నలుపు లేక తెలుపు లేదు!
అక్షర తూణీరం
పెద్ద నోట్ల రద్దు బావిలో పూడిక తీయడం లాంటిది. ఇక కొత్తనీరు బుగ్గలు బుగ్గలుగా ఊరుతుంది. ఆ వూరే నీరంతా నల్లదే అవుతుందనీ.. బ్లాక్ లేకుండా వైట్ లేదంటున్నారు.
ఇద్దరు పరిచయస్తులు రైల్లో ప్రయాణం చేస్తున్నారు. వారిలో ఒకాయన రెండో ఆసామికి అప్పున్నాడు. దొరక్క దొరక్క దొరికాడని బాకీ తీర్చనందుకు సాధిస్తున్నాడు. రైలు దిగి ఎటూ పోవడానికి లేదు. పాపం అందుకని ఓపిగ్గా భరిస్తు న్నాడు. ఇంతలో ఒకచోట ఉన్నట్టుండి రైలు ఆగింది. గబగబా పది మంది ముసుగు దొంగలు రైలెక్కారు. ఆ చివర్నించి కత్తులు చూపించి వరుసగా నగా నట్రా నుంచి జేబులు వొలి చేస్తున్నారు. రెండో ఆసామి ఒక్కసారిగా జాగృతమయ్యాడు. జేబులో ఉన్న పైకం, మెడలో ఉన్న బంగారు గొలుసు, చేతికున్న రెండు పెళ్లి ఉంగరాలు తీసి రుణదాత చేతిలో పెట్టాడు. ఆలస్యానికి క్షమించమన్నాడు. నష్టం జరగలేదు సరికదా బాకీ తీరిపోయింది. ఈ నోట్ల రద్దు వేళ ఇలాంటివి, ఇంకా చిత్ర విచిత్ర సన్నివేశాలు ఎదు రవుతున్నాయి.
ప్రధాని మోదీ పుణ్యమా అని రెడ్‌లైట్ కేంద్రాలు కళకళలాడుతున్నాయి. నిల్వ డబ్బుని, నిల్వ కోరికల్ని వదిలించుకుంటున్నారు. అక్కడ కూడా పెద్ద నోట్ల అర్హత గలవారికే గిరాకీ ఉందిట. మరీ చిల్లర వారికి బోణీలు కావడం లేదుట. ఇది ఇలా ఉంచితే దానధర్మాలు పెరిగాయి. చాలాచోట్ల దేవాలయ జీర్ణోద్ధరణలు సాగుతున్నాయి. యాభై ఏళ్లు గడచినా ఒక్క వాహనమైనా లేని దేవుళ్లకి అవి అమరుతున్నాయి. మా ఊళ్లో ఒకాయన మంచి హైక్లాస్ రికార్డింగ్ డ్యాన్సులు వరుసగా స్పాన్సర్ చేస్తున్నాడు. మా ఊరంతా ఆ నిషాలో జోగు తోంది. పన్నులతో సహా జగమొండి బాకీలు వద్దంటే రాలుతున్నాయి. ఒక సంపన్నుడు ఉత్తి పుణ్యానికి కవి సమ్మేళనం పెట్టించాడు. అంతేనా, ఒక్కో కవిని రెండేసి ఐదొందల నోట్లతో సత్కరిం చాడు. అంతేనా, శ్రోతలకి కూడా ఒక్కో నోటిస్తానని కబురంపాడు. అయినా, కవులకు భయపడి శ్రోతలంతగా స్పందించలేదు.
నోట్ల రద్దుతో సర్వే సర్వత్రా విచిత్రమైన వాతావరణం నెలకొన్నది. కొందరు నిమ్మకు నీరెత్తినట్టు కనిపిస్తున్నారు. మరికొందరు కొంచెం బాగానే నిల్వలున్నట్టు చిన్న మొహాలతో తిరుగుతున్నారు. బయటపడి బావురుమనలేదు. అట్లాగని దిగమింగనూ లేరు. దీనివల్ల చాలా నష్టం అని కేకలు పెడుతున్నారు గానీ ఎవరికి నష్టమో చెప్పడం లేదు. కొందరు సమన్యాయం జరగలేదని, డెమోక్రసీలో ఇది అన్యాయమనీ అరుస్తు న్నారు. కొందరికి ముందే ఉప్పందిందని వారి వాదన. కావచ్చు. మోదీ దేవుడేం కాదు. క్యాబినెట్ సహచరులు అంతకంటే కాదు. ఢిల్లీకి ఇక్కడీ ఆసులో గొట్టంలా తిరిగే వారె వరో ఒక్క చెవిలో పడేశారనీ, అది ఒక వర్గం చెవుల్లో కాంతి వేగంతో ప్రసరించిందనీ అంటున్నారు. పాపం పుణ్యం పైనున్న వాడికి తెలియాలి. ఇక్కడేమైందంటే, ఈ చర్యని సమర్థించే వారంతా నీతిపరులని, వ్యతిరేకిస్తున్న వారంతా నల్లధనవంతులని ఓ ముద్ర పడుతోంది. కాస్త ముందుగా మాక్కూడా చెప్పకూడదా మేమూ ఒడ్డున పడేవాళ్లమని పరోక్షంగా కష్టపడుతున్నారు. ఒక లాయరు కేసు ఓడిపోతే క్లయింట్‌కి ‘న్యాయం గెలి చింది’ అని టెలిగ్రామ్ కొట్టాడు. వెంటనే క్లయింట్, ‘పై కోర్టుకి అప్పీల్ చేయండి’ అని జవాబు కొట్టాడు. ఇప్పుడు కూడా వాదోపవాదాలు బయటపడకుండా ధ్వని ప్రధానంగా జరుగుతున్నాయి.
కొందరేమంటున్నారంటే, ఇది బావిలో పూడిక తీయడం లాంటిది. ఇక కొత్తనీరు బుగ్గలు బుగ్గలుగా ఊరుతుంది. ఆ వూరే నీరంతా నల్లదే అవుతుందంటున్నారు. బ్లాక్ లేకుండా వైట్ లేదంటున్నారు. ఒక పెద్దాయన దీనికి సింపుల్ సొల్యూషన్ చెప్పాడు. ‘‘రద్దు నోట్లని భద్రంగా ఉంచండి మేం వస్తాం! వాటిని తిరిగి చెలామణిలోకి తెస్తాం ఇదే ఈసారి మా ఎన్నికల ఎజెండా’’ అని కాంగ్రెస్ పార్టీ ఓ స్టేట్‌మెంట్ ఇస్తే ఢిల్లీకి కళ్లు తిరుగుతాయి. నల్లవారంతా ఏకమై గెలిపించుకోరా? చూడండి కావలిస్తే.
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
శ్రీరమణ