నారింజకాయ నిన్ను చూడగానే నోరూరుతున్నది తొక్క తీసి తినగా అబ్బబ్బ పులుపు తిననే తినను తీసి నేలకొట్ట తీయని నారింజ తింటే హాయ్ హాయ్.. చిన్నప్పుడు చదువుకున్న పాట ఇది. నారింజ పేరు చెబితేనే కళ్లు మూసుకుంటాయి. అటువంటి నారింజ రసాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తాగుతుంటారు ఇక్కడ. తూర్పు గోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం దాటి, ఆత్రేయపురం వెళ్లే దారిలో లొల్ల లాకులకు ముందుగా, రోడ్డు పక్కన పచ్చని చెట్ల కింద చిన్న బండి కనిపిస్తుంది. అక్కడకు రాగానే వారి వారి వాహనాలను పక్కన పెట్టి, జుత్తుగ సుబ్బారావు తాత ఇచ్చే నారింజ రసం సేవించి, సేద తీరుతుంటారు. సుబ్బారావు వయస్సు 83 సంవత్సరాలు. ‘శ్రేష్ఠమైన వడ్లమూడి నారింజ పండ్లు తెప్పించి, రసం తీసి ఇస్తాను. వడ్లమూడిలో దొరక్కపోతే, రాజమండ్రి, నిడదవోలు ప్రాంతాల నుంచి నారింజకాయలు తీసుకువస్తాయి’ అంటారు ఈ తాత.
ఆశ్చర్యమేమిటంటే, నారింజ కాయలు కొనడానికి తాత ఎక్కడకూ వెళ్లరు, అక్కడి నుంచి కాయలు రాగానే, ఇక్కడ అకౌంట్‌లో డబ్బులు వేసేస్తారు. ‘అంతా నమ్మకం మీదే నడిచిపోతోంది వ్యాపారం’ అంటారు ఈ తాత. ఒక్కో మనిషికి మూడు కాయల రసం పిండుతారు. కాయలు బాగా తగ్గినప్పుడు రెండు కాయలు పిండుతారు. ఒక్కో కాయ పది రూపాయలకు కొంటారు. కాని గ్లాసు రసం 20 రూపాయలకే అమ్ముతారు. ఎవరైనా వచ్చి ‘ధర పెంచవా తాతయ్యా’ అని అడిగితే, ‘నాకు ఆదాయానికి లోటు లేదు. నేను కూర్చుని తిన్నా నాకు సాగుతుంది. కాని ఏదో ఒక పనిచేయనిదే నాకు తోచదు. ఇది అలవాటైన పని. ఓపిక ఉన్నన్ని రోజులు చేస్తాను’ అంటూ ఎంతో సంబరంగా చెబుతారు సుబ్బారావు తాత.
వ్యాపార రహస్యం..
నారింజ రసంలో నాలుగు రకాల వస్తువులు కలుపుతారు. ‘లక్ష రూపాయలిచ్చినా ఆ రహస్యం మాత్రం చెప్పను’ అంటారు సుబ్బారావు తాత. మొట్టమొదట్లో ఈ వ్యాపారం ర్యాలి గ్రామంలోని జగన్మోహిని ఆలయం దగ్గర ప్రారంభించారు. అక్కడ ఈ బండి పాతిక సంవత్సరాలు నడిచింది. ఆ తరవాత ఇప్పుడున్న ప్రదేశానికి మార్చానని చెబుతారు సుబ్బారావు తాత.
ఆ తల్లి చలవ..
సుబ్బారావు తాత తన చిన్నతనంలో ఒకరి ఇంట్లో చాలా కాలం పనిచేశారు. అందుకుగాను వారు సుబ్బారావు తాతకు ఆరు కుంచాల పొలం రాసి ఇచ్చారట. సుబ్బారావు తాతకు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. వారిది ఉమ్మడి కుటుంబం. ‘వంటంతా ఒక కుండలోనే జరుగుతుంది’ అంటూ సంబరంగా చెబుతారు సుబ్బారావు తాత. ‘ఇంటి దగ్గర కూర్చుంటే ఏం వస్తుంది. ఓపిక ఉంది, కష్టపడతాను. ఎక్కడెక్కడ నుంచో మీరంతా రసం తాగటానికి వస్తుంటారు. నేను తయారుచేసిన నారింజ రసం అమెరికా కూడా వెళ్లింది. నాకు అంతకుమించిన సంతోషం లేదు’ అంటారు ఈ తాత.
ఆరు నెలలు నారింజలే..
ఆరు నెలల పాటు కేవలం నారింజ రసం అమ్ముతారు. మిగిలిన ఆరు నెలలు రకరకాల రసాలు అమ్ముతారు. సొంతంగా లిమ్కా రుచిని కూడా తయారుచేస్తారు. మొత్తం 20 రకాల జ్యూస్‌లు తయారుచేస్తారు సుబ్బా రావు తాత. అన్నీ 20 రూపాయలకే అందిస్తున్నారు. వచ్చిన ప్రతివారినీ ‘రండి బాబూ! రా తమ్ముడూ! రా మనవడా!’ అంటూ ఆప్యాయంగా పిలుస్తారు.
పది పైసలతో మొదలు..
50 సంవత్సరాల క్రితం 10 పైసలతో ప్రారంభమైన నారింజ రసం ఇప్పుడు 20 రూపాయలకు చేరింది. ‘ఈ పాకం, ఈ ఫార్ములా ఎవ్వరికీ తెలియదు. ఈ రుచికి అలవాటు పడిన వాళ్లు మళ్లీ మళ్లీ అక్కడకు వచ్చి, ఆగి తాగి వెళ్తారు. ‘సుబ్బారావు గ్రేట్’ అంటారు అక్కడ రసం తాగినవారు. మంచి నీడనిచ్చే చెట్టు కింద నీడలో చల్లగా సేద తీరుతారు. ‘బండి చిన్నదే కానీ రుచి మాత్రం పెద్దది’ అంటారు ఆ రసం రుచి చూసినవారంతా. ఆ రసాన్ని మిషన్ మీద కాకుండా చేత్తో తీసే మిషన్‌తోనే తీస్తారు. ఉప్పు, కారం, ప్రత్యేకమైన మసాలా వేసి, కొద్దిగా ఐస్ జత చేసి జ్యూస్ ఇస్తూ, సుబ్బారావు తాత అందరి కడుపులను చల్లబరుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment