పద్మాసనం ఓ కుట్ర | Sri Ramana writes opinion for Ap CM yogasanam | Sakshi
Sakshi News home page

పద్మాసనం ఓ కుట్ర

Published Sat, Jun 24 2017 9:56 AM | Last Updated on Sat, Aug 18 2018 6:18 PM

పద్మాసనం ఓ కుట్ర - Sakshi

పద్మాసనం ఓ కుట్ర

అక్షర తూణీరం
టెక్నాలజీ ప్రియుడైన చంద్రబాబు ‘‘మద్యం యాప్‌లు’’, ‘‘తలచుకోగానే తలుపు తడతా’’ లాంటి స్కీములు ఆవిష్కరించకుండా ఉంటే అదే చాలు.


ఇంకా నా చేతులు బారలు చాపి ఉన్నట్లే అనిపిస్తోంది. ఇంకా నా కాళ్లు పద్మాసనంలో ముడిపడి ఉన్నట్లే అనిపిస్తోంది. మోదీ దేశ ప్రధానిగా పగ్గాలు పట్టగానే, ఓంకారాలతో యోగాసనాలు ఒక్కసారిగా మేల్కొన్నాయ్‌. సర్వ రోగాలకు విరుగుడు ఇదేనన్నారు. ఎక్కడెక్కడివాళ్లూ కాళ్లూ చేతులూ విదిలించారు. శ్వాసమీద దృష్టి పెంచారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొరవా? యోగా స్పృహని విశ్వవ్యాప్తం చేయడమే ప్రధాని ప్రధాన లక్ష్యం అన్నారు. ఓంకారం కొంచెం బాగా కాంట్రవర్సీ అయితే, పోన్లెమ్మని దాన్ని పక్కన పెట్టేశారు.

ఆసనం ద్వారా పద్మం గుర్తుని జనంలో ముద్ర వేస్తున్నారని, ఇది భాజపా పన్నిన కుట్రగా గిట్టనివారు ఆరోపిస్తున్నారు. రాబోయే రోజుల్లో, వంగి తమ పాదాలను తాము ముట్టుకోలేని వారిని అన్‌ఫిట్‌ చేస్తారనీ, సంఘ్‌ వారంతా అలవోకగా పాదాలు తాకి ఫిట్‌ అయిపోతారనీ చెప్పుకుంటున్నారు. మోదీ, ఆయన సహచరులు మన దేశ పౌరుల శరీరాలను యోగాతో వజ్రకాయాలు చేసే మహా సంకల్పంతో జటిలమైన మత్స్య, కూర్మ, వరాహ, వామనాది ఆసనాలను సైతం జనం మీదికి తెస్తున్నారు. మనోవాక్కాయ కర్మలను యోగాతో ఒకే తాటికి తెమ్మంటున్నారు–జీఎస్టీ విధానం లాగా.

దేశ పౌరుల ఆరోగ్యం కోసం ఇంతగా ఆయాసపడే బడా నేతలు– జనాన్ని చిన్న చిన్న వ్యసనాలకు దూరంగా ఉంచే ప్రయత్నం ఎందుకు చెయ్యరో పాపం! బీడీ కట్లమీద పుర్రెబొమ్మ వేసి అనారోగ్య హెచ్చరిక చేయడానికి జంకుతారు. స్వతంత్ర సమరంలో  సంపూర్ణ మద్యపాన నిషేధం వద్దనుకున్నా, కనీసం వారంలో రెండు రోజులు ఆరోగ్య దినాలుగా ప్రకటించి దేశాన్ని పొడిగా ఉంచగలరా? ఉంచలేరు. ఎందుకంటే మందుపై వచ్చే ఆదాయం ప్రభుత్వాలకు ఒక వ్యసనంగా మారింది. మద్యపాన నిషేధం ప్రతి ఎన్నికలకి పనికొచ్చే గొప్ప అస్త్రం. పాపం మహిళలు ప్రతిసారీ ఆశపడి మోసపోతూ ఉంటారు.

ఆరుగాలం కష్టించే రైతులకు, రైతు కూలీలకు, పరుగులతో బతుకు గడిపే చిరుద్యోగులకు యోగాసనాలతో పనిలేదు. తాగుడుకీ, పొగకీ దూరంగా ఉంచితే చాలు. రాష్ట్ర ఖజానా కోసం వారితో చీప్‌ లిక్కర్‌ తాగించకుండా ఉంటే అదే పదివేలు. సమాజంలో పోలీసులు, ఎలిమెంటరీ టీచర్లు, గుడి పూజారులు మందుకి దూరంగా ఉంటే దేశం క్రమంగా ఆరోగ్యవంతమవుతుందని ఒక అనుభవశాలి చెప్పాడు. టెక్నాలజీ ప్రియుడైన చంద్రబాబు ‘‘మద్యం యాప్‌లు’’, ‘‘తలచుకోగానే తలుపు తడతా’’ లాంటి స్కీములు ఆవిష్కరించకుండా ఉంటే చాలు. షోడశకర్మల్లో ‘‘మందు ముట్టించడం’’ (దర్భపుల్లతో) చేర్చకుందురు గాక!

 

 

శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement