
మహాశివరాత్రి మర్నాడు
అక్షర తూణీరం
వందడుగుల ఎత్తుండి, విద్యుద్దీపాలతో శోభాయమా నంగా అలరారుతూ, మహాదేవుణ్ణి సేవించే శివరాత్రి ప్రభలు గొప్ప సాంస్కృతిక వేదికలు కూడా.
శివరాత్రి కోసం ఏడాది పొడుగునా ఎదురు చూస్తారు. భక్తితో కొందరు, ముక్తికోసం మరికొందరు, రక్తికై ఇంకొందరు. ఇదో పెద్ద కోలాహలం. అందుకే జన్మకో శివరాత్రి అంటారు. మిగతా రోజుల్లో ఏమాత్రం పట్టిం చుకోని శివలింగాలు సైతం శివరాత్రి రోజు వెలిగి పోతాయి. మన కోటప్పకొండ ప్రభలతో వచ్చే భక్తు లతో, శివనామంతో దద్దరిల్లుతుంది. అమరావతి సరే సరి. సింగరకొండ, మంగళగిరి, గోలాడలో జరిగే తిరు నాళ్లు ముక్తికి, రక్తికి సోపానాలు. శివరాత్రి ప్రభలు మన సొంత సంప్రదాయం. వందడుగుల ఎత్తుండి, విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలరారుతూ, మహాదేవుణ్ణి సేవించే ఈ ప్రభలు కేవలం అలంకారానికే కాదు, గౌప్ప సాంస్కృతిక వేదికలు కూడా.
శివరాత్రి ప్రభలపై పౌరాణిక నాటకాల్ని, విలువైన సంగీత గోష్టులను, శాస్త్రీయ నృత్య ప్రదర్శనల్ని, యువతని ఉర్రూతలూగించే రికార్డ్ డ్యాన్సుల్ని తెల్లవార్లూ ఆస్వాదించి ఆనందించవచ్చు. శివరాత్రికి వచ్చే ప్రభల వైభవాలని బట్టి ఆ యేడు పాడిపంటలు ఎలా ఉన్నాయో అంచనా వేయవచ్చు. ప్రభలు కట్టి, కోడె దూడల్నిచ్చి మహాశివునికి భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. శివుడు బోళా శంకరుడు. పిలవగానే పలుకుతాడని ప్రజల విశ్వాసం. అందుకనే ఆయ నకు ఫాలోయింగ్ ఎక్కువ.
తిరునాళ్లు ఒక గొప్ప సందర్భం. దేవుడి వంకన మహాజనం ఒక చోట చేర తారు. జనం చేరతారు కాబట్టి బోలెడు ఆకర్షణలు చేరతాయి. చిరువ్యాపారాలు పుట్టగొడు గుల్లా పుట్టుకొస్తాయ్. ఇది ఒక్కరోజు వేడుక. కొన్ని చోట్ల దీన్ని తీర్థం అంటారు. నదీ తీరాల్లో జరిగే తిరునాళ్లు మరింత చోద్యంగా ఉం టాయి. కోలాటాలు, చెక్క భజనలు, చిన్న చిన్న మోసాలు, కలిసొచ్చే చిరు ఆనందాలు ఇక్కడ తటస్థపడతాయ్. అర్ధరాత్రి లింగోద్భవం అయిందని ప్రకటిస్తారు. కొంత సేపు ఆలయ ప్రాంగణాలు శివ నామంతో హోరెత్తుతాయి. క్రమేపీ భక్తుల ఉత్సాహం సన్నగిల్లుతుంది. తెల తెలవారుతుండగా తీర్థప్రజని ఆకలి, నిద్ర ఆవహిస్తుంది. కాళ్లీడ్చుకుంటూ ఖాళీ జేబులతో ఇంటిదారి పడతారు. వచ్చేటప్పుడున్న మిత్ర బృందం చెల్లాచెదురై తలోదారి పడతారు. తీర్థంలో కొన్న చిన్న వస్తువేదో చేతిలో బరువుగా తోస్తుంది. ఎక్కడ చూసినా చెత్తా చెదారం. మూగపోయిన మైకులు, కొండెక్కిన రంగు రంగుల బల్బులు.
ఎన్నికల మహాసభలు విడిసినప్పుడు సరిగ్గా ఇలాగే ఉంటుంది. చిరిగిన జెండాలు, తినిపారేసిన బిర్యానీ పొట్లాల కాగితాలు, ఖాళీ సీసాలు దీనంగా కనిపిస్తాయ్. ‘తిరునాళ్లప్పుడు కూడా అదే అలసట, అదే హాంగోవరూ..’ అనగానే పాపం! అలా అనకండి, హాంగోవర్ సందర్భం వేరండీ, మీరు సోడా గోలీని దర్భపుల్లని ముడేస్తున్నారన్నాను. ‘సింగినాదం, శివరాత్రికి సెంట్రల్ ఎక్సైజ్ వారికి టార్గెట్స్ ఫిక్స్ అవుతాయండీ. ఇదొక అద్భుతమైన అవకాశం. తెల్లవార్లూ జాగారం చెయ్యాలి. రాత్రికి మందుకి ఓ బంధం ఉంది. పైగా తిరునాళ్లలో తాగరాదనే నియమం లేనేలేదు. జన్మకో శివరాత్రిగా అమ్మకాలు సాగించమన్నార్ట!
- శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)