
పచ్చబొట్ల పండగ వచ్చేసింది!
అక్షర తూణీరం
‘‘విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం. మమ్మల్ని గద్దె ఎక్కించండి’’ అని ఒకరంటున్నారు. ‘‘మేం మా రోజుల్లో తీర్చి దిద్ది ప్రపంచ స్థాయి నగరానికి కావలసిన హంగులన్నీ సమకూర్చాం. అవసరమైతే పారిస్ నగరానికి పోటీగా నిలబెడతాం’’ అంటూ ముందుకు వెళుతున్నారు ఇంకొకరు. కమలానికి చెప్పుకోవడానికి చరిత్రేమీ కనిపించడం లేదు. వినిపించడానికి వీరగాథలేమీ లేవు. పైగా తెదేపా, భాజపా పాలూనీళ్లలా కలసిపోవడం వల్ల, ఎవరు పాలో ఎవరు నీళ్లో విడమర్చి చెప్పలేం.
‘‘ప్రజాసేవకి ఇంత డిమాండా?’’ అని ఒక విదే శీయుడు ఆశ్చర్యపోయాడు. ‘‘ఔను! మాది కర్మభూమి!’’ అని నేను గర్వంగా బదులి చ్చాను. ఎందరో అంకిత భావమూ, సేవా స్వభా వమూ గల ఆదర్శ స్త్రీ పురుషులు ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్నారు ఈ బల్దియా ఎన్నికల కోసం. ఎన్నికలు లేకపోతే నిలబడే అవకాశం ఉండదు. నిలబడితే గాని పోటీలో గెలిచే అవకాశం రాదు. గెలిస్తే కానీ ప్రజాసేవకి దారి దొరకదు. ఈ అంతస్సూత్రాన్ని ఆధారం చేసుకుని ఒక్కో పార్టీకి ఒక స్థానానికి హీనపక్షం పదిమంది ఉత్సాహవంతులు బీఫారాలకై చకోర పక్షుల్లా నిరీక్షించడం చూశాం. దాని తర్వాత ఆత్మాహుతుల పర్వం. టిక్కెట్ రాని వారు జనసేవకు అవకాశం రానందుకు తీవ్ర అసంతృప్తికి లోనవుతారు. అలాంటి కొందరు రకరకాల మెథడ్స్‌లో అందరూ చూస్తుండగా ప్రాణ త్యాగాలకు పాల్పడతారు.
‘‘అంతా యాక్షన్. బ్లాక్‌మెయిల్ రాజకీయం. నిజంగా ఆ ఉద్దేశం ఉంటే ఇంట్లో తలుపులేసుకుని ఉరి వేసుకోవచ్చు. లేదా... వచ్చు. కాదంటే... వచ్చు’’ అంటూ పదహారు మేలైన సూచనలు చేస్తూ గిట్టనివాళ్లు మాట్లాడతారు. ఇది అమానుషమైన వ్యాఖ్య. మనకి ఫైనల్‌గా అర్థులు, ప్రత్యర్థులు, రెబెల్స్, స్వతంత్రులు, అస్వతంత్రులు ఇలా ఐదారు రకాలుగా ఈ అభ్యర్థులు తేలతారు. ఇందులోంచి వారికి తోచిన అర్హుల్ని ఓటర్లు ఎంపిక చేసుకుంటారు. అర్హులంతా కలసి ఒక మొనగాడిని లేదా మొనగత్తెను ఎన్నుకుంటారు. నగరాన్ని వారికి అప్పగిస్తారు. ప్రజా ప్రతినిధికి సేవలందించడానికి ఒక అధికార ప్రతినిధి ఉంటాడు. ఆయనని అంతా మేయరు... మేయరు అంటుంటారు. కానీ అవకాశం వస్తే బానే మేస్తారని కొందరు చమత్కరిస్తుంటారు.
ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో బల్దియా బస్తీలు, కాలనీలు బెజవాడ ప్లాట్‌ఫారమ్‌ని తలపిస్తున్నాయి. ఉన్న నాలుగు గల్లీల్లో ఏడెనిమిది మంది అభ్యర్థులు ప్రచారానికి తిరగడమంటే ఇబ్బందిగానే ఉంటుంది. కాండిడేట్ అంటే ఒంటరి కాదు కదా! కనీసం పదిమంది అండగాళ్లు, పది మంది ఉప్మా కార్యకర్తలు, ఒకరిద్దరు జెండాధారులు, అయిదారుగురు మేళాల వాళ్లు ఉంటారు. అందుకని కొన్ని కాలనీలలోని వారంతా ఒక మాటనుకుని, వేళల్ని ఫిక్స్ చేసుకున్నారు. నిర్ణీత సమయంలో ఆయా గల్లీలకు ఆయా అభ్యర్థులు ప్రచారానికి వెళ తారు. దీనివల్ల ఎలాంటి ఉద్రిక్తతలకూ తావుండదు. ఎన్నికల వాగ్దానాలు ఎటూ పైనించి వినిపిస్తాయి కాబట్టి, విడివిడిగా కార్పొరేటర్ అభ్యర్థులు చేసే దానాలేవీ ఉండవు.
ఇప్పటికీ బడా నాయకులు గళాలు సరి చేసుకున్నారు. ‘‘విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం. మమ్మల్ని గద్దె ఎక్కించండి’’ అని ఒకరంటున్నారు. ‘‘మేం మారోజుల్లో తీర్చి దిద్ది ప్రపంచ స్థాయి నగరానికి కావలసిన హంగులన్నీ సమకూర్చాం. అవసరమైతే పారిస్ నగరానికి పోటీగా నిల బెడతాం’’ అంటూ ముందుకు వెళుతున్నారు ఇంకొ కరు. కమలానికి చెప్పుకోవడానికి చరిత్రేమీ కనిపిం చడం లేదు. వినిపించడానికి వీరగాథలేమీ లేవు. పైగా తెదేపా, భాజపా పాలూనీళ్లలా కలసిపోవడం వల్ల, ఎవరు పాలో ఎవరు నీళ్లో విడమర్చి చెప్పలేం. ఏకాభిప్రాయం లేక పోయినా కలసి పోటీకి దిగారం టేనే పదవీ వ్యామోహం కదా! అసలీ రాజ్యం మాది. కనీసం జంట నగరాలు మాకివ్వండంటున్నారు మరొకరు. నగరానికి పచ్చబొట్టు పొడిపించుకునే అదృష్టం పట్టింది.
- శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)