ఏలినవారి మూల ధాతువు | sriramana writes on ap new liquor policy | Sakshi

ఏలినవారి మూల ధాతువు

Published Sat, Jul 8 2017 5:01 AM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

ఏలినవారి మూల ధాతువు - Sakshi

ఏలినవారి మూల ధాతువు

రాష్ట్ర సీఎం పాలిట ఆబ్కారీ శమంతకమణి లాంటిది. నిత్యం పుట్లకొద్దీ బంగారం కురిపిస్తుంది. కానీ మహిళా లోకం హర్షించని, సహించని అంశం ఇది.

అక్షర తూణీరం
రాష్ట్ర సీఎం పాలిట ఆబ్కారీ శమంతకమణి లాంటిది. నిత్యం పుట్లకొద్దీ బంగారం కురిపిస్తుంది. కానీ మహిళా లోకం హర్షించని, సహించని అంశం ఇది.

అప్పుడప్పుడు రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో మందు ప్రస్తావన రాక తప్పదు. అవినీతి నిర్మూలన, ఆశ్రిత పక్షపాతం వహించకుండుట లాంటి అరిగిపోయిన వాగ్దానమే మద్యపాన నిషేధంపై పునరాలోచన. మన జీవి తాల్లో భాగమైంది. రాష్ట్ర ఖజానాకు ముఖ్యాధారమైంది. మద్యాన్ని పక్కనపెట్టి మనుగడ సాగించలేని దుస్థితిలో ఉన్నాం. కిందటి వారం, అంటే జూలై 1 నుంచి 4 దాకా నాలుగే నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో 200 కోట్ల రూపాయల మద్యాన్ని విక్రయించి ఆంధ్రప్రదేశ్‌ బ్రువరీస్‌ కార్పొరేషన్‌ ఒక్కసారి ఒళ్లు విరుచుకుంది. సుప్రీం కోర్టు ఆంక్షలు అమ్మకాలను ఏమాత్రం చెక్కు చెదరనీయలేదు. ఇది మన ఉక్కు సంకల్పానికి నిదర్శనం. ఒక్కసారి లిక్కర్‌ నిజాల్లోకి వెళదాం.

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 4,170 మద్యం షాపులున్నాయి. తిరిగి ప్రతి షాపుకి తగినన్ని కొమ్మలు రెమ్మలు అనబడే బెల్ట్‌ షాపులు రేయింబవళ్లు ఆపన్నులకు సేవలందిస్తున్నాయి. వీటిలో సగానికి పైబడి సుమారు 2,118 విక్రయ శాలలు రాష్ట్ర రహదారులను సుసంపన్నం చేస్తుండగా, వెయ్యికి పైగా జాతీయ రహదారిని పండిస్తున్నాయి. ఏపీలో 746 పానశాలలు అర్ధరాత్రిదాకా మద్యకారుల్ని ఆదుకుంటున్నాయి. వీటికి అనుబంధంగా అనేక పానఘట్టాలు సందడి చేస్తున్నాయి. వీటిని టైరు షాపులంటారు. ఖాళీ ప్రదేశంలో పాత టైర్లే సుఖాసనాలుగా, సకల లాంఛనాలతో పాన ఘట్టాలు నడుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి ఏటా 15,000 కోట్లు ఈ విధంగా జమపడుతోంది. పెరుగుడే కానీ తరుగుడు లేదు.

మద్యానికి యుగయుగాల చరిత్ర ఉంది. కృతయుగంలో క్షీర సాగర మథనంలో పుట్టింది. వారుణి దాని పేరు. నిషా దాని నైజం. అంతకుముందు నిషా, కైపు, మత్తు లాంటి మాటలూ లేవు, వాటి తాలూకు అనుభవాలు లేవు. అప్పట్లో వారుణి రాక్షసుల వాటాలోకి వెళ్లింది. అనంతర కాలంలో అందరికీ సంక్రమించింది. తెలుగునేత ఎన్టీఆర్‌ ‘వారుణి వాహిని’ పేరుతో ప్రభుత్వ సారాయిని తెలుగుగడ్డపై ప్రవహింప చేశారు. మర్యాదస్తులు వారుణిని రకరకాల పేర్లతో సంబోధిస్తుంటారు. ధాతువు, దివ్యధాతువు అని ముచ్చటించుకుంటారు కొందరు. ‘సబ్జెక్ట్‌’ అనీ ‘విషయం’ అనీ గుప్తనామంతో మరికొందరు పిలుస్తారు. నలుగురూ కూర్చుని చర్చించడానికి అనువైనది కనుక విషయం అని పేరు సార్థకమైంది. ఇంతకీ సంగతి ఎక్కడ, సరుకు వచ్చిందా అనుకోవడం ఆనవాయితీ. ఒక మేధావి దినుసునీ అనుపానాలనీ కలిపి ‘ద్రవాలు–ఉపద్రవాలు’ అన్నాడు. దీని ద్వారా తెలుగు భాష చిలవలు పలవలుగా, తామర తంపరగా వృద్ధి చెందింది.

రాష్ట్ర ముఖ్యమంత్రి పాలిట ఆబ్కారీ శమంతకమణి లాంటిది. నిత్యం పుట్లకొద్దీ బంగారం కురిపిస్తుంది. కానీ మహిళా లోకం హర్షించని, సహించని అంశం ఇది. ఇప్పుడిప్పుడే తీగెలు కదుల్తున్నాయ్‌. ఎప్పుడో డొంక ఉద్యమిస్తుంది. ఎక్కడంటే అక్కడ, ఎడాపెడా ఈ దుర్మార్గం ద్వారా సొమ్ము చేసుకోవడం ఆరోగ్యకరం కాదు. కొంచెం ముందుచూపు వహించి, మద్యపాన నిషేధం విషయంలో మన మíß ళలకు చిన్న చిన్న ఆశలు కల్పించండి. ఎప్పటిలాగే మన అజెండాలో నిషేధం చేర్చండి. నందో రాజా భవిష్యతి! ఏరుదాటాక ఏంచెయ్యాలో మనకు కొట్టిన పిండే కదా!                                              


- శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement