
ఋష్యశృంగా ఇంపోర్టెడ్ వాటర్!
అక్షర తూణీరం
ముందు ముందు పెట్రోల్ పుట్టదు కనుక. అది లేకుండా భూమి తిరగదు కనుక.... నీళ్లు కూడా అంతే. ముందు చూపుగా ఈ ఆలోచన చేశా. మళ్లీ ఎక్కడా అనకండి!
పొద్దున్నే కాలిఫోర్నియా నించి ఫోను. శేషు నామాల చేశాడు. నాకు చిరకాల మిత్రుడు. ముప్పయ్ ఏళ్లకు పైగా అక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకుని అమెరికాని సొంతం చేసుకున్నాడు. చాలా మంచి ఉద్యోగం, తగిన సంపాదన. పైగా మ్యాన్ ఆఫ్ అయిడియాస్. శేషు ఎప్పుడు ఫోన్ చేసినా కొత్త ఆలోచనలు దట్టిస్తాడు.
‘‘మీ ఇండియాలో వాటర్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా. మళ్లీ ఎక్కడా అనకండి!’’ అంటూ ప్రారం భించాడు. ‘‘దేనికండీ! ఇప్పటికే సవాలక్ష బ్రాండ్లు అయిదు ఎమ్మెల్ నించి అయిదువేల దాకా ఉన్నాయ్ కదా!’’ అన్నాను. శేషు అమెరికన్ నవ్వుకి భారతీయత జోడించి ఘాటుగా, క్లుప్తంగా నవ్వాడు. ‘‘మనవాళ్లకి మెదడు ఉంది గాని మెథడ్ లేదు’’ అంటూ ఒక సొంత కొటేషన్ విసిరాడు, దాచుకోమన్నట్టు. ‘‘ఎక్కడా అనకండి... ఫ్యూచర్‌లో ఉండబోయే ఒకే ఒక్క సమస్య వాటర్ సమస్య. అందుకని మన రాష్ర్టంలో అక్కడక్కడ కొన్ని కొండలు కొంటున్నా...’’ అని మొదలుపెట్టాడు. ‘‘కొండలు తొలిచి భయంకరమైన స్టోరేజీ ట్యాంకులు తయారుచేస్తాం. వాటిలో నీళ్లని స్టోర్ చేస్తాం.’’ ఈసారి అచ్చతెలుగు నవ్వు నవ్వడం నా వంతయింది.
‘‘నవ్వు జ్ఞానాన్ని ఇంకనివ్వదు’’ మరో కోట్ విసి రాడు. చూడు, ప్రపంచమంతా పెట్రోల్‌ని దాచేస్తోంది. భూమిలో, సముద్రంలో, ఇంకా రహస్య ప్రదేశాల్లో... మళ్లీ ఎక్కడా అనకండి. దేనికంటే, ముందు ముందు పెట్రోల్ పుట్టదు కనుక. అది లేకుండా భూమి తిరగదు కనుక.... నీళ్లు కూడా అంతే. ముందుచూపుగా ఈ ఆలోచన చేశా. నీళ్లు ఆవిరి కాకుండా కాపాడే ఒక రకం నాచుని ఇప్పటికే సిద్ధం చేశా. పూర్వం సంపదని బంగారం, వజ్ర వైఢూర్యాల రూపంలో దాచుకునేవారు. భూసంపద కూడా అపురూపమై పోయింది. ఎందుకంటే భూమి తయారీ ఆగిపోయి యుగాలైంది కదా! మళ్లీ ఎక్కడా అనకండి. ఎప్పుడూ శేషు నామాల కొత్త సంగతులతో మాట్లాడతాడు. ‘‘భవిష్యత్తులో నీటిని మించిన నిధి లేదు. ఇప్పుడు నీటి నిల్వల సెక్యూరిటీ గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నా. ఎందుకంటే, ఎంతకైనా తెగిస్తారు. ధర మనం చెప్పినంత! వెయ్యి మందికి పది బిందెల నీళ్లు మాత్రమే ఉన్నప్పుడు ఇహ ధర ఏమిటి చెప్పండి! అప్పుడు నీళ్లు అమ్మడమంటే ప్రాణాలు అమ్మడమే కదా! అని మళ్లీ నవ్వాడు. ఈసారి నాకు భయం వేసింది. ఇంకా ఈ వాటర్ బిజినెస్ గురించి బోలెడు పాయింట్లు చెప్పాడు.
మరీ నాది ఇండియన్ బ్రెయిన్ అనుకుంటాడని నేనో అయిడియా జోడించా. ‘‘పై దేశాల నుంచి వచ్చే విమానాలకి తగిలించి వాన మబ్బుల్ని తరలించుకు రావచ్చు. ఇక్కడ ఒక గరాటు లాంటి ప్లాట్‌ఫాం మీద వాటిని నీళ్లుగా డౌన్‌లోడ్ చేసుకోవడమే. పెద్ద ఖర్చు కూడా ఉండదు. పైలట్ గారికి పది రూపాయలు చేతిలో పెడితే దారిలో ఓ కరిమబ్బుని తగిలించుకు వస్తాడు. ఇంకో సంగతి ఏంటంటే, అప్పుడు పాతిక దేశాల నీళ్ల పేర్లు చెప్పి మరీ నువ్వు అమ్మవచ్చు. మంచి పేరున్న మన రుషిగారి పేరు మీద మహత్తరంగా మార్కెట్ చేయవచ్చు’’ అన్నాను. మనకేంటి ఋష్యశృంగుడున్నాడు కదా.. ఎక్కడా అనకండి- అంటూ ఫోన్ పెట్టేశాడు శేషు.
- శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)