కొత్త సంవత్సరం, నూతన సంక్రాంతి పర్వంలో అక్షర చైతన్యం రాష్ట్రమంతా అందిపుచ్చుకుంది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తీర్చిదిద్దిన ‘అమ్మఒడి’ చదువులకు సంకురాత్రి శ్రీకారం చుట్టుకుంది. నాగాలు లేకుండా శ్రద్ధగా తమ పిల్లల్ని బడికి పంపే బంగారు తల్లులకు భారీ బహుమతులు అందించే పథకం ‘అమ్మఒడి’. ఈ స్కీమ్ గురించి చెప్పినప్పుడు కొందరు విద్యాధికులు, కలిగినవారు ముక్కున వేలేసుకున్నారు. తమ పిల్లల్ని తాము బడికి పంపితే సర్కారు సొమ్ముని ఎందుకు ఉదారంగా పంచాలని ప్రశ్నించారు. రేప్పొద్దున వాళ్ల పిల్లలు చదివి విద్యావంతులైతే ఆ తల్లిదండ్రులకే కదా లాభం అని సూటిపోటి బాణాలు వేశారు. చదువు సమాజంలో ఒక ఆరోగ్యకర వాతావరణం సృష్టిస్తుంది. విద్యతో సర్వత్రా సంస్కార పవనాలు వీస్తాయి. మన దేశం లాంటి దేశంలో, మన రాష్ట్రం లాంటి రాష్ట్రంలో ప్రభుత్వమే అన్నింటికీ చొరవ చెయ్యాలి.
ఒకప్పుడు పల్లెల్లో సైతం ఆదర్శ ఉపాధ్యాయులుండేవారు. వారే గడపగడపకీ వచ్చి, ఒక గడపలో పదిమంది పిల్లల్ని పోగేసి వారికి తాయిలాలు పెట్టి కాసిని అక్షరాలు దిద్దించి, కాసిని చదివించి వెళ్లేవారు. తర్వాత వారిలో కొద్దిమంది మేం అక్షరాస్యులమని గర్వంగా చెప్పుకునే స్థాయికి వెళ్లారు. వయోజనులైన రైతుకూలీలు పొలం పనిలో దిగడానికి ముందు గట్టున కూర్చోపెట్టి వారాల పేర్లు, నెలల పేర్లు, అంకెలు, అక్షరాలు చెప్పించేవారు. వారు వీటన్నింటినీ ఎంతో ఇష్టంగా నేర్చుకునేవారు. ఈ కాస్త చదువూ వారికి నిత్య జీవితంలో పెద్ద వెలుగుగా ఉపయోగపడేది. ‘మాకూ తెలుసు’ అనే మనోధైర్యం వారందర్నీ ఆవరించి కాపాడేది. తర్వాత బళ్లు వచ్చాయి. నిర్బంధ ప్రాథమిక విద్యని ప్రవేశపెట్టారు.
కానీ మనదేశ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు పిల్లల్ని స్కూల్స్‌కి పంపే స్థితిలో లేవు. ఇద్దరు స్కూలు వయసు పిల్లలుంటే వారు బడికి పోవడంకన్నా కూలీకి వెళితే సాయంత్రానికి కనీసం వారి పొట్ట పోసుకోవడానికి రూపాయో, రెండో వచ్చేది. ఎప్పుడో వారు చదివి సంపాయించే కాసులకంటే, అప్పటికప్పుడు వచ్చిన కాసు తక్షణ ఆకలి తీర్చేది. ఆ విధంగా చదువు వాయిదా పడేది. ఇది మన రాష్ట్రాన్ని స్వాతంత్య్రం తర్వాత నేటికీ పీడిస్తున్న సమస్య. జరుగుబాటున్నవారు, దొర బిడ్డలు వెనక దిగులు లేకుండా సుఖంగా అన్ని దశలలోనూ చదువుకుని స్థిరపడ్డారు. తెలివీ తేటా ఉన్నా రెక్కాడితేగానీ డొక్కాడని పిల్లలు.. మరీ ముఖ్యంగా గ్రామీణ పిల్లలు అసలు చదువుసంధ్యలు మనవి కావు, మనకోసం కావు అనే అభిప్రాయంతో పెరిగి పెద్దయ్యేవారు. కులవృత్తులు నేర్చి కష్టపడి జీవించేవారు. అవి లేని వారు నానా చాకిరీ చేసి పొట్టపోసుకునేవారు.
తిరిగి ఇన్నాళ్లకు జగన్ ప్రభుత్వం విద్యపై సరైన దృష్టి సారించింది. అందులో చిత్తశుద్ధి ఉంది. పల్లెల్లో కుటుంబాలను సాకే తల్లులకు అండగా నిలిచింది ప్రభుత్వం. మీ పిల్లలు కూడా దొరబిడ్డలవలె చదువుకోవాలి. మీ జీవితాలు వికసించాలనే సత్సంకల్పంతో అమ్మఒడి ఆరంభించారు. బాలకార్మిక వ్యవస్థ లేదిప్పుడు. అక్షరాలు దిద్దే చేతులు బండచాకిరీ చేసే పనిలేదు. ముందే సర్కార్ వాగ్దానం చేసిన సొమ్ము వారి ఖాతాలలో జమపడుతుంది. ప్రతి పాఠశాల సర్వాంగ సుందరంగా ఉంటుంది. సర్వతోముఖంగా ఉంటుంది. మంచి భోజనం బడిలోనే పిల్లలకు వండి వడ్డిస్తారు. పుష్టికరమైన, రుచికరమైన అన్నం చదువుకునే పిల్లలకు నిత్యం సకాలంలో లభిస్తుంది. ఉపాధ్యాయులు పిల్లల మెదళ్లకు కావాల్సిన మేత అందిస్తారు. తల్లిదండ్రులు ఈ మహదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పిల్లల ప్రయోజకత్వాన్ని విలువ కట్టలేం. ఒక పచ్చని చెట్టు పెరిగాక అది రోజూ ఎన్ని టన్నుల ప్రాణవాయువు మనకిస్తుంది. అలా ఎన్నా ళ్లిస్తుంది? ఆ ఆక్సిజన్‌కి విలువ కట్టగలమా? ఈ మహత్తర పథకం అక్షర సంక్రాంతిగా వర్ధిల్లాలని ఆశిద్దాం.
శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
Comments
Please login to add a commentAdd a comment