
ఉత్తమ పురుష
అక్షర తూణీరం
సూర్యుడీరోజు ఉత్తరాన ఉదయించాడని ప్రావ్దా పత్రిక రాస్తే, సోవియట్ యూనియన్ మొత్తం కాబోలనుకునేదిట. ఆధునిక సాంకేతిక యుగంలో విశ్వవ్యాప్త సమాచారాన్ని అర నిమిషంలో సేకరించగల సామర్థ్యం వచ్చింది. కానీ రెండేళ్ల సమయం ఇచ్చినా నిజాన్ని నిజంగా బయట పెట్టగల వ్యవస్థ మాత్రం రాలేదు.
అభద్రతా భావం వెన్నాడు తున్నప్పుడు, ‘నేను’ అనేది అప్రయత్నంగా వచ్చేస్తుందని మానసిక నిపుణులు విశ్లేషిస్తూ ఉంటారు. మన ప్రియతమ నాయకుడు ఇటీవల కాలంలో నేనుని తెగ ఆరాధిస్తున్నారు. నేనుకి స్వాగతం, నేనుకి నమ స్కారం, నేను కే అభినందనలు - ఈ ధోరణిలో సభలు సాగుతున్నాయని జనాభిప్రాయం. కొన్ని నిజాలే అయినా, సొంతం చేసుకుని ప్రకటిస్తే అది స్వోత్కర్ష అని పించుకుంటుంది. గాంధీజీ నిండు సభలో ‘‘ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది నేనే’’ అని ప్రకటిస్తే వినడానికి శ్రావ్యంగా ఉంటుందా? జనసామాన్యం అనుకోవాలి - ఈ మహనీయుడే బానిసత్వం వదిలించాడని. అది మర్యాదగా ఉంటుంది.
అసలు మనలాంటి ప్రజారాజ్యంలో ‘నేను’ ప్రయో గించాల్సిన అవసరమే లేదు. నేను పింఛను పెంచాను. నేను రేషన్ ఇచ్చాను. వంతెన నిర్మించింది నేనే. ఒలింపిక్స్‌లో నావల్లే పతకం వచ్చింది. ఇంకా ఇలాంటి నిర్మొహమాటమైన ప్రకటనలు నిత్యం వింటూనే ఉన్నాం. తిరుమలకి ఇంతటి దివ్యకళ వచ్చిందంటే దానికి కారణం నేను. శ్రీహరికోట నుంచి గురితప్పక ఉపగ్రహాలు కక్ష్యల్లో కూచుంటున్నాయంటే నా సంకల్ప శుద్ధిగాక మరొకటి కాదు.
ప్రభుత్వంలో ఉన్నవారంతా అక్షరాలా మహానేతకు అనుచరులు. అందుకని పాపం వారంతా నేను మేము మరిచి, వారు అనే వాడతారు. అధికార వర్గమైతే అసలు మాట్లాడే పనే లేదు. ‘‘ఫోర్త్ ఎస్టేట్‌గా స్థానం సంపా దించుకున్న మీడియా హాయిగా చుట్టలు చుట్టుకు పడు కుంది. శ్రీవారికి వెన్నుదన్నుగా పడగ పడుతోంది’’ అంటూ ఒకాయన తీవ్ర స్వరంలో బాధపడ్డాడు. ‘‘రాష్ట్రా నికి ప్రత్యేక హోదా లాభమా, ప్యాకేజి లాభమా అనే అంశంమీద మేధావుల అభిప్రాయాల్ని వెల్లడించరేంటి? జనానికి నిజం చెప్పాలి కదా’’ అంటూ ఒక సీనియర్ సిటిజన్ ఆందోళన పడ్డాడు. ప్రస్తుతం మీడియా రంగు రుచి వాసన మారిపోయాయని ఎవరైనా అరిస్తే, ‘‘ఆయన్ని పట్టించుకోకండి. విభేదించడమే ఆయన నైజం. అందుకే ఆయన షైన్ అవలేదు’’ అంటూ ముద్ర వేసి వదిలేస్తారు.
వెనకటికి ప్రావ్దా పత్రిక గురించి బోలెడు వార్తలు ప్రచారంలో ఉండేవి. సూర్యుడీరోజు ఉత్తరాన ఉదయిం చాడని ప్రావ్దా రాస్తే, యుఎస్‌ఎస్‌ఆర్ మొత్తం కాబోలను కునేదిట. మాస్కోలో తీవ్రంగా ఎండకాస్తుంటే, మంచు కురుస్తోందని ఆ పత్రిక చెబితే అక్కడి వారంతా చలి కోట్లు, మఫ్లర్లు ధరించి తిరిగేవారట. ఆధునిక సాంకేతిక యుగంలో విశ్వవ్యాప్త సమాచారాన్ని అర నిమిషంలో సేకరించగల సామర్థ్యం వచ్చింది. కానీ రెండేళ్ల సమ యం ఇచ్చినా నిజాన్ని నిజంగా బయట పెట్టగల వ్యవస్థ మాత్రం రాలేదు.
శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)