ఒంటి చేతి చప్పట్లు | Sriramana on ongoing AP assembly sessions | Sakshi
Sakshi News home page

ఒంటి చేతి చప్పట్లు

Published Sat, Nov 18 2017 1:27 AM | Last Updated on Mon, Jul 23 2018 6:55 PM

Sriramana on ongoing AP assembly sessions - Sakshi

ఆ సభ్యుడు స్పీకర్‌ కాళ్ల మీద పడి లేచాడు. గౌరవ ముఖ్యమంత్రివర్యులకు మీ ద్వారా పాదాభివందనం సమర్పించుకుంటున్నానధ్యక్షా అనగానే సభ కుదుటపడింది.

ఇప్పుడు అమరావతి శాసనసభ దేశ రికార్డ్‌ను బద్దలు కొట్టింది. ప్రతిపక్షం శాంపిల్‌గా కూడా లేకుండా అధికారపక్షం సభ నడిపిస్తోంది. తెరచాప వేసుకుని జాయ్‌గా వాలుకి సాగిపోతున్న పడవలా సభ నడుస్తోంది. దీన్నే ఆంగ్లంలో ‘కేక్‌వాక్‌’ అంటారు. తెలుగులో ‘నల్లేరు మీద బండి నడక’ అంటారు. సంసార పక్షంగా చెప్పాలంటే అత్తలేని కాపురంలా పోరు పొక్కు లేకుండా ఉంది. ప్రతి అనుకూల, ప్రతికూల సందర్భాలని తన దారికి తెచ్చుకునే నేర్పరి మన చంద్రబాబు.

‘‘.... మీరు నిర్మొహమాటంగా, నిర్భయంగా మాట్లాడండి! అవసరమైతే కడిగెయ్యండి. ప్రతిపక్ష పాత్ర పోషించండి. మనం చేసిన, చేస్తున్న పనులన్నింటినీ సమీక్షించుకుని ముందుకు పోవడానికిదొక మహదవకాశం....’’ అనగానే ఓ సభ్యుడు నిలబడి ‘‘అధ్యక్షా! నన్ను మూడు దేశాలు తిప్పుకొచ్చారు. మంచి ఫుడ్డు పెట్టించారు...’’ అంటుండగానే పక్క సభ్యుడు చొక్కా లాగి కూచోపెట్టాడు.

‘‘విశాఖలో హుద్‌హుద్‌ తుపాను వచ్చినప్పుడు అధ్యక్షా! మన ముఖ్యమంత్రి ఆ బీభత్సాన్ని మూడ్రోజుల్లో క్లీన్‌ అండ్‌ క్లియర్‌ చేసి పడేశారు. ఇది ఆయన ఘనత తప్ప మరొకటి కాదని తలబద్దలుకొట్టుకు చెబుతున్నా. దీనిని గౌరవ ముఖ్యమంత్రి బేషరతుగా అంగీకరించకపోతే, ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని సభాముఖంగా తెలియచేస్తున్నా!’’ అని మరో సభ్యుడు అనగానే చిరుదరహాసంతో ఆయన అంగీ కారం తెలిపి, ‘‘... నేను టెక్నాలజీని బాగా వినియోగింపచేశాను అధ్యక్షా! టెక్నాలజీతో కొండమీద కోతిని దింపవచ్చు అధ్యక్షా!’’ సభ దద్దరిల్లేటట్టు బల్లల మీద చరిచారు సభ్యులు.


‘‘దేశంలో అన్ని రాష్ట్రాలను పక్కకి నెడుతూ, మద్యం విక్రయాల్లో అగ్రస్థానంలో ఏపీ తూలకుండా నిలబడిందంటే దాని వెనకాల మన ప్రియతమ ముఖ్యమంత్రి ఉన్నారని చెప్పడానికి గర్విస్తున్నానధ్యక్షా!’– కొందరికి ఏదో డౌటొచ్చి బల్లలు చరచక తటస్థంగా ఉండిపోయారు. ఓ సభ్యుడు అత్యుత్సాహంగా నిలబడి, ‘‘కిందటి మిర్చి సీజన్‌లో అస్సలు ధర లేక రైతాంగం ఎండుమిర్చిని గుట్టలు పోసి యార్డ్‌లో తగలబెట్టినప్పుడు భరించరాని కోరు వచ్చింది. అప్పుడు అధికార యంత్రాంగాన్ని క్షణాల్లో రంగంలోకి దింపి మిర్చి కోరుని, రైతు హోరుని అదుపు చేసిన ఘనత మన ముఖ్యమంత్రిగారిదే అధ్యక్షా! వారికి మీ ద్వారా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెల్పుకుంటున్నానధ్యక్షా!’’ ఇవన్నీ వింటుంటే జానపద రామాయణంలో ఓ ఘట్టం గుర్తొచ్చింది.

హనుమంతుడు రామ పట్టాభిషేక సమయంలో ఒక్కసారిగా ఆవేశపడి, ‘‘నీల మేఘశ్యామ, రామా! చెట్టు చాటు నుంచి వాలిని చంపిన రామా, కోతులతో సేతువు కట్టిన రామా!’’ అంటూ కీర్తించడం మొదలు పెడితే రాముడు అప్‌సెట్‌ అయి ఆపించాడట. రామాయణంలో పిడకల వేట అంటే ఇదే. ఇంతలో ఉన్నట్టుండి, ఓ సభ్యుడు లేచి, సభలో వెల్‌ వైపు నడిచాడు. అంతా నిశ్చేష్టులై చూస్తున్నారు. అధ్యక్షుల వారు కొంచెం కంగారు పడ్డారు. సన్నిటి సందులోంచి పెద్ద శబ్దంతో ఆ సభ్యుడు స్పీకర్‌ కాళ్ల మీద పడి లేచాడు. గౌరవ ముఖ్యమంత్రివర్యులకు మీ ద్వారా పాదాభివందనం సమర్పించుకుంటున్నానధ్యక్షా అనగానే సభ కుదుటపడింది.
రెండు చేతులూ కలసినపుడే చప్పట్లు. ఒంటి చేత్తో మన వీపుల్ని మనం చరుచుకుంటే అవి చప్పట్లు కావు. ఆత్మస్తుతులు.


- శ్రీరమణ

(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement