ఇదొక మహానాటకం
అక్షర తూణీరం
రాష్ట్ర విభజన నాటి నుంచి ప్రత్యేకహోదా మహానాటకం నడుస్తూనే ఉంది. నేతలంతా ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ నాటకం తుది మొదలు లేకుండా, పరిష్కారంలేని దిశగా ఏళ్ల తరబడి నడుస్తూనే ఉంటుంది. ఇంత పెద్ద నాటకాన్ని నెలల తరబడి నడిపిస్తూ, బోలెడన్ని అంతర్నాటకాలను జనం దృష్టికి రాకుండా కళ్లు కప్పుతున్నారని కొందరి ఆరోపణ.
‘‘ప్రత్యేక హోదా’’ అంటే కల్పతరువు. స్పెషల్ స్టేటస్ అంటే కామధేనువు. మీరు ఏమి అడిగితే అవి బంగరు పళ్లాలలో వచ్చేస్తాయి - అని కదా అప్పుడు చెప్పుకున్నాం. ఇప్పుడు ఉన్నట్టుండి అట్టు తిరగబడింది. ప్రత్యేక హోదా ఒక మిథ్య! అందువల్ల రాష్ట్రానికి ఒనగూడే ప్రయోజ నాలు శూన్యం. అంతకంటే పరమాద్భుతమైన ప్యాకేజీ ఇస్తాం. అందుకని ధన్యులవండని ఇప్పుడంటున్నారు. కల్పతరువు ఏటా మూడు కాపులే కాస్తుంది. మేమిచ్చే ప్యాకేజీ ఆరు కాపులిస్తుంది. అది కామధేనువైతే, ఇది కామధేనువు గ్రాండ్ మదర్!
రాష్ట్ర విభజన నాటి నుంచి ఒక మహానాటకం నడుస్తూనే ఉంది. అందులో నేతలంతా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఉన్నట్టుండి ఒక దృశ్యంలో ఒక నాయ కుడు అలుగుతాడు. ఢిల్లీ వారంతా ముందే చదువుకుని బట్టీ పట్టిన డైలాగుల్ని సానుభూతి రసం ఒలికిస్తూ వల్లిస్తారు. రేపో ఎల్లుండో ఢిల్లీ ఖజానా తాళాలు వెంకయ్యనాయుడుకిచ్చి చంద్రబాబు నాయుడికి పంపించే అవకాశం ఉందని ఊహాగానాలు చెలరేగు తాయి. నాలుగో రోజున కేంద్ర ఆర్థికమంత్రి అరిగి పోయిన ప్లేటుని మరోసారి వినిపిస్తారు.
ఈ మహానాటకానికి తుది మొదలు లేదు. పరిష్కారంలేని దిశగా ఇది రోజుల తరబడి, ఏళ్ల తరబడి నడుస్తూనే ఉంటుంది. ఈ మహావేదిక మీంచి ఎవరూ నిష్ర్కమించరు. అట్లాగని క్రియాశీలక పాత్ర పోషించరు. ఒకటో అరో అరిగిపోయిన డైలాగ్ వారి అధీనంలో ఉంటుంది. సైడ్ వింగ్‌లోంచి సైగ అందగానే ఆ సంభాషణని వదిలి హాయిగా గాలి పీల్చుకుంటారు. వీళ్లంతా ఢిల్లీలో రాష్ట్ర ప్రతినిధులు. మీడియాకి నాట కీయ దృశ్యాలు ఎప్పుడూ ఆకర్షణలే. రాజకీయాలను, ప్రభుత్వాలను విస్పష్టంగా నిగ్గదీసే అలవాటుని మీడియా ఈ మధ్యకాలంలో బొత్తిగా విస్మరించిందనే ప్రథ ప్రజల్లో వినిపిస్తోంది. ప్రత్యేక హోదా లాంటి పెద్ద నాటకాన్ని నెలల తరబడి నడిపిస్తూ, బోలెడన్ని అంత ర్నాటకాలను జనం దృష్టికి రాకుండా కళ్లు కప్పు తున్నారని కొందరి ఆరోపణ.
ఒకవైపు కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం పూర్తి చేశారు. మరోవైపు కృష్ణా పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇంకోవైపు విశ్వ విఖ్యాత మహానగరం అంచెలంచెలుగా రూపుదిద్దుకుంటోంది. నిన్నగాక మొన్న రెండు జిల్లాల్లో పంటలు ఎండిపోతున్న సమయంలో, మన రాష్ట్ర ముఖ్యమంత్రి మందీ మార్బ లంతో క్షేత్రాలను స్వయంగా చేరి లక్షలాది ఎకరాల్లో పంటలకు కొత్త చిగుళ్లు తొడిగారు. ఇదొక వినూత్న చరిత్రగా స్వయంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కాకపోతే, మా నేతకైనా ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
(వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు)