atreyapuram
-
రుచితో అదరగొట్టే మధురాలు, ఈ పూతరేకులు
-
పూతరేకులు.. వెరీ స్పైసీ గురూ..
సాక్షి, విశాఖపట్నం: పూతరేకు ఏంటీ.. స్పైసీగా ఉండట మేంటి...? విడ్డూరం కాకపోతేనూ...! అని అనుకుంటు న్నారా... లేదండీ... నిజమే.. ఇక నుంచి స్పైసీ పూత రేకులు మార్కెట్లో హాట్ హాట్‌గా కనిపించనున్నాయి. ప్రత్యేకంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం కాకరకాయ, వెల్లుల్లి కారంతో పూతరేకులను రూపొందించారు ఆత్రేయ పురానికి చెందిన తయారీదారులు. పూతరేకుల తయారీ అనేది డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయ పురం ప్రజలకు తరతరాలుగా వారసత్వంగా వస్తోంది. తొలినాళ్లలో పంచదారతోనే పూతరేకులు తయారు చేసేవారు. కాలానుగుణంగా మారుతున్న అభిరుచుల మేరకు పూతరేకుల్లోనూ అనేక రకాలు వచ్చేశాయి. బెల్లం, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వంటి వాటితో రకరకాల పూతరేకులు తయారు చేస్తున్నారు. ఇప్పుడు పూతరేకుల తయారీదారులు ట్రెండ్ మార్చారు. స్పైసీ పూతరేకులు సిద్ధం చేశారు. కాకరకాయ, వెల్లుల్లి కారంపొడితో పూతరేకు చుడతారు. డయాబెటిక్‌తో ఉన్నవారికి ఇది ఒక ఔషధంలా పనిచేస్తుంది. ఈ పూతరేకులు తింటే రక్తశుద్ధి, ఇన్సులిన్ సామర్థ్యం పెరిగే అవకాశాలు ఉన్నాయని తయారీదారులు చెబుతున్నారు. మార్కెట్లోకి స్సైసీ బిట్టర్గార్డ్, గార్లిక్ పూతరేకులు ఇన్నాళ్లూ పూతరేకులు తీయని రుచితో నోరూరిస్తూ.. మధుమేహ బాధితులకు మాత్రం శత్రువుగా ఉండేవి. షుగర్ ఫ్రీ పూతరేకులు అందుబాటులోకి వచ్చినా వాటిపై డయాబెటిక్ రోగులు అంతగా ఆసక్తి చూపించలేదు. అందుకే ఇప్పుడు స్వీట్‌ని హాట్‌గా తింటూ... మధుమేహాన్ని కంట్రోల్ చేసుకునేందుకు ఆత్రేయపురం వాసులు తయారు చేసిన కొత్త తరహా పూతరేకులను శుక్ర వారం మార్కెట్లోకి విడుదల చేశారు. అత్రేయపురానికి చెందిన సర్ ఆర్థర్ కాటన్ పూతరేకుల సహకార సంఘం ప్రతినిధులు తీసుకువచ్చిన స్పైసీ బిట్టర్గార్డ్, గార్లిక్ పూతరేకులను దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ శ్రీసుధ మార్కెట్లోకి విడుదల చేశారు. ప్రతి ఒక్కరూ ఆస్వాదించేలా... ఆత్రేయపురం పూతరేకులు అంటే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. మా పూతరేకు ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తూ తినాలన్నదే తయారీదారులందరి కోరిక. పంచదారతో తయారు చేయడం వల్ల తినలేకపోతున్నామంటూ చాలామంది మధుమేహం ఉన్నవారు మా ఊరు వచ్చినప్పుడు చెప్పి బాధపడేవారు. అందుకే భౌగోళిక గుర్తింపు వచ్చిన తర్వాత మంచి రోజు చూసుకుని స్పైసీ పూతరేకులను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాం. – గాదిరాజు ప్రసాదరాజు, ఆత్రేయపురం -
ష్.. గప్‌చుప్..!!.. యువతులు దుస్తులు మార్చుకునే దృశ్యాల చిత్రీకరణ
సాక్షి, కోనసీమ జిల్లా(ఆత్రేయపురం): ఆడపిల్లలకు రక్షణ కరవైంది. తమ ఇంట్లోనూ మహిళలు ఉన్నారనే సంగతి మర్చిపోయి కొందరు మృగాళ్లు సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు. షాపింగ్ మాల్స్, ట్రైల్ రూమ్స్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టి మహిళలు దుస్తులు మార్చుకునే దృశ్యాలను చాటుగా చిత్రీకరించే విషయాలను చాలా వింటున్నాం. అదే ఓ ప్రభుత్వ కార్యాలయంలోనే ఇలా చేస్తే.. ఎవరిదీ తప్పు. ఆత్రేయపురం మండలం లొల్లలాకుల ఇరిగేషన్ కార్యాలయం వద్ద జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఫేస్బుక్ పరిచయంతో స్నేహితులంతా కలసి లొల్లలాకుల వద్ద కార్తిక మాసం సందర్భంగా ఈ నెల 20న వన సమారాధన ఏర్పాటు చేసుకున్నారు. కొందరు యువకులు, యువతులు హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. అయితే యువతులు దుస్తులు మార్చుకునేందుకు అక్కడే ఉన్న ఇరిగేషన్ కార్యాలయాన్ని అధికారుల అనుమతితో తీసుకున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ఆ కార్యాలయంలో పనిచేసే ఓ కాంట్రాక్టు సిబ్బంది ఒకరు రహస్యంగా ఆ రూమ్‌లో సెల్‌ఫోన్ రికార్డింగ్ బటన్ ఆన్‌చేసి.. ఎవరికీ కనబడకుండా కేవలం యువతుల దుస్తులు మార్చుకునే ప్రాంతంలో ఏర్పాటు చేశాడు. ఆ విషయం తెలియని ఆ యువతులు మామూలుగానే ఆ రూంలోకి వెళ్లారు. ఒకరిద్దరు దుస్తులు కూడా మార్చుకున్నారు. మరొకరు ఆ రూంలో చూస్తుండగా సెల్‌ఫోన్ కంట పడింది. దీంతో ఆ యువతులు షాక్‌కు గురై వెంటనే తమను ఇక్కడికి ఆహ్వానించిన స్నేహితులకు విషయం చెప్పి.. సెల్‌ఫోన్ అప్పగించారు. ఆ సెల్‌ఫోన్ ఎవరిదని ఆరా తీస్తే.. అక్కడ పనిచేస్తున్న వ్యక్తిది అని తెలిసింది. వెంటనే అతన్ని పట్టుకుని గట్టిగా దేహశుద్ధి చేశారు. అనంతరం ఆత్రేయపురం పోలీసులకు అప్పగించారు. అయితే ఇక్కడ కొందరు పెద్దలు, అధికారులు కలసి విషయాన్ని బయటకు పొక్కకుండా రహస్యంగా రాజీచేసి కేసు లేకుండా ఆ సెల్‌ఫోన్ రికార్డింగ్ చేసిన ప్రబుద్ధుడిని వదిలేశారు. ఇంతటి దారుణానికి పాల్పడిన వ్యక్తిని సాధారణంగా వదిలేస్తే ఎలా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు, పోలీసులు కుమ్మక్కై వదిలేశారనే ఆరోపిస్తున్నారు. దీనిపై ఎస్సై సీహెచ్ సుధాకర్ వివరణ కోరగా జరిగిన విషయం వాస్తమేనని, అయితే తమకు కేసు వద్దని స్నేహితులంతా తెలిపారన్నారు. దీంతో చట్టపరమైన చర్యలు తీసుకోలేదని ఆయన వివరించారు. -
ఆహా ఏమి రుచి.. ఆత్రేయపురం మామిడి తాండ్ర..
ఆత్రేయపురం(కోనసీమ జిల్లా): రుచికి.. శుచికి.. తియ్యని మామిడి తాండ్రకు కేరాఫ్ అడ్రస్‌గా ఆత్రేయపురం పేరు గాంచింది. చుట్టూ పచ్చని పొలాలు.. ప్రశాంత వాతావరణానికి నెలవైన ఈ గ్రామం తాండ్ర తయారీలో ప్రసిద్ధి పొందింది. అనేక మంది ప్రజలు దీనినే వృత్తిగా మార్చుకుని జీవనోపాధి పొందుతున్నారు. తియ్యని లాభాలు ఆర్జిస్తున్నారు. ఏటా వేసవి వచ్చిందంటే తాండ్ర తయారీలో ప్రజలు నిమగ్నమవుతుంటారు. సుమారు 500 కుటుంబాల వారు ఏప్రిల్, మే, జూన్ నెలల్లో తాటి చాపలపై మామిడి తాండ్ర పూస్తుంటారు. ఈ మూడు నెలలూ అనేక మందికి జీవనోపాధి కలి్పస్తుంటారు. ఇప్పుడు తయారు చేసిన తాండ్రను నిల్వ ఉంచి, ఏడాది పొడవునా విక్రయిస్తూంటారు. 60 టన్నులు.. రూ.66 లక్షలు ప్రస్తుత సీజన్లో ఆత్రేయపురం కేంద్రంగా సుమారు రూ.66 లక్షల విలువైన 60 టన్నుల మామిడి తాండ్ర తయారవుతోంది. దీని తయారీకి అవసరమైన మామిడి కాయలను నూజివీడు, సత్తుపల్లి, కోరుకొండ, గోకవరం, తుని, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ప్రధానంగా కలెక్టర్ రకం మామిడినే తాండ్ర తయారీకి వాడుతుంటారు. ఆత్రేయపురానికి రోజూ రెండు లారీల చొప్పున మామిడి కాయలు తీసుకొస్తుంటారు. దిగుమతి చేసుకున్న మామిడి కాయలను కావు వేసి పండ్లుగా తయారు చేస్తారు. గుజ్జు తీసి.. చక్కెర వేసి.. పండిన మామిడి నుంచి గుజ్జు తీస్తారు. ఆ గుజ్జులో తగు పాళ్లలో పంచదార కలుపుతారు. తర్వాత ఎండలో ఉంచిన తాటి చాపలపై కూలీల సాయంతో ఒక్కో పొరను పూస్తారు. ఇలా రోజుకు ఒక్కో పొర చొప్పున ఐదారు పొరలు పూసిన అనంతరం మామిడి తాండ్ర తయారవుతుంది. మామిడి తాండ్ర పూసిన తాటి చాపలు వారం రోజుల పాటు ఎండలో ఆరబెడతారు. దీనివల్ల ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అనంతరం ఆరంగుళాల పొడవు, వెడల్పు ఉండేలా ముక్కలు కోసి తిరిగి ఎండబెట్టి విక్రయాలకు సిద్ధం చేస్తారు. ప్రస్తుతం ఉన్న మామిడి ధరలతో తాండ్ర తయారీ తలకు మించిన భారంగా మారిందని తయారీదారులు వాపోతున్నారు. పెరిగిన ధరలతో గుబులు ప్రస్తుతం మామిడి దిగుబడి అంతంత మాత్రంగానే ఉండటంతో ధరలు విపరీతంగా పెరిగాయి. టన్ను మామిడి కాయల ధర రూ.18 వేలు, పంచదార క్వింటాల్ రూ.3,800 పలుకుతుండటంతో రూ.లక్షల్లో పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందని వ్యాపారులు అంటున్నారు. దీంతో సామాన్యులు మామిడి తాండ్ర తయారీకి ముందుకు వెళ్లే పరిస్థితులు లేవని తయారీదారుడు కఠారి సురేష్ ‘సాక్షి’కి తెలిపారు. టన్ను మామిడి కాయలతో 250 కిలోల తాండ్ర తయారవుతుండగా.. ప్రస్తుత ధరల ప్రకారం, కూలీల ఖర్చులతో కలసి సుమారు రూ.25 వేల వరకూ అవుతోంది. ఈ పరిస్థితుల్లో కిలో తాండ్రను రూ.150 నుంచి రూ.200 వరకూ అమ్మితేనే గిట్టుబాటు అవుతుందని వ్యాపారులు చెబుతున్నారు. ఇక్కడి నుంచి విదేశాలకూ.. ఆత్రేయపురంలో తయారైన మామిడి తాండ్ర రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర దేశాలకూ ఎగుమతి చేస్తున్నారు. ఇలా గ్రామానికి అంతర్జాతీయంగా పేరు తెస్తున్నారు. శ్రమనే దైవంగా నమ్ముకుని ఆత్రేయపురం పరిసర ప్రాంతాల ప్రజలు మామిడి తాండ్ర తయారీలో నిమగ్నమవుతున్నారు. లాభాలు ఆర్జించడంతో పాటు గ్రామానికి గుర్తింపు తీసుకురావడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఈ ఏడాది తక్కువ రేటు మామిడి తాండ్ర పుట్టిన ప్రాంతంగా ఆత్రేయపురం ఖ్యాతికెక్కింది. వేసవిలో టన్నుల కొద్దీ మామిడి కాయలను కొనుగోలు చేసి, తాండ్ర తయారు చేస్తారు. దీనిని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ ఏడాది మామిడికాయలు తక్కువ రావడంతో రేటు కూడా ఎక్కువగా ఉంది. తాండ్ర తయారు చేసిన కష్టానికి తగిన ఫలితం దక్కకపోవచ్చు. – కఠారి సురేష్, ఆత్రేయపురం ప్రభుత్వం చేయూతనివ్వాలి ఈ ప్రాంతంలో ఎందరో మహిళలు ఉపాధి పొందుతున్న మామిడి తాండ్ర తయారీకి ప్రభుత్వం బ్యాంకుల ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలు అందించాలి. అలాగే ఈ ప్రాంతంలో స్టాల్స్ నిర్మించుకోవడానికి, నాణ్యమైన సరుకులు కొనుగోలు చేయడానికి సాయం అందించాలి. -చిలువూరి చిన వెంకట్రాజు, ఆత్రేయపురం -
మృత్యువులోనూ వీడని స్నేహం
ఆత్రేయపురం/రాజమహేంద్రవరం రూరల్: బిడ్డలను కోల్పోయిన ఆ రెండు కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక వద్ద గోదావరిలో మంగళవారం సాయంత్రం నలుగురు విద్యార్థులు స్నానం చేస్తుండగా ఇద్దరు గల్లంతైన విషయం విదితమే. బుధవారం పోలీసులు, కుటుంబ సభ్యులు, ఈతగాళ్లతో గాలించడంతో పిచ్చుకలంకకు సుదూర ప్రాంతంలో హుకుంపేట గ్రామానికి చెందిన మెండి జోసఫ్ (బాబి)(15), ఈతకోట చిన్న(15) మృతదేహాలు బయటపడ్డాయి. మృతదేహాలను ఆత్రేయపురం ఎస్సై నరేష్ పోస్టుమార్టం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం ఇరువురి మృతదేహాలు హుకుంపేట చేరుకోవడంతో వారి ఇండ్లతో పాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులు ఇద్దరూ ప్రాణ స్నేహితులని..ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లే వారని, చివరికి మరణంలో కూడా వీరి స్నేహబంధం వీడలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇరువురు ఒకే రెడ్ కలర్ టీషర్టులు ధరించి ఉండటం చూపరులను కంటతడి పెట్టించింది. కుటుంబాల ఇంట గూడుకట్టిన విషాదం మెండు జోసఫ్(బాబి) తండ్రి రవికుమార్ నాలుగేళ్ల క్రితం మోరంపూడి సెంటర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. తల్లి కమలకుమారి కూలిపనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తోంది. మతిస్థిమితం లేని అక్కను చూసుకుంటుంది. చదువుకుని కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న తరుణంలో బాబి మరణించాడు. దీంతో కమలకుమారి తనను అన్యాయం చేసి వెళ్లిపోయావా కొడకా అంటూ గుండెలవిసేలా రోదించింది. ఈతకోట చిన్న తల్లిదండ్రులు రాణి, వెంకన్న కూలిపనులు చేసుకుని ముగ్గురు పిల్లలను పోషించుకుంటూ వస్తున్నారు. చిన్నకు అక్క,అన్నయ్య ఉన్నారు. ఇంటిలో చిన్నవాడైన చిన్నను తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచుకున్నారు. సరాదాగా స్నేహితులతో వెళ్లిన కుమారుడు విగతజీవిగా తిరిగిరావడంతో తల్లితండ్రులు రాణి, వెంకన్న తేరుకోలేకపోతున్నారు. -
సుబ్బారావు గ్రేట్.. నారింజ రసం సూపర్
నారింజకాయ నిన్ను చూడగానే నోరూరుతున్నది తొక్క తీసి తినగా అబ్బబ్బ పులుపు తిననే తినను తీసి నేలకొట్ట తీయని నారింజ తింటే హాయ్ హాయ్.. చిన్నప్పుడు చదువుకున్న పాట ఇది. నారింజ పేరు చెబితేనే కళ్లు మూసుకుంటాయి. అటువంటి నారింజ రసాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తాగుతుంటారు ఇక్కడ. తూర్పు గోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం దాటి, ఆత్రేయపురం వెళ్లే దారిలో లొల్ల లాకులకు ముందుగా, రోడ్డు పక్కన పచ్చని చెట్ల కింద చిన్న బండి కనిపిస్తుంది. అక్కడకు రాగానే వారి వారి వాహనాలను పక్కన పెట్టి, జుత్తుగ సుబ్బారావు తాత ఇచ్చే నారింజ రసం సేవించి, సేద తీరుతుంటారు. సుబ్బారావు వయస్సు 83 సంవత్సరాలు. ‘శ్రేష్ఠమైన వడ్లమూడి నారింజ పండ్లు తెప్పించి, రసం తీసి ఇస్తాను. వడ్లమూడిలో దొరక్కపోతే, రాజమండ్రి, నిడదవోలు ప్రాంతాల నుంచి నారింజకాయలు తీసుకువస్తాయి’ అంటారు ఈ తాత. ఆశ్చర్యమేమిటంటే, నారింజ కాయలు కొనడానికి తాత ఎక్కడకూ వెళ్లరు, అక్కడి నుంచి కాయలు రాగానే, ఇక్కడ అకౌంట్లో డబ్బులు వేసేస్తారు. ‘అంతా నమ్మకం మీదే నడిచిపోతోంది వ్యాపారం’ అంటారు ఈ తాత. ఒక్కో మనిషికి మూడు కాయల రసం పిండుతారు. కాయలు బాగా తగ్గినప్పుడు రెండు కాయలు పిండుతారు. ఒక్కో కాయ పది రూపాయలకు కొంటారు. కాని గ్లాసు రసం 20 రూపాయలకే అమ్ముతారు. ఎవరైనా వచ్చి ‘ధర పెంచవా తాతయ్యా’ అని అడిగితే, ‘నాకు ఆదాయానికి లోటు లేదు. నేను కూర్చుని తిన్నా నాకు సాగుతుంది. కాని ఏదో ఒక పనిచేయనిదే నాకు తోచదు. ఇది అలవాటైన పని. ఓపిక ఉన్నన్ని రోజులు చేస్తాను’ అంటూ ఎంతో సంబరంగా చెబుతారు సుబ్బారావు తాత. వ్యాపార రహస్యం.. నారింజ రసంలో నాలుగు రకాల వస్తువులు కలుపుతారు. ‘లక్ష రూపాయలిచ్చినా ఆ రహస్యం మాత్రం చెప్పను’ అంటారు సుబ్బారావు తాత. మొట్టమొదట్లో ఈ వ్యాపారం ర్యాలి గ్రామంలోని జగన్మోహిని ఆలయం దగ్గర ప్రారంభించారు. అక్కడ ఈ బండి పాతిక సంవత్సరాలు నడిచింది. ఆ తరవాత ఇప్పుడున్న ప్రదేశానికి మార్చానని చెబుతారు సుబ్బారావు తాత. ఆ తల్లి చలవ.. సుబ్బారావు తాత తన చిన్నతనంలో ఒకరి ఇంట్లో చాలా కాలం పనిచేశారు. అందుకుగాను వారు సుబ్బారావు తాతకు ఆరు కుంచాల పొలం రాసి ఇచ్చారట. సుబ్బారావు తాతకు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. వారిది ఉమ్మడి కుటుంబం. ‘వంటంతా ఒక కుండలోనే జరుగుతుంది’ అంటూ సంబరంగా చెబుతారు సుబ్బారావు తాత. ‘ఇంటి దగ్గర కూర్చుంటే ఏం వస్తుంది. ఓపిక ఉంది, కష్టపడతాను. ఎక్కడెక్కడ నుంచో మీరంతా రసం తాగటానికి వస్తుంటారు. నేను తయారుచేసిన నారింజ రసం అమెరికా కూడా వెళ్లింది. నాకు అంతకుమించిన సంతోషం లేదు’ అంటారు ఈ తాత. ఆరు నెలలు నారింజలే.. ఆరు నెలల పాటు కేవలం నారింజ రసం అమ్ముతారు. మిగిలిన ఆరు నెలలు రకరకాల రసాలు అమ్ముతారు. సొంతంగా లిమ్కా రుచిని కూడా తయారుచేస్తారు. మొత్తం 20 రకాల జ్యూస్‌లు తయారుచేస్తారు సుబ్బా రావు తాత. అన్నీ 20 రూపాయలకే అందిస్తున్నారు. వచ్చిన ప్రతివారినీ ‘రండి బాబూ! రా తమ్ముడూ! రా మనవడా!’ అంటూ ఆప్యాయంగా పిలుస్తారు. పది పైసలతో మొదలు.. 50 సంవత్సరాల క్రితం 10 పైసలతో ప్రారంభమైన నారింజ రసం ఇప్పుడు 20 రూపాయలకు చేరింది. ‘ఈ పాకం, ఈ ఫార్ములా ఎవ్వరికీ తెలియదు. ఈ రుచికి అలవాటు పడిన వాళ్లు మళ్లీ మళ్లీ అక్కడకు వచ్చి, ఆగి తాగి వెళ్తారు. ‘సుబ్బారావు గ్రేట్’ అంటారు అక్కడ రసం తాగినవారు. మంచి నీడనిచ్చే చెట్టు కింద నీడలో చల్లగా సేద తీరుతారు. ‘బండి చిన్నదే కానీ రుచి మాత్రం పెద్దది’ అంటారు ఆ రసం రుచి చూసినవారంతా. ఆ రసాన్ని మిషన్ మీద కాకుండా చేత్తో తీసే మిషన్‌తోనే తీస్తారు. ఉప్పు, కారం, ప్రత్యేకమైన మసాలా వేసి, కొద్దిగా ఐస్ జత చేసి జ్యూస్ ఇస్తూ, సుబ్బారావు తాత అందరి కడుపులను చల్లబరుస్తున్నారు. -
అర్ధరాత్రి విషాదం: పగబట్టిన పొగమంచు..
ఆత్రేయపురం: అర్ధరాత్రి పొగమంచు.. మార్గంలో హెచ్చరిక బోర్డులు లేకపోవడమే లొల్ల లాకుల సమీపాన జరిగిన కారు ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఆత్రేయపురం మండలం లొల్ల లాకుల వద్ద.. బొబ్బర్లంక – రావులపాలెం రోడ్డుపై ముక్తేశ్వరం ప్రధాన కాలువలోకి కారు దూసుకు పోయిన సంఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. ఇదే మండలం తాడిపూడికి చెందిన ఇందుకూరి సత్యనారాయణరాజు (43) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో పని చేస్తున్నారు. మిత్రులతో అక్కడే ఉంటున్నారు. మహా శివరాత్రి సందర్భంగా స్నేహితులతో కలిసి గురువారం కారులో స్వగ్రామం వచ్చారు. వసంతవాడలో పార్వతీ పరమేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వీరందరూ రాత్రి తిరిగి భీమవరం బయలుదేరారు. కారును చింతలపాటి శ్రీనివాసరాజు (46) నడుపుతున్నారు. ఆయన పక్కన ముందు సీటులో ఇందుకూరి సత్యనారాయణరాజు కూర్చున్నారు. వెనుక సీటులో ముదునూరి గణపతిరాజు, గొట్టుముక్కల బాపిరాజు చెరోపక్కన కూర్చోగా, వారి మధ్యలో ముదిండి సురేష్‌వర్మ కూర్చున్నారు. ఊరు దాటగానే పొగమంచు ఎక్కువగా ఉంది. దీంతో మార్గం కనిపించలేదు. అర్ధరాత్రి సమయానికి లొల్ల లాకుల వద్దకు చేరేసరికి కారు అదుపు తప్పి ముక్తేశ్వరం ప్రధాన కాలువలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇందుకూరి సత్యనారాయణరాజు, చింతలపాటి శ్రీనివాసరాజు (46), ముదిండి సురే‹Ùవర్మ (38) మరణించారు. కారు వెనుక సీటులో కూర్చున్న ముదునూరి గణపతిరాజు, గొట్టుముక్కల బాపిరాజులు ప్రమాదాన్ని గమనించి డోర్లు తెరచుకుని చెరోపక్కకు దూకేసి, సురక్షితంగా బయట పడ్డారు. మృతదేహాలను స్థానికుల సహాయంతో బయటకు తీసినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. ఇదీ మృతుల నేపథ్యం ♦ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చింతలపాటి శ్రీనివాసరాజుది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని కేశవరం. ఆయన రొయ్యల వ్యాపారం చేసేవారు. ఆయనకు భార్య శిరీష, కుమారుడు అవినాష్‌వర్మ ఉన్నారు. వర్మ ఆస్ట్రేలియాలో చదువుతున్నాడు. ♦మరో మృతుడు ముదిండి సురేష్వర్మది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని ఈడూరు. ఆయన లారీ ట్రాన్స్‌పోర్టు వ్యాపారం చేసేవారు. ఆయనకు భార్య ప్రమీల, కుమార్తె వర్షిత ఉన్నారు. కుమార్తె భీమవరంలో ఇంటర్ చదువుతోంది. ♦మరో మృతుడు ఆత్రేయపురం మండలం తాడిపూడికి చెందిన ఇందుకూరి సత్యనారాయణరాజుకు భార్య మాధవి, ఏకైక కుమారుడు అఖిల్‌వర్మ ఉన్నారు. వర్మ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. హెచ్చరిక బోర్డులేవీ! బొబ్బర్లంక–రావులపాలెం ఆర్అండ్బీ రోడ్డుపై లొల్ల లాకుల వద్ద మలుపు అత్యంత ప్రమాదకరంగా ఉంది. ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అర్ధరాత్రి వాహన చోదకులు ఈ మలుపును గుర్తించలేకపోతున్నారు. ఫలితంగా కాలువలోకి దూసుకుపోతున్నారు. కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటే కొట్టుకుపోతున్నారు. ఇటీవల ఏడెనిమిది సంఘటనలు జరిగాయి. ఇక్కడ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేస్తామని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారే కానీ పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఫలితంగా కొత్తవారు ఈ మార్గంలో ప్రయాణిస్తే కాలువలోకి దూసుకుపోయి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. రూ.59 కోట్లతో ప్రతిపాదనలు శిథిలావస్థకు చేరిన లొల్ల లాకుల మరమ్మతులకు రూ.59 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు. రెండు రోజుల క్రితమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి ఈ సమస్య తీసుకువెళ్లామన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కొంత అభివృద్ధి జరిగిందన్నారు. ఈ నెలాఖరున క్రాప్ హాలిడే ప్రకటించగానే ఇక్కడ వంతెన నిర్మాణం, ఇతర పనులు చేపడతామన్నారు. గడ్డర్లు ఊడిపోయే స్థితిలో ఉన్నాయన్నారు. కారు ప్రమాదంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గ్రిల్ ఊడిపోవడం వల్లే కారు కాలువలోకి దూసుకుపోయిందని అభిప్రాయపడ్డారు. మృతదేహాలకు నివాళులర్పించారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ మండల కనీ్వనర్ కనుమూరి శ్రీనివాసరాజు, మాజీ ఏఎంసీ చైర్మన్ ముదునూరి రామరాజు, మాజీ ఎంపీపీ పీఎస్ రాజు, వాడపల్లి ఆలయ కమిటీ సభ్యులు పెన్మెత్స సురేష్‌రాజు తదితరులు ఉన్నారు. చదవండి: తల్లీబిడ్డ మృతి కేసు.. విస్తుపోయే నిజాలు వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ, జనసేన వర్గీయుల దాడి -
గోదావరి వరదలో చిక్కుకున్న ఎస్ఐ
సాక్షి, తూర్పు గోదావరి : గోదావరి వరద నీటిలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అధికారులు కొద్దిగా శ్రమించాల్సి వచ్చింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు పోలవరం వద్ద గోదావరి ఉధృతి పెరుగుతున్న సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెళితే.. గత కొంతకాలంగా ఆత్రేయపురం వద్ద గోదావరి నదిలో హై టెన్షన్ టవర్ల నిర్మాణం కోసం పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం జేసీబీని తెప్పించి ఇసుక తవ్వకం చేపట్టారు. పలువురు కూలీలు కూడా అక్కడ పనిచేస్తున్నారు. అయితే ఎగువున కురుస్తున్న వర్షాలకు ధవశేశ్వరం వద్ద నీటి మట్టం పెరగడంతో నీటిని దిగువకు వదిలారు. ఈ క్రమంలో ఆత్రేయపురం వైపు నీటి ప్రవాహం పెరిగింది. ఒక్కసారిగా వరద చుట్టుముట్టడంతో కూలీలు, జేసీబీతో డ్రైవర్ నది మధ్యలో చిక్కుపోయారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని వారిని రక్షించే ప్రయత్నం చేశారు. ఆత్రేయపురం ఎస్సై నదిలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు నాటు పడవలో బయలుదేరారు. అయితే ఇసుక దిబ్బల కారణంగా ఆయన బోటు కూడా వరదలో చిక్కుకుపోయింది. దీంతో రావులపాలెం నుంచి బయలుదేరిన అగ్నిమాపక సిబ్బంది నదిలో చిక్కుకున్న వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అయితే జేసీబీని బయటకు తీసుకురావడంలో మాత్రం కొద్దిపాటి ఆలస్యం జరిగింది. -
చేతికి చిక్కినట్లే చిక్కి పారిపోయిన చిరుత
-
చేతికి చిక్కినట్లే చిక్కి పారిపోయిన చిరుత
సాక్షి, తూర్పుగోదావరి : గత కొద్ది రోజులుగా జిల్లాలో బీభత్సం సృష్టిస్తున్న చిరుత పులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారుల చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చేతికి చిక్కినట్టే చిక్కి పారిపోయింది. ముమ్మడివరం మండలం గేదెల్లంకలోని ఒ కొబ్బరితోటలో ఉన్నగుడిసెలో దూరిన చిరుతకు వైద్యులు మత్తు ఇంజక్షన్ ఇచ్చి పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ మత్తు మందు పని చేయకపోవడంతో చిరుత తప్పించుకుంది. అటవీ అధికారులు చిరుతను బంధిస్తుండగా ఒక్కసారిగా గాండ్రించి అక్కడి నుంచి పారిపోయింది. చిరుత పరారీతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. (తూర్పుగోదావరిని వణికిస్తున్న చిరుతపులి) ఈ నెల 4వ తేదీన అంకంపాలెం గ్రామంలో చిరుత పులి బీభత్సం సృష్టించి నలుగురిని గాయపరిచి చెట్టుపైకి చేరిన సంగతి తెలిసిందే. అయితే చిరుతను బంధించేందుకు అటవీశాఖ అధికారులు లైట్లు ఆపివేయడంతో చిరుత తప్పించుకుని పొలాల్లోకి పారిపోయింది. అక్కడినుంచి పరారైన చిరుతపులి...ఇప్పుడు ముమ్మడివరం మండలం గేదెల్లంకలో ప్రత్యక్షమైంది. సమయం గడుస్తున్నా చిరుతను బంధించకపోవడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుత ఎక్కడ తప్పించుకుని, మళ్లీ దాడికి దిగుతుందేమో అని భయంతో వణికిపోతున్నారు. -
తూర్పుగోదావరిని వణికిస్తున్న చిరుతపులి
సాక్షి, ముమ్మడివరం : తూర్పు గోదావరి జిల్లాలో చిరుత పులి సంచారం టెర్రర్ పుట్టిస్తోంది. నాలుగు రోజుల అనంతరం ఎట్టకేలకు చిరుత పులి చిక్కడంతో స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఓ గుడిసెలో బంధించిన చిరుతను అదుపులోకి తీసుకునేందుకు అటవీ, పోలీసు శాఖ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మరోవైపు చిరుత దాడిలో గాయపడిన వ్యక్తులు రాజమహేంద్రవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఈ నెల 4వ తేదీన అంకంపాలెం గ్రామంలో చిరుత పులి బీభత్సం సృష్టించి నలుగురిని గాయపరిచి చెట్టుపైకి చేరిన సంగతి తెలిసిందే. అయితే చిరుతను బంధించేందుకు అటవీశాఖ అధికారులు లైట్లు ఆపివేయడంతో చిరుత తప్పించుకుని పొలాల్లోకి పారిపోయింది. అక్కడినుంచి పరారైన చిరుతపులి...ఇప్పుడు ముమ్మడివరం మండలం గేదెల్లంకలో ప్రత్యక్షమైంది. ప్రస్తుతం గేదెల్లంకలోనే వున్న ఓ కొబ్బరితోటలోని గుడిసెలో దూరింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అప్రమత్తమై గుడిసెను తాళ్లతో కట్టి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. మరోవైపు అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. గతంలో చిరుతను పట్టుకోవడంలో అధికారులు విఫలం అవడం వల్లే ఇప్పుడు తమ వూరిపై పడిందని వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగు రోజుల నుంచి అటవీ శాఖ సాంకేతిక సిబ్బందిని రంగంలోకి దించకుండా, చిరుతపులిని పట్టుకోకుండా, కాలక్షేపం చేయడంపై ప్రజలు భయాందోళన చెందుతున్నారు. చిరుత ఎక్కడ తప్పించుకుని, మళ్లీ దాడికి దిగుతుందేమో అని స్థానికులు భయంతో వణికిపోతున్నారు. -
ఆత్రేయపురంలో చిరుత కలకలం
-
ఆత్రేయపురం కుర్రాడు
బ్రహ్మలోకంలో ఉన్నట్టుండి భీషణ ప్రతిజ్ఞ ముక్తకంఠంతో వినిపించింది. బ్రహ్మ నాలుగు ముఖాలూ నాలుగు దిక్కులూ పిక్కటిల్లేట్టు గర్జిస్తున్నాయ్. ‘ఒడ్డూ ఎత్తులూ, కండలు కావరాలూ లేకుండా బొమ్మని చేసి దానికి ప్రాణం పోస్తా. ఆ ప్రాణి తన విజ్ఞాన వైదుష్యాల ద్వారా సమున్నతుడై వర్ధిల్లగలడు... అస్తు’ అని నాలుగు నోళ్లు మూసేశాడు. విరించి శపథం ప్రాణదీపమై నేలకు దిగింది. ఆ దీపం అరవై ఏళ్లనాడు ఆత్రేయపురంలో భమిడిపల్లి వారింట్లో ఉగ్గులు పోసుకుంది. బ్రహ్మగారి మాట మేరకు ఏ ఆర్భాటాలూ లేకుండా ఆ బొమ్మ కూర్మంలా కది లింది. తర్వాత క్రమంగా ఎదిగి, బ్నిం అంటే ‘వీరా!’ అని తెలుగుజాతిని నివ్వెరపరుస్తున్న బ్రహ్మమానస పుత్రుడు, నేటి షష్ట్యబ్ది మిత్రుడు భమిడిపల్లి నరసింహమూర్తి అయ్యారు. ఆత్రేయపురంలో ఇంటి చదువుతోనే సంస్కృతాంధ్రాలు తగు మాత్రం వంట పట్టించుకున్నారు. బొమ్మలు గీయడంమీద ఆసక్తి చూపారు. అలాగ గీతలకి అడ్డంపడుతూ, అక్షరాల్ని గుచ్చుకుంటూ పాకుతూ దేకుతూ గుమ్మందాటి అరుగుమీదకు వచ్చారు. పిల్లాడికి ఈడొచ్చింది. నీలాటి రేవుకి వయసులు చిందిస్తూ బిందెలెత్తికెళ్లే పడుచుల్ని, పనీ పాటలకి వెళ్లే పిల్లల్ని ఆబగా తిలకించడం ఓ కళగా నేర్చాడు. అసింటా వెళ్లాక ఆ పల్లె పడతులు పమిటలు సద్దుకుంటూ ‘బెమ ఉందిగానీ జవ లేదు.. ప్చ్’ (భ్రమ ఉందిగానీ జవసత్వాల్లేవు) అనుకునేవారు. ఇప్పటికే భూమ్మీద పత్రి పూజ లేకుండా పోయిన పెనిమిటి చేసిన శపథంతో ఇంకేమవుతాడోనని పరిపరి విధాల వగచిన వాగ్దేవి అమరకోశం మొదలు కావ్య నిఘంటువుల్దాకా రంగరించి కూర్మానికి పోసేసి, నిశ్చింతగా వీణలో లీనమైంది. 1981లో ఆత్రేయపురం కుర్రాడు భాగ్యనగరానికి పయనమయ్యాడు. కార్యార్థి అయి వెళ్తున్న వామనుడికి ముంజి, భిక్షాపాత్ర, గొడుగు వగైరాలను తలొకరు తలోటి ఇచ్చి దీవించిన విధంగా, నవోదయ రామ్మోహనరావు, శంకు, శ్రీ సీతారావుడు, ఇంకొందరూ ఆ కుర్రాడిని చేతుల్లోకి తీసుకుని రైళ్లు, బస్సులు, మెట్లు ఎక్కించారు. ఒక వీక్లీలో ఆర్టిస్ట్‌గానూ, ఒకింట్లో పేయింగ్ గెస్ట్‌గానూ కుదురుకున్నాడు. మన బతుక్కిది చాల్లే అనుకుని ‘బ్నిం’ అనే అక్షరవన్నర సంత కం ఖాయం చేసుకున్నాడు. భాగ్యనగరం బ్నింని బహుముఖ ప్రజ్ఞాశాలిగా తీర్చిదిద్దింది. తెలంగాణ శ్లాంగ్వేజిని, బతుకుతెరువుని నేర్పింది. దూరదర్శన్ గ్రీన్‌రూంలో జొరబడి బుల్లితెరకి కావల్సిన ఛందో వ్యాకరణాలని ఆపోశన పట్టాడు. క్రమంగా స్వార్జననీ, ఇరానీ చాయ్‌నీ, జర్దాని మరిగారు. ఆ సరికే పాట, పద్యం మీద పట్టు సాధించారు. కథలు, టీవీ సీరియల్స్‌పై అధికారం వచ్చింది. కార్టూన్లు, కవర్ పేజీలు, సభ లేఖలు, శుభ లేఖలు, టుమ్రీలు అందించే నమ్మకపాత్రమైన చిరునామాగా తేలారు. రెక్క విదిల్చుకుని వేళాపాళల సంకెళ్లు తెంపేసుకుని ఫ్రీలాన్సర్‌గా నిలబడ్డారు. మైకంత ఎదిగారు. ఒకానొక శుభముహూర్తాన పలుకులమ్మతో మంతనాలు సాగించి నృత్య నాటికలకి శ్రీకారం చుట్టారు. ఇప్పటిదాకా రెండు సెంచరీలు పూర్తి చేసి మూడో శతకాన్ని ముగించే దారిలో ఉన్నారు. ప్రఖ్యాత నర్తకి స్వాతిసోమనాథ్ కోరగా ‘వాత్సా్య యన కామసూత్ర’ నృత్య నాటికని ప్రదర్శన యోగ్యంగా రచించారు. దాన్ని స్వాతిసోమనాథ్ ప్రదర్శించి రసజ్ఞుల మన్ననలందుకున్నారు. బ్నిం బాపు రమణలకు మూర్తి. వేలాదిమందికి స్ఫూర్తి. ఆత్రేయపురంలోనే అంకురించిన బాపు రమణలతో స్నేహం కడదాకా కొనసాగింది. నిరంతరం వారి మధ్య ఒక జీవతంతి ప్రవహిస్తూ ఉండేది. బ్నింగారు తెలుసని చెప్పుకోవడం నాలాంటి వాళ్లకి గర్వంగా ఉంటుంది. ఇప్పుడిప్పుడు చాలామంది ‘అర్జునుడంటే ఎవరో అనుకున్నా కిరీటి నాకెందుకు తెలీదన్నట్టు’ ప్రవర్తిస్తున్నారు. ఆయన విద్వత్తుకిది నీరాజనం. వారాసిగూడలో ఓ ఆశ్రమం స్థాపించి, ఆయన కాబోయిన నట నటీమణులకు, రైటర్లకు, దర్శకులకు, యాంకర్ భామలకు అభయాలిచ్చి ఆత్మవిశ్వాసం గోలీలుగా మింగిస్తున్నారు. బ్నిం దగ్గర వృత్తిపరమైన నిబద్ధత ఉంది. గీసి రాసి సకాలంలో ఇవ్వడం, ఇవ్వాల్టి సోషల్ మీడియాని త్రివిక్రమంగా ఆక్రమించుకుని విశ్వవ్యాప్తమయ్యారు. ఆయనది అవసరానికి మించిన ఆత్మవిశ్వాసం. ‘సెల్ఫ్‌పిటీని’ చావగొట్టి చెవులు మూసిన రౌడీషీటర్ ఆ కుర్రాడు. నా కాళ్లకి చెప్పుల్లేవని అఘోరించే వాళ్లని ఈ భూమ్మీద కాళ్లే లేని వారెందరున్నారో చూడమని కన్నీళ్లు తుడిచే బ్నింకి– శతమానం భవతి! (ఆదివారం ఇందిర ప్రియదర్శిని ఆడిటోరియం, పబ్లిక్ గార్డెన్స్‌లో జరుగనున్న బ్నిం షష్ట్యబ్ది సభ వేళ...) వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
మామిడి తాండ్ర తయారీదారులను కలిసిన వైఎస్ జగన్
సాక్షి, కొత్తపేట : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్ ఆత్రేయపురం శివారులో మామిడితాండ్ర తయారీదారులను కలిశారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజన్న బిడ్డకు వినతిపత్రం అందజేశారు. కోల్డ్ స్టోరేజ్‌లు, మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని జననేతకు చెప్పారు. అంతేకాక జీఎస్టీ నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని మామిడితాండ్ర తయారీదారులు వైఎస్ జగన్‌ను కోరారు. వారి సమస్యలను విన్న ప్రతిపక్షనేత సానుకూలంగా స్పందించారు. వారికి తోడుగా ఉంటానని మాట ఇచ్చారు. వైఎస్ జగన్ హామీతో వారు హర్షం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌ను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివచ్చారు. స్థానికుల నుంచి రాజన్న తనయుడికి ఘనస్వాగతం లభించింది. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైఎస్ జగన్ పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు. -
అవినీతి బాట.. అక్షర సత్యం
తేల్చిచెప్పిన విజిలెన్స్, క్వాలిటీ కంట్రోల్ బృందం రోడ్ల పనుల తీరుపై జేఈపై ఆగ్రహం పేరవరం, తాడిపూడి గ్రామాల్లో రోడ్ల నిర్మాణాలు.. అవినీతి బాటలుగా ఉన్నాయంటూ ‘సాక్షి’తో ప్రచురితమైన కథనం అక్షర సత్యమని విజిలెన్స్, క్వాలిటీ కంట్రోల్ బృందం బుధవారం నిర్ధారించింది. పనులు చేసే తీరు ఇదేనాంటూ జెడ్పీ జేఈ ప్రసాద్‌పై ఆగ్రహావేశాలు వ్యక్తంచేసింది. ఈ పనులకు సంబంధించి బిల్లులు కూడా చేస్తున్నట్టు వారు గుర్తించారు. ఈ పనుల రికార్డులతో తమ కార్యాలయానికి రావాలని ఏఈ...ని ఆదేశించారు. మండలంలో చేపట్టిన పనుల పర్యవేక్షణ నుంచి జేఈ ప్రసాద్ తప్పించినట్టు ఈ బృందంలోని జెడ్పీ ఈఈ ఎస్వీ రాఘవరెడ్డి ప్రకటించారు. ఆత్రేయపురం (కొత్తపేట) : మండలంలోని పేరవరం, తాడిపూడి గ్రామాల్లో జెడ్పీ జేఈ ప్రసాద్ పర్యవేక్షణలో చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులను బుధవారం విజిలెన్స్, క్వాలిటీ కంట్రోల్ బృందం పరిశీలించింది. ఈ రోడ్ల నిర్మాణ తీరు, ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడుస్తున్న వైనంపై ‘అవినీతి బాటలు... రూ.3 కోట్ల విలువైన రోడ్లు పనుల్లో నాణ్యతకు తిలోదకాలు’శీర్షికతో ఈ నెల 20వ తేదీ ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం.. విజిలెన్స్ అధికారులను పరుగులు పెట్టించింది. రోడ్ల నిర్మాణ పనుల తీరుపై విజిలెన్స్, క్వాలిటీ బృందంలోని కాకినాడ డీఈ ప్రసాద్‌బాబు, రాజమండ్రి డీఈ సురేష్‌కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పేరవరం కాలువ గట్టు వద్ద సిమెంట్ రోడ్డు బీటలు పడడంపై జేఈపై మండిపడ్డారు. మార్కెట్ కమిటీ నిధులతో నిర్మిస్తున్న గ్రావెల్ రోడ్డుకు ఉపయోగిస్తున్న మెటీరియల్‌ను పరిశీలించిన వారు.. నాణ్యత ప్రమాణాలు ఎక్కడ పాటిస్తున్నారంటూ నిలదీశారు. తాడిపూడిలో నిర్మిస్తున్న రహదారి పనులను చూసి..ఇలాగేనా రహదారులు నిర్మించేదని జేఈని ప్రశ్నించారు. పనులు పర్యవేక్షకుండానే రోడ్డు బిల్లులు చేస్తున్నట్టు వారి విచారణలో తేలింది. ఈ పనులకు సంబంధించిన ఎంబుక్‌లు, అంచనా వివరాలతోపాటు మొత్తం సమాచారంతో కార్యాలయానికి హజరు కావాలని జేఈ ప్రసాద్‌ను విజిలెన్స్ బృందం ఆదేశించింది. జేఈని పనులకు దూరంగా ఉంచుతాం.. మండలంలో జెడ్పీ పర్యవేక్షణలో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనుల్లో జేఈ ప్రసాద్‌ను దూరంగా ఉంచుతున్నట్టు ఈ బృందంలో ఉన్న జెడ్పీ ఈఈ ఎస్వీ రాఘవరెడ్డి తెలిపారు. ఈయన పర్యవేక్షణలో పనులు చేపట్టకుండా నిలుపుదల చేస్తున్నట్టు వివరించారు. ప్రస్తుత పనులపై విచారణ చేయనున్నట్టు ఆయన తెలిపారు. -
అవినీతి బాటలు
- ఆత్రేయపురం మండలంలో రూ.3 కోట్లతో రోడ్ల పనులు - నాణ్యతకు తిలోదకాలు.. మూణ్నాళ్లకే ముక్కలు - కానరాని ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణ - యథేచ్ఛగా ‘తమ్ముళ్ల’ అక్రమాలు కోట్లాది రూపాయలతో గ్రామాల్లో నిర్మిస్తున్న రోడ్లపై ‘తమ్ముళ్లు’ అవినీతి బాటలు వేసుకుంటున్నారు. ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో.. నాసిరకం గ్రావెల్‌తో.. మూడు పాళ్లు సిమెంటు.. ముప్ఫై పాళ్లు ఇసుక చందాన.. నాణ్యత లేకుండా రోడ్లు నిర్మిస్తున్నారు. దీంతో ఏళ్లపాటు నిక్షేపంలా ఉండాల్సిన ఆ రోడ్లు వేసిన మూణ్నాళ్లకే ముక్కలవుతున్నాయి. ఆత్రేయపురం : మండల పరిధిలోని 17 గ్రామాల్లో ఇటీవల తెలుగు తమ్ముళ్లు నామినేషన్ పద్ధతిపై సీసీ, గ్రావెల్ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టారు. జిల్లా పరిషత్ నుంచి కొత్తపేట మార్కెట్ కమిటీ నిధులు, ఎంపీ ల్యాడ్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా సుమారు రూ.3 కోట్లు ఈ రోడ్ల నిర్మాణానికి మంజూరయ్యాయి. నిబంధనల ప్రకారం గ్రావెల్ రోడ్డు వేసేటప్పుడు గ్రావెల్, ఇసుక, సిమెంటు మిశ్రమంతో నిర్మాణం చేపట్టాలి. కానీ, కాంట్రాక్టర్లయిన ‘తమ్ముళ్లు’ నిబంధనలకు తూట్లు పొడుస్తూ నాసిరకం సిమెంటు, నాసిరకం గ్రావెల్‌తో రోడ్ల నిర్మాణం చేపడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బూడిద ఎక్కువగా కలిసిన గ్రావెల్ వాడడంతో రోడ్డు నిర్మాణంలో నాణ్యత లోపిస్తోంది. తాడిపూడి, పేరవరం తదితర గ్రామాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క సీసీ రోడ్ల నిర్మాణంలో కూడా నిబంధనలు పాటించడంలేదు. ముఖ్యంగా వాటర్ క్యూరింగ్ చేయడంలో నిర్లక్ష్యం చూపుతున్నారు. క్యూరింగ్ 10 రోజులు చేయాల్సి ఉండగా చాలాచోట్ల ఆవిధంగా జరగడంలేదు. దీంతో నిర్మించిన కొద్ది రోజులకే సీసీ రోడ్లు బీటలు వారుతున్నాయి. పేరవరం, తాడిపూడి గ్రామాల్లో సీసీ రోడ్లు వేసిన కొద్ది రోజులకే బీటలు తీశాయంటే రోడ్లను ఎంత నాణ్యతారహితంగా నిర్మిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అందుబాటులో ఉండని ఇంజినీరింగ్ అధికారులు ఈ రోడ్ల పనులకు మంజూరైన నిధులు, రోడ్డు నిర్మాణంలో చేపట్టాల్సిన నాణ్యత ప్రమాణాల గురించి తెలుసుకునేందుకు సంప్రదించేందుకు ప్రయత్నించగా జెడ్పీ ఇంజినీరింగ్ అధికారులు అందుబాటులోకి రావడం లేదని పలువురు ఎంపీటీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల పరిషత్ సమావేశాల్లో ప్రశ్నించాలనుకున్నా ఇంజినీరింగ్ అధికారులు వాటికి కూడా డుమ్మా కొడుతున్నారని మండిపడుతున్నారు. విజిలెన్స్, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తా గ్రామాల్లో జరుగుతున్న రోడ్ల నిర్మాణంలో అధికారులు, అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై నిధులు దోచేస్తున్నారు. దీంతో రోడ్లు వేసిన మూణ్నాళ్లకే ముక్కలవుతున్నాయి. దీనిపై విజిలెన్స్ అధికారులకు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాను. గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం నిధుల మంజూరుకు కృషి చేసే ప్రజాప్రతినిధులకు ఆ పనులు ప్రారంభించే సమయంలో ఇంజినీరింగ్ అధికారులు కనీస సమాచారం కూడా అందించడం లేదు. - మద్దూరి సుబ్బలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యురాలు, ఆత్రేయపురం -
అచ్చం పచ్చని బాతులా..
నీటిపట్టుల్లో చకచకా ఈదుతూ, నేల మీద గునగునా నడిచే బాతులు సాధారణంగా తెలుపు, నలుపు రంగుల్లో లేదా ఆ రెండూ కలగలిసిన రంగులో ఉంటాయి. అయితే ‘నేను నీటి, నేలబాపతు బాతును కాదు. అలాంటి వాటి కన్న పై ఎత్తు దాన్ని’ ఓ ‘ఆకుపచ్చని బాతు’ బొప్పాయి చెట్టుపై దర్శనమిచ్చింది. ‘బాతు ఆకుపచ్చగా ఉండడమేమిటి, బొప్పాయి చెట్టుకూ దానికీ సంబంధమేమిటి?’ అనుకుంటున్నారా.. మరేం లేదు.. పేరవరంలో ముళ్లపూడి కృష్ణమోహ¯ŒSరావు వ్యవసాయ క్షేత్రంలో బొప్పాయి చెట్టుకు కాసిన కాయ బాతు ఆకృతిలో ఉంది. ఆ కాయను చూసిన వారు ‘భలేగుందే’ సంభ్రమం చెందారు. కొన్ని కాయలు జన్యుపరమైన కారణాల వల్ల సహజాకృతికి విరుద్ధంగా రూపొందుతాయని ఉద్యానవన శాఖాధికారి బబిత చెప్పారు. – ఆత్రేయపురం -
ఆకట్టుకున్న పురాతన నాణేల ప్రదర్శన
అత్తిలి :స్థానిక ఎస్వీఎస్ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన పాతనాణేలు, కరెన్సీనోట్లు, తపాలా బిళ్లల ప్రదర్శన విద్యార్థులను ఆకట్టుకుంది. తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లికి చెందిన రిటైర్డు ఉద్యోగి అల్లుకృష్ణకుమారి తాను సేకరించిన 70 దేశాలకు చెందిన 150 కరెన్సీనోట్లు, 900 నాణేలు, 600 తపాలా బిళ్లలను ప్రదర్శనలో ఉంచారు. ఇండియాలో 18వ శతాబ్దం నాటి నాణేలను ప్రదర్శించారు. విద్యార్థులకు అవగాహన కల్పించారు. కృష్ణకుమారి సర్పంచ్ కందుల కల్పన, జెడ్పీటీసీ మేడపాటి కృష్ణకుమారి సత్కరించారు. హెచ్ఎం కామర్సు నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు -
డీఎడ్ కాలేజీలో ఏసీబీ తనిఖీ
ఆత్రేయపురం: స్థానిక డీఎడ్ కాలేజీలో గురువారం ఏసీబీ సీఐ బి. రాజశేఖర్ ఆధ్వర్యంలో అధికారుల బృందం దాడులు నిర్వహించింది. రాష్ట్రంలో డీఎడ్ కాలేజీల రెన్యువల్లో భాగంగా హైదరాబాద్ ఎస్ఎస్సీ బోర్డు కార్యాలయం వద్ద ఏపీ ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ ప్రసన్నకుమార్ ఒకొక్క విద్యార్థి నుంచి రూ. వెయ్యి చొప్పున వసూలు చేస్తూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఆ వసూళ్లలో భాగస్వాములైన డీఎడ్ విద్యాసంస్థల అధినేత వినుకొండకు చెందిన రఫీ, రామారావును ఏసీబీ అధికారులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చారు. ఈ దాడుల్లో రూ. 44.65 లక్షలు నగదును స్వాధీనం చేసుకున్నారు. డీఎడ్ విద్యా సంస్థల అధినేత రఫీ రాష్ట్రవ్యాప్తంగా 23 డీఎడ్ కాలేజీల్లో భాగస్వామి కావడంతో ఆయా కాలేజీలపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. ఆ నేపథ్యంలో ఆత్రేయపురంలోని డీఎడ్ కాలేజీపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కాలేజీ రికార్డులను ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అదే సమయంలో సంస్థ డైరెక్టర్ పీఎస్ రాజు ఇంటిలో కూడా ఏసీబీ బృందం దాడులు నిర్వహించింది. ఏసీబీ సీఐ రాజశేఖర్ మాట్లాడుతూ కాలేజీ రికార్డులను పరిశీలించామని, దీనికి సంబంధించిన నివేదికను ఏసీబీ ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. అంబాజీపేట ఎంపీడీఓ టి.S శ్రీనివాస విశ్వనాథ్, ఏసీబీ సిబ్బంది ఎస్‌వై జానీ, బి. లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
రెండేళ్ల క్రితం ఒకేఒక్క స్థానంతో గట్టెక్కిన టీడీపీ
రెండేళ్ల క్రితం కేవలం ఒకేఒక్క స్థానంతో గట్టెక్కిన అధికార టీడీపీకి ఇక్కడ వింత పరిస్థితి ఎదురుకానుంది. అప్పటి పరిస్థితుల నేపథ్యంలో కుదుర్చుకున్న ‘జెంటిల్మెన్ ఒప్పందం’ ఇప్పుడు ఏం తేల్చుతుందోనని ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆత్రేయపురం మండల పరిషత్‌లో తొలి రెండేళ్లు ఒకరికి ఎంపీపీ పదవిని కట్టబెట్టగా, అది కొద్ది రోజుల్లో ముగియనుంది. ఒప్పందం మేరకు తర్వాతి మూడేళ్ల పాటు ఆ పదవిని మరొకరికి అప్పగించాల్సి ఉంది. మరి ఎంపీపీ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జెంటిల్మెన్ ఒప్పందమిదే.. తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలోని 19 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా, 10 స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. తొమ్మిది స్థానాల్లో వైఎస్సార్ సీపీ గెలుపొందింది. టీడీపీ తరఫున ఎంపీపీ స్థానంలో కూర్చొనేందుకు ఇద్దరు పోటీ పడ్డారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణుల ఏకాభిప్రాయం మేరకు జెంటిల్మెన్ ఒప్పందం కుదిరింది. తొలి రెండేళ్లు వీవీ కృష్ణారావు, ఆ తర్వాత మూడేళ్ల పాటు మద్దూరి సుబ్బారావు ఎంపీపీగా కొనసాగాలనేది ఆ ఒప్పందం సారాంశం. ఈ మేరకు ఎంపీపీగా వీవీ కృష్ణారావు పదవి చేపట్టగా, సుబ్బారావు వైస్ ఎంపీపీగా బాధ్యతలు చేపట్టారు. జూలై 4తో రెండేళ్లు ఆ ఒప్పందం ప్రకారం ఈ ఏడాది జూలై నాలుగో తేదీకి కృష్ణారావు ఎంపీపీగా కొనసాగి రెండేళ్లు పూర్తి కానుంది. జెంటిల్మెన్ ఒప్పందం ప్రకారం.. ఆ తర్వాత ఎంపీపీ పగ్గాలు సుబ్బారావుకు అప్పగించాల్సి ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై నెల రోజుల నుంచి ఎంపీటీసీ సభ్యులు, పార్టీ నేతలు తర్జనభర్జన పడుతున్నారు. కృష్ణారావు రాజీనామా చేస్తే, సుబ్బారావు ఆ పదవి చేపడతారని ఎదురుచూస్తున్నారు. ఒకవేళ కృష్ణారావు ఆ పదవిని వీడకపోతే, అధికార పక్షానికి చెందిన ఇద్దరు, ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు మద్దతు ఉపసంహరించుకోవచ్చని మండల పరిషత్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదే జరిగితే ఇప్పటికే 9 మంది సభ్యుల బలం ఉన్న వెఎస్సార్ సీపీకి లబ్ధి చేకూరే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజా సంక్షేమం అంతంతమాత్రమే.. ఈ విషయం పక్కనపెడితే.. ఎంపీపీగా కృష్ణారావు ఈ రెండేళ్ల కాలంలో చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పెద్దగా లేవని సొంత పార్టీవారే పెదవి విరుస్తున్నారు. ఒకవేళ జెంటిల్మెన్ ఒప్పదం అమలు కాకపోతే, స్వపక్షంలోనే వర్గవిభేదాలు పొడచూపే పరిస్థితి తలెత్తవచ్చన్న ఆందోళన వారిలో ప్రస్ఫుటమవుతోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఎంపీపీ కృష్ణారావు స్వచ్ఛందంగా పదవి వదులుకుని ‘జెంటిల్మెన్’ ఒప్పందానికి కట్టుబడి ఉంటారా లేక ఆయనే పదవిలో కొనసాగుతూ కొత్త సంక్షోభానికి తెర తీస్తారా అన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి. నేటి సమావేశంపైనే అందరి దృష్టి మట్టి తవ్వకాల్లో అక్రమాలు, ప్రజా సంక్షేమాన్ని విస్మరించడం వంటి విషయాల్లో అధికార పక్ష సభ్యులే బాహాటంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల జరిగిన పలు సమావేశాల్లోను అటు పార్టీ కేడర్‌తో పాటు సొంత వర్గీయుల నుంచి ఎంపీపీ అసంతృప్తిని ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో గురువారం జరిగిఏ మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. జెంటిల్మెన్ ఒప్పందాన్ని అమలు చేస్తారా లేక ప్రస్తుత ఎంపీపీనే కొనసాగిస్తారా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
ఆత్రేయపురం‘వంగవీటి’ సినీ సందడి
ఆత్రేయపురం : వర్మ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్న వంగవీటి సినిమా సన్నివేశాలు ఆత్రేయపురం ప్రాంతంలో చిత్రీకరిస్తున్నారు. స్క్రీన్‌ప్లే, నిర్మాత, డెరైక్టర్ రామ్‌గోపాల్‌వర్మ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫ్యాక్షన్ రాజకీయాల కథా చిత్రంగా రూపొందిస్తున్నారు. స్థానిక మహా త్మాగాంధీ జూనియర్ కళాశాల వద్ద ఈ చిత్రంలోని హత్య సంఘటనలను చిత్రీకరించా రు. నూతన తారాగణంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కో డెరైక్టర్లుగా వేగేశ్న అజయ్‌వర్మ, మంజునాథ్‌తో పాటు తారాగణం వంశీ, శాండీ, ఇం ద్రతో పాటు పలువురు నూతన తారాగణం నటిస్తున్నారు. ప్యాక్షన్ గొడవలకు సంబంధించిన చిత్రం కావడంతో హీరోయిన్ లేకుండా రూపొందిస్తున్నట్టు ఆత్రేయపురం వాసి కో డెరైక్టర్ వేగేశ్న అజయ్‌వర్మ పేర్కొన్నా రు. ఈ చిత్రం లోని విలన్ పాత్రలను ఆత్రేయపురానికి చెంది న యువకులు నటించారు. ఆత్రేయపురం విజయవాడ, పెనుగొండ ప్రాంతాల్లో ఈ చిత్ర నిర్మాణాన్ని శరవేగంగా రూపొం దించి త్వరలో విడుదల చేయనున్నట్టు అజయ్‌వర్మ తెలిపారు. -
లెక్క మార్చేసిన ఫోన్‌కాల్
ఆత్రేయపురం : ఒక్క ఫోన్‌కాల్.. అంతే ఆ అధికారులకు వణుకుపుట్టింది. తిమ్మిని బమ్మి చేసేశారు. వందలాది ట్రాక్టర్ల మట్టిని అక్రమార్కులు కొల్లగొడితే.. కేవలం 54 ట్రాక్టర్లే అని లెక్క తేల్చేశారు. కేవలం కొసర చూపించి అసలుకే టెండర్ వేసిన ఈ ఘనత ఆత్రేయపురం ఇరిగేషన్ అధికారుకే దక్కింది. గతేడాది నీరు-చెట్టు పథకంలో వెలిచేరు-పేరవరం మధ్య సెంట్రల్ డెల్టాకు సాగు నీరందించే ప్రధాన కాలువల్లో మట్టి తవ్వకాలకు మంజూరు లభించింది. ఈ ఏడాది ఎలాంటి మంజూరు లేకుండా ఓ మండల స్థాయి ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో దాదాపు 1,500 ట్రాక్టర్ల మట్టిని అక్రమంగా తరలించేశారు. దీనిపై ‘కాలువ మట్టి కొల్లగొట్టి..’ శీర్షికన ‘సాక్షి’లో వార్త వెలువడిన విషయం విదితమే. కలెక్టర్ ఆదేశాలతో ఆయా ప్రాంతాలను అధికారులు పరిశీలించి, విచారణ కూడా చేపట్టారు. కానీ స్థానిక పోలీస్ స్టేషన్లో మాత్రం కేవలం 54 ట్రాక్టర్ల మట్టి మాత్రమే అక్రమంగా తరలించినట్టు కేసు నమోదైంది. కొల్లగొట్టినది సుమారు రూ.18 లక్షల విలువైన దాదాపు 1,500 ట్రాక్టర్ల మట్టి అయితే, అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి ఒక్క ఫోన్‌కాల్ చేయడంతో పరిస్థితి అంతా మారిపోయింది. ఇరిగేషన్ అధికారులు ఆ 1,500 ట్రాక్టర్లను కాస్తా 54 ట్రాక్టర్లుగా కుదించారు. దీనిపై ఎస్సై జేమ్స్ రత్నప్రసాద్ను వివరణ కోరగా, ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం సుమారు రూ.30 వేల విలువైన 54 ట్రాక్టర్ల మట్టిని అక్రమంగా తవ్వినట్టు గుర్తించి, కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఇరిగేషన్ అధికారుల మాయాజాలంతో.. కేవలం 54 ట్రాక్టర్ల మట్టిని అక్రమంగా తరలించినట్టు పోలీసులు కేసు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారు. -
ఈ కారు ఎవరిదో?
వాడపల్లి (ఆత్రేయపురం) : శ్రీవేంకటేశ్వర స్వామి కల్యాణం జరిగిన ఈ నెల 16 నుంచి ఓ కారు ఆలయం వద్ద అనుమానాస్పదంగా నిలిచి ఉంది. ఈ నెల 29న ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పైడికొండల మాణిక్యాలరావు తదితరులు ఇక్కడకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఈ కారు అలాగే ఉండడంపై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.దీనిపై పోలీసులు దృష్టి పెట్టాలని కోరుతున్నారు. -
నేనే ముఠా మేస్త్రీ
ఆత్రేయపురం : ‘ఓయ్రబ్బా...ఓయ్రబ్బా... ఓయ్.. ఈ రీచ్‌కు నేనే మేస్త్రీ’ అంటూ తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం ఎస్సై జేమ్స్ రత్నప్రసాద్ ముఠా మేస్త్రీ అవతారమెత్తారు. ఇసుక రీచ్‌ల్లో అక్రమాలను అరికట్టేందుకు ఆయన పడే పాట్లు ఇవి. ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టినా, సామాన్యులకు అది అందని ద్రాక్షగానే మారింది. ఇసుక రీచ్‌ల్లో తిష్టవేసిన కొందరు అధికార పార్టీ నాయకులు.. వాహనాల్లో లోడింగ్, ర్యాంపుల్లో బాటల నిర్వహణ కోసం ప్రభుత్వం నిర్ణయించిన ధరకు నాలుగు రెట్లు వసూలు చేస్తున్నారు. ఈ అక్రమాలను అడ్డుకునేందుకు ఎస్సై జేమ్స్ రత్న ప్రసాద్ ముఠామేస్త్రీ అవతారమెత్తారు. ట్రాక్టర్లపై కూలీ వేషంలో ఎస్సై రత్నప్రసాద్ ఆత్రేయపురం, వద్దిపర్రు, వెలిచేరు, పేరవరం ఇసుక రీచ్‌లపై నిఘా పెట్టారు. ఇందులో భాగంగా గురువారం వెలిచేరు ఇసుక రీచ్‌లో అక్రమ వసూళ్లు జరుగుతున్నట్టు గుర్తించి, జట్టు మేస్త్రీని మందలించారు. అధిక వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిర్వాహకులు పలాయనం చిత్తగించడంతో గురువారం వెలిచేరు రీచ్‌లో ఇసుక లోడింగ్ నిలిచిపోయింది. -
పూతరేకుపై కల్తీ పూత
కల్తీ నెయ్యితో తయారీ తింటే అనారోగ్యం ఖాయం అమలాపురం :నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోయి.. కమ్మనైన రుచిని పంచే ఆత్రేయపురం పూతరేకుకు కల్తీ సెగ తగలింది. పూతరేకులకు అద్భుతమైన రుచిని తెచ్చేందుకు స్వచ్ఛమైన నెయ్యి వినియోగించే బదులు కల్తీ నెయ్యి వినియోగిస్తున్నారు. కొంతమంది వ్యాపారులు స్వార్థంతో చేస్తున్న ఈ పని.. జాతీయ స్థాయిలో ఆత్రేయపురం పూతరేకుకున్న ఇమేజ్‌కు డ్యామేజ్ అవుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు కేంద్రంగా తయారవుతున్న కల్తీనెయ్యి ఇటీవల ఆత్రేయపురం మండలంలో పెద్ద ఎత్తున దొరికిన విషయం తెలిసిందే. జిల్లావ్యాప్తంగా సరఫరా అవుతున్నా ఇక్కడే ఇంత పెద్ద ఎత్తున దొరకడానికి కారణం దీనిని స్థానికంగా తయారు చేస్తున్న పూతరేకుల్లో వినియోగించడమే. ఒక్క ఈ మండలంలోనే ఏటా సుమారు రూ.10 కోట్ల విలువైన కల్తీ నెయ్యి అమ్మకాలు సాగుతున్నాయంటే ఇక్కడ వాడకం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆవులు, గేదెల కళేబరాల నుంచి సేకరించిన కొవ్వులో కొంత నెయ్యి కలిపి కల్తీ చేస్తున్నారు. ఇది సువాసన వచ్చేందుకు కొన్ని రకాల ఎసెన్స్ వాడుతున్నారు. కల్తీనెయ్యి వల్ల పెద్దపేగు, లివర్ సంబంధ వ్యాధులు వస్తాయి. కల్తీ మోతాదు పెరిగితే ఫుడ్ పాయిజన్ కూడా జరగవచ్చు. బహిరంగ మార్కెట్లో స్వచ్ఛమైన నెయ్యి ధర కేజీ రూ.500 వరకూ ఉండడంతో కొందరు పూతరేకుల తయారీదారులు ఇలా పక్కదారి పట్టారు. రూ.250కే రావడంతో కల్తీ నెయ్యి వినియోగిస్తున్నారు. బ్రాండెడ్ అన్నట్టుగా బిల్డప్ ఆత్రేయపురం మండలం పులిదిండిలోని ఒక వ్యాపారి నిడదవోలు నుంచి పెద్ద ఎత్తున కల్తీ నెయ్యి దిగుమతి చేసుకుంటున్నాడు. దీనిని స్థానిక వ్యాపారులు కేజీ రూ.110కి కొంటున్నారు. రాజమండ్రిలోని బ్రాండెడ్ కంపెనీ నుంచి తెచ్చినట్టు చెబుతూ వారు పూతరేకుల తయారీదారులను మోసగిస్తున్నారు. కేజీ రూ.250 చొప్పున రోజుకు 15 నుంచి 20 కేజీల వరకూ విక్రయిస్తున్నారు. ఖండాంతర ఖ్యాతికి మచ్చ కల్తీ అని తెలిసి కూడా కొంతమంది పూతరేకుల తయారీదారులు లాభాపేక్షతో దీనిని వినియోగిస్తున్నారు. ఇది ఆత్రేయపురం పూతరేకు ఖ్యాతికి మచ్చ తెచ్చింది. ఆత్రేయపురం నుంచి జిల్లాతోపాటు హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలకు, అమెరికాకు కూడా పూతరేకులు ఎగుమతి అవుతూంటాయి. సినీ, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తల ఇళ్లల్లో ఫంక్షన్లకు ఆత్రేయపురం పూతరేకును అతిథులకు అందించడం సర్వసాధారణమైంది. వీటి తయారీపై మండలంలో సుమారు 300 కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవిస్తున్నాయి. ఏటా రూ.25 కోట్ల లావాదేవీలు జరుగుతాయి. ఇప్పుడు కల్తీ మచ్చవల్ల మొత్తం తయారీదారులపైనే అపనమ్మకం ఏర్పడుతోందని నిజాయితీగా వ్యవహరించే వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూతరేకులతోపాటు పలు స్వీట్ల వినియోగంలో కల్తీ నెయ్యి వినియోగిస్తున్నారు. కొందరే ‘కల్తీ’ని వినియోగిస్తున్నారు నాణ్యమైన ముడిసరుకుతో తయారు చేయడంవల్లే ఆత్రేయపురం పూతరేకులకు అంత గుర్తింపు వచ్చింది. కొంతమంది స్వార్థపరులు కల్తీ నెయ్యి వినియోగించి పూతరేకుకు చెడ్డపేరు తెస్తున్నారు. వారివల్ల పూతరేకుల పరిశ్రమ దెబ్బతినేలా ఉంది. - సఖిలేటి రామకృష్ణంరాజు, పూతరేకుల వ్యాపారం, తాడిపూడి, ఆత్రేయపురం