థాంక్యూ డాడీ! | Sriramana writes on Nara lokesh | Sakshi
Sakshi News home page

థాంక్యూ డాడీ!

Published Sat, Mar 11 2017 1:32 AM | Last Updated on Wed, Aug 29 2018 3:37 PM

థాంక్యూ డాడీ! - Sakshi

థాంక్యూ డాడీ!

అక్షర తూణీరం
రాజకీయ రంగంలో, ముఖ్యంగా తెలుగుదేశంలో అంచె లంచెలుగా ఎదిగి, క్యాబినెట్‌ గడపలో ఉన్న లోకేశ్‌ని చూస్తున్నప్పుడు చిట్టిబాబు విజయగాథ గుర్తుకొచ్చింది.

అదొక పెద్ద కర్మాగారం. మిట్ట మధ్యాహ్నం వేళ దాని ప్రాంగణమంతా కోలాహలంగా ఉంది. కార్మికులంతా ఆదరాబాదరా అన్నం తిని సమావేశ మందిరంలో చేరారు. ఫ్యాక్టరీ యజమాని మైకు ముందుకు రాగానే మందిరం నిశ్శబ్దమైపోయింది. ‘‘సోదరులారా! నేడు మనందరికీ సుదినం. కష్టించి పనిచేస్తే ఫలితం దక్కి తీరుతుందని రుజువు అవుతున్న సందర్భమిది. మన ఫ్యాక్టరీలో మూడు నెలల నాడు సాధారణ కార్మికుడిగా చేరాడు చిట్టిబాబు. అతని పనితనం, నిజాయితీ, సేవా తత్పరత మనందరినీ ముగ్ధుల్ని చేయగా రెండు నెలల క్రితం వర్క్స్‌ ఇన్‌చార్జ్‌గా ఎదిగాడు. మళ్లీ అక్కడ కూడా చిట్టిబాబుది అదే వరస. ఆ చొరవ, ఆ పనివాడితనం తట్టుకోలేకపోయాం. ఇంకో మెట్టుపైన కూచోపెట్టక తప్పింది కాదు. మళ్లీ పది రోజులు గిర్రున తిరి గాయి.
చిట్టిబాబు దీక్షా దక్షతల వల్ల మన ఫ్యాక్టరీ చక్రాలు మహా వేగాన్ని పుంజు కున్నాయి. ఇక్కడ కష్టానికి గుర్తింపు ఉందనే నమ్మకం మన కార్మికులందరికీ కలిగించడమే నా ఉద్దేశం. అందుకే మన ఆదర్శ కార్మికుడు చిట్టిబాబుని సంస్థకి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమిస్తున్నాను.’’ యజమాని ప్రసంగం పూర్తికాకుండానే చప్పట్లతో హాలు దద్దరిల్లింది. చప్పట్ల మధ్య నించి వేదిక ఎక్కిన చిట్టిబాబు, యజ మానికి నమస్కరించి ‘థాంక్యూ డాడీ!’అన్నాడు. ఆ తండ్రి మురిసిపోయాడు.
రాజకీయ రంగంలో, మరీ ముఖ్యంగా తెలుగు దేశంలో అంచెలంచెలుగా ఎదిగి, క్యాబినెట్‌ గడపలో ఉన్న లోకేశ్‌బాబుని చూస్తు న్నప్పుడు చిట్టిబాబు విజ యగాథ గుర్తుకొచ్చింది.

మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని పేరేగానీ, ముఖ్యమంత్రి గాని, ప్రధానమంత్రి గాని ‘‘నా ప్రభుత్వం’’ అనే మాట వాడరు. చాలా స్వేచ్ఛగా, షాజహాన్‌ చక్రవర్తిలా ‘‘నేను చేస్తా, నేనిస్తా, నేనుంటా’’ అనే మాట్లాడుతుంటారు. మంత్రులంతా సామంతుల్లా మాటకి ముందు నాయకుడి పేరు స్మరిస్తూ మాట్లాడుకుంటారు. దీనికి మనం బాగా అల వాటు పడిపోయాం. ఎప్పుడైతే పార్టీ పగ్గాలు, అధికార పగ్గాలు ఒకే చేతిలోకి వచ్చే సంప్రదాయం తెచ్చారో అప్పుడే ‘‘రాజరికం’’ ప్రవేశించింది. వంశపారంపర్య రాజకీయాలకు స్వస్తి చెప్పాలని మోదీ ఎంత ఘోషించినా ఈ వ్యవస్థ పట్టిం చుకోదు. పైగా మానవహక్కులను హరించడం కూడా అవుతుంది. ఐఏఎస్‌ గారి అబ్బాయి ఐఏఎస్‌ అవడం లేదా? కూలివాడి బిడ్డ కూలివాడవడం లేదా? పిల్లలు వెదురు మోసుల్లా పొడుచుకు వస్తుంటే దాన్ని ఆపడం ఎవరితరం.

యువరాజు క్రియాశీల రాజకీయాల్లో అడుగుపెడుతూనే ఆస్తులు డిక్లేర్‌ చేసి, ‘ఔరా!’ అనిపించుకున్నారు. కాకపోతే ఆస్తులు మరీ ఇబ్బడిముబ్బడిగా పెరిగా యని కొందరి ఆక్షేపణ. భర్తృహరి చెప్పినట్టు నీటిబొట్టు పడే చోటుని బట్టి దాని సౌభాగ్యం ఉంటుంది. పెనం మీద పడితే ఆవిరైపోతుంది. ఎడారిలో ఇంకిపో తుంది. సముద్రంలో కలసిపోతుంది. ముత్యపుచిప్పలో మంచి ముత్యమై మెరు స్తుంది. కొందరిళ్లలో డబ్బులు దుబ్బుల్లా పెరుగుతాయి. డబ్బు మూటలు కుందేలు సంతానంలా వర్థిల్లుతాయి. అది వారి వారి అదృష్టాలను బట్టి ఉంటుంది. పైగా లోకేశ్‌బాబు ‘‘దేవుడి దయ వల్ల’’ షేర్‌ విలువ అనూహ్యంగా పెరిగిందని లెక్క చెప్పారు. నిజమే దేవుడి దయవుంటే పట్టిందల్లా బంగారమైతే ఎంతసేపు కావాలి, నాలుగొందల కోట్లు జమ పడడానికి! సత్యనారాయణస్వామి వ్రతం చేసి, కథలు విని, ప్రసాదం స్వీకరించినా చాలు. చిత్తశుద్ధి ముఖ్యం. ఆస్తి పోగెయ్యడానికి కాదు, వ్రతమాచరించడానికి.


- శ్రీరమణ

(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement