సురభి నాట్యమండలికి సుదీర్ఘ చరిత్ర ఉంది...
జాతిగర్వం ‘సురభి’
సురభి నాట్యమండలికి సుదీర్ఘ చరిత్ర ఉంది. రంగస్థలంపై పౌరాణిక నాటకాలను ప్రదర్శిస్తూ, సందర్భోచితంగా కొన్ని సంఘటనలను స్టేజీపై చూపి ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తడం సురభి ప్రత్యేకత. ‘కృష్ణలీలలు’ నాటకంలో జైలు తాళాలు తమంతట విడిపోయి తలుపులు తెరుచుకోవడం, ‘మాయాబజార్’లో పలు సన్నివేశాలు, నీటి ప్రవాహంలో ఏనుగు నీరు తాగడం, హరిశ్చంద్రలో చితిమంటలు... ఇలా అత్యంత సహజంగా ప్రదర్శించేవారు.
ఈ ట్రిక్ వర్క్స్‌ని టైర్ వర్క్స్ అని కూడా పిలిచేవారు. సురభి సంస్థలోని వారంతా సర్వ సమర్థులు. ఏ వేషమైనా వేయడానికి సిద్ధం, మేకప్ చేసుకోగలరు, చేయగలరు. రంగస్థలంపై తెరలు కట్టడం, వాటిని నిర్వహించడం అందరికీ కొట్టిన పిండి. పాడడం, హార్మోనియం వాయించడం మాత్రమే కాక, పెట్రోమాక్స్ దీపాలు వెలిగించడం, వాటిని జాగ్రత్తగా పోషించడం కూడా సురభి పరివారమంతకీ క్షుణ్ణంగా తెలుసు. సురభి నాట్యమండలి ఏడాది పొడుగునా దేశం మీద తిరుగుతూ ఉండేది. ఆగిన చోట రెండు - మూడు వారాలపాటు ఉండి, వారి నాటకాలన్నింటినీ ప్రదర్శించేవారు. పురజనుల కోరికపై కొన్ని నాటకాలకు రెండు - మూడు ప్రదర్శనలిచ్చేవారు. సురభి విడిది చేసిందంటే ఆ ప్రాంతానికి పెద్ద సందడి. ఇది వందేళ్ల పైమాట.
అది 1903-ఏప్రిల్ 4 అర్ధరాత్రి. నైజాం పలుకుబడిలో ఉన్న అలనాటి హైదరాబాద్‌లో సురభి ప్రదర్శనలిస్తోంది. నటనకి, గాత్రానికి పేరుబడ్డ నటి వెంకుబాయి నాటకంలో ఒక ప్రముఖ పాత్ర పోషిస్తోంది. మామూలుగా అయితే సురభిలో తెరపడినా తిరిగి లిప్తపాటులో కొత్త దృశ్యం వచ్చేస్తుంది. కానీ నాటకంలో రెండు నిమిషాలు విరామం ప్రకటించారు. ఆశ్చర్యం! సురభి వేదిక మీదకు ఒక కొత్త పాత్ర ప్రవేశించింది.
అప్పుడే జన్మించిన తన బిడ్డను పొత్తిళ్లలో చేతులలో పట్టుకుని వెంకుబాయి వేదికపైకి వచ్చింది. నూతన పాత్రను సగర్వంగా సురభివారు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ప్రేక్షకులు ఆనందోద్వేగాలతో హర్షధ్వానాలు చేశారు. ఆ పసిపిల్లే ‘సురభి కమలాభాయ్’. ప్రేక్షకులు అప్పుడే పుట్టిన పిల్లకు డబ్బులు చదివించారు. మనసారా దీవించారు.
మూడు నాలుగేళ్లకే కమల కూత పట్టింది. ఇంకో ఏడాది తిరిగే సరికి నాటకాల్లో బాలకృష్ణుడు, ప్రహ్లాదుడు వేషాలు ధరించడం ప్రారంభించింది. నాట్యం, సంగీతం నేర్చింది. విశేషంగా నాటకాలు ప్రదర్శించింది. మొట్టమొదటి తెలుగు సినిమా భక్త ప్రహ్లాద (1932)లో లీలావతిగా నటించిన ‘తొలి తార’ కమలాబాయి. కడదాకా ఆమె నాటకాలలో, సినిమాలలో నటిస్తూనే ఉన్నారు. పాతాళ భైరవి, మల్లీశ్వరి లాంటి పలు చిత్రాల్లో ముఖ్య భూమికలలో కనిపిస్తారు. సాక్షాత్తూ రంగస్థలం మీద పుట్టి, రంగస్థలంపై పెరిగిన సురభి కమలాబాయి 1971, ఫిబ్రవరి 13న కన్నుమూశారు. ‘తొలి తార’ రాలిపోయింది. కథగా మిగిలిపోయింది.
మరీ దారుణం?
ఒక కార్యశీలి తనకు సంక్రమించిన పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అలంకారాలు మూడింటినీ పేరు ముందు తగిలించుకున్నాడు. ‘‘ఆపైవి వచ్చాక ఈ కిందివి అవసరం లేదండీ’’ అంటూ పలువురు సూచించారు. అందుకు కా.శీ.గారు నవ్వి, ‘‘మూడింటికీ చెమటోడ్చాను. ఏ ఒక్కటీ నాకు అప్పనంగా రాలేదు’’ అంటూ తన నిశ్చితాభిప్రాయాన్ని స్పష్టం చేశారు. ఎప్పుడూ ప్రాజ్ఞులు తొలిమెట్టును విస్మరింపరు!
మోక్ష సిద్ధి!
కృష్ణరాయలకి వ్యాసతీర్థులు అత్యంత ఆత్మీయ గురువులు. తీర్థులు రాయలకి శ్రేయోభిలాషి. ఒక సమయంలో విజయనగర సింహాసనాన్ని ‘కుహుదోషం’ ఆవహించింది. దాని ప్రభావం వల్ల సింహాసనాధీశుడు మృత్యువాత పడి తీరతాడని శాస్త్రం చెబుతోంది. అప్పుడా దోషకాలంలో వ్యాసతీర్థులు సింహాసనం అధిష్టించి, గండాన్ని జయించి బయటపడ్డారు. అప్పటినుంచి వ్యాసరాయలుగా, వ్యాసరాయ స్వామిగా వాసికెక్కారు. ఈ మధ్వ గురువుని కృష్ణరాయలు భయభక్తులతో కొలుచుకున్నాడు.
భువన విజయాలకు వ్యాసరాయ స్వామితో పాటు కనకదాసు వంటి దళిత పండితులూ వచ్చేవారు. ఇది మిగిలినవారికి కొంచెం కష్టంగానే ఉండేది. ఒక పండిత సదస్సులో ‘ఎవరు మోక్షానికి పోగలవారు’ అనే ప్రశ్న పుట్టి అందరి ముందూ తిరిగింది. ఉద్దండ పండితులంతా తమకు తోచిన విధంగా జవాబులు చెప్పారు. కనకదాసు వంతు వచ్చినప్పుడు, ‘నేను పోతే పోతాను’ అని జవాబు వచ్చింది.
ఒక్కసారి పండిత సభ ఆగ్రహంతో గుసగుస లాడింది. నోరెత్తడానికి వ్యాస స్వామి భయం. వ్యాసస్వామి ఒక్క క్షణం ఆగి కనకదాసు మాటని వ్యాఖ్యానిస్తూ, ‘భేష్! అలతి మాటలతో కనకదాసు లెస్సగా చెప్పాడు. నేను అంటే అహం. అహం పోతే మోక్షానికి ఎవరైనా పోగలరు’ అంటూ భాష్యం చెప్పారు. సభ చప్పట్లతో ప్రతిధ్వనించింది. గుసగుసలు తలదించుకున్నాయి.
గమనిక
ఇటీవల ఒక తెలంగాణ ప్రాంత చెక్‌పోస్ట్‌లో అంతర్రాష్ట్ర రవాణా సుంకం వడ్డించిన సందర్భంగా అట్టమీద ఈ అక్షరాలు కనిపించాయి! ‘వెనుకటి వలె కాదురా! వెర్రినాగన్నా!’
- ఇట్లు
తె.రా.ర.సం.
రేలంగోడు
ఆ రోజుల్లో రేలంగి పేరు తెరమీదకు రాగానే థియేటర్లో ప్రేక్షకులు విరగబడి నవ్వేవారు. జనానికి ఆయనంటే అంత అభిమానం, నవ్విస్తాడని గట్టి నమ్మకం. రేలంగి వెంకట్రామయ్యలో గొప్ప నటుడే కాదు, గొప్ప తాత్వికుడు కూడా ఉన్నాడు. మీకు నచ్చిన మంచి జోక్ ఏమిటండీ అని ఒక పాత్రికేయుడు అడిగితే, ‘‘లైఫ్ అనగా జీవితం, జీవితం అనగా లైఫ్’’ అన్నారట నవ్వేస్తూ. తర్వాత ఓ క్షణం ఆగి, ‘‘రాళ్లూ రత్నాలు తిని హరాయించుకునే రోజుల్లో మరమరాలు కూడా దొరకవు. తీరా కష్టపడి రాళ్లూ రత్నాలు పోగేసుకున్నాక, మరమరాలు కూడా అరగవు’’ అని హాయిగా నవ్వేశారట.
ఇంత హాస్యం పండిస్తూ, ఇందర్ని నవ్విస్తున్న మీకు జీవితంలో ఎదురైన ట్రాజెడీ ఏదైనా ఉందా అని రేలంగిని అడిగితే, ‘ఉంది బాబూ ఉంది’ అంటూ మొదలుపెట్టారు. ‘‘మా నాన్న పోయినప్పుడు మా ఊరు వెళ్లాను. నాన్నగారి శవంతో కూడా కన్నీళ్లతో నడుస్తున్నాను. చూసేవారంతా రేలంగోడ్రోయ్ అంటూ కేరింతలు కొడుతూ నవ్వడం నేను జీర్ణించుకోలేని సంఘటన. వాళ్లని తప్పుబట్టలేను, నన్ను నేను ఓదార్చుకోలేను’’ అంటూ వివరిస్తున్నప్పుడు ఓ కంట ఆనందబాష్పాలు మరోకంట కన్నీళ్లు జారేవి. తెలుగు చిత్ర ప్రపంచంలో రేలంగిది ఒక శకం. ఒళ్లు దగ్గర పెట్టుకుని నటించేవాడు. నటన ఆయనతో ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండేది.