మానవ సంబంధాల రుచి | About Sri Ramana Manava Sambandhalu | Sakshi
Sakshi News home page

మానవ సంబంధాల రుచి

Published Fri, May 18 2018 2:57 AM | Last Updated on Fri, May 18 2018 2:57 AM

About Sri Ramana Manava Sambandhalu - Sakshi

‘టెంకతో ఎంత సంభాషించినా తనివి తీరదు....’ శ్రీరమణ గారి ‘మానవ సంబంధాలు’ సంకలనంలోని వాక్యమిది. బరువైన పదబంధాలలోకెల్లా బరువైనది– మానవ సంబంధాలు. మనమే మేడ్‌ డిఫికల్ట్‌ చేసేసుకున్న పదబంధమేమోననిపిస్తుంది. అలాంటి మానవ సంబంధాల దండలో దారం రహస్యం విప్పారు శ్రీరమణ. అవి ఎలా అంటు కడతాయో కళ్లకు కట్టారు. ‘మామిడి–మానవ సంబంధాలు’ రచన చదివాక బాల్యంలో తగిలిన ఆ కాయ లేదా పండులోని పులుపు, తీపి, వగరు ఒక్కసారిగా నాలుక మీద నర్తిస్తాయి. వృద్ధాప్యం ‘పులి’లా దూసుకు వచ్చిన తరువాత ఇది మరింత నిజం. మామిడి కదా! ఈ ఒక్క రచనతోనే తనివి తీరలేదు. ‘మామిడిపళ్లు–మానవ సంబంధాలు’ పేరుతో ఇంకో మాగ ముగ్గిన రచననూ అందించారు. అందులో జయప్రకాశ్‌ నారాయణ్, గోయెంకాలతో ఎదురైన నూజివీడు రసం వంటి అనుభవాన్ని ఆవిష్కరించారు.
ఈ రచనల నిండా వ్యంగ్యమే. చలోక్తులే. నానుడులు, న్యూనుడులు, సామెతలూను. అమాయకత్వం నుంచీ మేధో బరువెరుగని జీవనం నుంచీ వెల్లువెత్తిన హాస్యరసం ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఏ వ్యవస్థ శ్రీరమణగారి కలం పోటు నుంచి తప్పించుకోలేదు. అలా అని ఎవరినీ నొప్పించరు. ‘గుత్తి వంకాయకూర– మానవ సంబంధాలు’ పేరుతో వచ్చిన మొదటి రచనే పాఠకులను నోరూరించేసి, మారువడ్డన కోసం ఎదురు చూసేటట్టు చేసింది. ముక్కు, బంగారం, మామిడి, సైకిలు, మైకు, రైలు, రింగ్‌టోన్లు, దీపావళి, పుస్తకాలు, సినిమా, కవిత్వం, చదువు, లిఫ్టు, ఓట్లు, సెల్‌ఫోన్లు, క్రికెట్టు, వాస్తు– ఇలా 91 అంశాలను తీసుకుని మానవ సంబంధాలని పేనుకొచ్చారు. ముక్కు ప్రయోజనాలేమిటని ఒక కుర్రాడిని అడిగితే, ‘అది లేకపోతే కళ్లజోడు పెట్టుకోలేం!’ అన్నాడట. ఈ మోతాదు చాలని పాఠకులని మరోచోటికి తీసుకువెళతారు రచయిత– అది గద్దముక్కువారిల్లు. వారింట అందరివీ గద్ద ముక్కులేనట. ‘లిఫ్టూ – మానవ సంబంధాలు’ అనేది మరో రచన. లిఫ్ట్‌ మానవ సంబంధాలను ఎలా మార్చేసిందో వివరిస్తారిందులో. కానీ ఆ ఉచ్ఛనీచ చలన పేటికలలో అనగా లిఫ్టులలో మనుషులు అలా అతుక్కుపోయి పైకీ కిందకీ ప్రయాణిస్తే కొత్త చిక్కులు రావా? డాక్టర్‌ను అదే అడిగాడు ఒకడు, ‘లిఫ్ట్‌లో ఎయిడ్స్‌ రావడానికి అవకాశం ఉందా?’ అని. ఆ డాక్టర్‌ ‘అవకాశం అయితే ఉందికానీ, చాలా శ్రమతో కూడిన వ్యవహారం’ అని సెలవిచ్చాడట. ఇక పబ్లీకున జరిగే సెల్‌ఫోను వాడకం ఈ పాడు లోకాన ఏల పుట్టితిమి అనిపిస్తూ పరులను ఎంత వైరాగ్యం లోకి నెట్టివేస్తుందో చెబుతుంది– ‘సెల్‌ఫోనూ– మానవ సంబంధాలు’. కానీ అబద్ధాలాడ్డానికి సెల్‌తో ఉన్న సౌలభ్యమే వేరు. 
 మానవ సంబంధాలకి బెడదగా మారగల వ్యవస్థల గురించీ ఉంది. ‘కవిత్వంతో మానవ సంబంధాలు విపరీతంగా దెబ్బ తింటాయి’అంటారు రచయిత. అయితే ఆ కళ ఉన్న కవులు వేరయా అని చెప్పడమే ఇక్కడ రచయిత కవి హృదయం. ఇది చూసి కవులు కక్షాకార్పణ్యాలు పెంచుకోనక్కరలేదు. ఎందుకంటే, నాస్తికులు ప్రపంచమంతటా ఉన్నా దేవుడికొచ్చిన ఫరవా ఏమైనా ఉందా? కవిత్వం కూడా అంతేనని మంగళవాక్యమే పలికారు. ‘ఇప్పుడు పళ్ల డాక్టర్‌ దగ్గ
రికి వెళితే నిజానికి బంగారు పన్ను కట్టించుకోవడమే చౌక అనిపిస్తోంది’ (బంగారం–మా. సం.), ‘మోకాళ్లని చూసి వీడు ఈ మధ్యే సైకిల్‌ నేర్చాడని ఇట్టే పసిగట్టే వాళ్లు (సైకిలు–మా.సం.), ‘లిఫ్టు మనిషి అంతస్తుని క్షణంలో మారుస్తుంది’ (లిఫ్టూ–మా.సం.) వంటి న్యూనుడులు విరివిగానే కనిపిస్తాయి. శ్రీరమణ తెలుగునాట అపురూప రచయిత. ఆయన కలం నుంచి వచ్చిన అనేక అద్భుత రచనలలో ఇదొకటి. పేరడీ వంటి రసరమ్యమైన ప్రక్రియని కాపాడుతున్నవారాయన ఒక్కరే. ఆస్వాదించవద్దూ మరి!
శ్రీరమణ మానవ సంబంధాలు, 
ప్రిజమ్, పే 312, ధర: రూ. 295.


- గోపరాజు నారాయణరావు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement