అక్షర తూణీరం
మోదీ మొండిచెయ్యిచ్చాడని అంతా వ్యాఖ్యానిస్తుంటే, చక్రం తిప్పగలనన్న గట్టి నమ్మకంతో ఉన్న చంద్రబాబుకి దిక్కులు కనిపిస్తున్నాయ్.
‘‘మొగుడు కొట్టినందుకు కాదు తోడుకోడలు నవ్వినం దుకు’’ అని సామెత. బడ్జెట్ వేళ మోదీ చేతి మొట్టికాయ తిన్న చంద్రబాబుకి పై సామెత చక్కగా అన్వయిస్తుంది. ప్రత్యేక హోదా కావాలని అందరూ ఘోషిస్తుంటే, కాదు ప్యాకేజీ లాభసాటి అంటూ వాదనకి దిగారు. ‘‘మనం ఢిల్లీలో అన్యోన్యంగా ఉంటే కదా పోలవరం పూర్తి చేసుకో గలం, ప్రపంచ ప్రసిద్ధ క్యాపిటల్ నిర్మించుకోగలం’’ అంటూ చంద్రబాబు పలుమార్లు సుదీర్ఘ సుత్తి వేస్తూ వచ్చారు. మన తలలు బొప్పెలు కట్టాయిగానీ ఏ మాత్రం పని జరగలేదు. ‘‘మోదీ నా జేబులో ఉన్నాడు. ఏదైనా నన్ను కలుపుకోందే చెయ్యరు’’ అని థిలాసా ప్రద ర్శిస్తున్న చంద్రబాబుకి గట్టి దెబ్బ ఎదురైంది. రైల్వే జోన్ పెద్ద విషయం కాదను కున్నారు. అది కూడా పీటముడి పడి కూర్చుంది.
బీజేపీ వర్గాలేమంటున్నాయంటే, ఈ బడ్జెట్ పేదవాడికి, రైతుకి గొప్ప వరం. రైతుకి ఆశా కిరణం, కడుపేదకి ఆరోగ్యం. నిజమే, ఆర్థిక స్తోమతు లేక ఆప్తుల ప్రాణాల్ని చూస్తూ, చూస్తూ వదిలేసుకున్న సంఘటనలు కోకొల్లలు. ఇప్పుడు పదికోట్ల కుటుంబాలకు బతుకు భరోసా ఇచ్చారు. రైతుకి ఒకటిన్నర రెట్ల ఆదా యానికి గ్యారంటీ ఇచ్చారు. ఒక రైతుకు ఉన్న ఎకరంమీద నలభై వేలు ఖర్చు చేస్తే కనిష్టంగా అరవై వేలు ముడుతుంది. పంటలు, ధరలు బాగుండి అంతకు ఎక్కువ వస్తే మరీ సంతోషం. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా రైతన్నలు కునారిల్లిపోతున్నారు. అందరూ రైతుని దేశా నికి వెన్నెముక, అన్న దాత అంటూ భావో ద్వేగ బ్లాక్‌మెయిల్ చేయడం తప్ప వారికి గట్టి మేలు తలపెట్టిన నాథుడు లేడు. సింహ భాగం చెందాల్సిన వారికి బడ్జెట్‌లో కేటా యించారనిపించింది.
పంచాయతీబోర్డు సర్పంచి తన గ్రామం గురించి ఆలోచిస్తాడు. ప్రధానమంత్రి దేశం మొత్తాన్ని కళ్లముందు నింపుకుంటాడు. వారి పార్లమెంట్ సభ్యులు ఎక్కడ చిక్కగా ఉన్నారో, ఎక్కడ పల్చగా ఉన్నారో చూస్తారు. ఆ నిష్పత్తిలో మొగ్గు చూపుతారు. ఇది రాజకీయ మూలసూత్రాలను బట్టి ధర్మమే కదా. ఇందుకు చిన్న ఉదాహరణ చెబుతాను. మా గ్రామం వేమూరుకు (రోశయ్యగారి ఊరు) రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వరహాపురం మూడు నాలుగు వేల జనాభా ఉన్న మంచి గ్రామం. ఆ ఊరికి రోడ్డు వేసి ఎనిమిదేళ్లు దాటింది. వేమూరు ఎమ్మెల్యే (ఇప్పుడు మంత్రి కూడా)ని అడిగితే, వరహాపురం వైఎస్సార్‌సీపీకి కంచు కోట. నాకు ఓటువేయని వారితో నాకేంటి అంటారు. కావచ్చు, కానీ ఒకసారి గెలిచాక అందర్నీ సమానంగా చూడాలి, కలుపుకుపోవాలి. ఒక చిన్న నియోజకవర్గ పరిధిలోనే ఇట్లా ఉంటే, ఆలిండియా స్థాయిలోకెల్లా ఉండాలో ఆలోచించండి.
చంద్రబాబు క్యాపిటల్ డ్రీమ్‌తో ఢిల్లీకి సంబంధం ఉండాల్సిన పన్లేదు. పోలవరం నిదానంగా పూర్తి చేస్తారు. మళ్లీ ఎన్నికల ముందే జాతికి అంకితం చేసి ఓట్లు దండుకోవాలంటే కుదరకపోవచ్చు. మోదీ మొండిచెయ్యిచ్చాడని అంతా వ్యాఖ్యానిస్తుంటే, చక్రం తిప్పగలనన్న గట్టి నమ్మకంతో ఉన్న చంద్రబాబుకి దిక్కులు కనిపిస్తున్నాయ్. హస్తినలో మనకీ, మన బలగానికీ ఏ మాత్రం సీన్ లేదని తేటతెల్లమైంది. ఇది చంద్రబాబుకి మెడతిరగని కణితైంది.
- శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
Comments
Please login to add a commentAdd a comment