విప్లవమూర్తితో తర్వాత ఎప్పటికో ఒక అడుగు దగ్గరకు జరిగాను. విఠల్ నిష్క్రమణతో నిజమైన హితాభిలాషిని పోగొట్టుకున్నాను. అక్షర నివాళి. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన విఠల్
ఆటోనగర్ (విజయవాడ తూర్పు) : నమ్మిన సిద్ధాం తం... ఆశయానికి జీవితంలో చివరి క్షణం వరకు కట్టుబడిన మహావ్యక్తి డాక్టర్ ఏపీ విఠల్ అని మంత్రి జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం విజయవాడ పటమటలోని భద్రయ్యనగర్‌లో విఠల్ పార్దివదేహానికి మంత్రి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. సూర్యాపేటలో పేదలకు పైసా ఆశించకుండా వైద్యం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయం ఉందంటూ అనేక వ్యాసాలు రాశారన్నారు. సాక్షి దినపత్రిక ఎడిటర్ వర్ధెల్లి మురళి మాట్లాడుతూ.. నిజాయితీ, నిబద్ధత, నిస్వార్థం కలిగిన వ్యక్తి విఠల్ అని అన్నారు. ఆయన మృతి ప్రజాస్వామ్యవాదులకు తీరని లోటు అని ఆయన అభివర్ణించారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు కె.రామచంద్రమూర్తి, ౖజానపద కళాకారుడు గోరటి వెంకన్న తదితరులు విఠల్ మృతదేహానికి నివాళులర్పించారు. కాగా విఠల్ మృతదేహాన్ని గన్నవరంలోని పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాలకు అప్పగించినట్లు ఆయన కుమార్తె సుహాసిని తెలిపారు. సీఎం జగన్ సంతాపం ఏపీ విఠల్ మృతి పట్ల సీఎం వైఎస్ జగన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి తీరని లోటు అని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
జోహార్ డాక్టర్ గారూ..!
ఏడాది క్రితం విస్సన్నపేటలో నేను ఆయన్ని కలిశాను. ఎక్కువ అడుగులు నడవలేని స్థితిలో ఉన్నారాయన. అయినా రోడ్డు మీదకి వచ్చి నన్ను కౌగలించుకుని ఇంట్లోకి తీసుకుని వెళ్ళారు. ఏమైనా ఈ ముసలితనం చాలా కష్టమయ్యా అన్నారు. అప్పుడు ఆయన కళ్ళలో నీరు చూశాను. ఎందుకు ఇలా ఈడ్వాలి ఈ దేహాన్ని అని ఇంకో మాట. ఎవరెవరో వృద్ధాప్యం వద్దనుకుని తనువులు చాలించిన ఉదాహరణలు చెప్పారు. ఏమిటి సార్ మీరిలా మాట్లాడుతున్నారు? అని కొంచెం కంగారుపడుతూ అన్నాను. తెరలు తెరలుగా నవ్వారు. ఏవయ్యా నేనలా చెయ్యనులే అని మరీ నవ్వారు. హమ్మయ్య అనుకున్నాను. మీరు రాయాల్సింది బోలెడు వుంది. రాయండి అన్నాను. అన్నానే గాని, కొందరిని ముసలితనంలో చూడకూడదు అని మనసులో అనుకున్న మాట మాత్రం మనసులోనే దాచుకున్నాను. ప్రవాహంలాంటి మనిషిని ఎండిపోయిన నదిలా ఎలా చూడగలం? ఆయనలా నవ్వుతూనే వున్నారు. ఏవేవో చెప్తూ గుర్తు చేసుకుంటూ నవ్వుతూనే వున్నారు. ఆయన నవ్వు భలే వుండేది. పెదాల చివరగా నవ్వితే కళ్ళలో వెలుగులు చిమ్మేవి. ఎప్పుడూ విఠల్ గారూ అనేవాళ్ళమే తప్ప ఏ అంటే ఏమిటి? పి అంటే ఏమిటి అని ఆలోచించలేదు. ఏపీ విఠల్ అంటే ఆదుర్తి పాండురంగ విఠల్ అని ఈరోజే తెలిసింది. ఆయన వెళ్ళిపోయారన్న వార్తలో ఆయన పూర్తి పేరు కలిసి కనపడితే గుండెలో ఎక్కడో నీటి కెలక చప్పుడైంది. సూర్యాపేట నుంచి విజయవాడ దాకా ఆయనను ఒక మంచి డాక్టర్‌గా ఎంతమంది గుర్తుపెట్టుకున్నారో కాని, ఆయన మంచి మార్క్సిస్టు డాక్టరుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి చాలాకాలం గుర్తుండిపోతారు. ఆయనిప్పుడు లేరు. ఇక ఆయన గతమైపోయారు. ఎవరైనా వర్తమానం నుంచి గతంగా మారిపోవాల్సిందే కదా. వారి జీవితం..వారి ఆలోచనలు..వారి ఆచరణ వారి గతాన్ని కూడా చెరగని వర్తమానంగా నిలిపి వుంచుతాయి. అలా విఠల్ గారు నాకెప్పుడూ వర్తమానమే. నేను బాగా ఆయనతో చనువుగా గడిపింది ప్రజాశక్తిలో సబ్ ఎడిటర్‌గా పనిచేసినప్పుడు. నేను రాసిన ప్రతి అక్షరాన్నీ ఆయన కళ్ళనిండా ఆప్యాయతతో మెచ్చుకునే వాడు. నేను రాసినదానికి ఎప్పుడైనా అడ్డంకి వస్తే సరాసరి ఆయన దగ్గరికే పరిగెత్తేవాడిని. ప్రజాశక్తిలో నేను చేరిన కొద్దిరోజులకే శ్రీశ్రీ మీద నేను రాసిన వ్యాసంతో ఆయనకూ నాకూ మధ్య ప్రేమ మొదలైంది. ఆ తర్వాత కాలం తిప్పిన మలుపులు ఆయనకూ చాలా ఉన్నాయి, నాకూ చాలా ఉన్నాయి. కానీ ఏ మలుపూ మా మధ్య ప్రేమకు అడ్డు రాలేదు. నాకు బాగా గుర్తు. ఆయన నవ్వుతూ నవ్వుతూ కన్నీళ్ళు పెట్టుకుంటారు. అది నవ్వుతో వచ్చే కన్నీరు కాదు ద్రవించే మనసు చేసే మాయ.సుందరయ్యగారు చనిపోయినప్పుడు మొదటి పేజీ మేకప్ చూసే భాగ్యం నాకు దక్కింది. అప్పుడు సగం పేజీ నేను రాసిన రైటప్ అందరికీ గుర్తే. ఆయన నన్ను కౌగలించుకుని కన్నీళ్ళతో తడిపిన తడి కూడా గుర్తే. ఇలాంటి జ్ఞాపకాలే చాలా ఉన్నాయి. మొన్న మొన్నటి దాకా పత్రికల్లో నేను రాసింది ఏది చదివినా పనిగట్టుకుని ఫోను చేసి చాలాచాలా సేపు మాట్లాడేవారు. నా గొడవ అలా ఉంచితే ఆయన గురించి చెప్పుకోవాలంటే చాలా వుంది. ఆయనతో సన్నిహితంగా గడిపిన పార్టీ మిత్రులు ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఆయన తార్కిక శక్తి..ఆయన మేధస్సు..ఆయన జ్ఞానం..ఆయన రచనా నైపుణ్యం..ఆయన నిష్కల్మషత్వం.. నమ్మిన దాన్ని నిష్కర్షగా చెప్పే నిజాయితీ ఆయన నవ్వులాగే ఆయన్ని ప్రత్యేకంగా నిలబెట్టే గుణాలు. సుందరయ్యగారి చివరి రోజుల్లో ఆయన వెన్నంటి ఉన్న విఠల్, సుందరయ్యగారి ఆత్మకథ రాయడమే కాదు, సుందరయ్య ఆత్మను కూడా చాలా దగ్గరగా అర్థం చేసుకున్నారు. పార్టీ కోసం సుందరయ్య ఆత్మ కథను రాసినా తనకు తెలిసిన సుందరయ్య గురించి మరిన్ని విశేషాలతో ‘నాకు తెలిసిన కామ్రేడ్ సుందరయ్య’ అని మరో పుస్తకం రాసి సుందరయ్యను మనందరికీ మరింత దగ్గరగా తీసుకు వచ్చారు. మరో నాలుగు పుస్తకాలు అచ్చులో ఉన్నట్టు శ్రీశ్రీ విశ్వేశ్వర్రావు గారు చెప్పారు. ఆయన అనేక సందర్భాలలో అనేక అంశాల మీద ‘సాక్షి’ తదితర పత్రికల్లో రాసిన వ్యాసాలు వందలాదిగా వుంటాయి. మనుషులు చెప్పే తీర్పులు వేరు, కాలం ఇచ్చే తీర్పు వేరు. మారుతున్న కాలంలో మారుతున్న నైజాల నిజాల ఇజాల మీద ఆయన చేసిన తీర్పులు మాత్రం అందరూ చదవాలి. వాటిని ముద్రించి ఎవరైనా భద్రపరిస్తే చరిత్రకు మేలు చేసినవారవుతారు. ఎవరూ సర్వ సంపూర్ణులు కారన్న సత్యాన్ని అంగీకరిస్తే ఆయన్ని కూడా అనేక కారణాల రీత్యా అంగీకరించక తప్పదు. పాఠాలూ, గుణపాఠాలూ అవసరమన్న విషయాన్ని మనం ఆమోదిస్తే విఠల్ గారి నుంచి కూడా కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. కొన్ని గుణపాఠాలూ తెలుసుకోవచ్చు. విఠల్ గారిని విఠల్ గారిలానే ప్రేమించిన వారు అనేకులు ఇంకా పార్టీలోనూ పార్టీ వెలుపలా అశేషంగా ఉన్నారు. బహుశా ఆయన పార్టీలో ఉండి వుంటే ఆయన అంత్యక్రియలకు వేలాదిగా తరలివచ్చి వుండేవారు. పెద్ద బహిరంగ సభ జరిగేది. పాటలు.. ఉపన్యాసాలు మారుమోగేవి. కానీ చనిపోయిన వారికి అవేం తెలుస్తాయి? బతికినంతకాలం తాను ఒక మంచి కమ్యూనిస్టుగానే బతికారు. సుందరయ్యగారు వచ్చేయ్ అంటే సూర్యాపేటలో అద్భుతంగా సాగుతున్న హాస్పిటల్ని వదిలేసి విజయవాడ చేరుకున్నారు. సమాజానికి వైద్యం చేసే పనిలో తన వైద్యం కొంత నిర్లక్ష్యం చేసే వుంటారు. సొంత లాభం అంతా మానుకుని డాక్టర్ విఠల్ అన్న పేరు మాత్రం వెనకేసుకున్నారు. మార్క్సిస్టులతో విభేదాలు వచ్చినా మార్క్సిజాన్ని తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూనే వున్నారు. అదే వెలుగులో సమస్తాన్నీ విశ్లేషించుకుంటూ వచ్చారు. మెజారిటీ మత ఫాసిజాన్ని నిర్ద్వంద్వంగా ఖండించారు. ఎన్ని విభేదాలున్నా పార్టీ నాయకులతో తన సంబంధాలను సజీ వంగా కొనసాగిస్తూనే వచ్చారు. వైద్యం చేసేటప్పుడు తరతమ భేదాలు ఎలా వుండకూడదో.. సత్యాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడూ అంతే నిష్పాక్షికంగా, నిర్భయంగా ఉన్నారు. ఎ.పి. విఠల్ లాంటి డాక్టర్లు ఈ కాలంలో ఇంకా అవసరం. ఎవరి లోటునూ పూడ్చలేం. కానీ, విఠల్‌గారి లాంటి వ్యక్తులు లేని లోటును అసలు పూడ్చలేం. విఠల్‌గారూ మీకు నా జోహార్లు. డా‘‘ ప్రసాదమూర్తి వ్యాసకర్త ప్రముఖ కవి, 84998 66699 -
చంద్రబాబుతో చెలిమి అనర్థదాయకం
అంతా బాగుంది అని మన దేశ ప్రధాని అమెరికా వెళ్లి మరీ ఆనందంగా నినదించారు. అమె రికా అధ్యక్షుడు ట్రంప్‌తో సహా వేదిక మీద ఉన్న పెద్దలు, ఎదు రుగా కూర్చున్న మన ప్రవాస భారతీయులు, నమో, నమో అని నిత్యం జపించే, అక్కడి శ్రోతలూ, ఎక్కడెక్కడినుంచో ఆ సభ ఏర్పాట్ల కోసం, తదితర ప్రచార కార్యక్రమాల పర్యవేక్షణకు వెళ్లిన బీజేపీ కార్యకర్తలు హర్షధ్వానాలు చేశారు. సభాస్థలికి వెలు పల కొందరు చేరి, ఇక్కడి బీజేపీ పాలనకు అసమ్మతి తెలు పుతూ నినదిస్తున్నారు. ఆ సభాస్థలిలో సైతం కొందరు ఏమిటీ ఈయన అంతా బాగుంది అనుకుంటున్నారు. ఎవర్ని గురించి? ఈ సభకు వచ్చిన వాళ్లను ఉద్దేశించి ట్రంప్‌ని దృష్టిలో ఉంచుకునా? అమెరికాను గురించా? లేదా తాను ప్రధానిగా ఉన్న భారత దేశాన్ని గురించా? అని అయోమయంగా చూశారట. ఎంత బీజేపీ వాడైనా, అదీ ఆర్ఎస్ఎస్ భూమిక ఉన్నవాడైనా, అంతా బాగుంది అని ఎలా అనగలరు అనుకున్నారు. రెండేళ్ల క్రితం మోదీ తీసుకున్న నిర్ణయం పెద్దనోట్ల రద్దు. నేటికీ కోలుకోలేనంతగా పేద మధ్యతరగతి ప్రజా నీకాన్ని ఏదో మేరకు వేధిస్తోంది కదా! ఆనాడు మూతప డిన ఎక్కువమందికి ఉపాధి చూపే చిన్న మ«ధ్యస్థాయి పరి శ్రమలు, చిన్ని చిన్ని దుకాణదారులు, చేతివృత్తులవారు తమ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తమై జీవన ప్రమాణాలు దిగ జారి కునారిల్లుతున్నారు కదా. అంతెందుకు.. తమ వద్ద అప్పటికే ఉన్న, అయిదో పదో పెద్దనోట్లను నిర్ణీత గడువు లోగా మార్చుకుందామని ఆంజనేయుడి తోకవంటి క్యూలై న్లలో నిలబడి, సాధారణ జనం వందమందికి పైగా ఆ లైన్లలో నిలబడలేక అసువులు బాశారు కదా! కనీసం ఆ చర్యవల్ల బాధితులైన వారికి క్షమాపణ చెప్పని మోదీ, ఆయన భజన బృందం అది ఎంతో సాహసవంతమైన చర్య, దానివల్ల పన్నుకట్టే వారి సంఖ్య పెరిగిందని జబ్బలు చరుచుకుంటున్నారు. మనలో మనమాట. ఈ సంవత్సరం పన్నుల రాబడి కేంద్రానికి 1 లక్ష 40 కోట్ల మేర తగ్గిందట కదా.. అయినా సరే మోదీగారికి ‘అంతా బాగుంది’. ఉగ్ర వాదులకు, తీవ్రవాదులకు పెద్ద నోట్ల రద్దు వల్ల ఆ కరెన్సీ దొరక్క వారి అకృత్యాలకు అడ్డుకట్ట పడుతుందని మోదీ ఆనాడు చెప్పారు కదా! కానీ సీమాంతర ఉగ్రవాదం తీవ్ర వాదం ఆ పెద్దనోట్ల రద్దు తర్వాత పెరగడమే కాదు.. వారి దాడులలో మరణిస్తున్న మన భారతీయుల సంఖ్య అంత కంతకూ పెరుగుతూనే ఉందని వారి సర్కారు లెక్కలే చెబు తున్నాయి. అయినా సరే ‘అంతా బాగుంది’. 2004 ఎన్నికలకు ముందు కూడా నాటి వాజ్‌పేయి గారి బీజేపీ ప్రభుత్వాన్ని కూడా షైనింగ్ ఇండియా (భారత్ వెలిగిపోతోంది) అని ములగచెట్టు ఎక్కించారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కూడా తనపై అలి పిరిలో నక్సలైట్ల దాడికి గురై బతికి బయటపడిన నేప థ్యంలో.. తన చరిష్మాకు తోడు దాడివలన తనపై ప్రజల్లో ఉన్న సానుభూతి రెండూ కలిసి తన వెన్నుపోటు పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చి తానే సీఎం అవుతానన్న స్వార్థ బుద్ధితో ముందుగానే జమిలి ఎన్నికలకు వెళ్లాలని వాజ్ పేయిపై ఒత్తిడి తెచ్చారు. తీరా ఎన్నికలు జరిగాయి. ‘నీనుంచి నే చెడితినే’ అన్నట్లు చంద్రబాబుతోపాటు పాపం వాజ్‌పేయి కూడా పదవీ భ్రష్టత్వం పొందారు. ఇక చంద్రబాబు పదేళ్లపాటు హైదరాబాద్‌లో ఉండే అవకాశం ఉన్నా– ఏపీ నూతన రాజధాని అభివృద్ధి అంతా దగ్గరుండి చూసుకోవాలి కదా అనే వంకతో ఓటుకు కోట్లు కేసులో కన్నంలో దొంగలా దొరికిపోయి, తెలంగాణ సీఎం కేసీఆర్ దెబ్బకు భయపడి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చి, కృష్ణా కరకట్టపై ‘లింగమనేని’ వారి రియల్ ఎస్టేట్ గెస్ట్‌హౌస్‌లో ఉంటున్నారు. అద్దెకు ఉంటున్నారో, అది భూసమీకరణలో వచ్చిన ప్రభుత్వ భూమో ఆయన స్పష్టం చేయలేదు. అదనీ, ఇదనీ రెంటికీ చెడింది ఆయనే. మంగళ గిరి ఎమ్మెల్యే వైఎస్సార్సీపీ నాయకుడు రామకృష్ణారెడ్డికి ఆ అమరావతి ప్రాంతమంతా కొట్టిన పిండి. కనుకనే మొన్న కృష్ణా నదికి 2009 తర్వాత దాదాపు అంత వరద వస్తే సహ జంగా రాజధాని కరకట్ట ప్రాంతా లలో ప్రజలకు అండగా నిల బడ్డారు. అప్పుడే చంద్రబాబు ఉంటున్న ఇల్లు కూడా వరద తాకిడికి గురయ్యే ప్రమాదం ఏర్పడింది. బాధ్యతగల శాసనసభ్యునిగా, ప్రతిపక్షనేత ఇంటికి ముప్పు రాకుండా చూడాలని మరింత శ్రద్ధగా పర్యవేక్షించారు. లేకుంటే ‘నా కొంప మునుగుతున్నా పట్టించుకోలేదు’ అంటూ చంద్ర బాబు, గోబెల్స్ ప్రచారం చేస్తారు గదా! ఎంతకయినా దిగ జారగలరు. అయ్యా బీజేపీ వారూ.. మీ కేంద్ర రక్షణమంత్రి రాజ్ నాథ్‌సింగ్ గతంలో ఒకసారి, బాబు ఎక్కడికి వెళ్లారు? ఆయనదీ మాదీ విడదీయరాని బంధం అని అన్నారు. ఇంతవరకు బాబుతో బీజేపీ, కమ్యూనిసులు, టీఆర్ఎస్ చివరకు కాంగ్రెస్...ఇలా అందరూ ఏదో సందర్భంలో కలిసి ఊరేగినవారే. నిజం ఏమిటంటే, బాబుగారితో చేయి కలిపితే చాలు ఆ మిత్ర పార్టీలన్నీ మటాషే మరి! ఇటీవల బాబుగారు ‘మూడేళ్లలో జమిలి ఎన్నికలు వస్తాయని’ ఆశపడుతున్నారు. జగన్మోహన్రెడ్డి ప్రజా నురంజక, పారదర్శక పాలనపై అసందర్భ, కువిమర్శలు చేస్తున్నారు. ఇటీవల మరణించిన కోడెల శివప్రసాద్‌ను తన అప్రజాస్వామిక అవినీతి పాలనకు వాడుకున్నంత మేరకు వాడుకుని తీరా ఆయనపై, ఆయన కుమారుడు, కుమార్తెలపై తెలుగు తమ్ముళ్లతో సహా దాదాపు 20 కేసులు పెడితే, ‘కోడెల వలన తమ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిం దని’ తన పార్టీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య చేతనే బహిరంగంగా విమర్శలు చేయించారు బాబు. కోడెలను పార్టీ నుంచి బహిష్కరించాలని లీకులు కూడా ఇచ్చి, తన చర్మం రక్షించుకునేందుకు కోడెల శివప్రసాద్‌ను అవ మానం చేయదల్చిన బాబు తీరా కోడెల మృతి అనంతరం ‘చచ్చినవాడి కళ్లు బారెడు’ అన్నట్లు కోడెల మృతిపట్ల ఎన లేని సానుభూతి కురిపిస్తున్నారు. అప్పుడప్పుడూ బీజేపీ నాయకులలో కొందరు సైతం నేటి వైఎస్సార్సీపీ పాలనపై పాత స్నేహం కారణంగానూ, తనకేమైనా అవకాశవాద రాజకీయ ప్రయోజనాలేమన్నా ఉన్నాయో, లేదా సామాజిక ఆర్థిక సంబంధాలున్నాయేమో గానీ, చంద్రబాబు ఆరోపణలను వల్లెవేస్తున్నారు. సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి వారిని తమ పార్టీలో చేర్చుకుని, వారితో పనికి మాలిన విమర్శలు జగన్ పాలనపై, జగన్‌పై చేయిస్తున్నారు. బాబుకు తన వెన్నుపోటు పార్టీ ఉన్నా, లేకున్నా పెద్ద బాధ లేదు. కానీ తన వ్యక్తిగత రాజకీయ రక్షణ కోసం బీజేపీతో కలిసినా కలుస్తారాయన! డాక్టర్ ఏపీ విఠల్ వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు మొబైల్ : 98480 69720 -
కొంపముంచే రాజకీయాలేనా బాబూ?
ఇటీవల ఏపీ రాజధాని ప్రాంతంపై కృష్ణానదికి వచ్చిన వరదలు మానవ కల్పితమని, వైఎస్ జగన్ ప్రభుత్వం తన కొంప మునగాలనే వీటిని సృష్టించిందని పదే పదే ఆరోపించారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. కృష్ణానదికి వరదలే రావు.. వచ్చినా ఏ ప్రాంతం మునగదు కనుక రాజధానికి ఏ ప్రమాదమూ ఉండదు అని మాత్రమే చెప్పదల్చుకున్నారు బాబు. ఖర్మం చాలకపోతే తాడే పామై కరుస్తుందన్నట్లు కృష్ణమ్మకు వరద వచ్చిన సందర్భంలో చంద్రబాబు నివాసంలోకీ, సుందర లేక్ వ్యూ ఎక్స్టెన్షన్ లోని ఆయన ఇంట్లోకి నీళ్లు రానే వచ్చాయి. రాజధానిలో వరదపైనే కాదు సందు దొరికితే చాలు జగన్ ప్రభుత్వంపై నిందలేయడానికి పూనుకుంటున్న చంద్రబాబును, ఆయన తనయుడు, ఇతర వందిమాగధులను జనం చూస్తూనే ఉన్నారని మర్చిపోవద్దు. తమ వెన్నంటి నిలిచేవారెవరో ప్రజలు సరిగ్గానే నిర్ధారించుకోగలరు. అమరావతి రాజధాని గురించి ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖామాత్యులు బొత్స సత్యనారాయణ ఒక ప్రకటన చేశారు. ’రాజధానికి అమరావతి అనువైనది కాదు. లోతట్టు ప్రాంతం! కొండవీటి వాగు కాదు.. కృష్ణానదికే 2010లో మాదిరి వరదలు వస్తే మునుగుతుంది, బిల్డింగులు కట్టాలంటే చాలా లోతుకు పునాదులు తీయాలి, ఖర్చు పెరుగుతుంది విభజన సందర్భంగా ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీ కూడా ఇక్కడ కాదు.. దొనకొండ ప్రాంతం మేలు అన్నది. పైగా రాజధాని ఒక ప్రాంతానికో, ఒక సామాజిక వర్గానికో (కులం బదులు) మాత్రమే చెందింది కాదు. పదమూడు జిల్లాల్లోని అయిదు కోట్లమంది తెలుగు ప్రజలకు చెందింది’’ అంటూ మంత్రి బొత్స ఉన్నమాటే అన్నారు. ఆ ప్రకటనలో ఎక్కడా రాజధానిని అమరావతి నుంచి మా ప్రభుత్వం మారుస్తుంది అని చెప్పలేదు. అయితే ఇప్పటికే నిండా మునిగిన చంద్రబాబుకు ఏదో ఆందోళన, భయమూ ఆరంభమయ్యాయి. పైగా మొన్న కృష్ణానదికి వరద వస్తే 2010లో అంతస్థాయికి కొంచెం తక్కువగా వరద వచ్చినా అక్కడే కరకట్టమీద లింగమనేని బడా రియల్ ఎస్టేట్ వారి గెస్ట్ హౌస్‌లో తాను నివాసం ఉంటున్న భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లోకి నీళ్లు వచ్చాయి. ముందుచూపుతో, తన కొంప మునుగుతుందేమో అన్న భయానికి హైదరాబాద్‌కు ముందుగానే మకాం మార్చారు బాబుగారు. అంతకుముందే ప్రస్తుత ప్రభుత్వం బాబుగారి నివాసానికి, ఆ కరకట్టమీద అక్రమంగా, ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్మించిన మరికొందరు పెద్దలకు కూడా తక్షణం ఖాళీ చేయాలని నోటీసులిచ్చింది. ఖర్మం చాలకపోతే తాడే పామై కరుస్తుందన్నట్లు కృష్ణమ్మకు వరద వచ్చిన సందర్భంలో చంద్రబాబు నివాసంలోకీ, సుందర లేక్ వ్యూ ఎక్స్‌టెన్షన్‌లోని ఆయన ఇంట్లోకి నీళ్లు రానే వచ్చాయి. ఎలాంటి విపత్కర పరిస్థితినైనా అవకాశంగా మార్చుకోగల సమర్థుడనీ, స్వోత్కర్ష చేసుకుంటారు కదా బాబుగారు. అందులో భాగంగానే ఆ వరదలు మానవ కల్పితమనీ, జగన్ ప్రభుత్వం తన కొంప మునగాలనే వరదలు సృష్టించిందనీ ఇలా మాట్లాడారు బాబు. కృష్ణానదికి వరదలే రావు, వచ్చినా ఏ ప్రాంతం మునగదు కనుక రాజధానికి సాంకేతిక నిపుణులు చెబుతున్నట్లు ఏ ప్రమాదమూ ఉండదు అని మాత్రమే చెప్పదల్చుకున్నారు బాబు. పైగా తన మాటను నమ్మి 33 వేల ఎకరాల భూమిని రైతులు భూసేకరణలో ఇచ్చారని తనపై వారికున్న విశ్వసనీయత గురించి సొంతడబ్బా వాయించుకున్నారు. నిజం నిప్పులాంటిదెప్పుడూ.. అది దహించక తప్పదు అన్నట్లు బాబుగారి పాలనలో వేంకటేశ్వరునికే శఠగోపం పెట్టడం దగ్గర నుంచి గత అయిదేళ్ల పాలన మొత్తం అవినీతిమయం అనీ అది రాజధాని భూములు, సదావర్తి సత్రంభూములు, అగ్రిగోల్డ్ బాగోతమూ, పట్టిసీమ నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, అమరావతి ప్రాంతానికి రోడ్లు, ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఇసుక, చెట్టు–నీరు, ఇలా చేపట్టిన ప్రతి ప్రతిపాదనలో బాబు గారి పాలనలో తాను నొక్కేసిన వాటిని ప్రస్తావన చేయడం ఆ ఆదిశేషుడికే సాధ్యం కానప్పుడు ఇక నావల్ల ఏమవుతుంది? అయినా మానవమాత్రుడు ఎవరూ చేయజాలని దుర్మార్గ ప్రచారం బాబు చేశాడు. అమరావతి ప్రాంతంలో భూములివ్వని వారి తోటల్ని తమ పార్టీవారిచేతనే తగులబెట్టించి ఆ నేరాన్ని నాటి ప్రతిపక్షపార్టీ వైఎస్సార్ సీపీ పైకి నెట్టారు. అంతకు మించి కాపునేత ముద్రగడ పద్మనాభం గారి ఆందోళన సందర్భంగా రైలు రైలునే పట్టాల మీద తగులబెట్టించి ఆ పని కడప రౌడీల పని అని కారుకూతలు కూసిన బాబుగారి దుష్ప్రవర్తన మర్చిపోగలమా? ఇక సింగపూర్ వారి సహకారంతో ఆయన కట్టించిన 50, 60 అంతస్తుల ఎత్తు ఆకాశ హర్మ్యాలు, వందల సంఖ్యలో ఐకాన్ బ్రిడ్జిలు, నందనవనాలు, పద్మసరస్సులూ, బాహుహలి భారీ సెట్టింగులు ఇవన్నీ వేలాది కోట్ల రూపాయల ఖర్చుతో కట్టించినవి కదా! అమరావతి రాజధాని మారిస్తే ఈ ప్రజాధనం వృథా కాదా అని ఊహాలోక విహారిగా తాను ప్రశ్నిస్తూ తన పెయిడ్ ఆర్టిస్టులచేత ప్రచారం చేయిస్తున్నారు బాబు. అసలింతకూ మామూలు వాన కురిస్తేనే అసెంబ్లీ భవనం, పైకప్పులూ, సీలింగులు కూలిపోయే ఒక పాలనా భవనం, ప్రతిపక్ష నేతకు కేటాయించిన గదుల సముదాయం ఇవన్నీ వానకు చిన్న చెరువుల్లా మారుతున్నాయి. ఇక హైకోర్టు భవనం న్యాయమూర్తులకు నివాస గృహాలు ఇత్యాది తాత్కాలిక భవనాలు భూమ్మీదే ఉన్నాయి కానీ మిగిలిన కలల కట్టడాలు, సింగపూర్ తరహా అతిగొప్ప భవనాలు ప్లానులూ ఇవన్నీ ఆర్ట్ గ్యాలరీలలో ప్రదర్శనార్థం ఉన్నాయి. పాలనాపరమైన రాజధానికి 33 వేల ఎకరాల భూమి అనవసరం. గుర్రం నాడా దొరికిందని గుర్రాన్ని, బండినీ కొనుక్కుంటే కొరివితో తలగోక్కున్నట్లే. ఆశలు చూపి, అభ్యంతరాలు పెట్టి రైతులను అది రించి, బెదిరించి బలవంతంగా మామూలు రైతుల నుంచి భూములు లాక్కుని వాటిని తన పార్టీవారికి, బినామీలకు, సింగపూర్‌లోని కోటీశ్వరులకు రియల్ దందా కోసం కట్టబెట్టేందుకా? బాబుగారి ఇంతటి కలల రాజధాని అవసరం ఉందా? అయినా ఇంకో 50 సంవత్సరాలకు అమరావతి ప్రపంచంలోనే అత్యంత గొప్ప నగరంగా మారుతుందట. కానీ అంత ‘ఫ్లో’ అక్కర లేదు సారూ, ప్రజల రాజధాని అవసరాలకు సరిపడా, అక్రమంగా పెరిగే జనాభాకు అనువైన రాజ ధాని విస్తరిస్తూ వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. అన్నింటికీ మించి అభివృద్ధి అంతా అమరావతి రాజధానికే పరిమితం చేయడం అంత బుద్ధి తక్కువ పని మరొకటి ఉండదు. మళ్లీ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రత్యేక ఉద్యమాలకు బీజం వేయడమే అవుతుంది. హైకోర్టు ఒక ప్రాంతంలో, ఇతర వ్యాపార, వాణిజ్య సముదాయాలు ఒకచోట నిర్మించవచ్చు. పారిశ్రామిక ప్రాంతంగా మూడుపంటల మాగాణీ ఎందుకు? దాన్ని మెట్టప్రాంతాలకు తరలించవచ్చు. వాణిజ్యానికి విశాఖపట్నం ఉండనే ఉంది. అలాగే గోదావరి జిల్లాల్లో పంటల ఆధారిత పరిశ్రమలు, గుంటూరు–విజయవాడ నగరాల్లో ఇప్పటికే ఉన్న అభివృద్ధికి తోడు పైవాటిని జోడించడం ద్వారా మొత్తం పాలనలో అభివృద్ధి వికేంద్రీకరణ చేయవచ్చు. అమరావతి, పోలవరం ఇవన్నీ జనానికి చూపించి ఇసుక, సిమెంట్, మట్టి బొక్కడమే కాకుండా పోలవరం ప్రాజెక్టు, అభివృద్ధి పేరుతో తన బినామీల అక్రమ సంపాదనకు వాడుకోవాలని బాబుగారు సిద్ధమయ్యారు. ఇక మళ్లీ గెలవడం అసాధ్యం కనుకనే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్లు 2014–19 మధ్యనే తన వారి ధనదాహం తీర్చుకునేందుకే బాబుగారు వ్యవహారం నడిపారని అర్థమవడం లేదూ? ఇవన్నీ వివిధ కమిషన్లు, నిపుణుల బృందాలు జరుపుతున్న విపులమైన విచారణలో వెల్లడి కావడం ఖాయం. అందుకే అసత్య పూరిత వ్యతిరేక ప్రచారానికీ, బూటకపు నాటకీయ ఉద్యమాలకు బాబు తెరలేపుతున్నారు. పైగా వైఎస్సార్సీపీ బాధితుల కోసం అంటూ పల్నాడులో పునరావాస కేంద్రం ఏర్పర్చి చిల్లర ఆర్టిస్టులతో కథ రక్తి కట్టిస్తున్నారు. ఇక కోడెల శివప్రసాద్ కూలిన కోట ప్రాంతంలో మరొక పునరావాస కేంద్రం ఏర్పరిస్తే హైక్లాస్ వెన్నుపోటు పార్టీ దోపిడీ దొంగలకు, అవసరమైతే తన ఆత్మీయులకూ తగినదవుతుంది. మరోవైపున చంద్రబాబుతోపాటు పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ నేతలు కూడా పగటి కలలు కంటూ సంధిమాటలు మాట్లాడటం ఆపటం లేదు. వీరంతా కలిసి కానీ విడిగా కానీ జగన్ పాలనపై లేనిపోని కట్టుకథలు, పెయిడ్ ఆర్టిస్టుల ప్రచారాలు, ప్రజల కోసం గాక అశాంతి రేపటం కోసం ఉద్యమాల పేరున అరాచక అల్లర్లు సృష్టించే ప్రమాదం లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు మూణ్నెళ్ల తన పాలనలో, నడివయస్సు ఇంకా రాకపోయినా ఎంతో పరిణితితో, హుందాతనంతో వైఎస్ జగన్ వ్యవహరిస్తున్నారు. అల్పుల ఆక్రోశపు ఆర్భాటాలకు, వారి అబద్ధాల గావుకేకలకు ఆయన ఏమాత్రం చలించడం లేదు. పాదయాత్ర సందర్భంగా తాను నేర్చుకున్న పాఠాలు, ఆ ప్రజల జీవితాన్ని మెరుగుపర్చేందుకు నిర్దేశించుకున్న కర్తవ్యాలు, నవరత్నాలు, రాష్ట్ర వ్యావసాయిక, పారి శ్రామిక అభివృద్ధి, పోలవరం ప్రజాహిత కర్తవ్యాలు వంటివాటిపై దృష్టిపెట్టి హుందాగా పాలనా మార్గాన అప్రతిహతంగా దూసుకుపోతున్నారు. మన ప్రజలు తెలివిగలవారు. కాకిగోలలను, కారుకూతలను, స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా వ్యవహారాలను పరిశీలించి తమ వెన్నంటి నిలిచేవారెవరో ప్రజలు సరిగ్గానే నిర్ధారించుకోగలరు. ఆచరణలో తమకు అండగా, వెన్నుదన్నుగా ఉంటూ తమను పురోగమన మార్గాన నడిపిస్తున్నదెవరో అనుభవంతో తేల్చుకుంటారు. డాక్టర్ ఏపీ విఠల్ వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు ‘ మొబైల్ : 98480 69720 -
కమ్యూనిస్టుల దారెటువైపు?
మే నెల 5న కారల్ మార్క్స్ 200వ జయంతి, మే 19న పుచ్చలపల్లి సుందరయ్య 35వ వర్ధంతి సందర్భంగా భారతదేశంలో వివిధ శాఖలుగా చీలిపోయిన కమ్యూనిస్టు పార్టీలు, నేతలూ తమ సైద్ధాంతిక దృక్పథాన్ని, ఆచరణనూ, దాని ఫలితాలను ఆత్మవిమర్శా పూర్వకంగా విశ్లేషించుకోవాలి. తొలినుంచి చంద్రబాబుతో అంటకాగిన కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు అదే చంద్రబాబుకు లోపాయికారీగా మద్దతునిస్తున్న జనసేనతో చేతులు కలపడం భావ్యమేనా అని ఆలోచించుకోవాలి. త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పర్చనున్న వైఎస్సార్సీపీకి ప్రజానుకూల అంశాలలో పూర్తి మద్దతునిస్తూ, తాము అంగీకరించలేని విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ ప్రజాసమస్యల పరిష్కారంలో తమ వంతు పాత్ర పోషించాలి. ఈ మే 5వ తేదీ అంతర్జాతీయ శ్రామిక వర్గానికి తమ విముక్తికి మాత్రమే కాకుండా, ప్రతి వ్యక్తీ స్వేచ్ఛగా, చైతన్యయుతంగా తన శక్తికొలదీ పనిచేసి తన అవసరం కొద్దీ అనుభవించే కమ్యూనిస్టు వ్యవస్థకు శాస్త్రీయంగా దిశానిర్దేశం చేసిన కారల్ మార్క్స్ మహనీయుని 200వ జయంతి. అలాగే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే, తన చిన్నతనంలోనే గాంధీజీ నేతృత్వంలో సాగిన స్వాతంత్య్రోద్యమంలో ప్రజా సేవా కార్యక్రమాలతో ప్రభావితుడై, అంతటితో సంతృప్తి చెందలేక మార్క్సిజం వైపు ఆకర్షితుడై తొలితరం కమ్యూనిస్టు నేతల్లో ఒకరిగా, ఆ తర్వాత దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాతగా తన యావజ్జీవితం అణగారిన కష్టజీవుల అభ్యున్నతికై పరితపించి పోరాడిన ఆదర్శ కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య 107వ జయంతి (మే 1వ తేదీ), కాగా మే 19న ఆయన 35వ వర్థంతి కూడా. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో తమను తాము కమ్యూనిస్టులుగా భావించుకునేవారు, వివిధ కమ్యూనిస్టు పార్టీలుగా చీలిన కమ్యూనిస్టులూ, వారి నేతలూ తమ కృషినీ, తమ తమ పార్టీల సైద్ధాంతిక దృక్పథాన్నీ, ఆచరణనూ తత్ఫలితాలను ఆత్మవిమర్శనా పూర్వకంగా నిశితంగా, నిజాయితీగా విశ్లేషించుకోవలసిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో ప్రజల కోసం ప్రాణాలర్పించిన అమరజీవుల స్ఫూర్తితో వారి ఆశయసాధన కోసం నేటితరం కమ్యూనిస్టులు పునరంకితం కావలసిన సమయమిది. మార్క్స్ ‘‘మేము (ఎంగెల్స్‌తో కలిపి) అంతిమంగా సమాజ గమనం కమ్యూనిస్టు వ్యవస్థదే అని ఉద్ఘాటించాము కానీ సమాజ పరి ణామ క్రమం అన్ని దేశాల్లోనూ, నిర్దిష్టంగా అదేరీతిలో సాగిందని భావిం చరాదు. అలాగే కమ్యూనిస్టు మేనిఫెస్టోను కూడా నాడు ఇంగ్లండులో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందిన దశను, దృష్టిలో ఉంచుకుని తయారు చేశాము. వివిధ దేశాల్లో ఈ కమ్యూనిస్టు మేనిఫెస్టోను యథాతథంగా కాక, ఆయా దేశాల భౌతిక వాస్తవిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అన్వయించుకోవాలి’’ అని హెచ్చరించారు కూడా. కనుక ముఖ్యమైనది మన దేశ భౌతిక వాస్తవిక పరిస్థితి గురించి శ్రద్ధతో, సృజనాత్మకతతో కూడిన అవగాహన. ఉదా. ఒక ప్రత్యేకతను గమనిద్దాం. మన దేశం ఎంత పురోగమించినప్పటికీ, ఇంకా మధ్య యుగాల నాటి మనుస్మృతి ఆధారిత నిచ్చెనమెట్ల కులవ్యవస్థ నేటికీ ఆధిపత్యం చలాయిస్తోంది. ఈఎంఎస్ నంబూద్రిపాద్ అన్నట్లు, బానిస వ్యవస్థ స్థానంలో మన దేశంలో కులవ్యవస్థ ఘనీభవించింది. పుట్టుక ఆధారంగా ఏర్పడిన ఇంతటి తీవ్రమైన వర్ణవివక్ష ఇంకా కొనసాగడం ఎంతో సిగ్గుచేటు. వర్ణవివక్షను రూపుమాపకుండా, మన దేశంలో అణగారిన ప్రజానీకానికి విముక్తి మార్గాన పురోగమనం సాధ్యమా? ఆర్థిక అణచివేత అంతరిస్తే అన్ని అన్యాయాలూ తొలగిపోతాయన్న భ్రమలో, వర్ణవివక్ష నిర్మూలన మన సమాజ పురోగమనానికి అత్యంత అవసరం అన్న స్పృహ కమ్యూనిస్టు పార్టీలలో కొరవడింది. పైగా ఎవరైనా పార్టీలో ఈ వర్ణవివక్ష నిర్మూలన ఆవశ్యకతను ఎత్తిచూపితే అది కార్మికవర్గ ఐక్యతకు భంగం కలిగించి చీలికలకు దారితీస్తుందని నేటికీ కమ్యూనిస్టు నేతల్లో ఉన్న భావన. కానీ నేడు కమ్యూనిస్టు పార్టీ మన దేశంలో 33 పార్టీలుగా చీలింది. వర్గపోరాటం సాయుధమా? ఎన్నికలా? ఆధిపత్యవర్గమెవరు, ఇలాంటి అంశాలపైనే ఆ చీలిక ఉంది కానీ, బ్రాహ్మణ కమ్యూనిస్టు పార్టీ, కమ్మరెడ్డి కమ్యూనిస్టు పార్టీలు అంటూ చీలిపోలేదు. కనుకనే ఇప్పటికైనా ఈ అంశానికి మన దేశంలో కమ్యూనిస్టు పార్టీలు తప్పక తగిన రీతిలో ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ విషయంలో తెలంగాణలో ఉన్న సీపీఎం శాఖ నేడు ఈ అవగాహనను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నది. అందుకు వారికి అభినందనలు. అయితే దేశవ్యాప్త సభల్లో కేంద్రకమిటీలో మెజారిటీ ఇంకా వర్ణవివక్ష ప్రమాదాన్ని గుర్తించని నేటి దశలో, తెలంగాణ సీపీఎం బహుజన సమాజ వామపక్ష ఐక్యసంఘటన యత్నాలు ఎంతవరకు నిలిచి గెలవగలవో చూడాలి. ఏది ఏమైనా, తెలం గాణ సీపీఎం శాఖ దృక్ప«థానికి దేశవ్యాప్త మద్దతు రావాలని ఆశిస్తాను. పుచ్చలపల్లి సుందరయ్య ఒక మాట చెబుతుండేవారు. మన పార్టీ అందులో వ్యక్తిగా నేను.. ఈ సమాజ చైతన్యం ఒక్క మిల్లీమీటరైనా తన అంతిమ లక్ష్యంవైపు సాగేందుకు దోహదపడ్డానా, పోనీ కనీసం మరింత తిరోగమనం చెందకుండానైనా నిలువరించే యత్నం చేశానా అనే ప్రశ్న వేసుకుని సానుకూల సమాధానం చెప్పుకోగలగాలి అనేవారాయన. ముందుగా ఆ కోణం నుంచి కమ్యూనిస్టుల కార్యకలాపాలను సమీక్షించుకుందాం. 1983లో కాకున్నా, 1984లో తెలుగుదేశం పార్టీతో ఒప్పందం చేసుకుని, శాసనసభల్లో కమ్యూనిస్టుల స్థానాలను సాపేక్షంగా పెంచుకుని కాంగ్రెస్ పార్టీని ఓడించి, ఎన్టీఆర్ నేతృత్వాన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో భాగస్వాములైనారు కమ్యూనిస్టులు. ఆ తర్వాత 1995లో ఎన్టీఆర్ ద్వితీయ కళత్రంగా ప్రవేశించిన లక్ష్మీపార్వతిని సాకుగా చూపి ఆమెను ఎన్టీఆర్ తన రాజకీయ వారసురాలుగా ప్రకటిస్తున్నారన్న దుష్ప్రచారం చేసిన స్వయానా ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు తెలుగుదేశం నుంచి దాని సంస్థాపకుడు ఎన్టీఆర్‌నే గెంటివేసి తాను రాష్ట్ర ముఖ్యమంత్రి కాదల్చుకున్నాడు. ఆయన కులానికి చెందిన నాటి ప్రచార సాధనాల ఆధిపత్య చక్రవర్తులు, కొందరు పార్టీయేతర నేతలు చంద్రబాబుకు అన్నివిధాలుగా సహకరించారు. చివరకు ‘ఆడపెత్తనంలో తెలుగుదేశం పార్టీ’ అని తమ మాంధాత భావజాలాన్ని ప్రచారం చేస్తూ పత్రికల్లో పతాక శీర్షికలు పెట్టించారు. ఈ ప్రక్రియలో కమ్యూనిస్టు పార్టీల ఆచరణ ఏహ్యంగా ఉండిందని చెప్పాల్సి వస్తున్నందుకు చింతిస్తున్నాను. వైస్రాయ్ హోటల్లో చంద్రబాబు కొంతమంది ఎమ్మెల్యేలను నిర్బంధించిన విషయం తెలిసిందే. ఆ నిర్బంధితులపై పర్యవేక్షణ చేస్తూ వారి వద్దకు వచ్చిపోయే వారి సమాచారం తెదేపా నేతలకు అందించేందుకు వాలంటీర్లను బాబుకు స్వయంగా మార్క్సిస్టు పార్టీ అందించడం మార్క్సిజమా? అని కూడా ప్రశ్నించుకోవాలి. 1999లో ఎన్నికలు వచ్చేసరికి బాబు అవసరంలో తనను ఆదుకున్న కమ్యూనిస్టు పార్టీలను తిరస్కరించి కమ్యూనిస్టులకు సైద్ధాంతికంగా ప్ర«థమ రాజకీయ వ్యతిరేకి అయిన బీజేపీతో నాటి వాజ్‌పేయితో చేతులు కలిపారు. 2014 ఎన్నికలకు కూడా అదే పొత్తు కొనసాగిస్తూ కమ్యూనిస్టు పార్టీలను కాలం చెల్లిన పార్టీలని, తనకు పనికిరాని పార్టీలని బహిరంగంగా ఈసడించిన కమ్యూనిస్టు వ్యతిరేకి బాబు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కమ్యూనిస్టుల పాత్ర కూడా ఉంది. ఆయన పాలన కమ్యూనిస్టు పరిభాషలో సోషలిజం కాకపోయినా, ప్రజానురంజకంగా సాగింది. ఆ దశలోనే చంద్రబాబు బీజేపీని బలపర్చి చాలా తప్పుచేశాననీ, ఇక జన్మలో ఆ పార్టీతో పొత్తుపెట్టుకోనని బహిరంగంగా ప్రజలముందు ఒట్టు వేసుకున్నాడు. కమ్యూనిస్టు పార్టీలకు మళ్లీ ఏమైందో ఏమో కానీ తమ పార్టీలను అవహేళన చేసిన బాబు టీడీపీతో భాగస్వాములైపోయాయి. 2009లో బాబు మహాకూటమి ఏర్పరిస్తే దాంట్లోనూ చేరిపోయారు. ఇలా ఎప్పటికప్పుడు రంగులుమార్చే చంద్రబాబు టీడీపీ వంటి పార్టీలతో ప్రజలు కమ్యూనిస్టులనూ జతచేశారు. అయినా ఆ ఎన్నికల్లో గెలుపు ప్రజాభి మానం చూరగొన్న వైఎస్సార్‌నే వరించింది. చంద్రబాబు అంతకుమించి బీజేపీని ఇక అంటుకునే ప్రశ్నే లేదని 2004లో వేసుకున్న ఒట్టును గట్టుమీద పెడితే పిల్లి వచ్చి నాకిపోయిందట. కనుక 2014లో నిర్లజ్జగా తిరిగి బీజేపీతో బాబు చేతులు కలిపాడు. 2002 గుజరాత్ మారణహోమం సందర్భంగా కిరాతకులు మా రాష్ట్రానికి వస్తే జైల్లోకి తోస్తానని ప్రగల్భాలు పలికిన బాబు అదే మోదీతో చేతులు కలిపాడు. వీరి సంసారం హాయిహాయిగా అంటూ సాగి చివరకు 2018 నాటికి విచ్ఛిన్నమై పోయింది. చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా, కొత్త రాజధాని అమరావతిలో ఒక్క శాశ్వత నిర్మాణం కాకుండా పోలవరం ప్రాజెక్టు 2019 జూన్ నాటికి నీళ్లందించే బదులు చంద్రబాబు బినామీలకు వేల కోట్లు దోచిపెట్టే అక్షయపాత్ర అయింది. అవినీతి, ఆశ్రిత పక్షపాతమే కాదు, ఆ పార్టీ నాయకుల అధికారం, అహంకారం, కాల్ మనీ సెక్స్ రాకెట్ కుంభకోణాలు, సామాన్య ప్రజానీకంపై లాఠీలు, తమ పార్టీ కాని వారిని జైళ్లలో కుక్కడం, దళారులు, పచ్చికులతత్వం.. ఇలా ఎన్ని అవలక్షణాలు ఉండాలో అన్ని అవలక్షణాలకు ఆలవాలమై రాక్షస పాలనగా 2019 ఎన్నికల వరకు సాగింది. ఈ పరిస్థితిలో కమ్యూనిస్టులు, ఎంతో చొరవతో ఈ దుష్టపాలనకు వ్యతిరేకంగా తమ సర్వశక్తులూ ఒడ్డి తామొక బలమైన ప్రజాశక్తిగా ఎదిగేందుకు స్వతంత్రంగా ప్రజాపంథాన పరుగు తీయాల్సి ఉండె. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకోసం, రైతులకు, మహిళలకు న్యాయమైన రుణమాఫీ కోసం, నవరత్నాలు తదితర ప్రజానుకూల విధానాలను ప్రచారం చేస్తూ ప్రజాభిమానం చూరగొన్న వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని, వెన్నుపోటు రాజకీయాలకు మారుపేరై ప్రజావ్యతిరేకతను కూడగట్టుకున్న చంద్రబాబును ఒకే గాటన కట్టడం కమ్యూనిస్టులకు విజ్ఞత అనిపించుకుంటుందా? పైపెచ్చు చంద్రబాబు వ్యతిరేక ఓట్లు చీల్చి, పరోక్షంగా చంద్రబాబు టీడీపీకి ఉపయోగపడే దృక్పథంతో సాగుతున్న పవన్ కల్యాణ్ జనసేనతో కలిసి టీడీపీకి, వైఎస్సార్సీపీకి భిన్నమైన ప్రత్యామ్నాయ మార్గాన్ని సాధిస్తామని కమ్యూనిస్టు పార్టీలు రంగంలో దిగాయి. వివేక భ్రష్ట సంపాతముల్ అంటే ఇదే. పైగా కమ్యూనిస్టులు పవన్ మాట వినాల్సిందే కానీ తాను వీరిని ఏ కోశానా పట్టించుకోడు. అంతకంటే కమ్యూనిస్టు పార్టీలే ఐక్యమై తామే ప్రత్యేకంగా పోటీ చేసి ఉంటే గౌరవంగా ఉండేది. ఇన్ని లోపాలున్నా కమ్యూనిస్టు పార్టీల్లో నిజాయితీతోపాటు ప్రజల కోసం అహరహం పనిచేసే కార్యకర్తలు, రాష్ట్ర స్థాయి నేతలూ కొందరున్నారు. ఈ స్థితిలోనూ కమ్యూనిస్టు పార్టీలు నిల్చి పుంజుకోవాలంటే వారికి సరైన రాజకీయ అవగాహన అవసరం. ఆంధ్రప్రదేశ్‌లో భవిష్యత్తులో ఏర్పడబోయే వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా కమ్యూనిస్టు పార్టీలు మద్దతు అందించాలి. తాము అంగీకరించలేని అంశాలను పాలకుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కారానికి ప్రయత్నించాలి. ఇప్పటికీ మన అమరవీరుల ఆశయస్ఫూర్తి, పోరాట పటిమ ఎక్కడికీపోలేదు. వారే ఆదర్శంగా కమ్యూనిస్టులు నిజాయితీగా పురోగమించే యత్నం చేసి తమ పున: ప్రతిష్టను పొందగలరని ఆశిస్తాను. వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు ‘ మొబైల్ : 98480 69720 -
ఆ ‘సవరణ’ బిల్లు ఎవరి లబ్ధికోసం?
ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకి పరాభవం కలిగిన నేపథ్యంలో, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయంపై కలిగిన కలవరం ఫలి తంగానే అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. ఈబీసీలకు రిజర్వేషన్ రేపటి ఎన్నికలాట కోసం విప్పిన వరాలమూటే తప్ప మరేం కాదు. అడుగంటిపోయిన ఉపాధి, ఉద్యోగ అవకాశాల మధ్య అగ్రకులాలకు రిజర్వేషన్ ఎవరికీ మేలుకలిగించేది కాదు. జనాభా ప్రాతిపదికన 85 శాతం రిజర్వేషన్ కల్పిస్తే అన్ని వర్గాల, కులాలకు మేలు జరుగవచ్చు. రాజకీయ ప్రయోజనాలకై తీసుకొచ్చిన ఈ రాజ్యాంగ సవరణ ఎవరికీ లబ్ధి కలిగించదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొద్దిమంది ఎంపీలు తప్ప మిగిలిన అందరు సభ్యుల మద్దతుతో, దాదాపు ఏకగ్రీవమైన ఆమోదంతో, మన రాజ్యాంగానికి 124వ సవరణ ద్వారా కొత్త చట్టాన్ని తెచ్చింది. ఇప్పుడు ఎస్టీ, ఎస్సీ, బీసీలకు ఉన్న రిజర్వేషన్ దాదాపు 50 శాతంగా ఉండగా, ఈ కొత్త రాజ్యాంగ సవరణ ద్వారా అగ్రవర్ణాలలోని ఆర్థికంగా వెనుకబడిన (ఈబీఎస్) వారికి విద్య, ప్రభుత్వ ఉద్యోగాలు మొదలైన వాటిలో మరో 10 శాతం మందికి రిజర్వేషన్ లభిస్తుంది. అంతేకాదు, వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉన్న అగ్రవర్ణాల వారందరికీ ఈ రిజర్వేషన్ అమలవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అనుకూలంగా ప్రభుత్వాలు వ్యవహరించడం వలన ఈ కులప్రాతిపదిక రిజర్వేషన్ల వల్ల తమకు అవకాశాలులేకుండా పోతున్నాయని అగ్రవర్ణాలు బలంగా విశ్వసిస్తున్నారు. మేధాసంపత్తి కాకుండా, కులం ఆధారంగా రిజర్వేషన్ల వలన దేశ ప్రగతి కుంటుపడుతున్నదనీ తమలో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఆ వెసులుబాటు లేకపోవడం వల్ల, తాము నష్టపోతున్నామన్న భావన అగ్రవర్ణాల్లో ఉండటంలో ఆశ్చర్యం లేదు. ఇప్పుడు ఓబీసీలకు 10 శాతం రిజర్వేషన్ వలన తమకూ విద్య, ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో వీరున్నారు. ఈ భావన, ఆశ ప్రభావమెంతో ముందు పరిశీలిద్దాం. ఈ రిజర్వేషన్ ప్రస్తుతానికి ప్రభుత్వ ఉద్యోగాలకు మాత్రమే వర్తిస్తుంది. ప్రైవేట్ సంస్థలకు వర్తించదు. అసలు వాస్తవమేమిటంటే, మొత్తం ఉద్యోగ మార్కెట్లో ప్రభుత్వ ఉద్యోగాల వాటా 3.5 శాతం మాత్రమే. ఇందులో 10 శాతం అంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల కంటే 0.35 శాతం మాత్రమే మేలు జరగవచ్చేమో! అయితే మోదీ ప్రభుత్వ హయాంలో ఈ ఉద్యోగ కల్పన దిగజారుతున్నది. నిజానికి మూడు నెలల క్రితమే విడుదల చేయవలసిన దేశ నిరుద్యోగ పరిస్థితిని మోదీ ప్రభుత్వం వెల్లడించడానికే భయపడుతోందనిపిస్తోంది. కొత్త ఉద్యోగాలు కల్పించలేకపోగా, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి విధానం వలన దేశవ్యాప్తంగా ఉద్యోగులు చిరుద్యోగులవుతున్నారు. చిరుద్యోగులు నిరుద్యోగులయ్యారు. వీరి సంఖ్య లక్షల్లో ఉంటోంది. మన చంద్రబాబు విషయానికివస్తే బాబు వస్తే జాబు వస్తుందని చేసిన ఊకదంపుడు ప్రచారం ఆచరణలో ఉన్న జాబులు ఊడిపోవడంగా ప్రతిఫలిం చింది. కనుక రిజర్వేషన్ వల్లనే తమ నిరుద్యోగ సమస్య తీరుతుందనుకోవడం భ్రమ. ప్రధానంగా కావలసింది కోట్లలో ఉద్యోగ కల్పన. ఇది చాతగాని ప్రభుత్వాలు ఏదో గోసాయి చిట్కాల వంటి సవరణ ద్వారా ఉద్యోగ కల్పన చేస్తున్నట్లు ప్రజలను మభ్యపెట్టి ప్రయోజనం లేదు. అగ్రవర్ణ విద్యావంతులు సైతం ఆలోచించవలసిన విషయం మరొకటి. కేవలం తమ కులం ఆధారంగానే, తగిన విద్య మేధాసంపత్తి లేకపోయినా ఐఏఎస్, ఐపీఎస్ వంటి ప్రతిష్టాత్మక పరీక్షల్లో సైతం ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల వారు ప్రతిభ లేకపోయినా నెగ్గుకొస్తున్నారన్న అభిప్రాయం వీరిలో ఉంది. సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల కోసం ఒక లెక్కప్రకారం ఏటా 4,50,000 మంది ప్రయత్నిస్తుంటారు. కానీ వారిలో అంతి మంగా 1100 మంది అర్హత సాధిస్తారు. ఇలాంటి పరిస్థితిలో, ఏదో పరీక్ష రాస్తే చాలు, రిజర్వేషన్ వర్తించే విద్యార్థులకు ఉద్యోగాలు వస్తున్నాయని భావింపగలమా? అంతే కాదు. ప్రతిభ, మేధోసంపత్తులకు ఈరోజుల్లో పరీక్షలో వారు సాధించిన మార్కులే కొలబద్ద! అసలీ మార్కుల కొలబద్దే వాస్తవానికి ప్రశ్నార్థకం కూడా. ఈ మార్కుల విషయం ఆలోచిస్తే, ప్రస్తుత పరిస్థితిలో ఈ మార్కుల సాధన, ఆ విద్యార్థి కుటుంబ పరిస్థితి, చదువుకునే వెసులుబాటు, వాతావరణం, తగిన ప్రోత్సాహం, దానితో పాటు వ్యక్తిగత మేధోసంపత్తి వీటన్నింటిపై ఆధారపడి ఉంటుంది. ఈ వర్ణవ్యవస్థ దుర్మార్గం కారణంగా అంబేడ్కర్, ఎన్నో కష్టాలు, అవమానాలు స్వయంగా అనుభవించవలసి వచ్చింది. తన గురువు గారి ప్రోత్సాహం, ఆయన సమకూర్చిన సాయం, తన వ్యక్తిగత ప్రతిభ వలన ఆయన ఇంగ్లండ్, అమెరికా, దేశాలకు విద్యార్జన కోసం వెళ్లి రెండు డాక్టరేట్ డిగ్రీలు తీసుకుని భారతదేశం తిరిగొచ్చారు. కానీ మనదేశం తిరిగి వచ్చిన తర్వాత మామూలు కిరాయిబండి తోలుకునే వ్యక్తి కూడా, అంబేడ్కర్‌ని తన బండి ఎక్కించుకోలేదు. కారణం దళితుడి నీడ సైతం అంటరానిదే అనే తరతరాల భావదాస్యంలో ఉన్నవాడే ఆ వ్యక్తి కూడా. అంబేడ్కర్‌కు దాహం తీర్చుకోవడానికి మంచినీళ్లు ఇచ్చేందుకు సైతం మిగిలిన కులాలవారెవరూ సిద్ధపడలేదు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, పార్సీ మతస్థులు కూడా ఎవరూ అంబేడ్కర్‌కు ఒక గది ఇచ్చేందుకు అంగీకరించలేదు. చివరకు తన ఆఫీసులో తన కింద పనిచేసే ఫ్యూన్ ఆఫీసు ఫైల్ సైతం అంబేడ్కర్ చేతికి అందించేవాడు కాడట. మైలపడిపోతామన్న మూఢవిశ్వాసమే కారణం. అందుకే అంబేడ్కర్ ఈ వర్ణ వ్యవస్థ అంతమయితే గానీ మన దేశానికి విముక్తి ఉండదని ‘కులనిర్మూలన’ అనే గొప్ప గ్రంథం రచించారు. కానీ మన సామాజిక జీవనంలో నేటికీ ఈ కులోన్మాద వికృత రూపం కనబడుతున్నది. భారతదేశం ప్రపంచంలోనే 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా పురోగమించినా, నేటికీ సామాజిక జీవనంలో, ఈ కులవ్యవస్థ అలాగే ఉంది. అందుకే సామాజిక న్యాయ సాధన అవసరం నేటికీ ఉంది. నిజానికి దళితుల ఆర్థికపరిస్థితి చెప్పనక్కరలేదు. నేడు విద్య, ఉద్యోగ, రాజకీయ పదవుల్లో ఈ మేరకైనా దళితుల అభివృద్ధి సాధ్యమైందంటే అందుకు రిజర్వేషన్లే ప్రధాన కారణం. గతంతో పోలిస్తే చాలామంది దళితులు మధ్యతరగతి స్థాయికి వచ్చారు. కానీ ఇంకా ఎంతటి వ్యత్యాసం ఉందంటే పారిశ్రామికవేత్తలుగా ఎదిగిన దళిత, గిరిజనులు 0.4 శాతం కూడా లేరు. కనుక ఆర్థిక సమానత్వం పేరుతో, సామాజిక అన్యాయాన్ని తోసిరాజనడం సబబు కాదు. ఈ స్థితిలో కొత్తగా వచ్చిన ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా ప్రభుత్వం తెచ్చిన 10 శాతం రిజర్వేషన్ కల్పించే చట్టాన్ని కూడా స్థూలంగా పరిశీలిద్దాం. బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ, వెలమ, వైశ్య, క్షత్రియ ఇత్యాది అగ్రకులాలు జనాభాలో 23 శాతం మించి ఉండరు. మామూలుగా ఈ చట్టం చేయబోయేముందే అలాంటి కులాల గణాంకాలు, వారి ఆర్థిక, సామాజిక పరిస్థితులు అన్నింటినీ సాధికారంగా ప్రభుత్వాలు ఇచ్చి ఉండాల్సింది. నిరుద్యోగ పరిస్థితిపై అంచనాను కేంద్రంలో మోదీ నేతృత్వంలో ఉన్న బీజేపీ (ఎన్డీఏ) ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దాచి ఉంచింది. కొత్తగా దళితులపై మైనారిటీలపై గోరక్షణ పేరుతోనో, మరో వంకతోనో బీజేపీ, వీహెచ్‌పీ వంటి మతతత్వ సంస్థల మూకదాడులు పెరిగిపోయాయి. దానికితోడు సాధారణ ప్రజల జీవన ప్రమాణాలు తరి గిపోతున్నాయి. మోదీ డబ్బా వాయించుకున్న అవినీతి, అధికార కేంద్రీకరణ మరింతగా పెరిగిపోతోంది. మన రాజ్యాంగ వ్యవస్థలు చివరకు సర్వోన్నత న్యాయవ్యవస్థ సైతం ఈ విలువలు దిగజారుతున్న ఆరోపణలకు గురవుతున్నాయి. అన్నిటికీ మించి ఒకే దేశం, ఒకే జాతి, ఒకే పన్నుల విధానం, ఒకేసారి ఎన్నికలు, రాష్ట్రాల్లో, కేంద్రంలో ఒకే పార్టీ పాలన వంటి ప్రచారంతో ప్రజల్లో మోదీ ప్రతిష్ట మసకబారుతోంది. అందుకు ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే నిదర్శనం. దీనిపై తమ విజయంపై ఆందోళన చెందుతున్న బీజేపీ నేతలు, అగ్రవర్ణాల ఓటర్లను మరింతగా ఆకర్షించడమే మార్గం అని తన విశ్వసనీయమైన సర్వేల ద్వారా నిజనిర్ధారణకు వచ్చిందట! ఆ ఎన్నికలాటలో, వరాల మూటలో రూపొందినదే ఆర్థికంగా వెనుకబడిన కులాల రిజర్వేషన్ పేరుతో వచ్చిన చట్టం. పార్లమెంటు ఆమోదం పొందిన ఈబీసీ రిజర్వేషన్ వల్ల 8 లక్షల వార్షికాదాయం ఉన్న అగ్రవర్ణాల వారందరికీ విద్యా, ఉద్యోగ, రాజకీయ అవకాశాల్లో రిజర్వేషన్లు లభించినట్లే. ఆమేరకు రిజర్వేషన్ అనుభవిస్తున్న దళిత, ఆదివాసీ, బీసీలకు ప్రాధాన్యత తగ్గుతుంది. ఆర్థిక సమానత్వం ఉంటేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని చెబుతూనే ఇంకా ఆ స్థాయికి మన దేశం చేరుకోలేదు కాబట్టి అది సాధించాలని రాజ్యాంగ ఆదేశిక సూత్రాల్లో దాన్ని చేర్చారు. ఇప్పుడు ఈ కొత్త చట్టం వల్ల సామాజిక న్యాయం మరింత దిగజారే అవకాశం ఉంది కనుక, విరుగుడుగా మరో 25 శాతం రిజర్వేషన్లను పెంచితే ఇప్పుడు కొత్తగా చేరినవారితో కలిపి దేశంలో 85 శాతం రిజర్వేషన్ అమలవుతుంది. నిజానికి వివిధ వర్గాల జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇస్తే అణగారిన వర్గాలకే కాదు.. జనాభా మొత్తానికి సామాజిక న్యాయం తగురీతిలో జరుగుతుంది. ఇప్పటికే తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు 69 రిజర్వేషన్లను కల్పిం చాయి కాబట్టి 85 శాతం రిజర్వేషన్ అసాధ్యం అని కొట్టిపారవేయాల్సిన అవసరం లేదు. నిజానికి ప్రతి వ్యక్తికీ పని కల్పించి, కనీన అవసరాలు తీర్చే తరహా సామాజిక వ్యవస్థను నెలకొల్పడం ఈ ప్రభుత్వాలకు అసాధ్యం కాబట్టే దేశంలో నిరుద్యోగుల సంఖ్య హనుమంతుని తోకలాగా పెరిగిపోతోంది. ఈ స్థితిలో దళిత, గిరిజన, ఇతర వెనుకబడిన కులాలకు కనీసం ఇప్పుడున్న రిజర్వేషన్కి ఏదో మేర నష్టం కలుగకుండా నిలబెట్టుకోవాలి. కమ్యూనిస్టులు, ఎస్పీ, బీఎస్పీ తదితర పార్టీలు సైతం రిజర్వేషన్ చట్టానికి సవరణలు కావాలని కోరుతూ పార్లమెంటులో ఓటింగులో పాల్గొనకుండా ఉండాల్సింది. కానీ దాదాపుగా అన్నిపార్టీలూ ఈ 124వ రాజ్యాంగ సవరణకు మద్దతు ఇచ్చాయి. సామాజిక న్యాయ అంశాన్ని కూడా ఓటు బ్యాంకు రాజకీయాల దృష్టితో చూడటం సరికాదు. ఓట్లాటలో మధ్యతరగతి ముఖ్యం కనుక వారి ఓట్లకోసమే అన్ని పార్టీలు రాజ్యాంగ సవరణను ఏకగ్రీవంగా అంగీకరించాయని అనుకోవాలి. ఈరోజు ప్రగతిశీల శక్తులు ఎన్నికల విజయాన్ని మాత్రమే లక్ష్యంగా పెట్టుకోకూడదు. సామాజిక న్యాయసాధన అవసరమైన అన్ని వర్గాల, అస్తిత్వ పోరాట శక్తుల ఐక్యత పునాదిగా సమరశీల ప్రజా ఉద్యమమే సామాజిక న్యాయ సాధనకు పరిష్కారం. డాక్టర్ ఏపీ విఠల్ వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు ‘ మొబైల్ : 98480 69720 -
బాబూ! ఏదీ ప్రత్యేక హోదా?
సందర్భం మోదీ, బాబుల అభివృద్ధికి అర్థం... దేశాన్ని, రాష్ట్రాన్ని కార్పొరేటు గుత్తాధిపతుల భోజ్యంగా మార్చేయడమే. ప్రత్యేక హోదా వల్ల కేంద్రం నుంచి లభించే రాయితీలు, నిధులు దుర్వినియోగం కాకుండా ఉద్యమకారులు జాగ్రత్త వహించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం ఏపీకి వాగ్దానం చేసిన ప్రత్యేక హో దాను కోరుతూ రాష్ట్ర వ్యాప్త విస్తృత ప్రజా ఉద్యమాలు ఆరంభమైనాయి. ప్రత్యేక హో దా సాధన కోసం మొదటి నుంచి చొరవతో కృషి చేస్తున్న వైఎస్సార్సీపీ ఢిల్లీలో నిర్వ హించిన భారీ ధర్నా ఈ సమస్యకు జాతీయ స్థాయి గుర్తింపును తెచ్చింది. కాగా, తిరుపతిలో మునికోటి విషాదకరమైన రీతిలో ఆత్మాహుతికి పాల్పడి ప్రాణాల ర్పించడంతో ప్రత్యేక హోదా ఉద్యమం ఊపందుకుంది. దీంతో గాలివాటం మాటకు మారుపేరైన చంద్రబాబు సైతం అదే పాట అందుకున్నారు. 14 నెలలుగా ప్రత్యేక హోదా ఊసే ఎత్తని బాబు నిద్రాహారాలు మాని ప్రత్యేక హోదా కోసం కృషి చేస్తున్నారని ‘తెలుగు’ తమ్ముళ్ల భజన మొదలైంది. సింగపూర్, జపాన్, చైనా, ఇస్తాం బుల్ తదితర ప్రపంచ నగరాలను తలదన్నేలా నిర్మించే రాజధానీ, అందులో పుట్టుకురానున్న ఆకాశహార్మ్యాలు, ఫ్లైఓవర్లు, మెట్రోలు, నదీ విహార విలాసాలు, పర్యాటక కేంద్రాలు, షాపింగ్ మాల్స్, ఫైవ్‌స్టార్ హోటళ్ల గోల తప్ప బాబు నోట మరే మాటా రాష్ట్ర ప్రజ విని ఉండ లేదు. హఠాత్తుగా ఆయన ప్రత్యేక హోదా అనడం విడ్డూరమే. వైఎస్సార్సీపీ శ్రేణులు, ఆ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి ఇంతకాలం ఓపికగా ప్రజలకు విభజన వలన కలిగిన నష్టాలను అధిగమించడానికి ప్రత్యేక హోదా ఎలా, ఎంతగా తోడ్పడుతుందో వివరించారు. అదే సమ యంలో టీడీపీ మంత్రులు, నేతలంతా కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ తెస్తామని చెబుతూ వచ్చారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీ ఒకటేనన్నట్టు ప్రజలను మభ్య పెట్టాలని చూశారు. కేంద్రంలో అధికారం తమదేనని ఏమైనా సాధించగలమని మాట్లాడారు. ఇప్పుడు ప్రజల నాడిని గ్రహించి ప్రత్యేక హోదా పల్లవి అందుకున్నారు. హక్కుగా నిలదీసి సాధించుకోవాల్సిన ప్రత్యేక హోదా కోసం ‘మ్యావ్! మ్యావ్!’ అంటున్నారు. మోదీ చుట్టూ తోకాడించుకుంటూ తిరగడానికి ఢిల్లీ ప్రయాణాలు క డుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీతో పాటూ సీపీఐ, సీపీఎంలేగాక కాంగ్రెస్, సినీ నటుడు శివాజీ ఈ ప్రత్యేక హోదా ఉద్యమంలో ఉన్నారు. చేగువేరాకు, మోదీకి సులువుగా ముడిపెట్టేయగల ‘రాజకీయ వేత్త’ గా రాటుదేలిన పవన్ కల్యాణ్ తన ‘జనసేన’తో సహా తాజాగా ఈ ఉద్యమంలో చేరారు. ముందు ముందు ఈ ఉద్యమం ఒకప్పటి ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ ఉద్యమంలా వ్యాపించేట్టు కనిపి స్తోంది. ఈ దృష్ట్యా ఉద్యమంలో పాల్గొంటున్న పార్టీలు, ప్రజలు ఒక విషయంలో జాగరూకులై ఉండాల్సి ఉంది. ఒకప్పుడు మనం సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగా రం ప్రభుత్వ రంగంలో ఉండి. రాష్ట్రాభివృద్ధికి, ప్రజలకు ఉపయోగపడింది. కానీ మోదీ, బాబు చెప్పే అభివృద్ధికి అర్థం ఒక్కటే... దేశాన్ని, రాష్ట్రాన్ని కార్పొరేటు గుత్తాధి పతుల భోజ్యంగా మార్చేయడమే. పెరుగుతున్న ఆర్థిక అంతరాలు, ‘అభివృద్ధి’ కోసం భూములు కోల్పోయి దిక్కులేనివారయ్యే రైతులు, రోజు కూలీల స్థాయికి దిగ జారుతున్న పారిశ్రామిక కార్మికులు, ప్రైవేటు ఉద్యో గులు, ప్రభుత్వరంగ కాంట్రాక్టు కూలీలు, పెరుగుతున్న నిరుద్యోగులు వారికి కనబడరు. ఇలాంటి పరిస్థితిలో ప్రత్యేక హోదాను పోరాడి సాధించుకున్నా అది ఈన గాచి నక్కల పాలు చేసిన చందం కాకుండా చూసు కోవాల్సి ఉంది. ప్రత్యేక హోదా వల్ల కేంద్రం నుంచి లభించే రాయితీలు, నిధులు దుర్వినియోగం కాకుండా జాగ్రత్త వహించాలి. జాతీయ హోదాతో, కేంద్రం నిధు లతో నిర్మించాల్సిన పోలవరాన్ని పక్కనబెట్టి, అస్మదీ యులకు లాభం చేకూర్చే పట్టిసీమను నిర్మిస్తున్న ఘను లు వీళ్లు, ఏమైనా చేయగలరు! ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలు ప్రజలకు చేరేలా జాగ్రత్త వహించాల్సిన బాధ్యత ఉద్యమిస్తున్న ప్రజలు, పార్టీలు, నేతలదే. ‘రుణ మాఫీ’ వాగ్దానంతో నమ్మించి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రైతులకు, డ్వాక్రా మహిళలకు మొండి చెయ్యి చూపిన వైనం ఎవరూ మరచిపోలేదు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి మొదలైన టీడీపీ ప్రభుత్వ వాగ్దాన భంగాల జాబితాను రాయాలంటే రామకోటం త. పైగా ‘‘నేను నిప్పుని, నిప్పుని’’అని నిత్య జపం చేసే బాబు, ఆయన అస్మదీయుల అవినీతి అడుగడుగునా కనిపిస్తూనే ఉంది. ‘ఓటుకు కోట్లు’ కుంభకోణంలో ‘‘నికార్సయిన నిప్పు’’ ‘‘ఆంధ్రా హజారే’’ బాబు భ్రష్ట చరిత్రను ప్రజలంతా కళ్లారా చూశారు, చెవులారా విన్నారు. అయినా సిగ్గు విడిచి ఎంఎల్ఏలను కొంటూ రెండ్ హ్యాండెడ్‌గా దొరికిన తమ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డికి బ్రహ్మరథం పట్టాడు. చేసిన సిగ్గుచేటు పనికి పశ్చా త్తాపం ప్రకటించడానికి బదులు అక్రమంగా ఫోన్ ట్యాపింగ్‌లు చేశారంటూ తెలంగాణ ప్రభుత్వంపై ఎదు రు దాడికి దిగిన ఘనుడు చంద్రబాబు. పన్నెండే ళ్లకోసారి వచ్చే గోదావరి పుష్కరాలు సైతం తన ఘనత వల్లే వచ్చాయన్నట్టుగా ప్రచారం చేసుకోగలిగిన అల్ప త్వం ఆయనది. ఆ అల్పత్వానికి దాదాపు ముప్పయి నిండు ప్రాణాలు బలి కావాల్సి వచ్చింది. రాజకీయ సన్యాసం స్వీకరించాల్సినంతటి మహా నేర భారాన్ని మోస్తూ కూడా.. ఇదేమి ఘోరమంటే, ‘శవ రాజకీ యాలు చేస్తున్నార’ని ఎదురు దాడి చేయగల అమా నవీయత బాబుకే స్వంతం. అందుకే ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న వారంతా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే చీమలు చేసిన పుట్టలో పాములు దూరిన చం దం అయ్యే ప్రమాదం ఉంది. ఈ జాగరూకతతో ప్రత్యేక హోదా కోసం ఉద్యమం మహోధృతంగా సాగాలని కోరుకుందాం. ఏపీ విఠల్ వ్యాసకర్త ప్రముఖ మార్క్సిస్టు విశ్లేషకులు ఫోన్: 98480 69720