బ్రాండ్లూ–వ్యాపారాలూ | Sriramana Article On Brands And Businesses | Sakshi
Sakshi News home page

బ్రాండ్లూ–వ్యాపారాలూ

Published Sat, Oct 3 2020 12:42 AM | Last Updated on Sat, Oct 3 2020 5:15 AM

Sriramana Article On Brands And Businesses - Sakshi

ఏ చిన్న అవకాశం వచ్చినా సంప్రదా యాల్ని అడ్డం పెట్టుకోవడం, నమ్మకంగా వ్యాపారం చేసుకోవడం మనకి అలవాటు. కరోనా తెరమీదకు వచ్చినపుడు భారతీ యత, వాడి వదిలేసిన దినుసులు మళ్లీ మొలకలెత్తాయి. ‘కోవిడ్‌ ఏమీ చెయ్య దండీ, ధనియాల చారు ఓ గుక్కెడు తాగండి. అడ్రస్‌ లేకుండా పోతుంది’ అంటూ హామీలు ఇచ్చినవాళ్లు ఎందరో?! ఇది చైనాలో పుట్టింది. వాళ్లే చెబుతున్నారు. చిటికెడు పసుపుపొడి వేసుకుని ముప్పూటా ఆవిరి పట్టండి. సమస్త మలినాలు వదిలిపోతాయ్‌ అంటూ ఎవరి పద్ధతిలో వాళ్లు దొరికిన చోటల్లా చెప్పుకుంటూ రాసుకుంటూ వెళ్లడం మొదలు పెట్టారు. ఏమీ దిక్కుతోచని స్థితిలో ఉన్న జనం ఎవరేం చెబితే అది నెత్తిన పెట్టుకుని అమలు చేశారు. చేసిన వాళ్లంతా బావుందంటూ ప్రచారం చేశారు. పైగా దానికితోడు మన భారతీయత, దేశవాళీ దినుసులు చేరే సరికి అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది. ఒకప్పుడు ఆవఠేవలు, ఇంగువ హింగులు మన రోజు వారీ వంటల్లో బొట్టూ కాటుకల్లా అలరించేవి.

చూశారా, ఇప్పుడవే దిక్కు అయినాయి. మడి, ఆచారాల పేరు చెప్పి వ్యక్తిగత శుభ్రత, సమాజ శుభ్రత పాటిస్తే తప్పులు అంటగట్టారు. ఇప్పుడవన్నీ ఈ మహా జాఢ్యానికి మందుగా తయారయ్యాయి. సందట్లో సడే మియా అన్నట్టు పాత దినుసులన్నిటికీ గుణాలు అంటగట్టి ప్రచా రంలోకి తెచ్చారు. ‘ఉసిరి’ బంగారం అన్నారు. దాంట్లో ఉన్న రోగ నిరోధక లక్షణాలు అమృతంలో కూడా లేవన్నారు. ఉసిరిగింజ, ఉసిరి పప్పు అన్నీ సిరులేనని ప్రచారం సాగింది. ఇట్లా లాభం లేదని లాభసాటి పథకం తయారు చేశారు. సింగినాదానికి, జీల కర్రకి, పసుపుకి, ఇంగువకి బ్రాండ్‌ తగిలించి, దానికో పేరు చిరు నామా ఉన్న ముఖాన్ని అడ్డంపెట్టి అమ్మకాలు సాగించారు. అశ్వగంథ, కస్తూరి లాంటి అలనాటి దినుసులకి ఒక్కసారి లెక్కలు వచ్చాయి. ధనియాల నించే కొత్తిమీర మొలకెత్తుతుందని కొన్ని తరాలు కొత్తగా తెలుసుకున్నాయ్‌. ‘మన వేదాల్లో అన్నీ ఉన్నా యిష!’ అన్నారు పెద్దలు.

ఏ మాత్రం విస్తుపోకుండా ‘సబ్బులు మీ చేతి కోమలత్వాన్ని పిండేస్తాయ్‌ జాగ్రత్త! అందుకని సంప్రదాయ మరియు ప్రకృతిసిద్ధమైన కుంకుడుకాయని మాత్రమే వాడండి’ అంటూ మూడంటే మూడు భద్రాచలం కుంకుళ్లని సాచెలో కొట్టి పడేసి, దానికి రాములవారి బ్రాండ్‌ వేసి, వెల రూపాయి పావలా, పన్నులు అదనం అంటూ అచ్చేసి అమ్ముతున్నారు. దాన్ని మిం చింది ‘సీకాయ్‌’ అంటూ పై సంగతులతో మరో బ్రాండు. ఇందులో ఉసిరి గుణాలున్నాయ్, ఇంగువ పలుకులున్నాయ్‌ అంటూ ట్యాగ్‌ లైన్లు తగిలించి మార్కెట్‌లోకి వదులుతున్నారు. మృత్యుభయం ఆవరించి ఉన్నవాళ్లు దేన్ని సేవించడానికైనా రెడీ అవుతున్నారు. దాదాపు ఏడాదిగా ఈ చిల్లర వ్యాపారాలు టోకున సాగుతున్నా, ఏ సాధికార సంస్థా వీటి గురించి మాట్లాడిన పాపాన పోలేదు.

మన దేశంలో దేనికీ జవాబుదారీతనం లేదు. వ్యాపారంలో ఒకే ఒక్క ఐడియా కోట్లు కురిపిస్తుందని వాడుక. రకరకాల బ్రాండ్‌ పేర్లతో శొంఠి, అల్లం, లవంగాలు, వెల్లుల్లి లాంటి ఘాటు ఘాటు దినుసులు ఔషధ గుణాలు సంతరించుకుని ఇళ్లలోకి వస్తున్నాయ్‌. పెరటిచెట్టు వైద్యానికి పనికిరాదని సామెత. ఇప్పుడు అన్ని రకాల తులసీదళాలు గొంతుకి మేలు చేస్తాయని నమ్ముతున్నారు. ఆ తులసి ఫలానా నేలలో పుట్టి పెరిగితే, అది మరింత సర్వ లక్షణ సంపన్నగా బ్రాండ్‌ వేస్తే– ఇక దాని గిరాకీ చెప్పనే వద్దు. ‘ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదు’. ఔను, మర్చేపోయాం గురూ అంటూ అంతా నాలికలు కరుచుకున్నారు. అయితే ఓ చిన్న మెలిక ఉంది. ఆ ఉల్లి ఫలానా గుట్టమీద పండాలి. అప్పుడే దానికి గుణం అని షరతు విధించారు. ఇహ ఆ ఉల్లిని బంగారంలో సరితూచాల్సిందే!

పొద్దున్నే పేపర్‌ తిరగేస్తే, టీవీ ఆన్‌ చేస్తే రకరకాల వ్యాపార ప్రకటనలు. అన్నీ పోపులపెట్టె సరంజామాలోంచే. మన అమ్మలు, అమ్మమ్మలు చిన్నప్పుడు పోసినవే. ఎవరికీ లేని వైద్య వేదం ఆయు ర్వేదం మనకుంది. అది వ్యాధిని రూట్స్‌ నించి తవ్వి అవతల పారేస్తుందంటారు. ప్రస్తుతం కూరలు, పళ్లు వాటి ప్రత్యేక ఔషధ గుణాల పేర్లు చెప్పి అమ్ముతున్నారు. పైగా, వాటి శుభ్రత దానికి బ్రాండ్‌ యంత్రాలు మార్కెట్‌లోకి వచ్చాయి. కొనగలిగినవాళ్లు ఆన్‌లైన్లో తెప్పించుకుంటున్నారు. ఉన్నట్టుండి ఒకరోజు ఒంటెపాల ప్రకటన వచ్చింది. అన్నీ ఇమ్యూన్‌ శక్తి పెంచేవే. చిన్నప్పుడు చందమామ కథలో రాజుగారి వైద్యానికి పులిపాలు అవసరపడటం దాన్ని ఓ సాహసి సాధించడం గుర్తుకొచ్చాయి. చివరకు ఆ సాహసికి అర్ధ రాజ్యం కూడా దక్కుతుంది.

స్వచ్ఛభారత్‌ని దేశం మీదకు తెచ్చినపుడు గాంధీగారి ఫేమస్‌ కళ్లజోడుని సింబల్‌గా వాడుకున్నారు. కరెన్సీ మీద కూడా ఆ కళ్లజోడే! ఎవరో అన్నారు గాంధీజీ వేరుశనగ పప్పులు, మేకపాలు సేవించేవారని చెప్పుకుంటారు. ఈ విపత్కర పరిస్థితిలో మేక పాలను మార్కెట్‌లోకి తెచ్చి మహాత్ముణ్ణి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వాడుకుంటే.. పరమాద్భుతంగా ఉంటుంది అనే ఆలోచన ఓ కార్పొ రేట్‌ కంపెనీకి వచ్చింది. మరిహనేం అయితే.. మేకపాలతో పాటు, మేక నెయ్యి కూడా వదుల్దాం, అన్నీ కలిపి ఓ యాడ్‌తో సరి పోతుంది. అనుకున్నారు. పనిలోపనిగా మేక మాంసం కూడా కలి పారు! సేమ్‌ బ్రాండ్‌!

శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement