ఆత్రేయపురం కుర్రాడు | SriRamana Write A Story On Atreyapuram Young Boy | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 27 2018 1:53 AM | Last Updated on Sat, Oct 27 2018 1:53 AM

SriRamana Write A Story On Atreyapuram Young Boy - Sakshi

బ్రహ్మలోకంలో ఉన్నట్టుండి భీషణ ప్రతిజ్ఞ ముక్తకంఠంతో వినిపించింది. బ్రహ్మ నాలుగు ముఖాలూ నాలుగు దిక్కులూ పిక్కటిల్లేట్టు గర్జిస్తున్నాయ్‌. ‘ఒడ్డూ ఎత్తులూ, కండలు కావరాలూ లేకుండా బొమ్మని చేసి దానికి ప్రాణం పోస్తా. ఆ ప్రాణి తన విజ్ఞాన వైదుష్యాల ద్వారా సమున్నతుడై వర్ధిల్లగలడు... అస్తు’ అని నాలుగు నోళ్లు మూసేశాడు. విరించి శపథం ప్రాణదీపమై నేలకు దిగింది. ఆ దీపం అరవై ఏళ్లనాడు ఆత్రేయపురంలో భమిడిపల్లి వారింట్లో ఉగ్గులు పోసుకుంది. బ్రహ్మగారి మాట మేరకు ఏ ఆర్భాటాలూ లేకుండా ఆ బొమ్మ కూర్మంలా కది లింది. తర్వాత క్రమంగా ఎదిగి, బ్నిం అంటే ‘వీరా!’ అని తెలుగుజాతిని నివ్వెరపరుస్తున్న బ్రహ్మమానస పుత్రుడు, నేటి షష్ట్యబ్ది మిత్రుడు భమిడిపల్లి నరసింహమూర్తి అయ్యారు.

ఆత్రేయపురంలో ఇంటి చదువుతోనే సంస్కృతాంధ్రాలు తగు మాత్రం వంట పట్టించుకున్నారు. బొమ్మలు గీయడంమీద ఆసక్తి చూపారు. అలాగ గీతలకి అడ్డంపడుతూ, అక్షరాల్ని గుచ్చుకుంటూ పాకుతూ దేకుతూ గుమ్మందాటి అరుగుమీదకు వచ్చారు. పిల్లాడికి ఈడొచ్చింది. నీలాటి రేవుకి వయసులు చిందిస్తూ బిందెలెత్తికెళ్లే పడుచుల్ని, పనీ పాటలకి వెళ్లే పిల్లల్ని ఆబగా తిలకించడం ఓ కళగా నేర్చాడు. అసింటా వెళ్లాక ఆ పల్లె పడతులు పమిటలు సద్దుకుంటూ ‘బెమ ఉందిగానీ జవ లేదు.. ప్చ్‌’ (భ్రమ ఉందిగానీ జవసత్వాల్లేవు) అనుకునేవారు.

ఇప్పటికే భూమ్మీద పత్రి పూజ లేకుండా పోయిన పెనిమిటి చేసిన శపథంతో ఇంకేమవుతాడోనని పరిపరి విధాల వగచిన వాగ్దేవి అమరకోశం మొదలు కావ్య నిఘంటువుల్దాకా రంగరించి కూర్మానికి పోసేసి, నిశ్చింతగా వీణలో లీనమైంది. 1981లో ఆత్రేయపురం కుర్రాడు భాగ్యనగరానికి పయనమయ్యాడు. కార్యార్థి అయి వెళ్తున్న వామనుడికి ముంజి, భిక్షాపాత్ర, గొడుగు వగైరాలను తలొకరు తలోటి ఇచ్చి దీవించిన విధంగా, నవోదయ రామ్మోహనరావు, శంకు, శ్రీ సీతారావుడు, ఇంకొందరూ ఆ కుర్రాడిని చేతుల్లోకి తీసుకుని రైళ్లు, బస్సులు, మెట్లు ఎక్కించారు. ఒక వీక్లీలో ఆర్టిస్ట్‌గానూ, ఒకింట్లో పేయింగ్‌ గెస్ట్‌గానూ కుదురుకున్నాడు.

మన బతుక్కిది చాల్లే అనుకుని ‘బ్నిం’ అనే అక్షరవన్నర సంత కం ఖాయం చేసుకున్నాడు. భాగ్యనగరం బ్నింని బహుముఖ ప్రజ్ఞాశాలిగా తీర్చిదిద్దింది. తెలంగాణ శ్లాంగ్వేజిని,  బతుకుతెరువుని నేర్పింది. దూరదర్శన్‌ గ్రీన్‌రూంలో జొరబడి బుల్లితెరకి కావల్సిన ఛందో వ్యాకరణాలని ఆపోశన పట్టాడు. క్రమంగా స్వార్జననీ, ఇరానీ చాయ్‌నీ, జర్దాని మరిగారు. ఆ సరికే పాట, పద్యం మీద పట్టు సాధించారు. కథలు, టీవీ సీరియల్స్‌పై అధికారం వచ్చింది. కార్టూన్లు, కవర్‌ పేజీలు, సభ లేఖలు, శుభ లేఖలు, టుమ్రీలు అందించే నమ్మకపాత్రమైన చిరునామాగా తేలారు. రెక్క విదిల్చుకుని వేళాపాళల సంకెళ్లు తెంపేసుకుని ఫ్రీలాన్సర్‌గా నిలబడ్డారు. మైకంత ఎదిగారు.

ఒకానొక శుభముహూర్తాన పలుకులమ్మతో మంతనాలు సాగించి నృత్య నాటికలకి శ్రీకారం చుట్టారు. ఇప్పటిదాకా రెండు సెంచరీలు పూర్తి చేసి మూడో శతకాన్ని ముగించే దారిలో ఉన్నారు. ప్రఖ్యాత నర్తకి స్వాతిసోమనాథ్‌ కోరగా ‘వాత్సా్య యన కామసూత్ర’ నృత్య నాటికని ప్రదర్శన యోగ్యంగా రచించారు. దాన్ని స్వాతిసోమనాథ్‌ ప్రదర్శించి రసజ్ఞుల మన్ననలందుకున్నారు. బ్నిం బాపు రమణలకు మూర్తి. వేలాదిమందికి స్ఫూర్తి. ఆత్రేయపురంలోనే అంకురించిన బాపు రమణలతో స్నేహం కడదాకా కొనసాగింది. నిరంతరం వారి మధ్య ఒక జీవతంతి ప్రవహిస్తూ ఉండేది. బ్నింగారు తెలుసని చెప్పుకోవడం నాలాంటి వాళ్లకి గర్వంగా ఉంటుంది.

ఇప్పుడిప్పుడు చాలామంది ‘అర్జునుడంటే ఎవరో అనుకున్నా కిరీటి నాకెందుకు తెలీదన్నట్టు’ ప్రవర్తిస్తున్నారు. ఆయన విద్వత్తుకిది నీరాజనం. వారాసిగూడలో ఓ ఆశ్రమం స్థాపించి, ఆయన కాబోయిన నట నటీమణులకు, రైటర్లకు, దర్శకులకు, యాంకర్‌ భామలకు అభయాలిచ్చి ఆత్మవిశ్వాసం గోలీలుగా మింగిస్తున్నారు. బ్నిం దగ్గర వృత్తిపరమైన నిబద్ధత ఉంది. గీసి రాసి సకాలంలో ఇవ్వడం, ఇవ్వాల్టి సోషల్‌ మీడియాని త్రివిక్రమంగా ఆక్రమించుకుని విశ్వవ్యాప్తమయ్యారు. ఆయనది అవసరానికి మించిన ఆత్మవిశ్వాసం. ‘సెల్ఫ్‌పిటీని’ చావగొట్టి చెవులు మూసిన రౌడీషీటర్‌ ఆ కుర్రాడు. నా కాళ్లకి చెప్పుల్లేవని అఘోరించే వాళ్లని ఈ భూమ్మీద కాళ్లే లేని వారెందరున్నారో చూడమని కన్నీళ్లు తుడిచే బ్నింకి– శతమానం భవతి! (ఆదివారం ఇందిర ప్రియదర్శిని ఆడిటోరియం, పబ్లిక్‌ గార్డెన్స్‌లో జరుగనున్న బ్నిం షష్ట్యబ్ది సభ వేళ...)

వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement