విశ్లేషణ
నేటి మన ‘ప్రజాస్వామ్యం’ మేడిపండులా ఉంది. కుల, మత తత్వాలు స్వైర విహారం చేస్తు న్నాయి. ‘ధనస్వామ్యం’ రాజ్యమేలుతున్నది. కమ్యూనిస్టు పార్టీలు, ఇతర రాజకీయపక్షాలు, ప్రజాస్వామ్య శక్తులు లౌకికత కోసం తక్షణమే ఏకం కావాలి. అణగారిన దళిత, ఆదివాసి, మహిళా, మైనారిటీ, వెనుకబడిన కులాల ప్రజానీకం, దేశభక్తియుత శక్తులు, ఐక్యమై ఈ దిగజారుడును నిలువరించేందుకు మహత్తర ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలి. స్వార్థ, సంకుచిత రాజకీయ చక్రభ్రమణానికి అతీతంగా మరో స్వతంత్ర పోరాటం అవసరం.
ఇంతవరకూ మన ప్రజలెన్నడూ ఎరుగనంతటి ప్రజా వ్యతిరేక, మతతత్వ, కులతత్వ, నిరంకుశ, ధనస్వామ్య పాలన కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ సాగు తున్నది. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆశయాలను భూస్థాపితం చేసిన చంద్రబాబు ఇక్కడ అధికారంలో ఉండగా, గుజరాత్‌లో సాగిన మత తత్వ రక్తతర్పణానికి బాధ్యత వహించవలసిన నాటి బీజేపీ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ కేంద్రంలో ప్రధానిగా ఉన్నారు. తమాషా ఏమంటే, ఆనాడు గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి మోదీ రాజీనామా చేయాలని కోరిన చంద్ర బాబు.. తిరిగి ఏనాడూ బీజేపీతో పొత్తు పెట్టుకోనని 2004 ఎన్నికల్లో బహి రంగంగా ప్రకటించారు. ఒట్టుతీసి గట్టునపెట్టి, నిర్లజ్జగా పదవీ వ్యామో హంతో 2014 ఎన్నికలో అదే బీజేపీతో జతకట్టి, ఎన్డీఏలో భాగస్వామి కూడా అయినారు.
విదేశాల్లోని నల్లధనం ఏదీ?
‘ఎన్నికల ప్రజాస్వామ్యం’లో ప్రజలకు అలవిగాని వాగ్దానాలతో అర చేతిలో వైకుంఠం చూపించి, వంచించే కళలో ఆరితేరడం ఒక ప్రధాన అర్హతగా నిరూపితమైంది. ‘అధికారంలోకి వచ్చిన 15 రోజులలోగా మన కుబేరులు దేశంలో అక్రమంగా సంపాదించి విదేశాలలో దాచిన లక్షల కోట్ల నల్లధనాన్ని దేశానికి తిరిగి తీసుకువచ్చి, ప్రతి సామాన్య భారతీయుని బ్యాంకు ఖాతాలో రూ. 15 లక్షలు జమ చేస్తామని 2014 ఎన్నికల్లో మోదీ వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చి 30 నెలలయినా ఒక్క రూపాయి కూడా అలా జమ కాలేదు. పైగా ‘‘స్వచ్ఛందంగా మీవద్ద ఉన్న నల్లధనాన్ని ప్రకటిస్తే మీపై చర్య లుండవు. మీకు రాయితీ కూడా ఇస్తాం’’ అంటూ ఆయన ప్రభుత్వం, నల్లధన కుబేరులను ప్రాథేయపడుతున్నది. వాగ్దాన భంగ వంచనా శిల్పంలో చంద్ర బాబు అగ్రగణ్యులని తెలిసిందే, ముఖ్యంగా ఈ రెండేళ్ల పాలనలో ఆయన అది నిరూపించి చూపారు. అయినా వారిరువురి విజయం ‘ప్రజాస్వామ్య’ విజయమేనట!
ఇది మతస్వామ్యం, కులస్వామ్యం
ఎన్నికలలో ప్రజల మధ్య మతపరమైన చిచ్చుపెట్టి మెజారిటీ మతం వారు భావోద్వేగాలకు గురయ్యేలా చేసి, అందుకోసం బీజేపీ వంటి పార్టీలు ఎంతకైనా తెగించడానికి ప్రయత్నించడం చూస్తున్నదే. ప్రతి ఎన్నికలకూ అయోధ్యలో రామాలయ నిర్మాణం తెరపైకి వస్తూనే ఉంటుంది. అయోధ్యలో రామాలయ నిర్మాణం ఖాయమే అయినా... ఏడాది లోపల (ఉత్తరప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల ఎన్నికల ముందు) అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి మ్యూజియం నిర్మిస్తామంటున్నారు. ఇది, హిందూ మతతత్వం కాదనీ, ‘టూరిజం’ దృష్టితో కోట్లాది శ్రీరామ భక్తులను ఆకర్షించే ఆదాయ వనరు మాత్రమేననీ కేంద్ర పర్యాటక మంత్రి ఉవాచ. అంటే పేరు రాముడిది, పైసలు ప్రభుత్వానికి. ‘అందరికీ వికాసం అందరికీ అభివృద్ధి’ అన్న మోదీ నినాదం... ఆచరణలో పరమత ద్వేషమే ప్రధానంగా గల మతతత్వంతో మనుగడ సాగిస్తున్నది.
అందుకే ముస్లిం స్త్రీలకు వ్యతిరేకమైన ‘తలాక్’ విధానాన్ని రద్దు చేసేందుకు ఆదేశిక సూత్రాలలోని ఉమ్మడి పౌర స్మృతిని ఎజెండాలోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం.
ముస్లిం మహిళలకు తగు న్యాయం జరగాల్సిందే. కానీ హిందూ మహిళలు, పురుషులతో సమానంగా జీవించ గలుగు తున్నారా? అలాగే క్రిస్టియన్ మహిళలకు న్యాయం జరగనక్కరలేదా? ఇంతెం దుకు? పార్లమెంటులో స్త్రీలకు 30 శాతం స్థానాలు రిజర్వు చేయాలన్న ప్రతి పాదన రెండు దశాబ్దాలుగా పార్లమెంటులో నానుతూనే ఉన్నది. ఆదేశిక సూత్రాలను అమలుపరచడం అన్నది నెపం కాకపోతే... వాటిలోనే ఉన్న ప్రజోపయోగకరమైన మద్యపాన నిషేధం వంటి అంశాలను అమలు జర పరేం? మతతత్వం, కులతత్వం ఆధారంగా ఓట్లు పొంది గద్దెనెక్కడం మన ప్రజాస్వామ్యం ప్రత్యేకత. ఏపీ జనాభాలోS6–7 శాతం కూడా లేని ఆధిపత్య కులాల అధికార దర్పం మనమెరిగినదే. ప్రస్తుత ప్రభుత్వం కులాధిపత్య సాధన విషయం మన శాసనసభలో, మంత్రి వర్గంలో వారి ఆధిపత్య కులం ఎంత శాతంగా సాపేక్షికంగా అధికంగా ఉన్నదో చూస్తున్నాం. కులతత్వంలో కూరుకుపోయినా, మతతత్వంలో మునిగిపోతున్నా ‘మన ప్రజాస్వామ్యం’ అందరికీ ఆదర్శమని పాలక వర్గాల ప్రచారం. అంతేకాదు 2014 ఎన్నికలలో మరో ముఖ్య కులం ఓట్లు తమ వైపు తిప్పుకునేందుకే పాపులర్ సినిమా నటుడు పవన్ కల్యాణ్ మద్దతు కోసం చంద్రబాబు ప్రాకులాడారని తెలి సిందే. ఇదీ మన ‘కులస్వామ్య’ ‘మతస్వామ్య’ ప్రజాస్వామ్య స్వరూపం.
‘ఓటుకు కోట్లు’ అవినీతి కాదట!
ప్రజలలో నూటికి 70 శాతం కేవలం పొట్ట నింపుకోడానికే పడరాని పాట్లు పడుతుంటే... పార్లమెంటులోని ప్రజా ప్రతినిధులలో దాదాపు సగం మంది దశ, శత, సహస్ర కోటీశ్వరులు. ఈ ఆర్థిక అసమానతలు నానాటికీ పెరు గుతుండగా, ధనరాశులు కుప్పలుతెప్పలుగా వృద్ధి చేసుకుంటున్న కోటీ శ్వరులను చూసి ‘‘ఆహా! మన దేశం ఎంతగా అభివృద్ధి చెందుతున్నదో’’నని గొప్పలు చెప్పుకుంటున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొనడం, ఇతర ప్రలోభాలు పెట్టి తమవైపు తిప్పుకోవడమూ, తద్వారా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడమూ సర్వసాధారణమై పోయింది. ఇక మన సీఎం చంద్రబాబు ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిన ‘ఓటుకు కోట్లు’ ఉదంతం గురించి చెప్పనవసరమే లేదు. ‘ఈ కేసు ఎన్నికల అవకతవకలకు సంబంధించినదేగానీ’ అవినీతి పరిధిలోకి రాదని బాబు తరఫున అటార్నీ జనరల్ చేసిన వితండ వాదన అపూర్వం. డబ్బు సంచులతో ఎన్నికలను అపహాస్యం చేసినా అది అవినీతి కాదట. ‘వచ్చే ఎన్నికల నాటికి ప్రతిపక్షం అనేది ఉండరాదని’ ఒక సీఎం స్వయంగా చెబుతున్నారు. అంతే కాదు తదనుగుణంగా ప్రతిపక్షం పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. మరీ నగ్నమైన ఉదాహరణ వంద ఓట్ల మెజారిటీతో గెలిచిన మన కోడెల శివప్రసాద్ 2014 ఎన్నికలలో 11 కోట్ల రూపాయలకుపైగా తాను ఖర్చు చేసినట్లు బాహాటంగా చేసిన ప్రకటన. అయినా ఎన్నికల కమిషన్ ఆయనపై ఏ చర్యనూ గైకొనలేదు.
సైనిక చర్యను చిన్నచూపు చూడటమేగా?
ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మున్నెన్నడూ లేనంతగా దిగజారి యూపీ సహా నాలుగు రాష్ట్రాల ఎన్నికలలో అనుమానాస్పదమైన తమ విజయం కోసం మన సేనల ప్రతిష్టను, గౌరవాన్ని, ప్రజలలో వారి పట్ల ఉన్న ప్రేమాభి మానాలను ‘ఓట్ల’కు వాడుకుని గట్టెక్కాలని బీజేపీ కుయుక్తులు పన్నడం గర్హనీయం.
ఇటీవల ఆక్రమిత కశ్మీర్ వెంబడి సరిహద్దులలోనీ యుడీ సెక్టర్‌లో, పాక్ సైన్యం అండదండలతో ఉగ్రవాదులు దొంగ దెబ్బతీసి 20 మంది మన వీర జవాన్లను పొట్టన పెట్టుకున్నారు. ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రమూక దాడికి సహజంగానే మన ప్రజానీకం దేశభక్తితో స్పందించారు. అయితే మన సైన్యం ఆ దుశ్చర్యకు ప్రతీకారంగా మన సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ దాడులు చేసి, దాదాపు 40 మంది ఉగ్రవాదులను హతమార్చింది. మన సైన్యం చేసిన ఈ సాహస కృత్యాన్ని కూడా తమ ఘనకార్యంగా బీజేపీ చౌకబారు ప్రచారం చేసుకుంటోంది. వాస్తవమేమంటే, ఇలాంటి దేశభక్తియుత ప్రతీకార సైనిక చర్యలు, ఏ పార్టీ అధికారంలో ఉంది, ప్రధాని ఎవరు అనే దానితో నిమిత్తం లేకుండా గతం లోనూ జరిగాయి. కానీ ఆయా పార్టీలుగానీ, ప్రధానులు గానీ ఇలా బడాయి ప్రకటనలు చేసుకోలేదు. అది రాజ్యతంత్రం. కానీ ఈసారి మోదీ సర్జికల్ దాడులు తన వలననే, తమ పాలనవల్లనే సాధ్యమైనట్లు ప్రచారం చేసుకుం టున్నారు. ‘కుమ్మరి సారె మీద ఈగ వాలి తన ప్రభావం వల్లనే సారె తిరుగు తున్నదనుకున్నట్లు’ అది తమ వల్లనే సాధ్యమైందంటూ ఆ ‘సైనిక చర్య’ను చులకన చేస్తున్నారు. బంగ్లాదేశ్ విముక్తి సందర్భంగా, కార్గిల్ స్థావర యుద్ధంలో మన సైనికుల వీరోచిత పాత్ర వీరికి తెలిసి ఉండదా?
ఇక ‘అమ్మ పుట్టిల్లు మేనమామకు ఎరుకలేదన్నట్లు కేంద్రమంత్రి వెంకయ్య ‘ఒకే దేశం, ఒకే జాతి, ఒకే ఎన్నిక’ అంటున్నారు. ఆయన అనని దల్లా ‘ఏక పార్టీ, ఏక వ్యక్తి పాలన’ అనే. ఈ వాదన అశాస్త్రీయమే కాదు, దేశాన్ని ప్రమాదంలోకి నెట్టేది. మన ప్రజాస్వామ్య వ్యవస్థ సమాఖ్య స్వభా వానికి, లౌకికతత్వానికి ప్రమాదం. ఈ ధోరణికి పరాకాష్టగా మన ప్రధాని మోదీ మన సైన్యాన్ని పరమ కిరాతకమైన ఇజ్రాయిల్ సైన్యంతోనూ, ప్రపంచ ఉగ్రవాద స్థావరంవలే ఉన్న అమెరికా సైన్యంతోనూ పోలుస్తున్నారు.
మేడిపండుగా మారుతున్న ప్రజాస్వామ్యం
నేటి ‘ప్రజాస్వామ్యం’ మేడిపండులా ఉంది. కుల, మతతత్వాలు స్వైర విహారం చేస్తున్నాయి. అన్ని విలువలకూ తిలోదకాలిస్తూ ‘ధనస్వామ్యం’ రాజ్యమేలుతున్నది. దీన్ని పరిమిత ప్రజాస్వామ్యం అంటారో, అ«థారిటేరి యనిజం అంటారో, నియంతృత్వం అంటారో, ఫాసిజం అంటారో... సాంకే తికంగా నిర్వచనమేమిటో, తర్వాత శాస్త్రీయ చర్చలలో తేల్చుకోవచ్చు. దేశం నేటి ఎన్డీఏ తిరోగామి పాలనలో మధ్యయుగాల నాటి అంధకారంలోకి దిగ జారి అతి అధ్వాన దిశగా పయనిస్తున్నది. రోగ నిర్ధారణ పేరుతో రోగి మల మూత్ర రక్త పరీక్ష, ఎక్స్‌రే, స్కానింగ్, యం.యం.ఆర్, ఈసీజీ, సీటీస్కాన్ అంటూ ప్రస్తుతం పరీక్షల కోసం నిరీక్షణ మాదిరి కాలయాపన సాగితే చివరకు రోగ నిర్ధారణ అయ్యేసరికి ఇక వైద్యం అవసరం ఉండకపోవచ్చు.
ఇక శషబిషలకు తావులేకుండా దేశ పురోగమనం కోసం అన్ని కమ్యూనిస్టు పార్టీలు ఐక్యం కావాలి. కమ్యూనిస్టులే సరిపోరు. రాజకీయ పార్టీలు ముఖ్యంగా దేశంలో, రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు దేశ ప్రజాస్వామ్య శక్తులు లౌకికత కోసం ఏకం కావాలి. అవి కూడా సరిపోవు. అణగారిన ప్రజానీకం సామాజిక న్యాయపోరాట దళిత, ఆదివాసి, మహిళా, మైనారిటీ, వెనుకబడిన కులాల ప్రజానీకం, వారి నేతలు, దేశభక్తియుత శక్తులు, వ్యక్తులు ఐక్యమై ఈ దిగజారుడును నిలువరించేందుకు మహత్తర ప్రజా ఉద్యమాన్ని నిర్మించితేనే, అంధకార బంధురంగానున్న మన ప్రజల జీవితాలను కాపాడగలం. స్వార్థ, సంకుచిత రాజకీయ చక్రభ్రమణానికి అతీతంగా మరో స్వతంత్ర పోరాటం అవసరం.
వ్యాసకర్త : ఏపీ విఠల్, మార్క్సిస్టు విమర్శకులు
మొబైల్ : 98480 69720