సుభాషితం
పండితరాయలు మన ముంగండ అగ్రహారీకుడు. దిల్లీలో కొలువుదీరి ఆసేతు హిమాచలం తన పలుకు వెదజల్లినవాడు. సందర్భానికి తగిన సామ్యం చెప్పి, ఊరడించడం ఆయనకి రివాజు. ఒకానొక సందర్భంలో -
‘‘ఆఘ్రాతం పరివీఢముగ్ర నఖరైః
క్షుణ్ణంచ యచ్చర్వితం ......’’
ఇలా సాగే శ్లోకానికి అర్థం ఇది. ఒక కోతికి జాతిరత్నమొకటి దొరికింది. అది కాయో పండో తినడానికి అనువో కాదోనని మొదట వాసన చూసింది. ఏమీ అంతుపట్టలేదు. తరువాత రుచికోసం నాలుకతో నాకింది.
రుచీ పచీ తగల్లేదు. తన వాడిగోళ్లతో రక్కింది. కనీసం రక్తం కూడా రాలేదు. ఆశ నిరాశ కాగా చివరికి కోపం వచ్చి రత్నాన్ని విసిరిపారేసింది. అలాంటి రత్నాన్ని సంబోధించి పండితరాజు ఇలా ఊరడిస్తున్నాడు. కోతి చేత అవమానం పొందానని బాధపడకు. దానివల్ల నీకు కొంత మేలే జరిగింది. అసలే కోతి గదా. అన్ని పరీక్షలు అయినాక పగలగొట్టే ప్రయత్నం చేసివుంటే ఏమయ్యేది? అందుకు సంతోషించు.
అన్ని అర్హతలూ గల ఒక విద్వాంసుణ్ని కమిటీ సభ్యునిగా అక్కడొకరు తిరస్కరించారు. ఆ సందర్భంగా కవిసామ్రాట్ విశ్వనాథ ఈ సుభాషితంతో మంచి గంధం రాశారు.
బ్రెయిన్ ఈటర్
మనం తరచూ వింటూ ఉంటాం -మేధోమథనం అని. అన్ని పార్టీలవారు గుమిగూడి చిలుకుతూ ఉంటారు. అందులోంచి ఏమేమి వచ్చాయో బయటకు తెలియదు. వచ్చినవి ఎవరెవరికిచ్చారో, హాలాహలమెవరు మింగారో ఎవరికీ చెప్పరు. కొన్నిసార్లు నేత తనవారిని మానసికంగా హింసిస్తూ ఉంటాడు. దాన్ని ‘మేధోహననం’ అంటారు. తెలుగులో బుర్ర తినడం.
బాబా స్పేస్
ఇవ్వాళ ‘సైబర్ స్పేస్’ అనేది అమేయం అనంతం అసాధ్యమైపోయింది. దీనికి మూలం ‘సాయిబాబా స్పేస్’. ఫ్రెంచ్ జర్మన్ భాషల్లో నోరు తిరగక సాయిబా, సైబర్‌గా మారి స్థిరపడింది. సాయి లాగానే ఇది కూడా సర్వాంతర్యామి. నమ్మడం, నమ్మకపోవడం మీ ఇష్టం.
నేడు వైద్యం చేస్తున్నవారిలో ఎక్కువమంది ధనవంతుర్లే గాని ధన్వంతర్లు కారు. రాజకీయంలో ఏమాత్రం కొత్తదనం లేదు. వాగ్బాణాలతో ప్రజల్ని నమ్మించే ప్రయత్నమే తరతరాలుగా సాగుతోంది.
సంగీతం అర్థం కానక్కర్లేదు, వినసొంపుగా ఉంటే చాలు. అలా లేనప్పుడు కనీసం అర్థం కావాలి.
ఇప్పుడే అందిన ఎస్.ఎం.ఎస్.
మేము పవర్‌లోకి వచ్చినట్టే పన్నెండేళ్లకి మళ్లీ గోదావరి పుష్కరాలొస్తున్నాయ్.
- తె.దే.పా.
శ్రీరమణ