
ఇటీవల ఏపీ రాజధాని ప్రాంతంపై కృష్ణానదికి వచ్చిన వరదలు మానవ కల్పితమని, వైఎస్ జగన్ ప్రభుత్వం తన కొంప మునగాలనే వీటిని సృష్టించిందని పదే పదే ఆరోపించారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. కృష్ణానదికి వరదలే రావు.. వచ్చినా ఏ ప్రాంతం మునగదు కనుక రాజధానికి ఏ ప్రమాదమూ ఉండదు అని మాత్రమే చెప్పదల్చుకున్నారు బాబు. ఖర్మం చాలకపోతే తాడే పామై కరుస్తుందన్నట్లు కృష్ణమ్మకు వరద వచ్చిన సందర్భంలో చంద్రబాబు నివాసంలోకీ, సుందర లేక్ వ్యూ ఎక్స్‌టెన్షన్ లోని ఆయన ఇంట్లోకి నీళ్లు రానే వచ్చాయి. రాజధానిలో వరదపైనే కాదు సందు దొరికితే చాలు జగన్ ప్రభుత్వంపై నిందలేయడానికి పూనుకుంటున్న చంద్రబాబును, ఆయన తనయుడు, ఇతర వందిమాగధులను జనం చూస్తూనే ఉన్నారని మర్చిపోవద్దు. తమ వెన్నంటి నిలిచేవారెవరో ప్రజలు సరిగ్గానే నిర్ధారించుకోగలరు.
అమరావతి రాజధాని గురించి ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖామాత్యులు బొత్స సత్యనారాయణ ఒక ప్రకటన చేశారు. ’రాజధానికి అమరావతి అనువైనది కాదు. లోతట్టు ప్రాంతం! కొండవీటి వాగు కాదు.. కృష్ణానదికే 2010లో మాదిరి వరదలు వస్తే మునుగుతుంది, బిల్డింగులు కట్టాలంటే చాలా లోతుకు పునాదులు తీయాలి, ఖర్చు పెరుగుతుంది విభజన సందర్భంగా ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీ కూడా ఇక్కడ కాదు.. దొనకొండ ప్రాంతం మేలు అన్నది. పైగా రాజధాని ఒక ప్రాంతానికో, ఒక సామాజిక వర్గానికో (కులం బదులు) మాత్రమే చెందింది కాదు. పదమూడు జిల్లాల్లోని అయిదు కోట్లమంది తెలుగు ప్రజలకు చెందింది’’ అంటూ మంత్రి బొత్స ఉన్నమాటే అన్నారు. ఆ ప్రకటనలో ఎక్కడా రాజధానిని అమరావతి నుంచి మా ప్రభుత్వం మారుస్తుంది అని చెప్పలేదు. అయితే ఇప్పటికే నిండా మునిగిన చంద్రబాబుకు ఏదో ఆందోళన, భయమూ ఆరంభమయ్యాయి. పైగా మొన్న కృష్ణానదికి వరద వస్తే 2010లో అంతస్థాయికి కొంచెం తక్కువగా వరద వచ్చినా అక్కడే కరకట్టమీద లింగమనేని బడా రియల్ ఎస్టేట్ వారి గెస్ట్ హౌస్‌లో తాను నివాసం ఉంటున్న భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లోకి నీళ్లు వచ్చాయి. ముందుచూపుతో, తన కొంప మునుగుతుందేమో అన్న భయానికి హైదరాబాద్‌కు ముందుగానే మకాం మార్చారు బాబుగారు. అంతకుముందే ప్రస్తుత ప్రభుత్వం బాబుగారి నివాసానికి, ఆ కరకట్టమీద అక్రమంగా, ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్మించిన మరికొందరు పెద్దలకు కూడా తక్షణం ఖాళీ చేయాలని నోటీసులిచ్చింది. ఖర్మం చాలకపోతే తాడే పామై కరుస్తుందన్నట్లు కృష్ణమ్మకు వరద వచ్చిన సందర్భంలో చంద్రబాబు నివాసంలోకీ, సుందర లేక్ వ్యూ ఎక్స్‌టెన్షన్‌లోని ఆయన ఇంట్లోకి నీళ్లు రానే వచ్చాయి.
ఎలాంటి విపత్కర పరిస్థితినైనా అవకాశంగా మార్చుకోగల సమర్థుడనీ, స్వోత్కర్ష చేసుకుంటారు కదా బాబుగారు. అందులో భాగంగానే ఆ వరదలు మానవ కల్పితమనీ, జగన్ ప్రభుత్వం తన కొంప మునగాలనే వరదలు సృష్టించిందనీ ఇలా మాట్లాడారు బాబు. కృష్ణానదికి వరదలే రావు, వచ్చినా ఏ ప్రాంతం మునగదు కనుక రాజధానికి సాంకేతిక నిపుణులు చెబుతున్నట్లు ఏ ప్రమాదమూ ఉండదు అని మాత్రమే చెప్పదల్చుకున్నారు బాబు. పైగా తన మాటను నమ్మి 33 వేల ఎకరాల భూమిని రైతులు భూసేకరణలో ఇచ్చారని తనపై వారికున్న విశ్వసనీయత గురించి సొంతడబ్బా వాయించుకున్నారు. నిజం నిప్పులాంటిదెప్పుడూ.. అది దహించక తప్పదు అన్నట్లు బాబుగారి పాలనలో వేంకటేశ్వరునికే శఠగోపం పెట్టడం దగ్గర నుంచి గత అయిదేళ్ల పాలన మొత్తం అవినీతిమయం అనీ అది రాజధాని భూములు, సదావర్తి సత్రంభూములు, అగ్రిగోల్డ్ బాగోతమూ, పట్టిసీమ నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, అమరావతి ప్రాంతానికి రోడ్లు, ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ ఇసుక, చెట్టు–నీరు, ఇలా చేపట్టిన ప్రతి ప్రతిపాదనలో బాబు గారి పాలనలో తాను నొక్కేసిన వాటిని ప్రస్తావన చేయడం ఆ ఆదిశేషుడికే సాధ్యం కానప్పుడు ఇక నావల్ల ఏమవుతుంది? అయినా మానవమాత్రుడు ఎవరూ చేయజాలని దుర్మార్గ ప్రచారం బాబు చేశాడు.
అమరావతి ప్రాంతంలో భూములివ్వని వారి తోటల్ని తమ పార్టీవారిచేతనే తగులబెట్టించి ఆ నేరాన్ని నాటి ప్రతిపక్షపార్టీ వైఎస్సార్ సీపీ పైకి నెట్టారు. అంతకు మించి కాపునేత ముద్రగడ పద్మనాభం గారి ఆందోళన సందర్భంగా రైలు రైలునే పట్టాల మీద తగులబెట్టించి ఆ పని కడప రౌడీల పని అని కారుకూతలు కూసిన బాబుగారి దుష్ప్రవర్తన మర్చిపోగలమా? ఇక సింగపూర్ వారి సహకారంతో ఆయన కట్టించిన 50, 60 అంతస్తుల ఎత్తు ఆకాశ హర్మ్యాలు, వందల సంఖ్యలో ఐకాన్ బ్రిడ్జిలు, నందనవనాలు, పద్మసరస్సులూ, బాహుహలి భారీ సెట్టింగులు ఇవన్నీ వేలాది కోట్ల రూపాయల ఖర్చుతో కట్టించినవి కదా! అమరావతి రాజధాని మారిస్తే ఈ ప్రజాధనం వృథా కాదా అని ఊహాలోక విహారిగా తాను ప్రశ్నిస్తూ తన పెయిడ్ ఆర్టిస్టులచేత ప్రచారం చేయిస్తున్నారు బాబు.
అసలింతకూ మామూలు వాన కురిస్తేనే అసెంబ్లీ భవనం, పైకప్పులూ, సీలింగులు కూలిపోయే ఒక పాలనా భవనం, ప్రతిపక్ష నేతకు కేటాయించిన గదుల సముదాయం ఇవన్నీ వానకు చిన్న చెరువుల్లా మారుతున్నాయి. ఇక హైకోర్టు భవనం న్యాయమూర్తులకు నివాస గృహాలు ఇత్యాది తాత్కాలిక భవనాలు భూమ్మీదే ఉన్నాయి కానీ మిగిలిన కలల కట్టడాలు, సింగపూర్ తరహా అతిగొప్ప భవనాలు ప్లానులూ ఇవన్నీ ఆర్ట్ గ్యాలరీలలో ప్రదర్శనార్థం ఉన్నాయి. పాలనాపరమైన రాజధానికి 33 వేల ఎకరాల భూమి అనవసరం. గుర్రం నాడా దొరికిందని గుర్రాన్ని, బండినీ కొనుక్కుంటే కొరివితో తలగోక్కున్నట్లే. ఆశలు చూపి, అభ్యంతరాలు పెట్టి రైతులను అది రించి, బెదిరించి బలవంతంగా మామూలు రైతుల నుంచి భూములు లాక్కుని వాటిని తన పార్టీవారికి, బినామీలకు, సింగపూర్‌లోని కోటీశ్వరులకు రియల్ దందా కోసం కట్టబెట్టేందుకా? బాబుగారి ఇంతటి కలల రాజధాని అవసరం ఉందా? అయినా ఇంకో 50 సంవత్సరాలకు అమరావతి ప్రపంచంలోనే అత్యంత గొప్ప నగరంగా మారుతుందట.
కానీ అంత ‘ఫ్లో’ అక్కర లేదు సారూ, ప్రజల రాజధాని అవసరాలకు సరిపడా, అక్రమంగా పెరిగే జనాభాకు అనువైన రాజ ధాని విస్తరిస్తూ వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. అన్నింటికీ మించి అభివృద్ధి అంతా అమరావతి రాజధానికే పరిమితం చేయడం అంత బుద్ధి తక్కువ పని మరొకటి ఉండదు. మళ్లీ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రత్యేక ఉద్యమాలకు బీజం వేయడమే అవుతుంది. హైకోర్టు ఒక ప్రాంతంలో, ఇతర వ్యాపార, వాణిజ్య సముదాయాలు ఒకచోట నిర్మించవచ్చు. పారిశ్రామిక ప్రాంతంగా మూడుపంటల మాగాణీ ఎందుకు? దాన్ని మెట్టప్రాంతాలకు తరలించవచ్చు. వాణిజ్యానికి విశాఖపట్నం ఉండనే ఉంది. అలాగే గోదావరి జిల్లాల్లో పంటల ఆధారిత పరిశ్రమలు, గుంటూరు–విజయవాడ నగరాల్లో ఇప్పటికే ఉన్న అభివృద్ధికి తోడు పైవాటిని జోడించడం ద్వారా మొత్తం పాలనలో అభివృద్ధి వికేంద్రీకరణ చేయవచ్చు. అమరావతి, పోలవరం ఇవన్నీ జనానికి చూపించి ఇసుక, సిమెంట్, మట్టి బొక్కడమే కాకుండా పోలవరం ప్రాజెక్టు, అభివృద్ధి పేరుతో తన బినామీల అక్రమ సంపాదనకు వాడుకోవాలని బాబుగారు సిద్ధమయ్యారు. ఇక మళ్లీ గెలవడం అసాధ్యం కనుకనే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్లు 2014–19 మధ్యనే తన వారి ధనదాహం తీర్చుకునేందుకే బాబుగారు వ్యవహారం నడిపారని అర్థమవడం లేదూ?
ఇవన్నీ వివిధ కమిషన్లు, నిపుణుల బృందాలు జరుపుతున్న విపులమైన విచారణలో వెల్లడి కావడం ఖాయం. అందుకే అసత్య పూరిత వ్యతిరేక ప్రచారానికీ, బూటకపు నాటకీయ ఉద్యమాలకు బాబు తెరలేపుతున్నారు. పైగా వైఎస్సార్‌సీపీ బాధితుల కోసం అంటూ పల్నాడులో పునరావాస కేంద్రం ఏర్పర్చి చిల్లర ఆర్టిస్టులతో కథ రక్తి కట్టిస్తున్నారు. ఇక కోడెల శివప్రసాద్ కూలిన కోట ప్రాంతంలో మరొక పునరావాస కేంద్రం ఏర్పరిస్తే హైక్లాస్ వెన్నుపోటు పార్టీ దోపిడీ దొంగలకు, అవసరమైతే తన ఆత్మీయులకూ తగినదవుతుంది.
మరోవైపున చంద్రబాబుతోపాటు పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ నేతలు కూడా పగటి కలలు కంటూ సంధిమాటలు మాట్లాడటం ఆపటం లేదు. వీరంతా కలిసి కానీ విడిగా కానీ జగన్ పాలనపై లేనిపోని కట్టుకథలు, పెయిడ్ ఆర్టిస్టుల ప్రచారాలు, ప్రజల కోసం గాక అశాంతి రేపటం కోసం ఉద్యమాల పేరున అరాచక అల్లర్లు సృష్టించే ప్రమాదం లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
మరోవైపు మూణ్నెళ్ల తన పాలనలో, నడివయస్సు ఇంకా రాకపోయినా ఎంతో పరిణితితో, హుందాతనంతో వైఎస్ జగన్ వ్యవహరిస్తున్నారు. అల్పుల ఆక్రోశపు ఆర్భాటాలకు, వారి అబద్ధాల గావుకేకలకు ఆయన ఏమాత్రం చలించడం లేదు. పాదయాత్ర సందర్భంగా తాను నేర్చుకున్న పాఠాలు, ఆ ప్రజల జీవితాన్ని మెరుగుపర్చేందుకు నిర్దేశించుకున్న కర్తవ్యాలు, నవరత్నాలు, రాష్ట్ర వ్యావసాయిక, పారి శ్రామిక అభివృద్ధి, పోలవరం ప్రజాహిత కర్తవ్యాలు వంటివాటిపై దృష్టిపెట్టి హుందాగా పాలనా మార్గాన అప్రతిహతంగా దూసుకుపోతున్నారు.
మన ప్రజలు తెలివిగలవారు. కాకిగోలలను, కారుకూతలను, స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా వ్యవహారాలను పరిశీలించి తమ వెన్నంటి నిలిచేవారెవరో ప్రజలు సరిగ్గానే నిర్ధారించుకోగలరు. ఆచరణలో తమకు అండగా, వెన్నుదన్నుగా ఉంటూ తమను పురోగమన మార్గాన నడిపిస్తున్నదెవరో అనుభవంతో తేల్చుకుంటారు.
డాక్టర్ ఏపీ విఠల్
వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు ‘ మొబైల్ : 98480 69720